ఏఐకి అనుగుణంగా కోర్సుల్లో నాణ్యత తీసుకురావాలి
సీట్లు, మౌలిక వసతులు పెంచాలంటున్న విద్యాసంస్థలు
కేంద్ర ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదనలు
దేశవ్యాప్తంగా ఎమర్జింగ్ కోర్సులకు డిమాండ్
ఏఐ, డేటాసైన్స్‌కు పునాది వేసే ఇంటర్ డిసిప్లినరీ కోర్సుల అభివృద్ధి అవసరం
2026–27 విద్యా సంవత్సరంలోనే కనీసం 2 వేల సీట్లు పెంచాలి
లేబొరేటరీలను ఉన్నతీకరించాలి.. హాస్టళ్లు పెంచాలి
క్యాంపస్ వెలుపల వసతితో బోధన, చదువుపై ప్రభావం ∙తక్షణమే చర్యలు తీసుకోవాలని ఐఐటీల వినతి
సాక్షి, హైదరాబాద్: సీట్ల పెంపు, మౌలిక వసతుల కల్పన, కోర్సుల్లో నాణ్యత పెంపుతో దేశంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లను బలోపేతం చేయాలని ఆయా సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. దేశవ్యాప్తంగా ఐఐటీలకు డిమాండ్ పెరుగుతోందని, అందువల్ల సీట్లు గణనీయంగా పెంచాలని విజ్ఞప్తి చేశాయి. 2026–27 విద్యా సంవత్సరంలోనే కనీసం 2 వేల సీట్లు పెంచాల్సిన అవసరం ఉందని తెలిపాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దూసుకొస్తున్న నేపథ్యంలో దేశంలో ఎమర్జింగ్ కోర్సులకు ప్రాధాన్యత పెరిగిందని పేర్కొన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏఐతో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా కోర్సుల నాణ్యత పెంచాలని, లేబొరేటరీలను ఉన్నతీకరించాలని స్పష్టం చేశాయి. ఈ మేరకు మౌలిక వసతులు సైతం పెంచాలని ఐఐటీలు ఇటీవల కేంద్రానికి ప్రతిపాదించాయి. ఆయా అంశాలపై కేంద్రం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి.
ఏఐకి అనుగుణంగా మెరుగులు
‘దేశంలో ఏఐపై విస్తృత పరిశోధన జరుగుతోంది. డేటా కేంద్రాల పరిధి పెరుగుతోంది. అంతర్జాతీయ ఏఐ సంస్థలు ఐఐటీల నైపుణ్యాన్ని పరిశీలిస్తున్నాయి. ఏఐఎంఎల్, డీప్ లెర్నింగ్, కంప్యూటర్ విజన్, ఇన్‌డెప్త్ ప్రాజెక్టు ఇంటర్న్‌షిప్‌పై దృష్టి పెడుతున్నాయి. ఏఐ, డేటాసైన్స్‌కు బలమైన పునాది వేసే ఇంటర్ డిసిప్లినరీ కోర్సుల అభివృద్ధి అవసరం పెరిగింది. ఈ మేరకు లేబొరేటరీలు ఏర్పాటు చేయడంతో పాటు, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..’అని ఐఐటీలు కేంద్రానికి తెలిపాయి. పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో కూడా ఎగ్జిక్యూటివ్ పీజీ డిప్లొమా ఇన్ ఏఐ, డేటాసైన్స్ లాంటి కోర్సులు పెంచాలని ఐఐటీ ముంబై సూచించింది. 120 గంటల హైబ్రిడ్ ఏఐ కోర్సులను అందించే దిశగా ఐఐటీ కాన్పూర్ ప్రణాళిక సిద్ధం చేసింది. కొన్నిచోట్ల ప్రైవేటు, ప్రభుత్వ సమన్వయంతో ముందుకెళ్ళే ప్రతిపాదనలు కూడా ముందుకు తెచ్చాయి.
ప్రధాన సమస్యగా హాస్టళ్ల కొరత..
ఐఐటీల్లో ప్రస్తుతం హాస్టళ్ల కొరత ప్రధాన సమస్యగా మారింది. విద్యార్థుల సంఖ్య వేగంగా పెరగడం, వసతి సదుపాయాల విస్తరణ ఆ స్థాయిలో జరగకపోవడమే దీనికి మూలకారణం. గత పదేళ్ళుగా ఐఐటీల్లో అండర్ గ్రాడ్యుయేట్, పీజీ, పీహెచ్‌డీ సీట్లు భారీగా పెరిగాయి. 2008 తర్వాత ఏర్పడిన కొత్త ఐఐటీలకు ఇంకా క్యాంపస్‌ల నిర్మాణం పూర్తవ్వలేదు. ఫ్యాకల్టీ, రీసెర్చ్ స్కాలర్లకు కూడా వసతి అవసరమవుతోంది. హాస్టల్ ప్రాధాన్యత విద్యార్థులకే కాకుండా పరిశోధకులకు కూడా ఉండటం వల్ల ఒత్తిడి పెరుగుతోంది. నిధులు, భూసేకరణ, నిర్మాణ ఆలస్యాలు, కేంద్రం నిధుల విడుదలలో జాప్యం తదితరాలు కూడా కారణమవుతున్నాయి.
ఐఐటీ విద్యార్థులు, ఫ్యాకల్టీకి క్యాంపస్ వెలుపల అద్దె గదులు తీసుకోవాల్సి రావడంతో ఖర్చు పెరుగుతోంది. బయట ఉండేవారి ప్రయాణ సమయం పెరగడం.. బోధన, చదువుపై ప్రభావం చూపుతోంది. మొదటి సంవత్సరం విద్యార్థులకు భద్రత పరమైన సౌకర్యాల సమస్య ఏర్పడుతోంది. టెక్నాలజీ అప్‌డేట్‌తో కూడుకున్న ఐఐటీ విద్యకు క్యాంపస్ హాస్టల్‌లోనే ఉండి చదువుకుంటేనే మంచి ఫలితాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఐఐటీల్లో 18,160 సీట్లు ఉన్నాయి. అయితే 12 వేల మందికి మాత్రమే ఐఐటీ ప్రాంగణాల్లో హాస్టల్ వసతి ఉండటం గమనార్హం. మిగతా విద్యార్థులను ప్రైవేటు వసతి గృహాల్లో ఉంచుతున్నారు.
ఆ కోర్సులకే డిమాండ్..
జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రస్తుతం 62,853 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 40 వేలకు పైగా కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లోనే ఉన్నాయి. గత నాలుగేళ్ళుగా ఏఐకి ప్రాధాన్యత పెరగడంతో కంప్యూటర్ కోర్సుల్లో సీట్లకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా పోస్టు–గ్రాడ్యుయేట్ కోర్సుల్లో డేటాసైన్స్, ఏఐఎంఎల్, ఎంబీడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్‌కు డిమాండ్ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా రాష్ట్రాల ఇంజనీరింగ్ కాలేజీలతో కలుపుకొని 16 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. అయితే వీరిలో స్కిల్డ్ ఉద్యోగాలు పొందుతున్న వారు 9 శాతమే ఉంటున్నారు. ఐఐటీల్లో విద్యా బోధన ప్రమాణాలు మెరుగ్గా ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ చదివిన విద్యార్థుల్లో 78 శాతం ఉపాధి పొందుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో సీట్ల పెంపుపై కొన్నేళ్ళుగా కేంద్రానికి ప్రతిపాదనలు వెళ్తున్నాయి. ఈ క్రమంలో ఏఐ ఆధారిత కొత్త కోర్సుల మేళవింపుపై కేంద్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.
సీట్ల పెంపు ప్రతిపాదనలు ఇలా..
ఏఐ ఆధారిత కంప్యూటర్ కోర్సులను కోర్ సీఎస్‌ఈకి అనుసంధానం చేసి కనీసం 800 సీట్లు పెంచాలని ఐఐటీలు సూచిస్తున్నాయి. మరో 400 సీట్లు డేటా సైన్స్‌లో కోరుతున్నాయి. మరో 800 సీట్లు ఇతర కంప్యూటర్ ఎమర్జింగ్ కోర్సులను తీసుకొచ్చి పెంచాలని కోరుతున్నాయి. మరోవైపు జాతీయ ఇంజనీరింగ్ కాలేజీలు (ఎన్‌ఐటీలు), కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజనీరింగ్ సంస్థల్లో (జీఎఫ్‌టీఐలు) మొత్తం 62 వేలకు పైగా సీట్లున్నాయి. వీటిల్లో సైబర్ సెక్యూరిటీ, ఏఐ, డేటాసైన్స్ కోర్సులతో కూడిన కంప్యూటర్ కోర్సులను రీ డిజైన్ చేయాలని ఐఐటీలు సూచిస్తున్నాయి.


