ఆమె ఒక ఉత్తుంగ కెరటం.. సంకల్ప శక్తికి నిర్వచనం..
ఆత్మవిశ్వాసం ఆమె ఆభరణం.. కుటుంబం ఆమె బలం..
దేవుడు ఆమె తోడు.. దైవశక్తి ఆమెకు మార్గదర్శి..
మనో సంకల్పానికి దైవశక్తి తోడైతే సాధించలేనిదంటూ ఏదీ ఉండదంటారు.. దేవుడు కరుణిస్తే అసాధ్యం సుసాధ్యమవుతుందని బలంగా నమ్ముతారు బొల్లారెడ్డి దివ్యారెడ్డి. అందుకే నాలుగు పదుల వయసులోనూ ఆమె అథ్లెట్‌గా పతకాల పంట పండిస్తున్నారు.
ముప్పై ఐదేళ్ల వయసులో ఆమె ‘నడక’ పరుగుగా మారింది. రెండో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత థైరాయిడ్ సంబంధిత సమస్యలు మొదలయ్యాయి. వీటిని అధిగమించేందుకు ఆమె వ్యాయామాలు ప్రారంభించారు.
భర్తతో కలిసి రోజూ జిమ్‌కు
భర్త బైజు మథాయ్ ప్రోత్సాహంతో ఆయనతో కలిసి రోజూ జిమ్‌కు వెళ్తూ కసరత్తులు చేసేవారు. ఈ క్రమంలో రోడ్‌రేస్‌లో పాల్గొనమని ఫ్రెండ్ ఒకరు సలహా ఇచ్చారు. అలా మొదటి ప్రయత్నంలోనే దివ్యారెడ్డి రేసులో ఏకంగా మూడోస్థానంలో నిలిచారు.
ఆ తర్వాత హాఫ్ మారథాన్ నుంచి.. క్రమక్రమంగా ఫుల్ మారథాన్లలో పాల్గొన్నారు. కోచ్ రాజశేఖర్ కాళీవెంకట మార్గదర్శనంలో ఆరు నెలలపాటు శిక్షణ పొందిన దివ్యారెడ్డి.. ఆయన సూచన మేరకు అథ్లెట్‌గా ప్రయాణం మొదలుపెట్టారు.
గచ్చిబౌలి స్టేడియంలో ‘గోల్డెన్ మైల్ రన్’లో దివ్యారెడ్డి విజేతగా నిలిచారు. ఆ తర్వాత జిల్లా స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్‌కు వెళ్లారు. అక్కడ గెలిచి రాష్ట్ర స్థాయి.. ఆపై జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటూ, పతకాలు సాధించారు.
2019లో మలేసియాలో జరిగిన ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 40 ఏళ్లకు పైబడిన వయో విభాగంలో 800 మీటర్ల పరుగులో పసిడి పతకం గెలిచిన దివ్యారెడ్డి.. 400 మీటర్ల విభాగంలో కాంస్యం దక్కించుకున్నారు.
ట్రైనింగ్ కష్టమై..
అయితే.. రెండేళ్ల క్రితం చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్‌లో ట్రైనింగ్ కష్టమై.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఆ తర్వాత జరిగిన వైద్య పరీక్షల్లో గర్భాశయంలో కణతి ఉన్నట్లు తేలింది.
సర్జరీ తదనంతర పరిణామాల వల్ల శారీరకంగా బలహీనపడుతున్నానేమో అన్న సందేహం ఆమెను వెంటాడింది. దీనిని అధిగమించేందుకు సరైన డైట్ తీసుకుంటూనే.. వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్లు తీసుకోవడం ప్రారంభించిన దివ్యారెడ్డి.. నెమ్మదిగా వ్యాయామం మళ్లీ మొదలుపెట్టారు.
యాక్టివ్ లైఫ్‌స్టైల్‌తో జయించవచ్చు..
ఇలాంటి సర్జరీ జరిగాక ఎక్సర్‌సైజులు, పరుగుతో శరీరాన్ని కష్టపెడితే.. భవిష్యత్‌లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పెద్దలు హెచ్చరించారు. నడుంనొప్పి వంటి దీర్ఘకాలిక రుగ్మతలతోపాటు.. బరువు పెరిగే ప్రమాదముంటుందని పేర్కొన్నారు.
అయితే.. సరైన కసరత్తుతో శరీరాన్ని బలోపేతం చేసుకుంటే.. ఇలాంటివన్నీ అపోహల్లాంటివేనని, యాక్టివ్ లైఫ్‌స్టైల్‌తో.. మెనోపాజ్ సమస్యలను సైతం ధైర్యంగా అధిగమించవచ్చని దివ్యారెడ్డి నిరూపించారు.

భయపడి ఓటమిని అంగీకరించకూడదని ఆమె బలంగా విశ్వసిస్తారు. ఆపరేషన్ తొలివారంలో ఐదు నిమిషాల నడకతో మొదలుపెట్టి.. ఎనిమిది వారాల్లో సాధారణ స్థాయికి చేరుకోవడం ఇందుకు నిదర్శనం.సంకల్పం గట్టిగా ఉంటే కొండంత లక్ష్యమైనా చిన్నదని నమ్మే దివ్యారెడ్డి.. తన శారీరక సమస్యల నుంచి కోలుకున్న తర్వాత.. మరింత గొప్పగా రాణించేందుకు కసరత్తు మొదలుపెట్టారు. రెండేళ్ల వ్యవధిలోనే మరోసారి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనడమే కాదు పతకాలు గెలిచే స్థాయికి చేరారు.
ఏం తినాలి?.. ఎంత తినాలి?
ఇటు తిండి.. అటు వ్యాయామం.. రెండూ మితంగానే ఉండాలంటారు దివ్యారెడ్డి. తాను తాజా కూరగాయలతో పాటు.. ప్రొటిన్ కోసం ఎగ్స్, చికెన్ తింటానని చెప్పారు. కొద్దిగా అన్నం, చపాతీలు.. ఓట్స్, నట్స్ తదితర ఫైబర్ ఫుడ్స్ కూడా తన డైట్‌లో భాగమేనని వివరించారు. అన్నింటికంటే శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచటం అత్యంత ముఖ్యమని దివ్యారెడ్డి అంటారు. రోజుకు కనీసం 3-5 లీటర్ల నీళ్లు తాగాలని చెబుతారు.
శిక్షణ సమయంలో మాత్రం తాను ఎలాంటి ప్రాసెస్డ్ ఫుడ్, బయటి భోజనం తినలేదని చెప్పారు. మెనోపాజ్ దశలో చాలా మంది లావైపోయామనే ఆందోళనతో ఉపవాసాలు చేస్తారని.. దాని వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. జీవనశైలిలో అకస్మాత్ మార్పు వల్ల తీసుకునే కాస్త ఆహారమైనా కొవ్వుగా మారి.. మెటబాలిజం దెబ్బతిని, మరింత బరువు పెరిగే ప్రమాదం ఉంటుందన్నారు.
ఎక్సర్‌సైజ్ ఆప్షన్ కాదు.. మీ వెపన్
దేవాలయం లాంటి శరీరం మీద.. వ్యాధులు దాడి చేయకుండా ఉండాలంటే.. వ్యాయామం అనే ఆయుధాన్ని సమర్థంగా ఉపయోగించాలంటారు దివ్యారెడ్డి. ముఖ్యంగా మహిళలు తప్పనిసరిగా తమ కోసం తాము సమయం కేటాయించి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచిస్తారు. గృహిణి, ఉద్యోగిని.. ఎవరైనా సరే ముందు తాము ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాన్ని చక్కగా చూసుకోగలరని చెబుతారు.

నిద్ర అత్యంత ముఖ్యం.. పవర్ న్యాప్ తప్పనిసరి
సోషల్ మీడియాను అవసరం మేరకు వాడతారు దివ్యారెడ్డి. రాత్రి 8.30 గంటలు దాటకముందే వృత్తిపరమైన, వ్యక్తిగత పనులు చక్కబెట్టుకుని నిద్రకు ఉపక్రమిస్తారు. అథ్లెట్ రికవరీకి నిద్ర అత్యంత ముఖ్యం అంటూ నిద్రకు సమయం కేటాయించాలని.. ఎలక్ట్రానిక్ డివైజ్‌ల వాడకాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు. తాను ఎంతటి హడావుడిలో ఉన్నా కనీసం ఇరవై నిమిషాల పాటు నిద్ర పోతే వెంటనే రికవరీ అవుతానంటున్నారు. కారులో ప్రయాణించే సమయమైనా పవర్ న్యాప్ కోసం కేటాయిస్తానని పేర్కొంటున్నారు.
భర్త అండదండలు..
తన ఆలోచనా విధానాన్ని భర్త బైజు మథాయ్, పిల్లలు ఇష్వి, ఆశ్రయ్ అర్థం చేసుకోవడం నిజంగా అదృష్టం లాంటిదేనంటారు దివ్యారెడ్డి. ఓ బహుళ జాతి సంస్థ(ఎంఎన్‌సీ)లో ఉన్నత హోదాలో ఉన్న తన భర్త బైజు మథాయ్.. తాను టోర్నీలకు వెళ్లినపుడు ఇంటి బాధ్యతలను ఆయనొక్కరే చక్కబెడతారని.. ప్రతి భర్త ఇలా ఆలోచిస్తే మహిళలకు సగం బలం వచ్చేస్తుందంటారు. భార్యాభర్తలిద్దరూ కలిసి రోజుకు కనీసం అరగంట వ్యాయామం చేస్తే.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కాసేపు హ్యాపీగా మాట్లాడుకునే సమయం దొరుకుతుందంటారు.
దేవుడి దయ ఉంటేనే..
“అతడు నా పాదములను జింక పాదములవలె చేసెను; నన్ను ఎత్తైన ప్రదేశములమీద నిలుపును” అనే దేవుడి వ్యాఖ్యాన్ని ప్రగాఢంగా విశ్వసించే దివ్యారెడ్డి.. తన పరుగు విజయం వెనక ఆ భగవంతుడే ఉన్నారంటున్నారు. స్వీయ శిక్షణ, క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఎదిగిన దివ్యారెడ్డి.. ఇటీవల ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్-2025లో ఏకంగా నాలుగు పతకాలు సాధించారు.
నలభై ఐదేళ్లకు ఏళ్లకు పైబడిన వయో విభాగంలో 800 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణం గెలిచిన ఆమె.. 1500 మీటర్ల రేసులో రజతం, 400 మీటర్ల పరుగులో కాంస్యం కైవసం చేసుకున్నారు. అదే విధంగా.. 4X400 రిలేలో స్వర్ణం గెలిచిన భారత జట్టులో దివ్యారెడ్డి సభ్యురాలు. తెలంగాణ తరఫున ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో నాలుగు పతకాలతో ఆమె సత్తా చాటారు.

నిజానికి.. 800 మీటర్ల పరుగు పందెంలో లక్ష్యాన్నికి 70 మీటర్ల దూరం ఉన్నంత వరకు దివ్యారెడ్డి వెనుకబడే ఉన్నారు. అయితే, అనూహ్యంగా క్షణకాలంలో శక్తిని పుంజుకుని టార్గెట్‌ను ఛేదించి.. పసిడి పతక విజేతగా నిలిచారు. ఎప్పటిలాగే ఆ సమయంలోనూ ఆ దేవుడే తనను ముందుకు నడిపించారని దివ్యారెడ్డి చెబుతున్నారు. అమ్మ విమలమ్మ, తన చర్చి సంఘం ప్రార్థనలు ఫలించి.. ఊహించని రీతిలో తాను విజేతగా నిలిచానని హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఓడిన చోట(చెన్నై) ఇప్పుడు ఏకంగా నాలుగు పతకాలు గెలవడం ఆ దేవుడి కృప కాకపోతే మరేమిటని మురిసిపోయారు.
తన వయసువారు మరో 20-30 ఏళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇప్పటి నుంచే శ్రద్ధతో కూడిన కసరత్తు అవసరమని, అందుకు ప్రతిరోజు వ్యాయామం చేయడం అత్యంత ముఖ్యమని చెబుతున్నారు దివ్యారెడ్డి.
-సుష్మారెడ్డి యాళ్ల, స్పోర్ట్స్ డెస్క్ (సాక్షి డిజిటల్)
-పసుపులేటి వెంకటేశ్వరరావు, సాక్షి లైఫ్


