న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నెలకొన్న వంటగ్యాస్ (ఎల్పీజీ) కొరత న్యాయస్థాన ప్రాంగణాలనూ తాకింది. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన అంతరాయం కారణంగా ఢిల్లీ హైకోర్టులోని ‘లాయర్స్ క్యాంటీన్’లో ప్రధాన భోజన వసతిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ లభ్యత కష్టతరంగా మారడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
ఢిల్లీ హైకోర్టు క్యాంటీన్ ఇన్‌ఛార్జ్ సందీప్ శర్మ తాజాగా న్యాయమూర్తుల కార్యదర్శికి, న్యాయవాదులకు ఒక విజ్ఞప్తి చేశారు. గ్యాస్ సిలిండర్ల నిల్వలు నిండుకోవడంతో, వంట చేయడానికి వీలు లేక ‘మెయిన్ కోర్స్’ తయారీని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి రాగానే తిరిగి భోజన సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం వంట గ్యాస్‌తో సంబంధం లేని శాండ్‌విచ్‌లు, సలాడ్‌లు, ఫ్రూట్ చాట్ వంటి అల్పాహారాలు మాత్రమే అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. దీంతో న్యాయవాదులు, కోర్టు పనులపై వచ్చేవారు మరోమార్గం లేక క్యాంటీన్‌లోని శాండ్‌వించ్‌ల కోసం క్యూ కడుతున్నారు.
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా చమురు ధరలు పెరగడంతో, కేంద్ర ప్రభుత్వం మార్చి 7న ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 60 పెంచింది. దీంతో ఢిల్లీలో సబ్సిడీ లేని సిలిండర్ ధర రూ. 913కు చేరింది. కేవలం ధరల పెరుగుదలే కాకుండా, సరఫరాలో ఏర్పడిన అవరోధాల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో గ్యాస్ కొరత తీవ్రమైంది. ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో వినియోగదారులు సిలిండర్ల కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద తెల్లవారుజాము నుంచే బారులు తీరుతున్నారు. గత పది రోజులుగా ఈ పరిస్థితి నెలకొందని, ఒక్కో ఏజెన్సీ వద్ద వందలాది మంది వేచి చూడాల్సి వస్తోందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ‘నిత్యావసర వస్తువుల చట్టాన్ని’ ప్రయోగించింది. గృహ అవసరాలు, ఆస్పత్రులు, అత్యవసర సేవలకు ఎల్పీజీ సరఫరాలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఇందులో భాగంగా డొమెస్టిక్ రీఫిల్ బుకింగ్‌ల మధ్య 25 రోజుల గడువును తప్పనిసరి చేసింది. వాణిజ్య అవసరాలకు సరఫరాను పరిమితం చేయడంతో హోటళ్లు, క్యాంటీన్లపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: పప్పన్నం పెట్టకుండా 10 వేల పెళ్లిళ్లు?


