చెన్నైలో మంగళవారం ఉదయం మెట్రో ప్రయాణికులు ఊహించని అనుభవాన్ని ఎదుర్కొన్నారు. విమ్కో నగర్ డిపో వైపు వెళ్తున్న బ్లూ లైన్ మెట్రో రైలు, సెంట్రల్ మెట్రో హైకోర్టు స్టేషన్ల మధ్య ఉన్న టన్నెల్‌లో అకాలంగా నిలిచిపోయింది. దీనితో ప్రయాణికులు రైల్వే ట్రాక్ మీదుగా నడుచుకుంటూ బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం ప్రారంభ సమయంలో బ్లూ లైన్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. రైలులో విద్యుత్ సరఫరా ఒక్కసారిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు వెలుగు లేక చీకటిలోనే ఇరుక్కుపోయారు. అక్కడివారు రికార్డ్ చేసిన వీడియోల్లో ప్రయాణికులు హ్యాండ్రెయిల్ పట్టుకుని బయట పరిస్థితి ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించింది.
అయితే పది నిమిషాల తర్వాత హైకోర్టు స్టేషన్ వరకు (దాదాపు 500 మీటర్లు) నడుచుకుంటూ వెళ్లాలని మెట్రో సిబ్బంది ప్రయాణికులకు తెలిపింది. అనంతరం వరుసగా క్యూలో నిలబడి టన్నెల్ ద్వారా జర్నీ కొనసాగించిన దృశ్యాలు కూడా సోషియల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా ఈ అంతరాయం విద్యుత్ లోపం లేదా సాంకేతిక సమస్య వల్ల జరిగి ఉండొచ్చని అంచనా. అయితే పరిస్థితిని త్వరగా సరిచేసిన అధికారులు మెట్రో సేవలు తిరిగి సాధారణ స్థితికి వచ్చాయని ప్రకటించారు.
అనంతరం ఎక్స్‌లో చెన్నై మెట్రో అధికారులు స్పందిస్తూ ఎయిర్‌పోర్ట్ విమ్కో నగర్ డిపో బ్లూ లైన్ సేవలు మళ్లీ సాధారణ స్థితికి వచ్చాయి. గ్రీన్ లైన్‌లోని సెంట్రల్ మెట్రో–సెంట్ థామస్ మౌంట్ మార్గంలో కూడా రైళ్లు సాధారణ షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయి. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపారు.
జరిగిన ఘటన వల్ల ఉదయం ప్రయాణికులు ఇబ్బంది పడ్డప్పటికీ అధికారులు సమస్యను తక్షణమే పరిష్కరించడంతో మెట్రో సేవలు మళ్లీ సవ్యంగా కొనసాగుతున్నాయి.


