వందలాది కాకులు మృతి చెందిన ఘటనతో తమిళనాడు రాజధాని చెన్నై నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పైగా ఆ కాకులకు హెచ్5ఎన్1 వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో బర్డ్‌ఫ్లూ భయాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ అధికార యంత్రాగం ప్రజల కోసం స్పెషల్ అడ్వైజరీని విడుదల చేసింది.
చెన్నై నగరంలో వందలాది కాకులు మృతిచెందిన ఘటన కలకలం రేపింది. ల్యాబ్ పరీక్షల్లో ఈ కాకులలో హెచ్5ఎన్1 వైరస్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు చెబుతున్నారు. పావురాలు, కాకులు, కోళ్లు గనుక చనిపోతే వాటిని తాకరాదని.. బయోసెక్యూరిటీ నియమావళి ప్రకారం అత్యంత జాగ్రత్తగా వాటిని కాల్చివేయడం లేదంటే లోతుగా పూడ్చివేయాలని(గ్లౌజులు, మాస్కులు తొడుక్కుని) చెబుతున్నారు. ఎక్కడైనా పక్షులు చనిపోయినట్లు కనిపిస్తే వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే చనిపోయిన పక్షుల వద్ద రెట్టలనుగానీ, వాటి రక్తపు మరకలను కూడా తాకడం మంచిది కాదని చెబుతున్నారు.
బయోసెక్యూరిటీ నియమావళి.. మనుషులు, జంతువులు, మొక్కలు మరియు పర్యావరణాన్ని ప్రమాదకరమైన సూక్ష్మజీవులు, వైరస్‌లు, బ్యాక్టీరియా లేదా ఇతర జీవ సంబంధిత ముప్పుల నుండి రక్షించడానికి రూపొందించిన నియమాలు, చర్యలు, జాగ్రత్తల సమాహారం.
H5N1 avian influenza has been confirmed in crows in parts of Chennai, prompting Tamil Nadu authorities to enhance surveillance.#BirdFlu #H5N1 #TamilNadu #PublicHealth #Chennaihttps://t.co/gE2ZhG2iCX
— The Logical Indian (@LogicalIndians) February 6, 2026
బర్డ్‌ఫ్లూ బయటపడడంతో.. కేంద్ర పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ తమిళనాడు చీఫ్ సెక్రటరీకి లేఖ రాసింది. తక్షణమే విస్తృత స్థాయి ఫీల్డ్ సర్వేలెన్స్ చేపట్టాలని ఆదేశించింది.
హెచ్5ఎన్1 అంటే ఏమిటి?
హెచ్5ఎన్1 అనేది ఇన్‌ఫ్లుయెంజా-ఏ వైరస్‌లోని అత్యంత ప్రమాదకరమైన రకం. పక్షుల్లో ఇది త్వరగతిన వ్యాపిస్తుంది. ప్రధానంగా కోళ్లు, అడవి పక్షులను ప్రభావితం చేస్తుంది. ‘బర్డ్ ఫ్లూ’గా ప్రసిద్ధి చెందిన ఈ వైరస్.. పక్షుల్లో అధిక మృత్యురేటును కలిగిస్తుంది. మరి మనుషులపై దీని ప్రభావం ఉంటుందా?..
సాధారణంగా ఇది పక్షులకే పరిమితం అవుతుంది. అరుదుగా మనుషులకూ సంక్రమించొచ్చు. మనుషులకు సోకితే మాత్రం ప్రభావం తీవ్రంగా ఉంటుంది. తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలు, న్యుమోనియా వంటి వ్యాధులు కలిగే అవకాశం ఉంది. ఒక్కోసారి మరణాలు కూడా సంభవించొచ్చు. గతంలో నమోదైన కేసుల్లో మరణాల శాతం సీజనల్ ఫ్లూతో పోలిస్తే ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే బర్డ్‌ఫ్లూ అనేది పక్షులను తినడం వల్ల రాదు. ఎందుకంటే.. అధిక ఉష్ణోగ్రతల వద్ద వాటి గుడ్లు, మాంసం ఉడికిస్తాం కాబట్టి. బర్డ్‌ఫ్లూ ప్రమాదం తినడం వల్ల కాదు, తాకడం వల్ల వస్తుంది.


