న్యూఢిల్లీ: నకిలీ కరెన్సీ నోట్లు కలిగి ఉన్న ఆరోపణలపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం(ఉపా)కింద అరెస్టయిన ఓ వ్యక్తికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండేళ్లుగా జైలు జీవితం గడుపుతున్నప్పటికీ ఇప్పటి వరకు అసోం పోలీసులు కోర్టులో చార్జిషీటు వేయలేదని అత్యున్నత న్యాయస్థానం అగ్రహం వ్యక్తం చేసింది. నిర్దేశిత సమయంలోగా విచారణ మొదలు కాలేదని, ఇలా కస్టడీలో ఉంచటం అక్రమమని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం స్పష్టం చేసింది.
ఉపా–1967 కింద అరెస్ట్ చేసిన వ్యక్తిపై 90 రోజుల్లోగా చార్జిషీటు వేయాలి. కోర్టు అనుమతి లేకుండా ఈ గడువును 180 రోజుల వరకు పొడిగించే వెసులుబాటు కూడా ఉంది. ‘రెండేళ్లు గడిచినా ఎందుకు చార్జిషీటు వేయలేదని పోలీసులను ప్రశ్నించింది. ఇది అక్రమ కస్టడీ అన్నది వాస్తవం. మీరేమైనా గొప్ప వాళ్లనుకుంటున్నారా? అంటూ కడిగిపారేసింది.
అయితే, మయన్మార్ వాసి అయిన నిందితుడు తొన్‌లొంగ్ కొన్యాక్‌పై పలు కేసులున్నాయని, నకిలీ నోట్ల కేసులో సహ నిందితులు పరారీలో ఉండటంతో చార్జిషీటు వేయలేకపోయామని పోలీసుల తరఫున లాయర్ ధర్మాసనానికి నివేదించారు. అయితే, ఈ కేసును ప్రత్యేకమైందిగా భావించి నిందితుడికి బెయిల్ ఇస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.


