ఎల్‌పీజీ కొరత.. మారిన ఆహార అలవాట్లు | How LPG shortage worry is taking over Delhi Mumbai Bengaluru | Sakshi
Sakshi News home page

ఎల్‌పీజీ కొరత.. మారిన ఆహార అలవాట్లు

Mar 13 2026 12:59 PM | Updated on Mar 13 2026 1:12 PM

How LPG shortage worry is taking over Delhi Mumbai Bengaluru

న్యూఢిల్లీ/ముంబై: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాల కారణంగా ఇంధన సరఫరా వ్యవస్థలో ఆటంకాలు తలెత్తాయి. ఈ నేపధ్యంలో దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ కొరత తీవ్రతరమవుతోంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌ తదితర నగరాల్లో సిలిండర్ల కోసం వినియోగదారులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. గ్యాస్ సరఫరాలో అనిశ్చితి నెలకొనడంతో హోటళ్లు తమ మెనూలను కుదిస్తుండటంతో ఇడ్లీలు, దోశలు తినేవారు టీ, కాఫీలతోనే సరిపెట్టుకుంటున్నారు.  

మెనూలో కోతలు
దేశ రాజధాని ఢిల్లీలోని విద్యాసంస్థల క్యాంటీన్లపై  ఎల్‌పీజీ కొరత ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని పలు క్యాంటీన్లు ఇప్పటికే  మెనూలోని స్నాక్స్ ఐటమ్స్‌ను నిలిపివేశాయి. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ క్యాంటీన్ తన ‘మటన్ దోశ’ను తాత్కాలికంగా తొలగించింది. ధరలు పెంచలేక, గ్యాస్ దొరకక వంటకాలను తగ్గించుకుంటున్నామని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముంబైలో మరీ దారుణం
సిలిండర్ రీఫిల్ కోసం ఆఫీసులకు సెలవులు పెట్టి మరీ డీలర్ల వద్ద వేచి చూడాల్సిన పరిస్థితి ముంబైవాసులకు ఏర్పడింది. గ్యాస్ కొరత కారణంగా ముంబైలోని పలు రెస్టారెంట్లు మళ్లీ పాత కాలపు బొగ్గు పొయ్యిల బాట పట్టాయి. మరోవైపు బెంగళూరులో ఆటో గ్యాస్ ధరలు రెండు రోజుల్లోనే లీటరుకు రూ. 10 వరకు పెరగడం వాహనదారులను కోలుకోలేని దెబ్బతీసింది. ఇందిరా క్యాంటీన్ల నిర్వహణపై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

టిఫిన్ బాక్సుల షేరింగ్‌..
పుణెలో విద్యార్థుల మెస్ నిర్వహణ భారంగా మారడంతో ధరలు పెంచక తప్పడం లేదు. దీంతో విద్యార్థులు ఒకే టిఫిన్ బాక్సును ఇద్దరు పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోల్‌కతా, అజ్మీర్ తదితర నగరాల్లో కమర్షియల్ సిలిండర్ల కొరత వల్ల హోటల్ యజమానులు కట్టెలు, బొగ్గును వినియోగిస్తున్నారు. దీంతో మార్కెట్‌లో బొగ్గు, కట్టెల ధరలకు కూడా రెక్కలొచ్చాయి. కేజీ బొగ్గు ధర రూ. 30 నుంచి రూ. 35కి చేరగా, కట్టెల ధరలు కూడా  అమాంతం పెరిగాయి. పశ్చిమాసియా సంక్షోభం త్వరగా ముగియకపోతే, రాబోయే రోజుల్లో ఇంధన కష్టాలు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 

ఇది కూడా చదవండి: వార్‌ ఎఫెక్ట్‌: మూసివేత దిశగా ప్రముఖ కాఫీ హౌస్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement