వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం ఖరారైనప్పటికీ, ఇప్పుడు ట్రంప్ ఎటువంటి మెలిక పెడతారో, చివరి నిముషంలో ఏం చేస్తారో అనే సందేహం ప్రపంచవ్యాప్తంగా పలువురి మదిలో మెదులుతోంది. అలాగే ఆయన జనీవా రాకపై సస్పెన్స్ నెలకొంది. మధ్యప్రాచ్యంలో శాంతిని పునరుద్ధరించడంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదుటపరిచే ఈ కీలక ఒప్పందంపై వచ్చే జూన్ 19న స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో సంతకాలు జరగనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ట్రంప్ స్వయంగా హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ ఒప్పందాన్ని తన ప్రభుత్వ దౌత్య విజయంగా భావిస్తున్నప్పటికీ, ఆయన నేరుగా వేదికపైకి వస్తారా అనే విషయంలో ట్రంప్ వైఖరి ఇంకా స్పష్టంగా వెల్లడి కాలేదు.
ఈ సస్పెన్స్‌కు మరింత బలాన్ని చేకూరుస్తూ యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తాము ఇంకా దీనికి సంబంధించిన లాజిస్టిక్స్ వివరాలను పరిశీలిస్తున్నామని, తాను కచ్చితంగా ఈ కార్యక్రమానికి హాజరవుతానని చెబుతూనే, అధ్యక్షుడు ట్రంప్ కూడా వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందం అమెరికా ప్రజలకు దక్కిన విజయమని, దీనివల్ల దీర్ఘకాలంలో ఇంధన ధరలు భారీగా తగ్గి, మిడిల్ ఈస్ట్‌లో కొత్త శకానికి నాంది పడుతుందని వాన్స్ ధీమా వ్యక్తం చేశారు. అయితే ట్రంప్ రాకపై తుది నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించకపోవడం దౌత్య వర్గాలలో చర్చనీయాంశమైంది.
మరోవైపు, ఇరాన్ సైతం జూన్ 19న ఒప్పందం జరగనుందనే విషయాన్ని ధృవీకరిస్తూనే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంతకాల కార్యక్రమాన్ని వర్చువల్ (రిమోట్) పద్ధతిలో నిర్వహించే అవకాశం కూడా ఉందని గతవారమే స్పష్టం చేసింది. టెహ్రాన్ తరఫున ఈ చారిత్రాత్మక ఘట్టంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్-బాగర్ గాలిబాఫ్ లేదా విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీలలో ఒకరు హాజరయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ వైపు నుంచి రిమోట్ సైనింగ్ ఆప్షన్ తెరపైకి రావడం కూడా ట్రంప్ స్వయంగా జెనీవా రావడంపై సస్పెన్స్‌ను మరింత పెంచేలా చేసింది.
అన్నింటికంటే ముఖ్యంగా, ట్రంప్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చిన ఇరాన్ అణు కార్యక్రమంపై ఈ ఒప్పందంలో పెద్దగా స్పష్టత లేకపోవడం గమనార్హం. ఇరాన్ తన యురేనియం సంపదను అప్పగించాలని ట్రంప్ డిమాండ్ చేస్తుండగా, తమ అణు కార్యక్రమం కేవలం పౌర అవసరాల కోసమేనని ఇరాన్ వాదిస్తోంది. ఈ వివాదాస్పద అణు సమస్య అలాగే ఉండిపోవడం, దీనికి తోడు హార్ముజ్ జలసంధిపై దిగ్బంధనాన్ని తొలగించడం, ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తులను పునరుద్ధరించడంపై వాషింగ్టన్ వైఖరిని పరిశీలించేందుకు ఇరాన్ 60 రోజుల డెడ్‌లైన్ విధించడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యూహాత్మక ఉత్కంఠల నడుమ, ఒప్పందాన్ని ఖరారు చేసిన ట్రంప్ జూన్ 19న జెనీవా వేదికపై ప్రత్యక్షంగా కనిపిస్తారా లేదా అనేదే ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది.


