సాక్షి, చైన్నె: తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై రూపొందించిన అభ్యర్థుల జాబితా వివాదానికి దారితీసింది. అభ్యర్థుల ఎంపికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఓ మహిళా కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేయడం, కీలక నేత మాణికం ఠాగూర్ తన పదవికి రాజీనామా చేయడం వంటి పరిణామాలు చైన్నెలోని టీఎన్‌సీసీ కార్యాలయం సత్యమూర్తి భవన్‌లో ఉత్కంఠ పెంచుతున్నాయి.
ఆది నుంచి అసంతృప్తి..
గత ఎన్నికల్లో 25 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్, ఈసారి 40 సీట్లలో పోటీ, అధికారంలో వాటా కావాలని పట్టుబట్టింది. అయితే డీఎంకేతో జరిగిన చర్చల తర్వాత కేవలం 28 సీట్లతో సర్దుకోక తప్పలేదు.అదే సమయంలో డీఎంకేకు అనుకూలంగా సెల్వ పెరుంతొగై వ్యవహరిస్తున్నారని పార్టీలోని కొన్ని గ్రూప్‌లు ఆరోపిస్తూవస్తున్నాయి. అలాగే తన అనుచరులైన 20 మందికి టికెట్లు దక్కే దిశగా ఆయన పావులు కదుపుతున్నట్టు చర్చ ఊపందుకుంది. ఆయన ఢిల్లీకి పంపించిన జాబితా లీక్ కావడంతో మాజీ అధ్యక్షులు కేఎస్ అళగిరి, తిరునావుక్కరసర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఢిల్లీకి లేఖలు పంపించారు. ఇక ఎంపీలు జ్యోతిమణి, మాణికం ఠాగూర్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. సత్యమూర్తి భవన్‌లో వివిధ విభాగాల కార్యకర్తలు నిరసనలకు దిగారు. ఈక్రమంలో తిరుచ్చి జిల్లా మహిళా నేత లక్ష్మి బుధవారం ఆత్మాహుతి ప్రయత్నం చేశారు. ఈ పరిణామాల తదుపరి సత్యమూర్తి భవన్ నిరసలనకు వేదికగా మారినట్లయ్యి్‌ంది. వినూత్న తరహాలో నిరసనలు వ్యక్తం చేస్తున్న వాళ్లు పెరిగారు. గురువారం కూడా సత్యమూర్తి భవనం వద్ద భారీగా నిరసనలు కొనసాగుతున్నాయి. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు హసీనా సయ్యద్, సేవాదళ్ నేత కుంగ్ ఫూ విజయన్ వంటి వారికి టిక్కెట్లు ఇవ్వాలని వారి మద్దతుదారులు ఆందోళన చేస్తున్నారు.
రాజీనామా హెచ్చరికలు
అభ్యర్థుల ఎంపికపై నెలకొన్న గందరగోళం నేపథ్యంలో, తమిళనాడు కాంగ్రెస్ ఎన్నికల నిర్వహణ , సమన్వయ కమిటీ అధ్యక్ష పదవికి ఎంపీ మాణిక్యం ఠాగూర్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. అలాగే మరికొందరు నేతలు సైతం రాజీనామా బాట ఎంచుకోవడం చర్చకు దారి తీసింది. ఈ పరిణామాలతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడి ఉంది. కేరళ పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లనున్న ఆయన శుక్రవారం తుది జాబితాపై కసరత్తు చేసి అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో నామినేషన్ల గడువు సమీపిస్తుండటంతో ఉత్కంఠ తప్పడం లేదు.


