breaking news
ece
-
ఇంజినీరింగ్ పల్టీ
జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల ఆశలు, కలలు, ఆలోచనలు బూమరాంగ్ అయ్యాయి. గత రెండు.. మూడేళ్లుగా ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్ల భర్తీకి యాజమాన్యాలు నానా పాట్లు పడుతున్నారు. ఈ ఏడాది పరిస్థితి మరీ దారుణంగా మారింది. జిల్లా మొత్తంగా ఉన్న కళాశాలల్లో 56.65 శాతం సీట్లు మాత్రమే భర్తీ కాగా, రెండు కళాశాలల్లో ‘0’ శాతం, మరో రెండు కళాశాలల్లో 4 శాతం సీట్లు కూడా భర్తీ కాని పరిస్థితి నెలకొంది. గత విద్యా సంవత్సరాల్లో భర్తీ కానీ సీట్లను యాజమాన్యాలు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించాయి. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది కొన్ని కళాశాలలు మూతపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నెల్లూరు (టౌన్): ఒకప్పుడు విద్యార్థులు ఇంజినీరింగ్ కళాశాలలో ఏ బ్రాంచ్‌లో అయినా పర్వాలేదు సీటు దొరికితే చాలు అదృష్టంగా భావించే వారు. అప్పట్లో కళాశాలల యాజమాన్యం చెప్పిందే వేదం. ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ఒక్క విద్యార్థి దొరికితే చాలు కళాశాలను నడుపుకుందామనే ధోరణిలో పలు కళాశాలల యాజమాన్యాలు ఉన్నాయి. ఈ ఏడాది కూడా ఆయా కళాశాలల్లో పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ కాకపోవడంతో మూడో విడత కౌన్సెలింగ్‌పై ఆశలు పెట్టుకున్న యాజమాన్యాలకు నిరాశే మిగిలింది. రెండో విడత కౌన్సెలింగ్‌లో ఆయా కళాశాలల్లో చేరిన విద్యార్థులు సైతం మూడో విడత కౌన్సెలింగ్ సమయంలో 106 మంది జారుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 56.56 శాతం భర్తీ ఇంజినీరింగ్ మూడో విడత కౌన్సెలింగ్ గత నెల 31తో ముగిసింది. జిల్లాలో ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో 56.65 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. జిల్లాలో ఏ కళాశాలలోనూ 100 శాతం సీట్లు భర్తీ కాలేదు. కావలి ప్రాంతంలో ఉన్న ఆర్ఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో మాత్రం 90.82 శాతం సీట్లు భర్తీ అయి ప్రథమ స్థానంలో, ఆ తర్వాత 88.62 శాతం భర్తీతో నారాయణ రెండో స్థానంలో నిలిచాయి. 87.04 శాతంతో శ్రీవెంకటేశ్వర మూడో స్థానం, 85.98 శాతంతో గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాల నాలుగో స్థానంలో నిలిచాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,245 సీట్లు ఉన్నాయి. వాటిల్లో మూడో విడత కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత 3,538 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 2,707 సీట్లు మిగిలి పోయాయి. జిల్లాలో రెండు ఇంజినీరింగ్ కళాశాలల్లో జీరో శాతం అడ్మిషన్లు ఉండగా, మరో రెండు కళాశాలల్లో 4 శాతం లోపు అడ్మిషన్లు ఉండటం గమనార్హం. 20 శాతం లోపు 2 కళాశాలలో 50 శాతం లోపు 6 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. జిల్లాలోని 10 ఇంజినీరింగ్ కళాశాలల్లో 50 శాతానికి పైగా సీట్లు భర్తీ అయ్యాయి. సీఎస్ఈ, ఈసీఈ బ్రాంచ్‌లకు డిమాండ్ ఇంజినిరింగ్‌లో సీఎస్ఈ, సివిల్, మెకానికల్, ట్రిపుల్ ఈ, ఈసీఈ, ఐటీ తదితర బ్రాంచ్‌లు ఉన్నాయి. అయితే సీఎస్ఈ, ఈఎస్ఈ బ్రాంచ్‌లకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ రెండు బ్రాంచ్‌ల్లో చేరేందుకు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు. కంప్యూటర్ సైన్స్ కోర్సు పూర్తికాగానే ఉద్యోగంలో చేరవచ్చన్న భావనలో విద్యార్థులు ఉంది. జిల్లా వ్యాప్తంగా అన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో పూర్తయిన బ్రాంచ్‌లను పరిశీలిస్తే సీఎస్ఈలో 70.20 శాతం సీట్లు భర్తీ కాగా ఈసీఈలో 65.3 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. సివిల్‌లో 38.4 శాతం, ట్రిపుల్ ఈ లో 41.1 శాతం, మెకానికల్‌లో 50.2 శాతం, ఐటీ 34.5 శాతం సీట్లు భర్తీ కావడం విశేషం. మూత దిశగా కొన్ని కళాశాలలు ఇంజినీరింగ్‌లో ఆశించిన మేర విద్యార్థులు చేరక పోవడంతో కొన్ని కళాశాలలు మూత పడే దిశలో ఉన్నాయి. గత ఏడాది అనుభావాలను దృష్టితో ఈ ఏడాది సుమారు 2 వేలు సీట్లను వదులుకున్నారు. ప్రధానంగా జిల్లాలో చదివిన విద్యార్ధులు ఇక్కడ ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరకుండా ఎక్కువ మంది విద్యార్ధులు ఇతర రాష్ట్రాల్లోని కళాశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రీతిలో జిల్లా నుంచి ప్రతి ఏటా సుమారు 14 వేల మందికి పైగా విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఇంజినీరింగ్ చదివేందుకు వెళుతున్నారని తెలిసింది. ఇక్కడ ఎక్కువ కళాశాలల్లో బీటెక్ పూర్తి చేసిన వారితోనే బోధన చేయిస్తున్నారన్న ప్రచారం ఉంది. -
ప్రముఖ ఎన్ఐటీలు.. కటాఫ్ ర్యాంకులు
మరికొద్ది రోజుల్లో జేఈఈ మెయిన్ ర్యాంకులు వెల్లడి కానున్నాయి. జూలై 1 నుంచి జేఈఈ మెయిన్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా 30 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)లు; కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లు; ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (ఐఐఐటీఎం); ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (ఐఐఐటీడీఎం)లు, ఇతర సంస్థల్లో వివిధ కోర్సుల్లో దాదాపు 40,000 సీట్లున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎన్ఐటీల్లో .. బీటెక్‌లో టాప్ బ్రాంచ్‌ల్లో గతేడాది క్లోజింగ్ ర్యాంకుల వివరాలు తెలుసుకుందాం.. EEE ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రోజుకో కొత్త ఎలక్ట్రానిక్ ఉత్పత్తి, ఎలక్ట్రికల్ ఉపకరణాలు మార్కెట్లో వచ్చిపడుతున్న తరుణంలో రెండు రకాల అవకాశాల వేదికలను (ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్) అందుకునేందుకు దోహదం చేస్తుంది ఈఈఈ. స్థూలంగా డిజైన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ డివెసైస్ అండ్ సర్క్యూట్స్, అనాలసిస్ అండ్ ఆపరేషన్ ఆఫ్ పవర్ సిస్టమ్, పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్ అండ్ డిజైన్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఫీల్డ్స్, కంప్యూటర్ ఎయిడెడ్ పవర్ సిస్టమ్ అనాలసిస్, యుటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ వంటి కోర్ సబ్జెక్టులపై విద్యార్థులకు శిక్షణనిస్తారు. అవకాశాలు: మనదేశంలో విద్యుత్ కొరతను అధిగమించడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. కొత్త విద్యుత్ ప్లాంట్ నిర్మాణాలను భారీ స్థాయిలో చేపడుతున్నాయి. వీటితోపాటు హైడ్రో ఎలక్ట్రిసిటీ రంగం, నేచురల్ గ్యాస్ పాంట్లు, పవర్ కార్పొరేషన్లు, అణు విద్యుత్ కర్మాగారాలు, రైల్వేలు, విద్యుత్ ఉపకరణ ఉత్పత్తుల సంస్థలు, ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో ఈఈఈ ఉత్తీర్ణులకు అపార అవకాశాలు ఉన్నాయి. గతేడాది కటాఫ్స్: కోర్ బ్రాంచ్‌ల్లో ఒకటి కావడం.. భవిష్యత్ అవకాశాల నేపథ్యంలో ఈ కోర్సుకు విపరీతమైన డిమాండ్ ఉంది. గతేడాది ఎన్ఐటీ వరంగల్‌లో హోమ్ స్టేట్ కోటాలో జనరల్ కేటగిరిలో సీటు లభించిన చివరి ర్యాంకు 3601. అదర్స్టేట్ కోటాలో కూడా చాలా తక్కువ ర్యాంకుకే (4131) సీట్లు భర్తీ అవడం గమనార్హం. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు ఎక్కువగా చేరే ఎన్ఐటీ తిరుచిరాపల్లి (తమిళనాడు), సూరత్కల్ (కర్ణాటక), కాలికట్ (కేరళ)లలో కూడా వరుసగా సీట్లు లభించిన చివరి ర్యాంకులు.. 3067, 3723, 6460. వీటిని బట్టి చూస్తేనే తెలుస్తోంది ఈఈఈకి ఎంత డిమాండ్ ఉందో! ECE ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అందించే బ్రాంచ్ ఈసీఈ. పరిధి విస్తృతంగా ఉండే ఈసీఈ ద్వారా ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, టెలికాం, సెమీకండక్టర్ డిజైన్ తదితర రంగాల గురించిన పరిజ్ఞానం సొంతం చేసుకోవచ్చు. ఈసీఈలో అనలాగ్ ట్రాన్స్మిషన్, డిజిటల్ ట్రాన్స్మిషన్, వాయిస్ అండ్ డాటా, బేసిక్ ఎలక్ట్రానిక్స్, సాలిడ్ స్టేట్ డివెసైస్, మైక్రో ప్రాసెసర్స్, డిజిటల్ అండ్ అనలాగ్ కమ్యూనికేషన్, అనలాగ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, శాటిలైట్ కమ్యూనికేషన్, మైక్రోవేవ్ ఇంజనీరింగ్, ఆంటెన్నా అండ్ వేవ్ ప్రొగ్రెషన్ తదితర అంశాలను అధ్యయనం చేస్తారు. దాంతోపాటు ఎలక్ట్రానిక్ పరికరాలు, సర్క్యూట్స్, ప్రసార ఉపకరణాలైన ట్రాన్స్‌మీటర్, రిసీవర్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, మైక్రోవేవ్స్, ఫైబర్ వంటి వాటి తయారీలో ఈసీఈ విభాగం కీలకపాత్ర పోషిస్తుంది. ఉద్యోగావకాశాలు: ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లోనూ, వాటి అనుబంధ సంస్థలు, కార్పొరేషన్లలోనూ ఉద్యోగావకాశాలు విస్తృతం. యూపీఎస్సీ ఏటా నిర్వహించే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్) ఎగ్జామినేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో చేరొచ్చు. టీచింగ్ రంగంలోనూ ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారతీయ రైల్వేలు, అణు విద్యుత్ కంపెనీలు, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డెరైక్టరేట్ ఆఫ్ జనరల్ పోస్ట్స్ అండ్ టెలిగ్రాఫ్స్ డిపార్ట్మెంట్స్.. మొదలైనవాటిలో ఉద్యోగాలు పొందొచ్చు. గతేడాది ర్యాంకుల విశ్లేషణ: కోర్ బ్రాంచ్‌ల్లో ఒకటి కావడం, ఉన్నత విద్య, ఉద్యోగావ కాశాల విషయంలో ఎలాంటి ఢోకా లేకపోవడంతో ప్రధాన ర్యాంకర్లలో ఎక్కువ శాతం ఈసీఈనే ఎంచుకుంటున్నారు. గతేడాది సీట్లు లభించిన చివరి ర్యాంకులను గమనిస్తే ఈ విషయం అవగతమవుతోంది. ఎన్ఐటీ వరంగల్‌లో హోమ్ స్టేట్ కోటాలో జనరల్ కేటగిరీ విద్యార్థికి సీటు లభించిన చివరి ర్యాంకు.. 2543. కాగా ఇతర రాష్ట్ర కోటాలో సీటు కూడా 3364కే భర్తీ అయింది. ఇక దక్షిణ భారత ఎన్ఐటీలు.. తిరుచిరాపల్లిలో 2076, సూరత్కల్లో 2456, కాలికట్లో 4966 ర్యాంకుకే సీట్లన్నీ నిండాయి. CIVILసివిల్ ఇంజనీరింగ్ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తున్నాయి. మనదేశంలో రియల్ ఎస్టేట్ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. పెరుగుతున్న జనాభా, మానవ అవసరాలకనుగుణంగా ఇళ్లు, రహదారులు, మురుగునీటి కాలువలు, భూ అంతర్గత రహదారులు , ఫ్లై ఓవర్లు నిర్మాణంతోపాటు నదులపై ప్రాజెక్టులు చేపడుతున్నారు. భారీ విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నాయి. వీటన్నింటి నిర్మాణంలో తప్పనిసరిగా సివిల్ ఇంజనీర్ల సేవలు అవసరం. ఈ క్రమంలో సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు హాట్ ఫేవరెట్ బ్రాంచ్‌గా నిలుస్తోంది. ఉద్యోగావకాశాలు: సివిల్ ఇంజనీర్లకు అటు ప్రభుత్వ రంగంలోనూ, ఇటు ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రహదారులు- భవనాల శాఖ, నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్ విభాగం, గ్రామీణ నీటి సరఫరా విభాగం, కాలుష్య నియంత్రణ మండలి, వివిధ పరిశోధన సంస్థలు, భారతీయ రైల్వేలు, జాతీయ రహదారుల విభాగం, జాతీయ విపత్తు నిర్వహణ విభాగం, ఎల్ అండ్ టీ, డీఎల్ఎఫ్ వంటి సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఇవే కాకుండా ప్రతి ఏటా యూపీఎస్సీ నిర్వహించే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ద్వారా కేంద్ర ప్రభుత్వ కొలువుల్లో పాగా వేయొచ్చు. గతేడాది కటాఫ్ ర్యాంకులు: గతేడాది ఎన్ఐటీ-వరంగల్‌లో హోమ్ స్టేట్ కోటాలో జనరల్ కేటగిరీలో 4954 వరకు, అదర్ స్టేట్ కోటాలో 7483 ర్యాంకు వరకు సీట్లు లభించాయి. ఇక ఎన్ఐటీ-తిరుచిరాపల్లి, ఎన్ఐటీ-సూరత్కల్, ఎన్ఐటీ-కాలికట్లలో సీట్లు భర్తీ అయిన చివరి ర్యాంకులు 6814, 7411, 11206. MECHANICALమెకానికల్ ఇంజనీరింగ్ ఒక ప్రొడక్ట్ డిజైన్‌లో, తయారీలో మెకానికల్ ఇంజనీర్లది కీలక పాత్ర. ఇది కేవలం యంత్ర పరికరాలకే కాకుండా.. ఎయిర్ కండీషన్లు, గ్యాస్ టర్బైన్లు వంటి ఎలక్ట్రికల్ పరికరాలకు విస్తరించింది. ప్రొడక్ట్స్, కాంపొనెంట్స్, సిస్టమ్స్.. ఇలా అనేక యంత్ర పరికరాల తయారీలో ప్రతి దశలోనూ మెకానికల్ ఇంజనీర్ల ప్రతిభ ఎంతో అవసరం. మెకానికల్ ఇంజినీరింగ్ పరిధి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఎయిరోప్లేన్ నుంచి ఎయిర్ కండీషనర్ దాకా.. రాకెట్ నుంచి రోబోల తయారీ వరకూ.. స్టీలు పరిశ్రమలలో, కార్ల డిజైన్‌లో.. ఇలా అనేక విభాగాల్లో మెకానికల్ ఇంజనీరింగ్ పాత్ర కీలకం..! వచ్చే 5-10 ఏళ్లలో భారత్‌లో ఆటోమొబైల్స్, పవర్, ఏరోస్పేస్ పరిశ్రమ గణనీయ వృద్ధిని నమోదు చేసుకోనుంది. గెయిల్, ఎన్టీపీసీ, డీఆర్డీవో వంటి ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు టాటా మోటార్స్, మారుతి సుజుకీ, హోండా, తదితర సంస్థల్లో ఉపాధికి కొదవ లేదు. గతేడాది కటాఫ్ ర్యాంకులు: గతేడాది ఎన్ఐటీ వరంగల్‌లో హోమ్ స్టేట్ కోటాలో జనరల్ కేటగిరీలో సీటు లభించిన చివరి ర్యాంకు 3780 కాగా.. అదర్ స్టేట్ కోటాలో చివరి ర్యాంకు 3530. ఇక ఎన్ఐటీ - తిరుచిరాపల్లి, ఎన్ఐటీ - సూరత్కల్, ఎన్ఐటీ - కాలికట్లలో సీట్లు లభించిన చివరి ర్యాంకులు వరుసగా.. 2818, 3178, 6203. CHEMICAL కెమికల్ ఇంజనీరింగ్ పరిశ్రమల విస్తరణ శరవేగంగా జరుగుతున్న ప్రస్తుత తరుణంలో కెమికల్ ఇంజనీర్ల అవసరం బాగా పెరుగుతోంది. మరోవైపు ముడివనరుల కొరత పెరుగుదలతో సహజ వనరుల స్థానంలో సింథటిక్ వనరుల సృష్టికి కెమికల్ ఇంజనీర్ల అవసరం ఎంతైనా ఉంది. కెమికల్ ఇంజనీర్‌గా ఒక పరిశ్రమలో అనేక క్లిష్టతరమైన బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. సంబంధిత పరిశ్రమకు అవసరమైన పరిశోధన, అభివృద్ధి, డిజైన్, అమలు, నిర్వహణ పనులు కెమికల్ ఇంజనీర్ విధిలో భాగాలే. నిజానికి కెమికల్ ఇంజనీరు ఒక పరిశ్రమలో అనేక ఇంజనీరింగ్ శాఖలను.. అంటే కెమిస్ట్, ఇండస్ట్రియల్ ఇంజనీర్, మెటీరియల్స్ ఇంజనీర్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ల సమ్మిళిత పాత్రను నిర్వహించాలి. ఉద్యోగావకాశాలు: ఉత్పాదక రంగం విస్తృతంగా అభివృద్ధి చెందుతోంది. పెట్రోలియం, పెట్రోకెమికల్స్ నుంచి ఆహార పరిశ్రమల వరకు కెమికల్ ఇంజనీర్ల పాత్ర కీలకం. మెటీరియల్స్, స్పెషాలిటీ కెమికల్స్, ప్లాస్టిక్స్, పవర్ ప్రొడక్షన్, ఎన్విరాన్మెంటల్ కంట్రోల్, వేస్ట్ మేనేజ్మెంట్, బయోటెక్నాలజీ, లేబొరేటరీలు, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు, ఎరువులు-రసాయనాల కర్మాగారాల్లో వివిధ హోదాల్లో అవకాశాలుంటాయి. గతేడాది కటాఫ్ ర్యాంకులు: కెమికల్ ఇంజనీరింగ్‌లో గతేడాది ఎన్ఐటీ వరంగల్‌లో హోమ్ స్టేట్ కోటాలో జనరల్ కేటగిరీలో 8061 వరకు, ఇతర రాష్ట్ర కోటాలో 10,500 ర్యాంకు వరకు సీట్లు లభించాయి. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రాధాన్యమిస్తున్న ఎన్ఐటీ-తిరుచిరాపల్లి, ఎన్ఐటీ-సూరత్కల్, ఎన్ఐటీ-కాలికట్లలో సీట్లు లభించిన చివరి ర్యాంకులు వరుసగా.. 8174, 8369, 14,463. CSE కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నేడు కంప్యూటర్ ప్రవేశించని రంగమే లేదంటే అతిశయోక్తి కాదు. దైనందిన వ్యవహారాల నుంచి వ్యాపార అవసరాల వరకు మానవ జీవితంలో కంప్యూటర్ పెనవేసుకుపోయింది. ఏ స్థాయిలో అంటే ఆన్లైన్లోనే బస్, రైలు, విమాన, సినిమా టికెట్ల బుకింగ్ నుంచి ఆన్లైన్ చాటింగ్ వరకు పెరిగిపోయింది. ఇక కంపెనీలు, పరిశ్రమల అవసరాలు చెప్పాల్సిన పనే లేదు. దాంతో ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో అవకాశాలు విస్తృతమయ్యాయి. కంప్యూటర్ సిస్టమ్స్ డిజైన్, నిర్మాణం, నిర్వహణ కంప్యూటర్ ఇంజనీర్ల పని. డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్ కంప్యూటర్లు, సర్వర్లతోపాటు మొబైల్ ఫోన్లలో వినియోగించే వివిధ అప్లికేషన్స్ రూపకల్పన, వివిధ పరిశ్రమల్లో ఉపయోగించే అప్లికేషన్స్, ఇంటిగ్రేటెడ్ మైక్రోచిప్స్‌ను కంప్యూటర్ ఇంజనీర్లు రూపొందిస్తారు. కంప్యూటర్ ఇంజనీర్లు సాఫ్ట్‌వేర్‌తోపాటు హార్డ్‌వేర్ విభాగాల్లోనూ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. జాబ్ ప్రొఫైల్స్: టెక్నికల్ రైటర్, సాఫ్ట్వేర్ డిజైనర్, మల్టీమీడియా ప్రోగ్రామర్, అప్లికేషన్ ప్రోగ్రామర్, టెక్నికల్ ఆర్కిటెక్ట్, సిస్టమ్స్ ప్రోగ్రామర్, సిస్టమ్స్ అనలిస్ట్, గేమ్ డిజైనర్, కంప్యూటర్ ఇంజనీర్, సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్, డేటా నెట్వర్క్ డిజైనర్, సెక్యూరిటీ అనలిస్ట్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, వెబ్సైట్ డెవలపర్/డిజైనర్. గతేడాది కటాఫ్ ర్యాంకుల విశ్లేషణ: అన్ని కోర్ బ్రాంచ్‌ల కంటే సీఎస్ఈని విద్యార్థుల ఫేవరెట్ బ్రాంచ్ అని చెప్పొచ్చు. ఇందుకు గతేడాది కటాఫ్ ర్యాంకులే నిదర్శనం. గతేడాది ఎన్ఐటీ- వరంగల్‌లో హోమ్ స్టేట్ కోటాలో జనరల్ కేటగిరీలో కేవలం 2411, అదర్ స్టేట్ కోటాలో 1921 ర్యాంకుకే సీట్లన్నీ నిండాయి. మిగిలిన ప్రధాన ఎన్ఐటీల్లోనూ ఇదే పరిస్థితి. ఎన్ఐటీ-తిరుచిరాపల్లిలో 1344 ర్యాంకు వరకు, ఎన్ఐటీ-సూరత్కల్లో 1785 ర్యాంకు వరకు, ఎన్ఐటీ- కాలికట్లో 4552 వరకు సీట్లు లభించాయి. జేఈఈ మెయిన్ కౌన్సెలింగ్ ముఖ్య తేదీలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్: జూలై 1 నుంచి జూలై 9 వరకు ఛాయిస్ లాకింగ్: జూలై 6 నుంచి జూలై 9 వరకు మొదటి రౌండ్ సీట్ ఎలాట్మెంట్: జూలై 11 ఫీజు చెల్లింపు: జూలై 11 నుంచి జూలై 14 వరకు రెండో రౌండ్ సీట్ ఎలాట్మెంట్: జూలై 16 ఫీజు చెల్లింపు: జూలై 16 నుంచి జూలై 19 వరకు మూడో రౌండ్ సీట్ ఎలాట్మెంట్: జూలై 21 ఫీజు చెల్లింపు: జూలై 21 నుంచి జూలై 23 వరకు సీటు సరెండర్ (1, 2, 3 రౌండల్లో లభించిన సీటు నచ్చకపోతే): జూలై 21 నుంచి జూలై 23 వరకు మొదటి మూడు రౌండ్లలో సీటు లభించినవారు కేటాయించిన ఇన్స్టిట్యూట్లలో రిపోర్టింగ్: జూలై 21 నుంచి జూలై 24 వరకు నాలుగో రౌండ్ సీట్ ఎలాట్మెంట్: జూలై 26 నాలుగో రౌండ్లో సీటు లభించినవారు కేటాయించిన ఇన్స్టిట్యూట్లో రిపోర్టింగ్: జూలై 26 నుంచి జూలై 29 ఇంటర్నల్ స్లైడింగ్: జూలై 31 స్పాట్ రౌండ్ (జీఎఫ్‌టీఐ, ఎస్ఎఫ్టీఐ) ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్, ఆన్లైన్ ఫీజు చెల్లింపు, ఆన్లైన్ ఛాయిస్ లాకింగ్: జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు స్పాట్ రౌండ్ సీట్ ఎలాట్మెంట్: ఆగస్టు 4 కౌన్సెలింగ్ ముగింపు: ఆగస్టు 7 వెబ్సైట్: www.ccab.nic.in జేఈఈ మెయిన్ ర్యాంకుతో ప్రవేశం కల్పించే ఎన్ఐటీలు 1. ఎన్ఐటీ- అగర్తలా 2. మోతీలాల్ నెహ్రూ ఎన్ఐటీ - అలహాబాద్ 3. ఎన్ఐటీ - అరుణాచల్ ప్రదేశ్ 4. మౌలానా ఆజాద్ ఎన్ఐటీ - భోపాల్ 5. ఎన్ఐటీ - కాలికట్ 6. ఎన్ఐటీ - ఢిల్లీ 7. ఎన్ఐటీ - దుర్గాపూర్ 8. ఎన్ఐటీ - గోవా 9. ఎన్ఐటీ - హమీర్పూర్ 10. మాలవీయ ఎన్ఐటీ - జైపూర్ 11. బీఆర్ అంబేద్కర్ ఎన్ఐటీ - జలంధర్ 12. ఎన్ఐటీ - జంషెడ్పూర్ 13. ఎన్ఐటీ - కురుక్షేత్ర 14. ఎన్ఐటీ - మణిపూర్ 15. ఎన్ఐటీ - మేఘాలయా 16. ఎన్ఐటీ- మిజోరాం 17. ఎన్ఐటీ - నాగాలాండ్ 18. విశ్వేశ్వరాయ ఎన్ఐటీ - నాగ్‌పూర్ 19. ఎన్ఐటీ - పాట్నా 20. ఎన్ఐటీ - పుదుచ్చేరి 21. ఎన్ఐటీ - రాయ్‌పూర్ 22. ఎన్ఐటీ - రూర్కెలా 23. ఎన్ఐటీ - సిక్కిం 24. ఎన్ఐటీ - సిల్చార్ 25. ఎన్ఐటీ - శ్రీనగర్ 26. సర్దార్ వల్లభాయ్ ఎన్ఐటీ - సూరత్ 27. ఎన్ఐటీ - సూరత్కల్ 28. ఎన్ఐటీ - తిరుచిరాపల్లి 29. ఎన్ఐటీ - ఉత్తరాఖండ్ 30. ఎన్ఐటీ - వరంగల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ, ఐఐఐటీఎం అండ్ ఐఐఐటీడీఎం)లు 1.అటల్ బిహారి వాజ్పాయ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ - గ్వాలియర్ 2.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ - కాంచీపురం 3.రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - అమేథి 4.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - గువహటి 5.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - అలహాబాద్ 6.పండిట్ ద్వారకా ప్రసాద్ మిశ్రా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ - జబల్పూర్ 7. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - కోటా, రాజస్థాన్ 8. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - శ్రీ సిటీ, సత్యవేడు, ఆంధ్రప్రదేశ్ 9. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - వడోదరా 10. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఉనా, హిమాచల్‌ప్రదేశ్ 11. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కల్యాణి, పశ్చిమ బెంగాల్ 12. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ - త్రిపుర 13. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సోనేపట్, హర్యానా -
యూనివర్సల్ విద్యార్థుల ఎంపిక
మేడికొండూరు, న్యూస్‌లైన్: మండలం లోని డోకిపర్రు అడ్డరోడ్డు సమీపంలోని యూనివర్సల్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో లాజిక్ ఇ ఆర్ పి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మొహాలీ, పంజాబ్ వారి ఆధ్వర్యంలో రెండు రోజులుగా క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. బీటెక్ ఈసీఈ, సీఎస్ఈ, ఈఈఈ విద్యార్థులు 150 మంది హాజరయ్యారు. కంపెనీ ఆపరేషన్స్ హెడ్ సాల్మన్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించి 10 మందిని ఎంపిక చేశారు. చీరాలలోని వీఆర్ఎస్, వైఆర్ఎన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన జాబ్‌ఫెయిర్ నందు యురేకాఫోర్ట్, ఎన్ఎస్ఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీఆదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీలకు కళాశాలకు చెందిన 16 మంది ఎంబీఏ విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం జాస్మిన్ ఇన్ఫోటెక్ చెన్నై సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్‌లో అర్హత సాధించిన 33మంది విద్యార్థులకు రాతపరీక్ష నిర్వహించారు. ఎంపికైన విద్యార్థులను కళాశాల చైర్మన్ డాక్టర్ గాలి బాలి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో ఉన్నతస్థాయికి ఎదగాలంటే కార్యదీక్ష, పట్టుదలతో పాటు ఇంగ్లిష్ భాషపై ప్రావీణ్యం సాధించాలని విద్యార్థులకు సూచించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఫాదర్ లూర్దురెడ్డి మాట్లాడుతూ వివిధ కంపెనీల ప్రోత్సాహంతో విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కె.విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ రాబోవు రోజుల్లో టెక్‌మహీంద్రా, విప్రో కంపెనీలతో పాటు వివిధ కంపెనీలు ఎంపికలు నిర్వహించడానికి కళాశాలకు రానున్నాయని చెప్పారు.