సాక్షి, చైన్నె : చట్టంలో అడ్డంకి లేనప్పుడు ఐపీఎల్ పోటీలను ఎలా అడ్డుకోగలం? అని పిటిషనర్‌ను మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల సమయంలో చైన్నెలో ఐపీఎల్ క్రికెట్ పోటీల నిర్వహణను నిలిపివేయాలని దాఖలైన పిటిషన్‌పై చైన్నె హైకోర్టు తీవ్రంగా స్పందించింది. చట్టబద్ధంగా ఎటువంటి నిషేధం లేనప్పుడు ఇటువంటి క్రీడా పోటీలను కోర్టు ఎలా అడ్డుకుంటుందని ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో శుక్రవారం నుంచి చైన్నెలో జరగనున్న పోటీలకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టైంది.
కేసు నేపథ్యం
చైన్నెలోని చేపాక్కం– ట్రిప్లికేన్ నియోజకవర్గ ఓటరు ప్రభాకరన్ అనే వ్యక్తి హైకోర్టులో ఒక ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో, చైన్నెలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడం వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని, ఈనేపత్యంలో ఈ పోటీలపై నిషేధం విధించాలని ఆయన కోరారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ. ధర్మాధికారి, న్యాయమూర్తి జి. అరుల్ మురుగన్‌తో కూడిన ధర్మాసనం ముందు అభ్యర్థించారు. అయితే న్యాయమూర్తులు ఈ అభ్యర్థనను తోసిపుచ్చుతూ స్పందించారు.
చట్టపరమైన ఆధారం ఏది
ఐపీఎల్ నిర్వహించకూడదని చట్టంలో ఎక్కడైనా ఉందా..?, చట్టపరమైన అడ్డంకులు లేనప్పుడు కోర్టు మ్యాచ్‌లను ఎలా ఆపుతుంది? అని న్యాయమూర్తులు పిటిషనర్‌ను గురువారం ప్రశ్నించారు. క్రికెట్ మ్యాచ్ చూడటం ఇష్టం లేకపోతే ఇంట్లోనే ఉండాలని, మ్యాచ్‌లు నిర్వహిస్తే వచ్చిన ఇబ్బంది ఏంటి? అని పిటిషనర్‌ను నిలదీశారు. ఈ కేసును అత్యవసరంగా విచారించలేమని, పిటిషన్‌కు నంబరు కేటాయించి జాబితాలోకి వచ్చిన తర్వాతే సాధారణ ప్రక్రియ ప్రకారం విచారిస్తామని స్పష్టం చేశారు. దీంతో చైన్నెలో శుక్రవారం నుంచి పలు మ్యాచ్‌లు అప్పుడప్పుడూ జరగనున్నాయి. వీటికి అడ్డంకులు తొలగినట్లయ్యింది. చైన్నె సూపర్ కింగ్స్ ఆడే మ్యాచ్‌లు అన్నీ ఇక్కడే జరగనున్నాయి. దీంతో జట్టు సభ్యులు మ్యాచ్‌కు సన్నద్ధమయ్యారు. అదే సమయంలో శుక్రవారం జరగనున్న మ్యాచ్‌కు వచ్చే వారి వద్ద టికెట్లు ఉంటే, ఎంటీసీ బస్సులలో ఉచిత ప్రయాణానికి మార్గం సులభం చేస్తూ నగర రవాణా సంస్థ చర్యలు తీసుకుంది.


