గుత్తాధిపత్యాన్ని అడ్డం పెట్టుకుని వ్యవహారం
నిబంధనలు పాటించడం ఇష్టంలేక.. రద్దుల పర్వం
శుక్రవారం ఒక్కరోజే వెయ్యికిపైగా విమానాలు రద్దు
గడిచిన రెండ్రోజుల్లో మరో వెయ్యి విమానాలు క్యాన్సిల్
దిగివచ్చిన డీజీసీఏ... తాత్కాలిక మినహాయింపులు
‘ఇండిగో’లో పైలట్ల డ్యూటీ నిబంధనలు ప్రస్తుతానికి పక్కకు
దీంతో శనివారం నుంచి పరిస్థితి మారవచ్చన్న ఇండిగో సీఈఓ
పరిస్థితి పూర్తిగా మామూలుగా అవటానికి రెండుమూడు వారాలు పట్టే అవకాశం
నిబంధనలను లైట్ తీసుకున్నామని, క్షమించాలని సందేశం
దేశవ్యాప్తంగా మెట్రోల్లో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం
డిమాండ్ పెరగటంతో వేరే సంస్థల టిక్కెట్ల ధరలు ఆకాశంలోకి
దేశీ పౌరవిమానయాన రంగంలో 66 శాతం వాటాతో దాదాపు గుత్తాధిపత్యం చెలాయిస్తున్న ఇండిగో సంస్థ... తమ జోలికెవరూ రాకూడదన్న రీతిలో వ్యవహరించిన తీరు వల్ల శుక్రవారం వెయ్యికి పైగా విమానాలు రద్దయ్యాయి. ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉండవచ్చు కానీ.. నిర్దిష్టంగా ఎంతన్నది సంస్థ వెల్లడించలేదు. బుధ, గురు వారాల్లోనూ వెయ్యికి పైగా విమానాలు రద్దు కావటంతో దేశవ్యాప్తంగా ప్రయాణికుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. పైలట్ల డ్యూటీ, విశ్రాంతికి సంబంధించి పౌరవిమానయాన సంస్థ (డీజీసీఏ) ఇచ్చిన మార్గదర్శకాలను పాటించడం ఇష్టంలేక... విమానాలు రద్దుచేసి ప్రయాణికుల్ని ఇబ్బందులు పెట్టడం ద్వారా డీజీసీఏను దిగివచ్చేలా చేయాలన్న ఇండిగో వ్యూహం నెరవేరినట్లే అనుకోవాలి.
వేల విమానాలు రద్దవుతుండటంతో చివరకు డీజీసీఏ దిగివచ్చింది. నిబంధనలను తాత్కాలికంగా సడలిస్తామని, విమానాలు పూర్తిస్థాయిలో తిరిగేలా చేయాలని ఇండిగోను అభ్యరి్థంచింది. ఇండిగో దీనికి ఒప్పుకుంటూనే... తాము మార్గదర్శకాలను లైట్ తీసుకున్నామని, అందుకే ఈ పరిస్థితి వచ్చిందని, డీజీసీఏ సడలింపులిచ్చింది కనక త్వరలో పరిస్థితి చక్కబడుతుందని అధికారికంగా ప్రకటించింది. ఏ రంగంలోనైనా ఒకటిరెండు సంస్థలే గుత్తాధిపత్యం చెలాయిస్తే ఏమవుతుందన్నది ఇండిగో ఉదంతం మరోసారి నిరూపించినట్లయింది.
పైలట్ల విశ్రాంతి, డ్యూటీకి సంబంధించి...
పైలట్లు్ల విరామంలేకుండా విమానాలను వేల కిలోమీటర్ల దూరాలు నడుపుతున్నారని, దీనివల్ల వారి ఆరోగ్యంతో పాటు ప్రయాణికులు సైతం రిసు్కలో పడుతున్నారని భావించి డీజీసీఏ కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. వీటిని 2024 జనవరిలోనే విడుదల చేసింది. మొత్తం 22 నిబంధనల్లో 15 నిబంధనలు ఈ ఏడాది జూలై నుంచి అమల్లోకి రాగా... పైలట్ల విశ్రాంతి, డ్యూటీకి సంబంధించిన మిగతా 7 నిబంధనలు ఈ నవంబరు 1 నుంచి అమల్లోకి వచ్చాయి. వారానికి 12 గంటలుగా ఉన్న పైలట్ల విశ్రాంతి సమయాన్ని 48 గంటలకు పెంచడం, రాత్రి వేళ ఏ పైలట్ కూడా రెండుకు మించి ఎక్కువ ల్యాండింగ్‌లు చేయకూడదని విధించిన నిబంధనలను పాటించటం వల్ల మరింతమంది సిబ్బంది కావాల్సి వస్తారని ఇండిగో భావించింది.
అందుకే ఈ నిబంధనల్ని అడ్డం పెట్టుకుని నవంబరులో ఏకంగా 1,200పైగా విమానాలను రద్దు చేసింది. చాలా విమానాలు ఆలస్యమయ్యాయి కూడా. అయితే దేశవ్యాప్తంగా ఇండిగో నెలకు 60వేలకు పైగా సర్వీసులను నడిపిస్తోంది. కాబట్టి 1,200 రద్దుతో పెద్ద తేడా రాలేదు. కానీ ఈ నెల 3న ఒకేరోజు 500కు పైగా విమానాలు రద్దు కావటం... 4న అది కొనసాగటం...5న తీవ్రమవటంతో సంక్షోభం ఒక్కసారిగా బద్దలయింది. అయ్యప్పభక్తుల శబరిమల యాత్ర మొదలు శీతాకాల పర్యటనలకు వెళ్లే సందర్శకులు, అత్యవసర పనుల నిమిత్తం విమానప్రయాణాలను ఎంచుకునే లక్షలాది మంది జనం తాము ఎక్కే విమానం అసలు బయల్దేరుతుందో లేదో... రద్దయితే రిఫండ్ ఎప్పుడొస్తుందో తెలీక తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇదే అదునుగా ఇతర కంపెనీలు అత్యధిక ధరల మోత మోగించడంతో ప్రయాణికులు గగ్గోలు పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన కేంద్రం ఇండిగోకు ఈ నిబంధనల నుంచి తాత్కాలికంగా మినహాయింపునిచ్చింది.
10 రోజుల్లో పరిస్థితి అదుపులోకి!
నిబంధనావళిని సడలించటంతో ఎక్కువ మంది పైలట్లు అందుబాటులోకి వచ్చి విమానాల రద్దుకు తెరపడుతుందని, మరో 10 రోజుల్లో అంతా సర్దుకుంటుందని, డిసెంబర్ 10–15 తేదీకల్లా సాధారణ స్థాయిలో విమానాల రాకపోకలు ఉంటాయని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ శుక్రవారం ప్రకటించారు. నిబంధనలను తక్కువగా అంచనావేశాం. క్షమించమని కూడా కోరారాయన. శనివారం నుంచి పరిస్థితిలో మార్పురావొచ్చునన్నారు.
ప్రధాన ఎయిర్‌పోర్ట్‌లలో అంతా గందరగోళం
శుక్రవారం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి షెడ్యూల్ చేసిన మొత్తం 235 దేశీ సర్విసులను ఇండిగో రద్దుచేసింది. దేశంలోని ప్రధాన విమానాశ్రయాలకు అప్పటికే వచ్చిన ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. కొన్ని ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో కౌంటర్ల వద్ద సిబ్బంది కనిపించలేదు. ఇచ్చేసిన లగేజీలను వెనక్కి తెచ్చుకోవడం, మరో కంపెనీ విమానాన్ని బుక్ చేసుకోవడం, గత విమాన టికెట్ రీఫండ్ కోసం ప్రయతి్నంచడం ఇలా పలు రకాల బాధలు పడుతున్నారు.
డిమాండ్ పెరగటంతో పోటీ సంస్థలు ధరలు పెంచేశాయి. ప్రధాన రూట్లలో ఒక్కో టికెట్ ధర ఏకంగా రూ.లక్ష దాటేసిందని సోషల్ మీడియా హోరెత్తింది. ధరలు అమాంతం పెరగకుండా చర్యలు చేపట్టాలని కేంద్రం, డీజీసీఏ చేసిన సూచనలను విమానయాన సంస్థలు పట్టించుకోలేదు. ఎయిర్‌పోర్టుల్లో తాము పడుతున్న అవస్థలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో నెటిజర్లు ఇండిగో తీరుపై మండిపడటం కనిపించింది.
తప్పు ఇండిగోదే: ఆర్.శివరామన్
డైరెక్టర్లు, ఇండిపెండెంట్ డైరెక్టర్లతో ఇండిగోలో చాలా పెద్ద వ్యవస్థ ఉందని, వారిలో ఎవ్వరూ కూడా ఈ పరిస్థితిని ఊహించకపోవటం, దానిగురించి ముందుగా చర్చించకపోవటం అత్యంత దారుణమని మాజీ డీజీసీఏ ఆర్.శివరామన్ చెప్పారు. వారు తక్షణం రాజీనామా చేయాల్సి ఉందన్నారు. రెండేళ్ల కిందటనే నిబంధనలు వెలువరించినా... దాన్ని పాటించాల్సిన డెడ్‌లైన్ దగ్గర పడుతున్నా... అందుకు తగ్గ చర్యలను తీసుకోవటం ఇండిగో బాధ్యతారాహిత్యం తప్ప వేరేమీ కాదని ఆయన స్పష్టంచేశారు. ఇప్పటిదాకా దీన్ని గమనించకపోవటం, ఎప్పటికప్పుడు సమీక్షించకపోవటం డీజీసీఏ తరఫున తప్పిదాలేనని అంగీకరించారాయన. – సాక్షి, నేషనల్ డెస్క్
కీలక నిబంధనల సడలింపు
ఇండిగోలోని ఏ320 రకం విమానాలకు సంబంధించిన ఎఫ్‌డీటీఎల్ నిబంధనలను డీజీసీఏ శుక్రవారం సడలించింది. ముఖ్యంగా అధిక విశ్రాంతి వెసులుబాటుతో విధుల నుంచి విరామం తీసుకున్న పైలట్లను వెంటనే విధులకు హాజరయ్యేలా డీజసీఏ తన నిబంధనలకు సడలింపునిచ్చింది. అంటే వారపు విరామంలో భాగంగా పైలట్లు సమరి్పంచే సెలవు అభ్యర్థనలను తిరస్కరిస్తారు. దీంతో ఎక్కువ మంది పైలట్లు అందుబాటులోకి వస్తారు. గతంలో వారానికి రెండు రోజులే నైట్ డ్యూటీలు వేసేవారు. ఇప్పుడు గరిష్టంగా ఆరు సార్లు నైట్‌డ్యూటీలు చేయొచ్చు.
పైలట్లు అందుబాటులోకి వచ్చి రాత్రిపూట సైతం విమానాల రాకపోకలు పెరుగుతాయి. దీంతో విమానాల క్యాన్సిలేషన్ రేటు తగ్గుతుంది. వెనువెంటనే రెండురోజులు నైట్‌డ్యూటీలు చేయకూడదనే నిబంధననూ సడలించారు. ‘‘విమానాల రాకపోకలు కొనసాగేలా నిబంధనలను సడలించాం. అంతేగానీ భద్రతానిబంధనల్లో ఎలాంటి సడలింపు లేదు. సరిపడా పైలట్లను నియమించుకోవాలని ఇండిగోకు సూచించాం’’ అని కేంద్ర పౌరవిమానయాన శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
నిజాలు నిగ్గుతేల్చేందుకు విచారణ షురూ..
మొత్తం ఉదంతంలో నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు జాయింట్ డైరెక్టర్ జనరల్ సంజయ్ బ్రాహ్మణి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అమిత్ గుప్తా, ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్ కెప్టెన్లు కపిల్ మాంగ్లిక్, రాంపాల్‌లతో డీజీసీఏ ప్యానెల్‌ను ఏర్పాటుచేసింది. సమస్యకు కారణాలను అన్వేషించి, కారకులెవరో నిగ్గుతేల్చి 15 రోజుల్లోపు డీజీసీఏకు ఈ ప్యానెల్ నివేదిక సమరి్పంచుంది.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలనూ ప్యానెల్ సూచించనుంది. అయితే నవంబర్ నుంచే సరిపడా పైలట్లను అందుబాటులో ఉంచుకోకపోవడం, నిర్వహణ, షెడ్యూలింగ్, ప్రణాళికా లోపాలు సైతం సమస్యను పెనువిపత్తుగా మార్చేశాయని ప్యానెల్ ప్రాథమికస్థాయిలో అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. శీతాకాల సెలవులు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో పెరిగిన రద్దీకి తగ్గట్లు పైలట్లు అందుబాటులో చూడాలని పైలట్ల సంఘాలకు సైతం డీజీసీఏ విజ్ఞప్తిచేసింది.
మరోవైపు అధిక విమానాల రద్దుతో నడిచిన ఆ కొద్దీ విమానాలూ ఆలస్యంగా రాకపోకలు సాగిస్తుండటంతో వాటి సమయపాలనా రేటు (ఓటీపీ) గురువారం దారుణంగా 8.5 శాతానికి పడిపోయింది. మరోవైపు ఆకాశా ఎయిర్ 63 శాతం, ఎయిర్‌ఇండియా 61 శాతం, ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్ 58.6 శాతం, స్పైస్‌జెట్ 56.4, అలయన్స్ ఎయిర్ 56 శాతం ఓటీపీ సాధించడం గమనార్హం.
డీజీసీఏ ఫెయిల్యూర్ కూడా...
వాస్తవానికి నిబంధనలు విడుదల చేసిన డీజీసీఏ... దాన్ని పాటించడానికి తగ్గ ఏర్పాట్లు ఎయిర్‌లైన్స్ సంస్థలు చేసుకుంటున్నాయో లేదో ఎప్పటికప్పుడు సమీక్షించాలి. కానీ డీజీసీఏ అలాంటివేమీ చేయలేదు. చివరకు రెండునెలల కిందట ఆలిండియా పైలట్ల సంఘం నేరుగా డీజీసీఏను కలిసి... ఇండిగోలో ఎలాంటి ఏర్పాట్లూ చేయటం లేదని, నిబంధనలు గనక కఠినంగా అమల్లోకి తెస్తే సంక్షోభం రావచ్చని తెలియజేస్తూ వినతిపత్రం కూడా ఇచ్చింది. ఈ విషయాన్ని ఆ సంఘం అధ్యక్షుడు శామ్ థామస్ స్వయంగా చెప్పారు. కానీ డీజీసీఏ దీన్ని లైట్ తీసుకుంది. నిబంధనలు అమల్లోకి వస్తే అంతా సర్దుకుంటుందని భావించింది.
దీన్ని గమనించిన ఇండిగో... నవంబరు నుంచి కొత్త నిబంధనలు పాటిస్తూ తన పైలట్లకు విశ్రాంతినివ్వటం ఆరంభించింది. కానీ వాళ్ల స్థానంలో వేరొకరిని డ్యూటీలో పంపలేదు. ఎందుకంటే అంతమంది పైలట్లు లేరు. దీంతో కొన్ని విమానాలు ఆలస్యంగా నడపటం... కొన్నిటిని రద్దు చేయటం ఆరంభించింది. చివరికి గడిచిన మూడురోజుల్లో ఈ రద్దుల పర్వం పతాక స్థాయికి చేరింది. ఇండిగో ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసిందని, దానిపై క్రిమినల్ కేసులు పెట్టాలని శామ్ థామస్ వ్యాఖ్యానించటం ఈ సందర్భంగా గమనార్హం.


