క్షేత్రస్థాయిలోకి అమ్మ సైన్యం
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ను అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి మహిళా ఓటు బ్యాంక్ సాధన దిశగా దివంగత సీఎం అమ్మ జయలలిత సైన్యం సన్నద్దమైంది. అమ్మ ఆశయ సాధన నినాదంతో అన్నాడీఎంకే మహిళా విభాగం 75 మంది ప్రతినిధులతో బృందాన్ని రంగంలోకి దించింది. అన్నాడీఎంకే మహిళా విభాగం నేతృత్వంలో ఇక కార్యక్రమాలను వేగవంతం చేయనున్నారు.
వివరాలు.. మాజీ మంత్రి, అన్నాడీఎంకే మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పి. వలర్మతి నేతృత్వంలో గురువారం ఎంజీఆర్ మాళిగైలో మహిళా విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రం, జిల్లా, యూనియన్, నగరం, టౌన్‌షిప్, బ్రాంచ్, వార్డు, కార్పొరేషన్ మరియు సర్కిల్ స్థాయిల నుండి మహిళా ముఖ్య కార్యనిర్వాహకులు తరలివచ్చారు. మహిళా విభాగం కార్యకర్తలు పేదలకు ఆహారం, దుస్తులు, చీరలు పంపిణీ చేయడం, నేత్రదానం, రక్తదానం, వైద్య శిబిరాలు నిర్వహించడం వంటి సామాజిక సేవలను విస్తృతం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. విద్యార్థులకు విద్యా సామగ్రి అందించడం, ఉచిత వివాహాలు నిర్వహించడం, నర్సింగ్ హోమ్‌లు, వృద్ధాశ్రమాలకు సహాయం వంటి సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగవంతం చేయనున్నారు. అలాగే, కవితా, వ్యాసరచన పోటీలతో పాటు క్రీడా పోటీలను నిర్వహించడం ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు సిద్ధమయ్యారు.
ప్రజల్లోకి పళణి మ్యానిఫెస్టో..
తమ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఇప్పటి వరకుప్రకటించిన 10 వాగ్దానాలను గుర్తుచేస్తూ, ఇందులో మహిళా కుటుంబ పెద్దలకు నెలకు రూ. 2 వేలు, హిజ్రాలకు పెన్షన్ పెంపు, అమ్మ గృహం, విద్యారుణాల రద్దు , ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలను విస్తృతంగా మహిళలోకి తీసుకెళ్లే విధగా కార్యక్రమాలకు తీర్మానించారు. డీఎంకే ప్రభుత్వంపై ప్రజలలో ఉన్న వ్యతిరేకతను, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను మహిళలోకి తీసుకెళ్లేందుకు గ్రామ, వార్డు సభలకు సన్నద్ధమయ్యారు. 2026లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో పళణి స్వామిని ముఖ్యమంత్రి చేయడం లక్ష్యంగా ప్రతిజ్ఞ చేశారు. క్షేత్ర స్థాయిలో మహిళా విభాగం కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే విధంగా 75 మందితో ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి గోకుల ఇందిర, కీర్తికా మునియసామి, మరగద కుమారవేల్, మహేశ్వరి, వలర్మతి, రాజలక్ష్మి, కణిత సంపత్, గాయత్రి రఘురామ్, చంద్రప్రభ, జిల్లా మహిళా కార్యనిర్వాహకులు పాల్గొన్నారు.
క్షేత్రస్థాయిలోకి అమ్మ సైన్యం


