సాక్షి, చైన్నె : డీఎంకే యువజన విభాగం ప్రధాన కార్యదర్శి, డిప్యూటీ సీఎం ఉదయ నిధికి రూ. 20 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ మేరకు గురువారం ఆయన దాఖలుచేసిన నామినేషన్ ప్రమాణ పత్రంలో వివరాలను తెలియజేశారు. వివరాలు.. చేపాక్కం – ట్రిప్లికేన్‌లో రెండో సారిగా ఉదయ నిధి స్టాలిన్ పోటీచేస్తున్న విషయం తెలిసిందే. గురువారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుంగధికి నామినేషన్ సమర్పించేందుకు నియోజక వర్గానికి వచ్చారు. ఆయనకు పార్టీ వర్గాలు బ్రహ్మరథం పట్టాయి. ఎంపీ దయానిధి మారన్‌తో కలిసి ఎన్నికల అధికారికి నామినేషన్ సమర్పించారు. చైన్నెలోని చేపాక్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుగంతికి ఉదయనిధి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఇక్కడ ఉదయనిధికి ప్రత్యర్థులుగా అన్నాడీఎంకే తరపున ఆది రాజారామ్, టీవీకే తరపున డి సెల్వం, ఎన్‌టీకే తరపున ఆయేషా భేగం పోటీలో ఉన్నారు. చైన్నెలోని అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటిగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని మళ్లీ కై వసం చేసుకునేందుకు ఉదయ నిధిసిద్ధమయ్యారు. ఆయన ఓ వైపు తన నియోజకవర్గంపై దృష్టి పెడుతూనే మరో వైపు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత పర్యటనలో ముందుకు సాగుతున్నారు. డీఎంకే మళ్లీ అధికారంలోకి రావడం లక్ష్యంగా ఆయన ప్రచార పర్యటనలు ఉన్నాయి. ఈ పరిస్థితులలో ఆయన దాఖలు చేసిన నామినేషన్ ప్రమాణ పత్రంలో ఆస్తుల వివరాలను ప్రకటించారు. ఇందులో ఉదయ నిధి స్టాలిన్‌కు రూ. 12.92 కోట్లు విలువైన చర ఆస్తులు, రూ. 7 కోట్లు విలువనై స్థిర ఆస్తులు ఉన్నాయి. అలాగే ఆయన పేరిట ఒక డిఫండర్ కారు, ఇన్నోవా కారు ఉన్నాయి. తిరువళ్లూరు సమీపంలోని పది ఎకరాల వ్యవసాయ భూమి తనకు ఉన్నట్టు ప్రమాణ పత్రంలో ఆయన వివరించారు.


