సాక్షి, చెన్నై: టికెట్టు కొనకుండా ఏకంగా ఉత్తరప్రదేశ్ నుంచి 300 మంది ప్రయాణికులు రామేశ్వరానికి వచ్చారు. వారిని ఓ రైల్వే టీటీ పట్టుకోగా జైహో... జైహో అన్న నినాదాలతో బయటకు పరుగులు తీశారు. వివరాలు.. రామనాథపురం జిల్లా రామేశ్వరం నుంచి ఉత్తరాది రాష్ట్రాల నుంచి నిత్యం రైళ్లు వచ్చి వెళ్తుంటాయి. శనివారం ఉదయం ఉత్తరాది నుంచి వచ్చిన రైళ్లలో దిగిన ప్రయాణికులపై అనుమానాలు నెలకొన్నాయి.
ఒక రైలులో పెద్దసంఖ్యలో దిగి వచ్చిన వారంతా నెత్తిన బ్యాగులు, సంచులను పెట్టుకుని దిగి ప్లాట్ ఫాం మీదకు చేరారు. వీరి వద్ద టికెట్టు కలెక్టర్ తనిఖీ చేయగా, తామెవ్వరూ టికెట్లు కొనుగోలు చేయలేదంటూ సమాధానం ఇవ్వడంతో షాక్‌కు గురయ్యాడు. వారందరికీ జరిమానా విధించేందుకు టీటీ సిద్ధమయ్యాడు. అలాగే ఇతర సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అయితే వారు వచ్చేలోపు ఈ 300 మంది టీటీపై తిరగ బడ్డారు. తమకు టికెట్టు తీసుకునే అలావాటు లేదంటూ గథమాయించడం మొదలెట్టారు. అంతే కాదు జైహో...జైహో... అని నినదిస్తూ అందరూ రైల్వే స్టేషన్ బయటకు పరుగులు తీయడంతో టీటీ విస్తుపోయాడు.
తాజాగా వీరంతా బయటకు తప్పించుకు వెళ్లినా, తిరుగు ప్రయాణంలో పట్టుకునేందుకు ముందు జాగ్రత్తలలో రామేశ్వరం రైల్వే వర్గాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. కాగా ఉత్తరప్రదేశ్ నుంచి ఇంత పెద్ద సంఖ్యలో టికెట్టు తీసుకోకుండా ప్రయాణికులు తరలి వస్తుంటే, మార్గం మధ్యలోని ఇతర స్టేషన్లు, ప్రధాన జంక్షన్‌లలో టీటీలు ఎవ్వరూ సోదాలు చేయక పోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా వారంతా రోజువారీ కూలీలు, పేదలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.


