రాత్రి మంచు, పగలు ఎండ
కొరుక్కుపేట: రాత్రి మంచు, పగటి పూట మండే ఎండతో చైన్నె ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు . మార్చి, ఏప్రిల్, మే నెలల్లో తమిళనాడు తీవ్రమైన వేడిని ఎదుర్కొంటుంది. ఇక గత 2 నెలలుగా రాత్రిపూట భారీ హిమపాతం నమోదవుతోంది. ముఖ్యంగా చైన్నె, దాని శివారు ప్రాంతాల్లో, సాయంత్రం ప్రారంభమై ఉదయం వరకు మంచు కురుస్తుంది. దీని కారణంగా, ఇళ్ల బయట పార్క్ చేసిన మోటార్ సైకిళ్లు, కార్లు కూడా మంచుతో తడిచిపోతున్నాయి. ఉదయం బయటకు వెళ్లేవారు స్వెటర్లు ధరిస్తున్నారు. కాగా రాత్రిపూట విపరీతంగా మంచు కురుస్తుండటం వల్ల వద్ధులు, పిల్లలు జలుబుతో ఇబ్బంది పడుతున్నారు.ఇప్పటికే శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారి బాధలను మంచు ప్రభావం మరింత పెంచింది. దీని కారణంగా, జ్వరం, తలనొప్పి, ఇతర వ్యాధులకు చికిత్స పొందడానికి సాయంత్రం వేళల్లో సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రులు, చిన్న క్లినిక్‌లకు తరలివస్తున్నారు. అయితే గత కొద్దిరోజులుగా ఎండ తీవ్రత పెరగడంతో రోజువారీ కూలీలు, చిరు వ్యావారులు అవస్థలు పడుతున్నారు.
జయలలిత ఆస్తుల వేలానికి రెడీ
సాక్షి, చైన్నె: తమకు చెల్లించాల్సిన ఆదాయ పన్ను, వడ్డీ కోసం దివంగత సీఎం జయలలితకు సంబంధించిన ఆస్తులను వేలం వేయడానికి సిద్ధంగా ఉన్నామని కోర్టుకు ఆదాయ పన్ను శాఖ వివరించింది. వివరాలు.. జయలలిత ఆస్తులకు సంబంధించిన పన్ను చెల్లింపు వ్యవహారం ఆదాయ పన్ను శాఖలో గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. కోర్టు ద్వారా ఆమె ఆస్తులకు వారసులుగా ఉన్న జయలలిత అన్న జయకుమార్ కుమార్తె దీప, కుమారుడు వివేక్‌కు ఈ వ్యవహారంపై ఆదాయ పన్ను శాఖ నోటీసులు సైతం ఇచ్చింది. అదే సమయంలో వ్యవహారం హైకోర్టుకు చేరి ఉంది. గురువారం జరిగిన విచారణ సమయంలో హైకోర్టులో ఆదాయ పన్ను శాఖ తరపు వాదనను ఉంచారు. తమకు చెల్లించాల్సిన రూ. 13 కోట్ల బకాయి కోసం అందుకు సంబంధించిన జయలలిత ఆస్తుల వేలం వేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆదాయ పన్నుశాఖ పేర్కొనడం గమనార్హం.
దర్శన టికెట్ల మోసం కేసులో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
కొరుక్కుపేట: మదుౖరై లోని మీనాక్షి అమ్మవారి ఆలయంలో దర్శన టిక్కెట్ మోసం కేసులో ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ విధించారు.ప్రతిరోజూ వేలాది మంది మధురై మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని సందర్శించి, దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి వస్తారు. ఈ పరిస్థితుల్లో కౌంటర్‌లో టిక్కెట్లు కొనకుండానే చాలా మంది స్వామి దర్శనం చేసుకుంటున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేయాలని జాయింట్ కమిషనర్ సురేష్ పేష్కర్ అన్బళగన్‌ను ఆదేశించారు. దీని తర్వాత, పేష్కర్ అన్బళగన్ స్వామి, అమ్మన్ మందిరంలో నిఘా పెంచారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల రికార్డింగ్‌లను కూడా ఆయన పరిశీలించారు. ఇందులో కొందరు టిక్కెట్‌ను పక్కదారిలో విక్రయించినట్టు తెలిసింది. దీంతో ఇద్దరు ఉద్యోగులపై జాయింట్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా, కమిషనర్ బుధవారం రాత్రి ఉద్యోగులు పేచీ , శివరాజ్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఇద్దరిపై దర్యాప్తు కొనసాగుతోంది.
బాలికను గర్భవతిని చేసిన బాబాయికి 25 ఏళ్ల జైలు
అన్నానగర్: బాలికను గర్భవతిని చేసిన బాబాయికి 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ చైన్నె పోక్సో కోర్టు తీర్పు వెలువరించింది. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలిక చైన్నెలోని కోయంబేడు ప్రాంతంలో లోడ్ లిఫ్టింగ్ కార్మికుడైన తన బాబాయి ఇంట్లో ఉంటూ 10వ తరగతి చదువుతోంది. 2023 జూలైలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సోదరుడి కుమార్తె అని కూడా చూడకుండా ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. అయితే ఈ విషయం బయట చెబితే తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించాడు. విషయం బయటకు రావడంతో కోయంబేడు ఆల్ ఉమెన్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ చైన్నె పోక్సో ప్రత్యేక కోర్టులో జరుగుతోంది. కేసు విచారణ చివరి దశ ముగిసిన తర్వాత, న్యాయమూర్తి పద్మ గురువారం తీర్పు ప్రకటించారు. ఇందులో, బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన బాబాయికి 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 5 లక్షల జరిమానా విధించారు. బాధిత బాలికకు తమిళనాడు ప్రభుత్వం రూ.3 లక్షలు పరిహారంగా అందించాలని, ఆ బాలిక బ్లాక్ చేసిన 10వ తరగతి పరీక్షను తిరిగి రాయాలని, నేరస్థుడికి విధించిన జరిమానా రూ.5 లక్షలు, పరిహారం రూ.3 లక్షలు, మొత్తం రూ.8 లక్షలు బాలిక పేరు మీద బ్యాంకులో జమ చేయాలని, బాలిక భవిష్యత్తు జీవితానికి సహాయం చేయడానికి ఒక ఛారిటీ నిర్వాహణ కోసం భద్రతా వ్యక్తిగా నియమించాలని కూడా ఆదేశించారు. ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిత హాజరై వాదించారు. లైంగిక వేధింపులకు గురైన బాలిక విచారణ సమయంలో ఓ బిడ్డకు జన్మ నిచ్చింది. ఆ బిడ్డను చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు.


