తిరుత్తణి: తిరుత్తణి టీవీకే అభ్యర్థిని మార్చాలంటూ ఆ పార్టీ శ్రేణులు గురువారం ఆందోళన చేశారు. దీంతో కార్యకర్తలు లేకుండా ఒంటరిగా టీవీకే అభ్యర్థి సత్యకుమార్ నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఒంటరిగా పోటీ చేస్తోంది. ఈక్రమంలో తిరుత్తణి టీవీకే అభ్యర్థిగా ప్రకటించిన సత్యకుమార్‌కు కార్యకర్తల సెగ రాజుకుంది. స్థానికులను అభ్యర్థిగా ప్రకటించాలనే డిమాండ్‌తో గురువారం ఉదయం ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా చైన్నె–తిరుపతి జాతీయ రహదారిలో రాస్తారోకో చేశారు. తమ ప్రాంతానికి సంబంధంలేని అభ్యర్థి తమకు అవసరం లేదని, వెంటనే అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేశారు. దీంతో టీవీకే అభ్యర్థి సత్యకుమార్ మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఒంటరిగా ఆర్డీఓ కార్యాలయం చేరుకుని తమ కుటుంబీకుల సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు. తన విజయం అడ్డుకోవాలనే కక్షగట్టి కొంతమందిని డీఎంకే రెచ్చగొడుతున్నట్లు అయితే ఎన్నికల్లో తిరుత్తణి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో టీవీకే విజయం సాధిస్తుందని సత్యకుమార్ తెలిపారు.


