రూ.17000 పెరిగిన ధర
న్యూఢిల్లీ: విలువైన లోహాల ధరలు మళ్లీ జోరందుకున్నాయి. తాజాగా వెండి కిలో ధర దాదాపు 7 శాతం(రూ. 17,000) జంప్‌చేసింది. అన్ని పన్నులు కలుపుకుని రూ. 2,72,000కు చేరింది. ఇదే బాటలో బంగారం ధరలు సైతం మెరిశాయి. స్థానిక బులియన్ మార్కెట్లో 99.9 స్వచ్చతగల 10 గ్రాములు రూ. 1,300 బలపడింది. రూ. 1,58,500ను తాకింది. వారాంతాన వెండి కేజీ రూ. 2,55,000 వద్ద, పసిడి 10 గ్రాములు రూ. 1,57,200 వద్ద నిలిచిన విషయం విదితమే.
ధరల తాజా పెరుగుదలకు యూఎస్ డాలరు బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పుంజుకోవడం కారణమైనట్లు బులియన్ వర్గాలు తెలియజేశాయి. అంతేకా కుండా ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో కొనసాగుతున్న అనిశ్చితికితోడు.. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకుంటున్న అనూహ్య రాజకీయ, భౌగోళిక చర్యలు వెండి, పసిడి తదితర విలువైన లోహాలకు డిమాండును పెంచుతున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకులు సౌమిల్ గాంధీ పేర్కొన్నారు.
విదేశీ మార్కెట్లో
అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ స్పాట్ ధర ఔన్స్ 2.8 శాతం(2.2 డాలర్లు) ఎగసింది. 80.21 డాలర్లను తాకింది. మరోపక్క పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 1 శాతం పుంజుకుని 5,013 డాలర్లకు చేరింది.


