– పీఎం మోదీ పర్యటనకు ఏర్పాట్లు
సాక్షి,చైన్నె: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో చైన్నెలో భద్రత ఆంక్షలు అమలలోకి వచ్చాయి. పలు ప్రాంతాలను రెడ్ జోన్ పరిధిలోకి తీసుకొచ్చారు. అన్నాడీఎంకే బీజేపీకి 27 సీట్లను కేటాయించిన విషయం తెలిసిందే. ఈ అభ్యర్థుల ఎంపిక తుది కసరత్తు ఢిల్లీలో జరుగుతోంది. శుక్రవారం జాబితా వెలువడ వచ్చు అన్న సంకేతాలు ఉన్నాయి. ఈ పరిస్థితులలో ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు, పుదుచ్చేరి పర్యటనకు రానున్నారు. దీంతో చైన్నెలో పలు ప్రాంతాలను రెడ్ జోన్ పరిధిలోకి తీసుకొచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం చైన్నె చేరుకునే పీఎం మోదీ ఇక్కడి నుంచి పుదుచ్చేరి వెళ్తారు. అక్కడ జరిగే రోడ్ షో, బహిరంగ సభను ముగించుకుని తిరిగి రాత్రికి చైన్నె చేరుకుంటారు. ఇక్కడి గిండిలోని స్టార్ హోటల్‌లో బస చేస్తారు. 4వ తేదీ శనివారం బీజేపీ నాయకులతో కీలక సమావేశం నిర్వహించి అనంతరం ఢిల్లీకి తిరుగుప్రయాణం కానున్నారు.
భద్రతా ఆంక్షలు
ప్రధాని పర్యటన నేపథ్యంలో మీనంబాక్కం (విమానాశ్రయం), గిండి ప్రాంతాలను పోలీసులు ’రెడ్ జోన్’గా ప్రకటించారు. భద్రతా కారణ దృష్ట్యా, శుక్ర, శనివారాలలో డ్రోన్లు, రిమోట్ కంట్రోల్డ్ విమానాలు, పారాగ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లు ఎగురవేయడాన్ని పోలీసులు కఠినంగా నిషేధించారు. ఇప్పటికే చైన్నె నగరవ్యాప్తంగా మే 2వ తేదీ వరకు ఆంక్షలు అమలులో ఉన్నాయి. తాజాగా మరింత కట్టుదిట్టం చేశారు. కాగా, శనివారం చైన్నెలో పీఎం రోడ్ షోకు కసరత్తులు జరిగినా, అభ్యర్థుల జాబితా వెలువడక పోవడంతో రద్దుచేసుకున్నట్టు సమాచారం. అందుకే ఇక్కడి బీజేపీ నేతలతో సమావేశానంతరం ఢిల్లీకి పీఎం బయలుదేరి వెళ్లనున్నారు.
పళనిస్వామి ఎన్నికల
ప్రచారంలో అపశ్రుతి
అన్నానగర్: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి బుధవారం సాయంత్రం శివగంగైలో ప్రచారం చేశారు. అనంతరం ప్రచారం నిమిత్తం ఆయన పుదుక్కోట్టై జిల్లాకు బయలుదేరారు. ఆయనకు భద్రత కల్పించేందుకు పోలీసు వాహనాలు వెళ్లాయి. ఈ వాహనాలు శివగంగై పక్కన ఉన్న మడకుపట్టి వైపు వస్తుండగా, మడకుపట్టికి చెందిన అరుముగం (27) మోటార్ సైకిల్‌పై వచ్చాడు. ఈ క్రమంలో పోలీసు భద్రతా వాహనం ప్రమాదవశాత్తూ ఆ మోటార్ సైకిల్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అరుము గం ఘటనా స్థలంలోనే మరణించాడు.
5నుంచి ఎగ్మోర్ నుంచి యధావిధిగా నడవనున్న విద్యుత్ రైళ్లు
కొరుక్కుపేట: ఎగ్మోర్ రైల్వే స్టేషన్‌లో పునరుద్ధరణ పనుల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి పునాది పనులు తజాగా పూర్తయ్యాయి. దీంతో ఈనెల 5వ తేదీ నుంచి 10, 13 ఫ్లాట్ పామ్‌లపై సబర్బన్ ఎలక్ట్రిక్ రైళ్లు యదావిధిగా నడుస్తాయని సదరన్ రైల్వే అధికారులు వెల్లడించారు. వివరాలు.. చైన్నె ఎగ్మోర్ రైల్వే స్టేసన్‌లో రూ. 735 కోట్లు విలువైన భారీ పునరుద్ధరణ ప్రాజెక్టు పనులు సాగుతున్నాయి. ఇందులో భాగంగా భారీ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. దీనికి సంబందించిన పునాది పనుల కారణంగా రైల్వే స్టేషన్‌లోని 10,11 ఫ్లాట్ పామ్‌లను మూసివేశారు. ఫలితంగా ఫిబ్రవరి 19 నుంచి చైన్నె బీచ్ – తాంబరం–చెంగల్ పట్టు మార్గంలో 44 ఎలక్ట్రిక్ రైళ్ల సేవలను రద్దు చేశారు. 10,11 ఫ్లాట్ ఫామ్‌లకు బదులుగా 5,6 ప్లాట్ పామ్‌లపై సబర్బన్ ఎలక్ట్రిక్ రైళ్లను నడుపుతున్నారు. ప్రస్తుతం ఫుట్ ఓవర్ బ్రిడ్జి పునాది పనులు పనులు పూర్తి కావటంతో తిరిగి యాధావిదిగా 10,11 ప్లాట్ పామ్‌లపై నుంచి 2నెల 5వ తేదీ నుంచి సేవలు ప్రారంభం అవుతాయని రైల్వే అధికారులు తెలిపారు.
డీజీపీగా సందీప్ రాయ్ రాథోర్
సాక్షి, చైన్నె:రాష్ట్ర శాంతి భద్రతల విభాగం డీజీపీ గా సందీప్‌రాయ్ రాథోర్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, పలువురు ఐఏఎస్‌లు,ఐపీఎస్‌లను బదిలీ చేశారు. వివరాుల.. రాష్ట్ర శాంతి భద్రతల విభాగం డీజీపీగా శంకర్‌జివాల్ పదవీ విరమణ తదుపరి కొత్త డీజీపీ నియామకం వివాదానికి దారి తీసింది. దీంతో ఇన్‌చార్జ్ డీజీపీగా వెంకటరామన్ వ్యవహరిస్తూ వచ్చారు. తాజాగా ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో తమకు భద్రత కల్పించడం లేదని టీవీకే అధినేత విజయ్ ఎన్నికల కమిషన్‌కు, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్‌చార్జ్ డీజీపీని తప్పించి కొత్త డీజీపీగా సందీప్ రాయ్ రాథోడ్‌ను నియమిస్తూ ఉత్తర్వులుజారీ చేశారు. అంతే కాకుండా పలు జిల్లాలకు ఎస్పీలు, కలెక్టర్లను మారుస్తూ చర్యలు తీసుకున్నారు. సేలం జిల్లా కలెక్టర్ బృందాదేవిని తప్పించి అరుణ్ తంబురాజ్‌ను , తూత్తుకుడి కలెక్టర్ ఇలంభగవత్‌ను తప్పించి విష్ణు మహాజన్‌ను నియమించారు. మదురై పోలీసు కమిషనర్ లోకనాథన్‌ను తప్పించి ఆయన స్థానంలో అభిషేక్ దీక్షిత్‌ను, తాంబరం పోలీసు కమిషనర్‌గా సంజయ్‌కుమార్, వెస్ట్ జోన్ ఐజీగా రమ్య భారతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.


