రష్యా నుంచి పెరిగిన చమురు కొనుగోళ్లు | India pumps up Russia oil buy by 50 Percent in March | Sakshi
Sakshi News home page

రష్యా నుంచి పెరిగిన చమురు కొనుగోళ్లు

Mar 15 2026 1:48 AM | Updated on Mar 15 2026 1:48 AM

India pumps up Russia oil buy by 50 Percent in March

ఈ నెలలో 1.5 మిలియన్‌ బ్యారెళ్లు

న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఈ నెలలో 50 శాతం పెరిగాయి. రోజువారీ 1.5 మిలియన్‌ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేస్తోంది. ఫిబ్రవరిలో ఇది 1.04 మిలియన్‌ బ్యారెళ్లుగానే ఉంది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులతో చమురు సరఫరాలు నిలిచిపోవడం తెలిసిందే. దీంతో భారత్‌ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పెంచుకుంది. మన దేశం ప్రతి రోజూ సగటున 5.8 మిలియన్‌ బ్యారెళ్ల చమురును వినియోగిస్తుంటుంది. ఇందులో 2.5–2.7 మిలియన్‌ బ్యారెళ్లు హర్మూజ్‌ జలసంధి నుంచే భారత్‌కు వస్తుంటుంది.

అంతేకాదు మన దేశ ఎల్‌పీజీ అవసరాల్లో 55 శాతం, ఎల్‌ఎన్‌జీలో 30 శాతం కూడా ఈ మార్గం నుంచే వస్తుంటుంది. రష్యా నుంచి రోజువారీ 1–1.2 మిలియన్‌ బ్యారెళ్ల చమురును సమకూర్చుకుంటున్న నేపథ్యంలో హర్మూజ్‌ను మూసివేయడం కారణంగా మనకు ఏర్పడే లోటు 1.6 మిలియన్‌ బ్యారెళ్లు (రోజువారీ/బీపీడీ)గా ఉంటుందని కెప్లర్‌ అనలిస్ట్‌ సుమిత్‌ రిటోలియా తెలిపారు. ఇక రోజువారీ ఎల్‌పీజీ వినియోగం ఒక మిలియన్‌ బీపీడీగా ఉంటే.. ఇందులో 40–45 శాతం దేశీయంగా ఉత్పత్తి అవుతోంది. మిగిలిన మొత్తాన్ని దిగుమతి చేసుకోవాల్సిందే. ఇందులో 80–90 శాతం హర్మూజ్‌ జలసంధి నుంచే రావాలి. ఈ మార్గం మూసుకుపోవడంతో దేశీయంగా ఎల్‌పీజీకి కటకట  నెలకొంది. దేశీ సంస్థలు ఉత్పత్తిని 10–20 శాతం పెంచినా సరే, 47–50 శాతం లోటును ఎదుర్కోవాల్సి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement