
చెన్నై విమానాశ్రయంలో సురక్షితంగా ఇండిగో ల్యాండింగ్
చెన్నై: విమానం ముందు అద్దానికి పగుళ్లు ఏర్పడిన విషయాన్ని ముందుగానే గుర్తించిన పైలట్.. సురక్షిత ల్యాండింగ్‌కు తగిన చర్యలు తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పిన ఘటన ఇది. అధికార వర్గాల సమాచారం ప్రకారం, దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో విమానం శనివారం మదురై నుంచి 76 మంది ప్రయాణికులతో చెన్నైకి బయలుదేరింది. ల్యాండింగ్‌కు కొద్ది సేపటికి ముందు విమానం ముందు అద్దానికి పగుళ్లు ఏర్పడినట్లు పైలట్ గుర్తించారు. ఈ విషయాన్ని ఇక్కడి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందిన వెంటనే విమానం సురక్షితంగా ల్యాండ్ కావడానికి ఎయిర్‌పోర్ట్‌లో తగిన ఏర్పాట్లు చేశారు. అనుకున్నది అనుకున్నట్లు జరగడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా విండ్‌షీల్డ్ పగుళ్లకు కారణం తెలియలేదు. ఈ ఘటన కారణంగా మదురైకి విమానం తిరుగు ప్రయా ణం రద్దయ్యింది. ఇదిలావుండగా, ఘటనపై స్పందించిన ఇండిగో, ‘విండ్‌షిల్డ్ క్రాక్స్’ గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. కేవలం ‘ల్యాండింగ్‌కు ముందు మెయింటెనెన్స్ అవసరాన్ని గుర్తించడం జరిగింది’’ అని మాత్రమే ఒక ప్రకటనలో పేర్కొంది.