సాక్షి, చైన్నె: అసూయ, ఈర్ష్యతోనే ప్రతి పక్ష నేత ఎడప్పాడి పళణిస్వామి తమపై అసత్యపు ప్రచారం చేస్తున్నారని డీఎంకే అధ్యక్షుడు,సీఎం స్టాలిన్ ధ్వజమెత్తారు. ఈరోడ్‌లో గురువారం ఎన్నికల ప్రచార సభకు స్టాలిన్ హాజరయ్యారు. ఈ జిల్లా పరిధిలోని నియోజకవర్గంలో పోటీ చేస్తున్న మంత్రులు స్వామినాథన్, ముత్తుస్వామితో పాటుగా ఇతర అభ్యర్థులకు మద్దతుగా ఓట్ల సేకరణలో స్టాలిన్ నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా తన ప్రసంగంలో ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి , బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ఈపీఎస్ పై విమర్శలు
కాళ్లు పట్టుకుని పాకుతూ వెళ్లి, వెన్నుపోటు పొడిచి పదవిలోకి వచ్చిన వ్యక్తి పళనిస్వామి అని ఎద్దేవా చేశారు. ఏ ఎన్నికల్లోనూ వారిని ఈ స్టాలిన్ గెలవనివ్వ డం లేదనే అసూయతో ఆయన అబద్ధాలను, పుకార్ల ను ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. గత ఐదేళ్ల లో ఈరోడ్ జిల్లాలో అనేక అభివృద్ధి పనులను చేశామని, మరెన్నో పనులు జరుగుతున్నాయని గుర్తుచేశా రు. ప్రధానంగా దశాబ్దాల నాటి అత్తిక్కడవు–అవినాశి ప్రాజెక్టును పూర్తి చేసింది తామేనని ధీమా వ్యక్తం చేశారు. అలాగే పసుపు పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని గుర్తు చేస్తూ , ఈ జిల్లాకు ఎన్నో ప్రగతి, సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని వివరించారు.
కేంద్రంపై ధ్వజం
మెట్రో రైలు ప్రాజెక్టులు, 100 రోజుల పని దినాల పథకం నిర్వీర్యం, నీట్, సీఏఏ , వ్యవసాయ చట్టాలు , జీఎస్టీ పరిహారం విషయంలో తమిళనాడుకు జరుగుతున్న అన్యాయం వెనుక ఎడప్పాడి పళణి స్వామి, ఆయన బీజేపీ కూటమి ఉందని ఆరోపించారు. పొల్లాచ్చి కేసును సరిగ్గా విచారించని పళనిస్వామికి మహిళా భద్రత గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి మరణశిక్ష విధించేలా తన ప్రభుత్వం చట్టాలను తీసుకొచ్చిందని స్టాలిన్ పేర్కొన్నారు.
డబుల్ ఇంజిన్ ఫెయిల్
తమిళనాడులో ’డబుల్ ఇంజిన్’ సర్కార్ పట్టాలు తప్పడం ఖాయమని, ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడును ప్రపంచమే గర్వించేలా మార్చడమే తమ లక్ష్యమన్నారు. ఎడప్పాడి పళనిస్వామి ఎన్ని కుట్రలు చేసినా, అబద్ధాల ప్రచారం చేసినా తమిళ ప్రజలు వాటిని నమ్మరని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోడ్ జిల్లా పెరియార్ పుట్టిన గడ్డ అని, ఇక్కడి ప్రజల ఆదరాభిమానాలు చూస్తుంటే డీఎంకే విజయం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. కాగా గత మూడురోజులుగా ప్రచారంలో ఉన్న స్టాలిన్ ఎక్కడా తన ప్రసంగంలో విజయ్ పేరుగాని, ఆ పార్టీ గురించి గాని వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. ఇక శుక్రవారం తిరునెల్వేలి జిల్లా పాళయంకోటలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
విదేశీ విరాళాల సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి
క్రైస్తవ స్వచ్ఛంద సంస్థలు, చర్చిలు , ఇతర మైనారిటీ సంస్థలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విదేశీ విరాళాల నియంత్రణ (సవరణ) బిల్లు – 2026ను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఎం. స్టాలిన్ డిమాండ్ చేశారు. ఈమేరకు స్టాలిన్ ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ సవరణలు పూర్తిగా క్రైస్తవ మిషనరీలు, చర్చిలు, మైనారిటీ స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలను దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శించారు. ఇది మైనారిటీల హక్కులపై ప్రత్యక్ష దాడి గా ఆయన అభివర్ణించారు.
ముందస్తు ప్రణాళిక
ఇప్పటికే వక్ఫ్ బోర్డు చట్ట సవరణ ద్వారా ముస్లింల ఆస్తులను లాక్కోవడానికి ప్రయత్నించిన కేంద్రం, ఇప్పుడు ఇతర మైనారిటీ సంస్థలు విదేశాల నుండి పొందే నిధులను నిలిపివేయడానికి ఈ కుట్రకు తెరలేపిందని ఆరోపించారు. కేరళ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండటం, ప్రతిపక్షాల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతుండటంతో, కేంద్రం ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్లు నటిస్తున్నదన్నారు. త్వరలోనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి ఈ బిల్లును ఆమోదించుకోవాలని బీజేపీ చూస్తున్నట్టు ఆందోళన వ్యక్తం చేశారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఈ ఏకపక్ష సవరణ బిల్లును ప్రధాని మోదీ వెంటనే శాశ్వతంగా రద్దు చేయాలని ఆయన సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు.


