న్యూ ఏవియేషన్ రూల్స్‌ను వెనక్కి తీసుకోవడంతో విమానయాన ప్రయాణాలు ఇక సాఫీగా సాగుతాయని భావించిన ప్రయాణికులకు నిరాశ తప్పడం లేదు. పైలట్లు సత్వరమే అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ.. విమానాల రద్దు, వాయిదాలపర్వం ఇంకా కొనసాగుతోంది. దీంతో.. వేల మంది ఇంకా ఎయిర్‌పోర్టులలోనే ఇరుక్కుపోయారు. ఈ సంక్షోభం ఎప్పుడు ముగస్తుందనే విషయంపై ఇటు కేంద్రం, అటు ఇండిగో ఎయిర్‌లైన్స్‌లు ఓ స్పష్టత అంటూ ఇవ్వలేకపోతున్నాయి.

సాధారణ పరిస్థితి నెలకొనేందుకు ఇంకోన్నిరోజులు సమయం పట్టొచ్చు.. ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ చెబుతున్న మాట ఇది. గత నాలుగు రోజులుగా నెలకొన్న పరిస్థితులకు.. తీవ్రస్థాయిలో అవస్థలు పడ్డ ప్రయాణికులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారాయన. ఇండిగో మొత్తం ఆపరేషనల్ సిస్టమ్ రీబూట్ చేయడం వల్ల పెద్ద ఎత్తున అంతరాయం ఏర్పడిందని.. దీని వల్ల షెడ్యూల్‌లు, క్రూ మేనేజ్‌మెంట్, ఫ్లైట్ ప్లానింగ్ అన్నీ తాత్కాలికంగా దెబ్బతిన్నాయన్నారు. విమానాల రద్దుపై ప్రయాణికులకు సమాచారం చేరవేస్తున్నామని.. అనవసరంగా ఎయిర్‌పోర్టుల వద్దకు వచ్చి ఇబ్బంది పడొద్దని ప్రయాణికులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో డిసెంబర్ 10–15 మధ్యకల్లా సేవలు క్రమంగా సాధారణ స్థితికి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే..

కేంద్రం మాత్రం మరోలా చెబుతోంది. శనివారం(ఇవాళ)కి పరిస్థితి కాస్త చక్కబడుతుందని.. సోమవారం నుంచి సర్వీసులన్నీ యధాతథంగా, సాధారణ పరిస్థితుల మధ్య నడవొచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ప్రయాణికుల ఇబ్బందులు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటూ.. 24x7 కంట్రోల్ రూమ్ ద్వారా పౌరవిమానయాన శాఖ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. అయితే పరిస్థితులు మాత్రం కేంద్రం చెబుతున్నట్లుగా ఏమాత్రం లేవు.

పైలట్లకు వారాంతపు విశ్రాంతి విషయంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తాత్కాలికంగా వెనక్కి తగ్గినప్పటికీ.. ఇండిగో సంక్షోభం ఇంకా కొనసాగడానికి కారణాలున్నాయి. భారీ సంఖ్యలో విమానాల రద్దుతో ఇప్పటికే షెడ్యూల్‌లు గందరగోళంగా మారిపోయాయి. తీవ్ర పైలట్ కొరత, రోస్టరింగ్ సమస్యలను చక్కబెట్టుకోవడానికి ఇండిగోకు ఇంకొంత సమయం పట్టొచ్చు. సిస్టమ్ రీబూట్ వల్ల ఏర్పడిన ఆపరేషనల్ అంతరాయం ఒక్కసారిగా సరిచేయలేని స్థాయిలో కొనసాగుతోంది. ఈ ఫలితంతో..
ఇవాళ కూడా వెయ్యికి పైగా విమానాలు రద్దు అయ్యాయి. ఇండిగో సంక్షోభాన్ని క్యాష్ చేసుకుంటున్న మిగతా ఎయిర్‌లైన్స్‌లు ఛార్జీలు భారీగా పెంచాయి. దీంతో ఈ సంక్షోభం ఇప్పటికప్పుడు పరిష్కారం అయ్యేలా కనిపించడం లేదు.

మరోవైపు.. ప్రయాణికులకు విమానాల రద్దుపై ముందస్తు సమాచారం లేకపోవడంతో ఇండిగో కావాలనే ఇలా చేసిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డీజీసీఏ తెచ్చిన కొత్త రూల్స్ విషయంలో ఒత్తిడి పెంచేందుకే ఈ కృత్రిమ సంక్షోభాన్ని ఇండిగోనే సృష్టించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో కేంద్రం అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించింది. ప్యానెల్ ఏర్పాటు చేసి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీజీసీఏ ఆదేశించింది. అయితే..

రూల్స్ వెనక్కి తీసుకోవడంపై పైలట్ అసోషియేషన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇది భద్రతా ప్రమాణాలను తగ్గించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఇటు ఇండిగో.. అటు డీజీసీఏ.. ఇద్దరి నిర్వాకంతోనే బిగ్ ట్రబుల్ ఏర్పడిందని, కాబట్టి సమిష్టిగా భాద్యత వహించాల్సిందేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే డీజీసీఏ గనుక రూల్స్‌ను వెనక్కి తీసుకోకపోయి ఉంటే మాత్రం ఈ సంక్షోభం రెండు మూడు నెలలైనా ముగిసేది కాదనేది నిపుణుల మాట.


