● రూ. 35 వేల కోట్ల ఇన్విస్టిమెంట్లకు కేబినెట్ ఆమోదం ●
సాక్షి, చైన్నె: సీఎం స్టాలిన్ నేతృత్వంలో సచివాలయంలో గురువారం మంత్రివర్గ భేటీ జరిగింది. ఇందులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముందుగా మధ్యంతర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉండడంతో ఇందులో చేర్చాల్సిన అంశాలపై చర్చించారు. అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న సంస్థల గురించి సమీక్షించి, అనుమతి ఇచ్చే విధంగా ఆమోద ముద్ర వేశారు. ఈ వివరాలను కేబినెట్ భేటీ అనంతరం పరిశ్రమల మంత్రి టీఆర్‌బీ రాజా మీడియాకు వివరించారు. రూ. 34,237.39 కోట్లు పెట్టుబడి, 55,096 మందికి ఉపాధి కల్పన దిశగా అద్భుత ప్రాజెక్టులు తమిళనాడులోకి రానున్నాయని ప్రకటించారు. చైన్నె, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, రాణిపేట్, తిరువణ్ణామలై, కృష్ణగిరి, నమక్కల్, పెరంబలూర్, తిరుచ్చి, కరూర్, తిరుప్పూర్, రామనాథపురం, తూత్తుకుడి పారిశ్రామిక వాడలలో ఈ పెట్టుబడులను 15 ప్రముఖ సంస్థలు పెట్టనున్నట్టు వివరించారు. ఈనెల 12వ తేదీన ఒప్పందాలు జరగనున్నాయని ప్రకటించారు.
ఎన్‌ఎస్ కృష్ణన్ విగ్రహం ఆవిష్కరణ
తమిళ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ హాస్యనటుడిగా, గాయకుడిగా, నాటక నిర్మాతగా ఎన్‌ఎస్ కృష్ణన్ విశేష గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఇండియన్ చార్లీ చాప్లిన్‌గా గుర్తింపు పొందిన ఆయన శాసీ్త్రయ ఆలోచనలు, సామాజిక సంస్కరణ భావాలను తన సినిమాల ద్వారా వ్యక్తం పరిచి ఉన్నారు. గాంధేయ సిద్ధాంతాలకు కూడా కట్టుబడి ఆయన 150కిపైగా చిత్రాలలో నటించి తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని పేదలకు పంచి పెట్టారు. తన 49వ ఏటా ఆయన ఈ లోకాన్ని వీడారు. ఆయన స్మారకంగా టీ నగర్ జి.ఎన్. చెట్టి రోడ్డులో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే వంతెన నిర్మాణ కారణంగా దానిని అప్పట్లో తొలగించారు. చివరకు ఆయన కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు తాజాగా కలైవానర్ అరంగం(ఆడిటోరియం) ఆవరణలో తమిళ అభివృద్ధి , సమాచార శాఖ ఆధ్వర్యంలో విగ్రహాన్ని పునరుద్ధరించి ప్రతిష్టించింది. దీనిని సీఎం స్టాలిన్ ఆవిష్కరించారు.
ముక్తినాథ్ యాత్రికులకు చెక్కులు
సచివాలయంలో హిందూ మత ధార్మిక దేవాదాయ శాఖఆధ్వర్యంలో కన్యాకుమారి, పుదుక్కోట్టై , తంజావూరు ప్యాలెస్ దేవస్థానాల పరిధిలోని దేవాలయాల పరిపాలన, నిర్వహణ ఖర్చుల కోసం తమిళనాడు ప్రభుత్వం రూ.36 కోట్ల సబ్సిడీని సీఎం మంజూరు చేశారు. అలాగే ముక్తినాథ్ ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లిన 389 మంది భక్తులకు రూ.1.17 కోట్ల ప్రభుత్వ సబ్సిడీ చెక్కులను సీఎం అందజేశారు. ముక్తినాథ్ ఆధ్యాత్మిక యాత్రలో వెళ్లే భక్తులకు రూ. 30 వేలు ప్రభుత్వ సబ్సిడీ మంజూరు చేయడం జరుగుతుందని గతంలో సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రగతి పనులకు శ్రీకారం
పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి చేపట్టిన విస్తృత కార్యచరణలో భాగంగా మున్సిపల్ పరిపాలన, తాగునీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో రూ.3,511 కోట్ల విలువైన 183 పూర్తయిన ప్రాజెక్టులను సీఎం వీడీయో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అలాగే, రూ.1,267 కోట్ల అంచనా వ్యయంతో 10 కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.100 కోట్ల విలువైన ఆవిన్‌లో పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రారంభించిన సీఎం స్టాలిన్, పదవీ విరమణ పొంది డైరీ సహకార ఉద్యోగులకు నెలకు రూ.1000 కారుణ్య పెన్షన్ పంపిణీ పథకాన్ని ప్రారంభించారు.
హస్తకళా
మహోత్సవం
తమిళనాడు హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చైన్నెలోని కలైవానర్ అరంగంలో గురువారం మహోత్సవం ప్రారంభమైంది. ఇందులో హస్తకళలకే తమ జీవితాన్ని అంకితం చేసుకున్న 65 ఏళ్లు పైబడిన ఉత్తమ కళాకారులను గౌరవించేందుకు లివింగ్ క్రాఫ్ట్ ట్రెజర్ అవార్డులు అందజేశారు. ఈ అవార్డులో భాగంగా ప్రతి కళాకారునికి రూ. ఒక లక్ష నగదు చెక్కు, 8 గ్రాముల బంగారు పతకం, రాగి ప్రశంసా పత్రంను సీఎం అందజేశారు. 2025–26 సంవత్సరానికి నాగపట్నం, తంజావూరు, చైన్నె, చెంగల్పట్టు, శివగంగ, కళ్లకురిచి, కన్యాకుమారి జిల్లాలకు చెందిన 10 మంది ప్రముఖ కళాకారులు ఈ గౌరవాన్ని పొందారు. అలాగే, హస్తకళల అభివృద్ధి,సజనాత్మకత , పరిశ్రమకు చేసిన సేవలను గుర్తిస్తూ 10 మంది ఉత్తమ కళాకారులకు పూంబుహార్ రాష్ట్ర అవార్డులు ప్రదానం చేశారు. ఈ అవార్డులో ఒకొక్కరికి రూ. 50 వేలు నగదు, 4 గ్రాముల బంగారం, ప్రశంసా పత్రం అందజేశారు. తంజావూరు, విల్లుపురం, మైలాడుతురై, చెంగల్పట్టు, తిరునెల్వేలి, కన్యాకుమారి, కాంచీపురం జిల్లాలకు చెందిన కళాకారులు ఈ అవార్డులు అందుకున్నారు. కాగా,ఈ మహోత్సవంలో తంజావూరు పెయింటింగ్, కలంకారి, చెక్క శిల్పాలు, రాతి శిల్పాలు, కాల్చిన మట్టి కళాఖండాలు, వెదురు ఉత్పత్తులు, అరటిపండు ఫైబర్ ఉత్పత్తులు, లోహ కళాఖండాలు తదితర సంప్రదాయ హస్తకళలను ప్రదర్శనలో ఏర్పాటు చేశారు.
● రూ. 35 వేల కోట్ల ఇన్విస్టిమెంట్లకు కేబినెట్ ఆమోదం ●


