భారత్‌లో పెరుగుతున్న వాతావరణ ముప్పులను ఎదుర్కోవడానికి, డేటా ఆధారంగా పట్టణాల రక్షణను మెరుగుపరచడానికి గాంధీనగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కీలక ఆవిష్కరణ చేసింది. తన రీసెర్చ్ పార్క్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఏఐ రెసిలియన్స్ అండ్ కమాండ్ (ఏఆర్‌సీ) సెంటర్‌ను విద్యావేత్తలు, ప్రభుత్వ ఉన్నతాధికారుల సమక్షంలో ఇటీవల ప్రారంభించింది.
ఈ సెంటర్ ప్రధానంగా ‘రెయిన్-టు-రెసిలియన్స్’ (వర్షం నుంచి తట్టుకునే పరిస్థితులు) అనే ఫ్రేమ్‌వర్క్‌పై పనిచేస్తుంది. ఇది భౌతిక శాస్త్ర నమూనాలను కృత్రిమ మేధతో (ఏఐ) అనుసంధానిస్తుంది. దీని ద్వారా ఐఐటీ గాంధీనగర్ చెప్పిన అంశాల ప్రకారం.. నగరాల్లో వరదలను ముందే అంచనా వేయవచ్చు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలపై పడే ప్రభావాన్ని విశ్లేషించవచ్చు. విపత్తు సమయంలో నిర్ణయాలు తీసుకోవడంలో అధికారులకు వేగంగా సమాచారాన్ని అందించవచ్చు.
అత్యాధునిక సాంకేతికత
ఈ కేంద్రంలో వినియోగిస్తున్న సాధనాలను ఐఐటీ గాంధీనగర్ ఇంక్యుబేటెడ్ డీప్-టెక్ స్టార్టప్ ‘AIResQ ClimSols’ అభివృద్ధి చేసింది. ఇవి వాతావరణ మార్పులకు సంబంధించిన సంక్లిష్ట పరిస్థితులకు అత్యంత వేగంగా స్పందించగలవు. విపత్తు జరగకపోయినా ‘ఒకవేళ ఇలా జరిగితే పరిస్థితి ఏంటి?’ అనే అత్యవసర అంశాలకు ప్రణాళికలను ముందే సిద్ధం చేసుకోవడానికి ఇవి ఎంతగానో దోహదపడతాయి.
పట్టణాల్లో..
ఐఐటీ గాంధీనగర్‌లోని మెషీన్ ఇంటెలిజెన్స్ అండ్ రెసిలియన్స్ (ఎంఐఆర్) ల్యాబ్ పరిశోధనల ఫలితంగా ఈ కేంద్రం ఏర్పాటైంది. నగరాల్లో నీటి ఎద్దడి లేదా వరదలు వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో ఈ సాంకేతికత కీలకం కానుంది. కేవలం విపత్తు జరిగిన తర్వాత స్పందించడం కాకుండా ముందే ఊహించి నష్టాన్ని నివారించడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం.
సమన్వయంతో..
ప్రభుత్వం, టెక్నాలజీ భాగస్వాములను ఒకే తాటిపైకి తీసుకురావడం ద్వారా పరిశోధనలను క్షేత్రస్థాయిలో ప్రజలకు ఉపయోగపడే సాధనాలుగా ఈ కేంద్రం మారుస్తోంది. ఇది భారతీయ నగరాలను మరింత సురక్షితంగా, వాతావరణ మార్పులను తట్టుకోగల సుస్థిర పట్టణాలుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించనుంది.
ఇదీ చదవండి: సరికొత్త లుక్‌లో మార్కెట్‌లోకి కొత్త ఈవీ


