అవయవ లోపంకి మించిన రుగ్మతలతో పోరాడుతూ ప్రతిభను చాటుకుంటున్నారు చాలామంది. అన్ని బాగుండి విజయం సాధించడం కాదు..సమస్యతో పోరాడుతూ విజయం సాధించడం వేరేలెవల్ అంటూ సత్తా చాటి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాంటి కోవకు చెందిన వాడే ఈ మన్వేందర్ సింగ్. చిన్నానాటి నుంచి సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతూ..మరోవైపు తండ్రి మరణం భుజాలపై ఇంటి బాధ్యతలు..ఇన్ని సమస్యలతో పోరాడుతూ అసామాన్యమైన ప్రతిభను చాటి శెభాష్ అనిపించుకుని యువతకు ప్రేరణగా నిలిచాడు.
అతడే బులంద్‌షహర్ జిల్లాలోని ఆవాస్ వికాస్ నివాసి మన్వేంద్ర సింగ్. అతడు సెరిబ్రల్ పాల్సి బాధితుడు. ఇది కదలిక, కండరాలను నియంత్రణను ప్రభావితం చేసే నాడీ సంబంధిత వ్యాధి. అతడికి ఆరునెలల వయసులో వ్యాధి ఉందని వైద్యులు నిర్థారించారు. రెండేళ్లకే మెడను సరిగా నిలబెట్టడంలో ఇబ్బందిపడ్డాడు, పెద్దయ్యాక శరీరం కుడివైపుకి వండిపోవడంతో..రోజువారీ పనులు చేసుకోలేక చాలా అవస్థలు పడ్డాడు. తనకు ప్రతిబంధంగా ఉన్న శరీరంతో పోరాడుతూ..సవాలుగా మారిన రోజువారీ సాధారణ పనులను ఎలా చేయాలో తెలుసుకుంటూ సాగింది అతడి ప్రయాణం.
అతడి ప్రతిభను వెలికతీయడంలో తల్లి పాత్ర కీలకం..
అతని తల్లి రేణు సింగ్, బులంద్‌షహర్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్. తన కుమారుడు ప్రతీది చాలా ఆలస్యంగా నేర్చుకునేవాడు. పెన్సిల్ పట్టుకోవడమే చాలా కష్టంగా ఉండేదని చెప్పుకొచ్చింది. అతడి బాల్యం మొత్తం శారీరక, సామాజిక అడ్డంకులతో నిండి ఉందని చెప్పుకొచ్చారామె. తన కుడివైపు ఉన్న శారీరక పరిమితులను భర్తీ చేసేలా ఎడమ చేతితో అన్ని పనులు చేసుకునేలా శిక్షణ తీసుకున్నాడు.
వైద్యులు అతడి నడకను సైతం ఆ వ్యాధి ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. దాంతో చికిత్స కోసం ఢిల్లీలోని ఆస్పత్రులన్ని తిరిగామని చెప్పుకొచ్చారామె. వైద్య సంరక్షణ తోపాటు అతడి సంకల్ప బలం తోడవ్వడంతో ..అతడు ఆ సమస్యను అధిగమించగలిగాడు. ఇంతలో విధి మరోలా తలచింది అంటూ కన్నీటి పర్యంతమయ్యారామె.
ఈ శారీరక కష్టానికి తోడు ఇంటి బాధ్యతలు..
మన్వేంద్రకు 17 ఏళ్ల వయసులో, అతని తండ్రి దీర్ఘకాలిక అనారోగ్యంతో మరణించాడు. ఇంటి పెద్దను కోల్పోవడం ఆ కుటుంబాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. మన్వేందర్‌ని ఈ ఘటన మరింతగా కుంగదీసింది. అయితే ఒకరకంగా అతడిలో దాగున్న అంతర్లీన శక్తిని తట్టిలేపి..ఇంటికి పెద్ద కొడుకుగా ఇంటి బాధ్యతలను స్వీకరించేలా చేసిందని చెప్పుకొచ్చారామె. ఇక మన్వేందర్ ఇంటర్ తర్వాత ఐఐటీ లక్ష్యంగా ఎంట్రన్స్ టెస్ట్‌కి ప్రిపేరయ్యి..ఐఐటీ పాట్నాలో సీటు సంపాదించాడు.
అక్కడ బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, యూపీఎస్సీ ఆల్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ 2025కి ప్రిపేరయ్యాడు. తొలి ప్రయత్నంలోనే ప్రిలిమ్స్, మెయిన్స్ క్లియర్ చేసి, ఆల్ ఇండియా 112ర్యాంకు సాధించి..అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఎగ్జామ్‌లో గెలుపొందితే టెలికాం, విద్యుత్ వంటి కేంద్ర ప్రభుత్వ విభాగాలలో గ్రూప్ ఏ, లేదా బీ కేటగిరీలో ఇంజనీర్‌గా నియమిస్తుంది ప్రభుత్వం. చివరగా అతడి తల్లి రేణుసింగ్ మాట్లాడుతూ.. "ప్రతిదీ భారంగా అనిపించిన క్షణాలు ఉన్నాయి. అయితే నేను నువ్వు ఇది చేయగలవు అనే నమ్మకాన్ని ఇస్తూనే ఉన్నా.
ఈ విజయం అతడి ఏళ్ల తరబడి కృషి, పట్టుదల, ఓర్పుల ప్రతితిఫలమే ఈ సక్సెస్ అని భావోద్వేగంగా చెప్పుకొచ్చింది ". మన్వేంద్ర తల్లి. బిడ్డ ఎలా ఉన్నా తల్లికి గొప్ప అందగాడు, హీరో.. అది నిజం చేసేలా ప్రపంచం ముందు గొప్పవాడిగా తీర్చిదిద్దేలా తల్లి ఎంతగా పరితపిస్తుంది అనేందుకు ఈ కథే ఉదాహరణ.
(చదవండి: పేరెంట్స్ చేత ట్రీట్ ఇప్పించుకోండి..! వైరల్‌గా ప్రముఖ వ్యాపారవేత్త పోస్ట్)


