భద్రతా వలయాన్ని చేధిస్తున్న సైబర్ నేరస్థులు
సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ క్లౌడ్‌సెక్ ఆరోపణ
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ మోసగాళ్లు కొత్త టెక్నాలజీతో యూపీఐ యూజర్లనూ బురిడీ కొట్టిస్తున్నారు. యూపీఐ భద్రతా ఫీచర్లను ఛేదించుకుని మరీ, ఆర్థిక లావాదేవీలు కానిచ్చేస్తున్నారని, సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ క్లౌడ్‌సెక్ ఆరోపించింది. ఇందుకు సంబంధించి ఒక నివేదిక విడుదల చేసింది. టెలీగ్రామ్‌లో 20 గ్రూప్‌లు చురుగ్గా పనిచేస్తున్నట్టు, ప్రతీ బృందంలో 100కు పైగా సభ్యులున్నుట్టు తెలిపింది. ఈ గ్రూప్‌లు ‘డిజిటల్ లూటెరా’ పేరుతో చర్చించుకోవడం, పంపిణీ చేయడం, నిర్వహించడం చేస్తున్నట్టు వెల్లడించింది. ‘‘ఇది కేవలం మరొక యూపీఐ మాల్వేర్ రకమే కాదు.
డివైజ్‌పై ఉన్న నమ్మకంపైనే డిజిటల్ లూటెరా దాడి చేస్తోంది. ఆపరేటింగ్ సిస్టమ్‌నే మార్చివేస్తున్నప్పుడు.. సంప్రదాయ రక్షణలైన సిమ్ బైండింగ్ యాప్ (సిమ్‌కు అనుసంధానమైన) సిగ్నేచర్ తనఖీ కూడా పనికిరాకుండా పోతుంది. దీనికి పరిష్కారం కనుగొనకపోతే డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అంతటినీ తన చేతుల్లోకి తీసుకునే ప్రమాదం ఉంటుంది’’అని హెచ్చరించింది. ఒక టెలిగ్రామ్ గ్రూప్ రెండు రోజుల్లోనే రూ.25–30 లక్షల లావాదేవీలను పూర్తి చేసిందని క్లౌడ్‌సెక్ విశ్లేషణలో తేలింది. ఈ మోసపూరిత వ్యవస్థ ఎంత వేగంగా విస్తరించగలదు, ఎంత మంది మోసం చేయగలదన్నదానికి ఇది నిదర్శమని పేర్కొంది.
మోసం ఇలా...
మొబైల్ ఫోన్ యూజర్ తనకు తెలియకుండా హానికారక ఏపీకే ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు.. డిజిటల్ లూటెరా కిట్ ఇన్‌స్టాల్ అయిపోతుంది. వెంటనే సైబర్ నేరస్థులకు ఫోన్‌పై నియంత్రణ వెళుతుంది. దీంతో బ్యాంక్ ఓటీపీలు అటాకర్ల టెలీగ్రామ్ ఛానళ్లకు వెళతాయి.
భద్రతకు ఢోకాలేదు: ఎన్‌పీసీఐ
దీనిపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(యూపీఐ నిర్వహణ సంస్థ/ఎన్‌పీసీఐ) స్పందించింది. డిజిటల్ చెల్లింపుల నిర్వహణకు సంబంధించి బలమైన తనిఖీలున్నట్టు స్పష్టం చేసింది. ‘‘సంబంధిత నివేదికను ఎన్‌పీసీఐ పరిశీలించింది. ఆ విధమైన రిస్క్‌లను పరిష్కరిచేందుకు తగినన్ని రక్షణలు ఉన్నాయి. బహుళ అంచల రక్షణలతో, గుర్తింపు ధ్రువీకరణలతో లావాదేవీలను సురక్షితంగా, భద్రంగా చేసుకునే విధంగా యూపీఐని రూపొందించడమైంది’’అని ఎన్‌పీసీఐ వివరణ ఇచ్చింది.


