న్యూఢిల్లీ: వెండి, పసిడి రేట్లు ఆగకుండా పరుగులు తీస్తూనే ఉన్నాయి. అమెరికన్ డాలరు బలహీనంగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లలో కొనుగోళ్ల దన్నుతో సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. తాజాగా బుధవారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో వెండి కిలో ధర మరో రూ. 15,000 పెరిగి ఇంకో కొత్త ఆల్ టైం గరిష్టం రూ. 3,85,000కి ఎగిసింది. అటు 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ. 5,000 మేర పెరిగి రూ. 1,71,000కు ఎగిసింది.
బంగారం, వెండి రేట్లు పటిష్టంగా ర్యాలీ చేస్తున్నాయని, ప్రతీ రోజు కొత్త గరిష్టాలకు ఎగదోసేందుకు బుల్స్‌కి కొత్త కారణాలు లభిస్తున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ చెప్పారు. అంతర్జాతీయంగా భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య పరంగా అనిశ్చితులు మొదలైన అంశాల వల్ల సురక్షిత పెట్టుబడి సాధనాలైన పసిడి, వెండి రేట్లకు రెక్కలొస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకి (31.1 గ్రాములు) 74.57 డాలరు పెరిగి 5,256.35 డాలర్లకు చేరింది.
ఇంట్రాడేలో 130.13 డాలర్లు ఎగిసి 5,311.38 డాలర్ల స్థాయిని కూడా తాగింది. అటు సిల్వర్ ధర 0.12 శాతం పెరిగి 112.22 డాలర్లకు చేరింది. అటు ఫ్యూచర్స్ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఏప్రిల్ కాంట్రాక్టు ఒక దశలో దాదాపు 200 డాలర్లు పైగా పెరిగి 5,344.70 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. ఇక సిల్వర్ సైతం సుమారు పది డాలర్లకు పైగా పెరిగి ఒక దశలో 116.11 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యింది. దేశీయంగా ఎంసీఎక్స్‌లో ఏప్రిల్ కాంట్రాక్టు రూ. 1,75,848 వద్ద, సిల్వర్ మార్చి కాంట్రాక్టు రూ. 3,85,200 వద్ద ట్రేడయ్యింది. అనిశ్చితికి, టారిఫ్ బెదిరింపులు, ఫెడరల్ రిజర్వ్ స్వతంత్ర ప్రతిపత్తిపై అనుమానాల్లాంటివి భౌగోళిక–రాజకీయ అనిశ్చితికి దారితీస్తూ, సిల్వర్, గోల్డ్ ధరలను ఎగదోస్తున్నాయని విశ్లేషకులు తెలిపారు.


