breaking news
peace deal
-
భారత కంపెనీలకు ఉపశమనం
న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఘర్షణల కారణంగా భారత కంపెనీల లాభాదాయకత ముందు అంచనా వేసిన స్థాయిలో ప్రభావితం కాకపోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. యూఎస్–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగడంతోపాటు, ఇంధన సరఫరాలు సాధారణ స్థితికి రావడంపైనే ఈ ప్రభావం ఆధారపడి ఉంటుందని తెలిపింది. పశ్చిమాసియా సంక్షోభంతో 2026–27 ఆర్థిక సంవత్సరంలో భారత కంపెనీల నిర్వహణ మార్జిన్లు 100 బేసిస్ పాయింట్లు (ఒక శాతం) తగ్గిపోవచ్చని తాజాగా ప్రకటించింది. వాస్తవానికి ఘర్షణలు ఎక్కువ కాలం పాటు కొనసాగొచ్చని, హర్మూజ్ జలసంధి ఇప్పట్లో తెరుచుకోకపోవచ్చన్న అంచనా ఆధారంగా.. కంపెనీల లాభదాయకత 200 బేసిస్ పాయింట్లు తగ్గిపోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ లోగడ పేర్కొనడం గమనార్హం. అమెరికా–ఇరాన్ మధ్య ఈ నెలలో కుదిరిన అవగాహన ఒప్పందంతో హర్మూజ్ జలసంధి తెరుచుకోవడం తెలిసిందే. దీంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు గణనీయంగా దిగొచ్చాయి. బ్రెంట్ బ్యారెల్ 73 డాలర్ల స్థాయికి పడిపోయింది. యుద్ధ సమయంలో ఒక దశలో 121 డాలర్ల వరకు వెళ్లడం చూశాం. అయితే, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయంటూ, గ్యాస్ సరఫరా సాధారణ స్థాయికి చేరుకునేందుకు చాలా కాలమే పట్టొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. కార్పొరేట్ ఇండియా సరఫరా వైవిధ్యంపై దృష్టి సారించాల్సి ఉంటుందని పేర్కొంది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు సగటున 80–85 డాలర్ల స్థాయిలో ఉండొచ్చని పేర్కొంది. కొన్ని రంగాలపై ఎక్కువ ప్రభావం.. పశ్చిమాసియా ఘర్షణలతో 22 రంగాల కంపెనీల లాభదాయకతపై ఎక్కువ ఒత్తిడి పడొచ్చని క్రిసిల్ లోగడ అంచనా వేయగా.. ఇప్పుడు పది రంగాలపైనే ఈ ప్రభావం చెప్పకోతగ్గ స్థాయిలో ఉంటుందని తెలిపింది. అంతేకానీ, భారీగా ఆదాయం, లాభాలు తగ్గడం ఉండదని స్పష్టం చేసింది. ఎయిర్‌లైన్స్ (విమానయాన సంస్థలు), సిరామిక్స్, పాలిస్టర్ టెక్స్టైల్స్, స్పెషాలిటీ కెమికల్స్, ప్యాకేజింగ్, వజ్రాల పాలిíÙంగ్ కంపెనీలపై ఎక్కువగా ఒత్తిళ్లు ఉండొచ్చంటూ.. వీటికి ధరల నిర్ణయంలో వెసులుబాటు లేకపోవడం, సరఫరా సమస్యలు, అధిక ముడి సరకుల వ్యయాలు, బలహీన లాభదాయకత, అధిక మూలధన అసవసరాలు, బలహీన బ్యాలన్స్ షీట్లను కారణాలుగా పేర్కొంది. దీంతో ఈ కంపెనీల క్రెడిట్ రేటింగ్ ప్రతికూలంగా మారే రిస్క్ లేకపోలేదని తెలిపింది. ముడి చమురు ధరలు దిగిరావడం, గ్యాస్ సరఫరాలు మెరుగుపడడం చాలా రంగాలకు ఉపశమనాన్నిస్తుందని అంచనా వేసింది. దీనికితోడు ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై నిధులు ఖర్చు చేస్తుండడం, దేశీ వినియోగ డిమాండ్ ఆదాయ వృద్ధికి అనుకూలిస్తాయని తెలిపింది. అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) 5.0 కింద రూ.2.55 లక్షల కోట్ల అదనపు రుణ సాయం, ఎయిర్‌లైన్స్‌కు ప్రత్యేకంగా రూ.5,000 కోట్లు అన్నవి నిధుల అవసరాలను తీరుస్తాయని అభిప్రాయపడింది. లాభాల్లోకి చమురు కంపెనీలు ఇంధన ధరలు తగ్గడంతో ఆయిల్ మార్కెటింగ్, ఎరువుల కంపెనీలు ఎక్కువగా ప్రయోజనం పొందుతాయని క్రిసిల్ నివేదిక అంచనా వేసింది. ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు మార్చి నుంచి మే మధ్య రూ.40,000–45,000 కోట్ల నష్టాలను ఎదుర్కొన్నాయని, ధరలు దిగిరావడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అవి నిర్వహణ లాభంలోకి తిరిగి అడుగు పెడతాయని తన నివేదికలో వెల్లడించింది. ప్రధానంగా రెండు రిస్‌్కలు పొంచి ఉన్నట్టు తెలిపింది. యూఎస్–ఇరాన్ ఒప్పందం ముందుకు వెళ్లకుండా, ఘర్షణలు తిరిగి మొదలు కావడం ఒకటి కాగా.. ఎల్‌నినో కారణంగా వర్షాలు బలహీనపడితే గ్రామీణ వినియోగం సన్నగిల్లుతుందని అంచనా వేసింది. -
అణు కేంద్రాలు తెరవకపోతే.. చర్చలే రద్దు!
అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు ముందుకు సాగుతున్న వేళ కొత్త వివాదం తెరపైకి వచ్చింది. అణు కేంద్రాల్లో అంతర్జాతీయ తనిఖీలకు ఇరాన్ అంగీకరించిందని అమెరికా ప్రకటించగా.. కాసేపటికే టెహ్రాన్ వర్గాలు దానిని తోసిపుచ్చాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. “అది పూర్తిగా తప్పు” అంటూ ఇరాన్‌పై మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ అణు కార్యక్రమంపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) తనిఖీలు తప్పనిసరి. ఇరాన్ అధికారులు తనిఖీల అంశాన్ని ఖండిస్తున్నప్పటికీ, తెర వెనుక వారు అంగీకరించారని ట్రంప్ పేర్కొన్నారు. "వాళ్లు తప్పు చెబుతున్నారు. నిజంగా అంగీకరించకపోతే ఈ క్షణమే చర్చలను రద్దు చేస్తాను" అని వ్యాఖ్యానించారు.జేడీ వాన్స్ ప్రకటనతో..అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) ఇటీవల స్విట్జర్లాండ్ చర్చల అనంతరం మాట్లాడుతూ.. ఇరాన్ చివరకు ఐఏఈఏ తనిఖీలకు అంగీకరించిందని ప్రకటించారు. ఇరు దేశాల ఒప్పందంలోనే దీనిని పెద్ద ముందడుగుగా అభివర్ణించారు. అయితే కొద్ది గంటల్లోనే ఇరాన్ ఆ ప్రకటనను ఖండించింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ వాదన ఏమిటి?ఇరాన్ విదేశాంగ శాఖ మాత్రం అమెరికా ప్రకటనలను ఖండిస్తోంది. ఇటీవల స్విట్జర్లాండ్‌లో జరిగిన చర్చల్లో తనిఖీలపై ఎలాంటి తుది ఒప్పందం కుదరలేదని స్పష్టం చేసింది. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు గురైన అణు కేంద్రాలను తనిఖీ చేయడానికి ప్రస్తుతం అనుమతించే యోచన లేదని తెలిపింది. అసలు వివాదం ఎందుకు కీలకం?ఇరాన్ అణు కార్యక్రమాన్ని నియంత్రించాలంటే తనిఖీలు అత్యంత కీలకమైన అంశం. గతంలో జరిగిన అణు ఒప్పందాలన్నింటిలోనూ IAEA పర్యవేక్షణ ప్రధాన షరతుగా ఉండేది. ఇప్పుడు కూడా అదే అంశాన్ని అమెరికా "నాన్-నెగోషియబుల్" షరతుగా చూస్తోంది. ట్రంప్ పరిపాలన అభిప్రాయం ప్రకారం, తనిఖీలు లేకుంటే ఇరాన్ నిజంగా అణ్వాయుధాల అభివృద్ధిని నిలిపివేసిందో లేదో నిర్ధారించడం అసాధ్యం. అందుకే తనిఖీలు తప్పనిసరి అంటోంది. ట్రంప్ ప్రకారం, సరైన సమయంలో IAEA తనిఖీ బృందాలు ఇరాన్‌లోకి ప్రవేశిస్తాయని, అణు కార్యకలాపాలపై పూర్తి స్థాయి పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. అణు తనిఖీలు లేకుండా ఎలాంటి ఒప్పందమూ ఉండదని.. అవసరమైతే చర్చలనే రద్దు చేస్తానని హెచ్చరించారు. దీంతో చర్చల భవిష్యత్తుపై మళ్లీ అనిశ్చితి నెలకొంది. -
వాన్స్‌ను ముందుకు నెట్టి.. ట్రంప్ సేఫ్ గేమ్?
స్విట్జర్లాండ్‌లో జరిగిన అమెరికా-ఇరాన్ చర్చల సందర్భంగా ఇరాన్ ప్రతినిధి బృందం అకస్మాత్తుగా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదనే ప్రచారం వైరల్ కాగా.. మరోవైపు, ఇరాన్‌తో కుదురుతున్న వివాదాస్పద ఒప్పందం విజయవంతమైతే కీర్తి ట్రంప్‌దే, విఫలమైతే నింద మాత్రం వాన్స్‌పైనే పడేలా రాజకీయ వ్యూహం నడుస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.స్విట్జర్లాండ్‌లో జరిగిన అమెరికా-ఇరాన్ చర్చల్లో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ సమావేశ మందిరంలోకి వచ్చి పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్‌తో మాట్లాడి, అనంతరం అమెరికా ప్రతినిధుల వైపు చూడకుండానే వెనుదిరగడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. దీనిని చాలామంది అమెరికాకు, ముఖ్యంగా జేడీ వాన్స్‌కు జరిగిన దౌత్యపరమైన అవమానంగా అభివర్ణించారు.అయితే వాన్స్ మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు. "నన్ను అవమానించారనే భావన నాకు లేదు. ఇరానీయన్లు చర్చల్లో కొన్నిసార్లు చాలా గందరగోళంగా వ్యవహరిస్తారు. కానీ ఆ ఘటన తర్వాత కూడా మేము దాదాపు తొమ్మిది గంటలపాటు చర్చలు కొనసాగించాం" అని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కనిపించిన దృశ్యాల కంటే, చర్చల గదిలో జరిగిన పరిణామాలే ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు.ఇరాన్ మీడియా కథనాల ప్రకారం.. అమెరికా ప్రతినిధులతో కలిసి ఫొటో దిగాలన్న ప్రతిపాదనపై, అలాగే అదే సమయంలో ట్రంప్ చేసిన హెచ్చరికలపై అసంతృప్తితో ఇరాన్ ప్రతినిధులు కొద్దిసేపు సమావేశం నుంచి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. లెబనాన్‌లోని హెజ్బొల్లా కార్యకలాపాలపై ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేయడాన్ని కూడా టెహ్రాన్ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.అయితే అసలు రాజకీయ చర్చ ఇప్పుడు మరో కోణంలో సాగుతోంది. ఇరాన్‌తో కుదురుతున్న తాత్కాలిక శాంతి ఒప్పందానికి అమెరికాలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చమురు ఆంక్షల సడలింపు, స్తంభింపజేసిన నిధుల విడుదల, ఇరాన్ పునర్నిర్మాణానికి భారీ ఆర్థిక సహకారం వంటి అంశాలు రిపబ్లికన్ పార్టీలోని కొందరికి ఆగ్రహం తెప్పిస్తున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ తనను పక్కన పెట్టి, ఒప్పందం ముఖచిత్రంగా జేడీ వాన్స్‌ను ముందుకు నెట్టారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చర్చలకు వాన్స్‌నే నాయకత్వం వహించడమే కాకుండా, ఇరాన్ ఒప్పందాన్ని సమర్థించే బాధ్యత కూడా ఆయన భుజాలపై పడింది. విదేశాంగ మంత్రి మార్కో రుబియో, రక్షణ శాఖ నేతలు వెనుకకు తగ్గిన వేళ.. విమర్శలన్నింటినీ ఎదుర్కొంటున్నది వాన్స్ కావడం గమనార్హం.ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి బలం చేకూర్చాయి. "ఒప్పందం విజయవంతమైతే క్రెడిట్ నాదే.. విఫలమైతే నింద జేడీదే" అంటూ ఆయన సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. ట్రంప్ కావాలనే వాన్స్‌ను ముందుకు నెట్టి, తాను సురక్షిత దూరంలో నిలిచారని అమెరికా మీడియా విశ్లేషిస్తోంది.రిపబ్లికన్ వర్గాల్లో కూడా ఈ ఒప్పందాన్ని ఇప్పటికే "వాన్స్ డీల్"గా పిలవడం మొదలైంది. ఒప్పందం కుదిరితే 2028 అధ్యక్ష ఎన్నికల రేసులో వాన్స్‌కు భారీ రాజకీయ లాభం కలిగే అవకాశం ఉంది. కానీ చర్చలు విఫలమైతే లేదంటే ఇరాన్ మరోసారి అమెరికాను ఇబ్బందుల్లోకి నెడితే.. ఆ రాజకీయ దెబ్బ కూడా ముందుగా వాన్స్‌కే తగిలే ప్రమాదం కనిపిస్తోంది. -
డీల్‌పై కీలక వ్యాఖ్యలు.. ఇరాన్‌ను మళ్లీ రెచ్చగొట్టిన ట్రంప్
అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన తాత్కాలిక ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒప్పందంలోని నిబంధనలను ఇరాన్ పాటించకపోతే తాను అవసరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారాయన. ఈ క్రమంలో కాస్త ఘాటు హెచ్చరికలే జారీ చేశారు."ఇరాన్ తమ ఒప్పందానికి కట్టుబడి ఉండాలి. ఒప్పందం పట్ల వాళ్లు సక్రమంగా ప్రవర్తించాల్సిందే. లేకుంటే నేను చేయాల్సింది నేను చేస్తా. ఊరుకుంటానుకుంటే ఆ దేశం పొరపాటే" అని ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ.. గత వారం ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తాత్కాలిక ఒప్పందం(MoU)పై డిజిటల్ సంతకాలు చేశారు. ప్రత్యక్ష చర్చల్లో భాగంగా.. మొన్న ఆదివారం ఇరాన్, అమెరికా, మధ్యవర్తిత్వ ప్రతినిధులు స్విట్జర్లాండ్‌లో చర్చలు మొదలుపెట్టారు. దీంతో 60 రోజుల్లో ఇరాన్-అమెరికా మధ్య ఒప్పందం కుదరాల్సి ఉంటుంది. అయితే.. స్విస్ చర్చలు జరుగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు ఇరాన్‌ను కవ్వించేలా మాట్లాడారు. ఒప్పందం కుదుర్చుకోకపోతే భీకర దాడులు.. అదీ గతంలో కంటే దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగానే ఇరాన్ ప్రతినిధులు చర్చల మధ్య నుంచి అర్ధాంతరంగా బయటకు వెళ్లిపోయినట్లు ప్రచారం జరిగింది. అదే సమయంలో ఇరాన్ అధికార ప్రతినిధులు ట్రంప్ వార్నింగ్‌పై సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. ఈ తరుణంలో.. ఇప్పుడు ట్రంప్ ఇచ్చిన వార్నింగ్‌కు ఇరాన్ నుంచి కౌంటర్ తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. నిధుల వినియోగంపైనా ఓ క్లారిటీఇదిలా ఉంటే.. ఇరాన్‌కు చెందిన స్తంభింపజేసిన నిధులను విడుదల చేసే అంశంపై కూడా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. విడుదలయ్యే డబ్బు మొత్తం అమెరికా నుంచే ఆహార పదార్థాల కొనుగోలుకు వినియోగించాల్సి ఉంటుందని చెప్పారు. "విడుదల చేసే డబ్బంతా తిరిగి అమెరికా రైతులకే చేరుతుంది. ఎందుకంటే ఆ నిధులతో ఇరాన్ అమెరికా నుంచి ఆహార ధాన్యాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. సుమారు 9.1 కోట్ల జనాభాకు సరిపడా ఆహారాన్ని ఇరాన్ ఉత్పత్తి చేయలేకపోతోంది" అని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో ఇరాన్‌కు నిధుల విడుదల అనేది నేరుగా నగదు సాయం కాదని, నియంత్రిత వినియోగంతో కూడిన ఆర్థిక వ్యవస్థలో భాగమని అమెరికా సంకేతాలు ఇచ్చినట్లయ్యింది.యుద్ధ ప్రభావం ఇంకా కొనసాగుతూనే..అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు ఇరాన్ యుద్ధం ప్రపంచ మార్కెట్లపై కూడా ప్రభావం చూపింది. ముఖ్యంగా అంతర్జాతీయ చమురు ధరలు పెరగడం, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. అయితే తాజా ఒప్పందం శాంతికి మార్గం వేస్తుందా? లేదంటే ఇరాన్ ఒప్పంద నిబంధనల అమలుపై కొత్త వివాదాలకు దారితీస్తుందా? అన్నది ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక చర్చగా మారింది.ఇదీ చదవండి: ఇదెక్కడి ఫిట్టింగ్?.. పే చేయాల్సింది గల్ఫ్ దేశాలేనా! -
ట్రంప్-ఇరాన్ డీల్.. గల్ఫ్ దేశాల్లో గుబులు!
అమెరికా-ఇరాన్ ఒప్పందంపై గల్ఫ్ దేశాల గుబులు.. డబ్బు, భద్రత, హర్ముజ్‌పై పెరుగుతున్న ప్రశ్నలు. ఇరాన్ పునర్నిర్మాణానికి 300 బిలియన్ డాలర్లు ఇస్తే.. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు చెల్లిస్తారు?. ప్రస్తుతం గల్ఫ్ దేశాలను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) తర్వాత ఈ అంశం ఆ రీజియన్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో (Marco Rubio) మూడు రోజుల పర్యటనలో భాగంగా యూఏఈ, కువైట్, బహ్రెయిన్ దేశాలను సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా గల్ఫ్ దేశాల నేతలు ఇరాన్‌కు ప్రతిపాదిస్తున్న భారీ ఆర్థిక ప్యాకేజీ, భద్రతా హామీలు, ఆంక్షల సడలింపులపై స్పష్టత కోరే అవకాశం ఉంది.300 బిలియన్ డాలర్ల ప్యాకేజీ..అమెరికా-ఇరాన్ అవగాహన ఒప్పందం ప్రకారం, ఇరాన్ పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధి కోసం కనీసం 300 బిలియన్ డాలర్ల (సుమారు రూ.25 లక్షల కోట్లు) విలువైన ప్రణాళికను ప్రాంతీయ భాగస్వాములతో కలిసి రూపొందించాలని అమెరికా అంగీకరించింది. ఈ నిధుల అమలు విధానాన్ని 60 రోజుల్లో ఖరారు చేయాలని ఒప్పందంలో పేర్కొన్నారు.అయితే ఈ భారీ నిధులు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, దాని సైనిక సామర్థ్యాలను కూడా పెంచే ప్రమాదం ఉందని గల్ఫ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంపై ఒప్పందంలో స్పష్టమైన ప్రస్తావన లేకపోవడం వారికి మరింత కలవరపెడుతోంది.గల్ఫ్ దేశాల భద్రతా ఆందోళనలుసౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రెయిన్, ఖతార్ దేశాలు అమెరికా భద్రతా వ్యవస్థలో కీలక భాగస్వాములు. ఇటీవల జరిగిన యుద్ధ సమయంలో ఈ దేశాల్లోని అమెరికా స్థావరాలు, పౌర మౌలిక వసతులు ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడుల ముప్పును ఎదుర్కొన్నాయి. అందుకే యుద్ధం ఆగడాన్ని స్వాగతిస్తున్నప్పటికీ, ఇరాన్‌కు ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తున్నారో తెలుసుకోవాలని గల్ఫ్ దేశాలు కోరుతున్నాయి.స్తంభింపజేసిన ఆస్తులపై కొత్త ఫార్ములా!చర్చల్లో మరో కీలక అంశం ఇరాన్‌కు చెందిన విదేశీ ఆస్తులు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ JD Vance వెల్లడించిన వివరాల ప్రకారం, ఆంక్షల సడలింపు తర్వాత విడుదలయ్యే నిధుల వినియోగంపై అమెరికా, ఖతార్ సంయుక్త పర్యవేక్షణ ఉండేలా ప్రతిపాదన సిద్ధమైంది.అంటే విడుదలైన డబ్బును ఇరాన్ నేరుగా వినియోగించకుండా, అమెరికా గోధుమలు, మొక్కజొన్న వంటి అవసరమైన వస్తువుల కొనుగోలుకు మాత్రమే ఉపయోగించే విధంగా వ్యవస్థను రూపొందించాలని భావిస్తున్నారు. ఈ ఆలోచనను ట్రంప్ అల్లుడు(ఇవాంక భర్త), మాజీ వైట్‌హౌస్ సలహాదారు జారెడ్ కుష్నర్ Jared Kushner ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.వందల బిలియన్ల డాలర్లు పణంగా..ప్రారంభ చర్చల్లో 6 నుంచి 25 బిలియన్ డాలర్ల మధ్య ఉన్న స్తంభింపజేసిన నిధుల గురించే చర్చ జరిగినప్పటికీ, వివిధ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇరాన్‌కు చెందిన 100 నుంచి 120 బిలియన్ డాలర్ల వరకు ఆస్తులు ఆంక్షల కారణంగా నిలిచిపోయి ఉన్నాయి. అయితే ఆ నిధుల వినియోగంపై తుది నిర్ణయం తమదే కావాలని ఇరాన్ స్పష్టం చేస్తోంది.హర్ముజ్ జలసంధిపై దృష్టిరుబియో పర్యటనలో మరో కీలక అంశం హర్ముజ్ జలసంధి Strait of Hormuz. ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాల్లో కీలక పాత్ర పోషించే ఈ జలసంధి ఇటీవల యుద్ధంతో ఉద్రిక్త ప్రాంతంగా మారింది. యుద్ధానికి ముందు రోజుకు 100 నుంచి 131 నౌకలు ఈ మార్గంలో ప్రయాణించగా, ప్రస్తుతం ఆ సంఖ్య 71కు పడిపోయింది. 60 రోజుల చర్చల కాలంలో రవాణాపై అదనపు రుసుములు విధించబోమని ఒప్పందంలో ఉన్నప్పటికీ, ఆ గడువు ముగిసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందన్నదానిపై అనిశ్చితి కొనసాగుతోంది.కీలక ప్రశ్న మాత్రం అదే..ఇరాన్‌తో శాంతి ఒప్పందం, పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధి అన్నీ బాగానే ఉన్నా... 300 బిలియన్ డాలర్ల భారీ ప్యాకేజీకి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? అమెరికానా? గల్ఫ్ దేశాలా? లేదంటే అంతర్జాతీయ భాగస్వాములా?** అనే ప్రశ్నకు ఇంకా స్పష్టమైన సమాధానం లేదు. అందుకే ప్రస్తుతం పశ్చిమాసియా రాజకీయాల్లో అందరి నోటా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే... ఆ బిల్లు చివరికి ఎవరు చెల్లించాలి?. -
బిగ్ రిలీఫ్.. చేతులు కలిపిన అమెరికా-ఇరాన్!
ఓవైపు హెచ్చరికలు, మరోవైపు శాంతి చర్చలు.. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య అమెరికా-ఇరాన్ సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్విట్జర్లాండ్‌లో జరిగిన తొలి విడత చర్చల అనంతరం 60 రోజుల్లో తుది శాంతి ఒప్పందానికి చేరుకోవాలనే రోడ్‌మ్యాప్‌ను ఇరు దేశాలు ఆమోదించాయి. ఖతర్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో.. ఇందుకు ఇరు దేశాల ప్రతినిధులు చేతులు కలపడం గమనార్హం. స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్ రిసార్ట్‌లో ఆదివారం జరిగిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు కీలక మలుపు తిరిగాయి. ఖతర్, పాకిస్తాన్ విడుదల చేసిన సంయుక్త ప్రకటన ప్రకారం.. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య నెలకొన్న ప్రధాన విభేదాలను పరిష్కరించేందుకు 60 రోజుల కార్యాచరణ ప్రణాళిక (రోడ్‌మ్యాప్)పై ఇరు దేశాలు అంగీకరించాయి.'ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం' (Islamabad MoU) కింద జరిగిన తొలి విడత చర్చలు సానుకూల, నిర్మాణాత్మక వాతావరణంలో జరిగాయని మధ్యవర్తి దేశాలు పేర్కొన్నాయి. తుది ఒప్పందానికి అవసరమైన అమలు విధానాలు, పర్యవేక్షణ వ్యవస్థ, నిబంధనల అమలు, పరస్పర బాధ్యతలపై ఇక నుంచి సాంకేతిక స్థాయి చర్చలు వెంటనే ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్నిఇటు ఇరాన్ సైతం ధృవీకరించింది. Tireless Pakistani and Qatari mediation has delivered major progress to end Lebanon War. Oil and petrochem exports are waived, blockade lifted, some frozen assets released, and major reconstruction & development plan launched for Iran. 1st real test: Lebanon deconfliction cell https://t.co/q0okD2qwSO— Seyed Abbas Araghchi (@araghchi) June 22, 2026చర్చల్లో మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. అపార్థాలు, ఉద్రిక్తతలు, అనుకోని ఘర్షణలు నివారించేందుకు అమెరికా-ఇరాన్ మధ్య నేరుగా సమాచార మార్పిడి వ్యవస్థ (డైరెక్ట్ కమ్యూనికేషన్ ఛానెల్) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చర్చల కాలంలో ఏవైనా సంఘటనలు చోటుచేసుకున్నా వాటిని వెంటనే పరిష్కరించేలా ఈ వ్యవస్థ పనిచేయనుంది.ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల సురక్షిత రాకపోకల అంశం కూడా ఈ చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. హర్ముజ్‌లో భద్రత, నౌకాయాన స్వేచ్ఛను కొనసాగించేందుకు ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలని అంగీకరించారు. అలాగే రాజకీయ స్థాయిలో మొత్తం మధ్యవర్తిత్వ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీకి ప్రధాన చర్చాకర్తలు తరచూ నివేదికలు సమర్పిస్తారు. అణు కార్యక్రమం, ఆర్థిక ఆంక్షలు, పర్యవేక్షణ విధానాలు, వివాద పరిష్కార వ్యవస్థ వంటి అంశాలపై ప్రత్యేక వర్కింగ్ గ్రూపులు పనిచేయనున్నాయి.లెబనాన్‌లో కాల్పుల విరమణ అమలును పర్యవేక్షించేందుకు అమెరికా, ఇరాన్, లెబనాన్ ప్రతినిధులతో కూడిన ప్రత్యేక 'డీ-కాన్ఫ్లిక్షన్ సెల్'ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి ఖతర్, పాకిస్తాన్ సౌకర్యదాతలుగా వ్యవహరించనున్నాయి.ఈ చర్చల్లో అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్ పాల్గొనగా.. ఇరాన్ తరఫున విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, ప్రధాన చర్చాకర్త మొహమ్మద్ బాఘేర్ ఘాలిబఫ్ హాజరయ్యారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ఖతర్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ అల్ థానీ కూడా చర్చల్లో పాల్గొన్నారు. అంతకుముందు.. చర్చలు జరుగుతుండగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. దీంతో ఇరాన్ ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారని.. చర్చల నుంచి వాకౌట్ చేశారని.. అమెరికాకు కౌంటర్ వార్నింగ్ ఇచ్చారని కథనాలు వెలువడ్డాయి. అయినప్పటికీ చర్చల టేబుల్‌పై పురోగతి సాధించామని జేడీ వాన్స్ ప్రకటించారు. లెబనాన్‌లో కాల్పుల విరమణ కొనసాగించడం, ఇరాన్‌తో సంబంధాలను కొత్త దిశగా తీసుకెళ్లడంలో ముందడుగు పడిందని ఆయన పేర్కొన్నారు.మొదటి విడత చర్చల్లో విభేదాలు, వాకౌట్లు, హెచ్చరికలు కనిపించినప్పటికీ.. చివరకు 60 రోజుల రోడ్‌మ్యాప్‌పై అంగీకారం కుదరడం శాంతి ప్రక్రియకు ఊరటనిచ్చే పరిణామంగా భావిస్తున్నారు. ఇప్పుడు ఈ 60 రోజులు అమెరికా-ఇరాన్ సంబంధాల భవిష్యత్తును నిర్ణయించే కీలక కాలంగా మారనున్నాయి. -
జాగ్రత్తగా మాట్లాడండి.. మా సైన్యం సిద్ధంగానే ఉంది
అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు కీలక మలుపు తిరిగాయి. స్విట్జర్లాండ్ వేదికగా చర్చలు మొదలు కాగా.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు, హర్ముజ్ జలసంధి మూసివేత, ఆర్థిక ఆంక్షలు ప్రధాన అడ్డంకులుగా మారాయి. చర్చలు కొనసాగుతుండగానే మరోసారి దాడులు చేస్తామంటూ ట్రంప్ హెచ్చరించగా.. ఇరాన్ అందుకు ధీటుగానే స్పందిస్తూ వాకౌట్ చేసింది. ఈ పరిణామాలు మిడిల్ఈస్ట్లో ఉద్రిక్తతల వేడిని మరింత పెంచేలా కనిపిస్తున్నాయి.అత్యంత విలాసవంతమైన బర్గెన్‌స్టాక్ రిసార్ట్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య ఆదివారం తొలి విడత శాంతి చర్చలు జరిగాయి. గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ మధ్య కుదిరిన తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఈ సమావేశాల ప్రధాన లక్ష్యం. అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ పాల్గొనగా.. ఇరాన్ తరఫున విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, ప్రధాన చర్చాకర్త మొహమ్మద్ బాఘేర్ ఘాలిబఫ్ హాజరయ్యారు. పాకిస్తాన్, ఖతర్ ఈ చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి.అయితే.. చర్చలకు ముందు ఘాలిబఫ్ ఖతర్, పాకిస్తాన్ ప్రతినిధులతో విడివిడిగా సమావేశమయ్యారు. ఆ తర్వాత నాలుగు పక్షాల చర్చలు ప్రారంభమయ్యాయి. సుమారు 80 నిమిషాల పాటు సాగిన తొలి విడత సమావేశంలో యుద్ధ విరమణ అమలు, ఆర్థిక ఆంక్షల సడలింపు, ఇరాన్‌కు చెందిన విదేశీ నిధుల విడుదల, చమురు ఎగుమతులపై పరిమితుల తొలగింపు వంటి అంశాలపై చర్చ జరిగింది.అయితే చర్చల ఆరంభంలోనే.. లెబనాన్ అంశం ప్రధాన అడ్డంకిగా మారింది. తాత్కాలిక ఒప్పందంలోని మొదటి నిబంధన అయిన "అన్ని రంగాల్లో కాల్పుల విరమణ"ను అమెరికా అమలు చేయలేదని ఇరాన్ ఆరోపించింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండటమే ఇందుకు నిదర్శనమని పేర్కొంది. లెబనాన్‌పై దాడులు ఆగేంత వరకు ఇతర అంశాలపై చర్చలు ముందుకు సాగబోవని ఇరాన్ చర్చల బృందంలోని సభ్యులు స్పష్టం చేశారు.ఇదే సమయంలో హర్ముజ్ జలసంధి అంశం కూడా చర్చల్లో ఉద్రిక్తతను పెంచింది. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ సముద్ర మార్గాన్ని ఇరాన్ తాజాగా మళ్లీ మూసేసిన సంగతి తెలిసిందే. లెబనాన్‌లో యుద్ధ పరిస్థితులు కొనసాగుతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఇరాన్ వివరణ ఇచ్చింది. అయితే హర్ముజ్ తెరిచి ఉంచడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమని అమెరికా స్పష్టం చేసింది.ఈ పరిస్థితుల్లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చలను మరింత సంక్లిష్టం చేశాయి. లెబనాన్‌లోని తమ అనుకూల బలగాలు, ముఖ్యంగా హెజ్బుల్లాను ఇరాన్ అదుపులో పెట్టాలని, లేదంటే గతవారం చేసిన దాడుల కంటే మరింత తీవ్రంగా దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఇరాన్ ప్రతినిధులు కొద్దిసేపు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయినట్లు ఇరానియన్ మీడియా వెల్లడించింది.BREAKING: Peace talks in Switzerland with Iran are falling apart already. Iran walks out. More of the same. Eff them. pic.twitter.com/N6WTYKGz34— Buzz Patterson (@BuzzPatterson) June 21, 2026అనంతరం స్పందించిన ఘాలిబఫ్.. అమెరికా బెదిరింపులను ఇరాన్ ఏమాత్రం పట్టించుకోదని, బెదిరింపులు పనిచేసి ఉంటే అమెరికా ఈ స్థాయికి వచ్చేదే కాదని వ్యాఖ్యానించారు. తమ సాయుధ బలగాలు అవసరమైతే భిన్నమైన రీతిలో ప్రతిస్పందించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు.అయితే పరిస్థితిని చల్లబరచే ప్రయత్నం చేసిన జేడీ వాన్స్.. ఇలాంటి చర్చల్లో విభేదాలు సహజమని, ప్రక్రియ కొంత గందరగోళంగా కనిపించినా పురోగతి కొనసాగుతోందని చెప్పారు. మధ్యప్రాచ్యంలో శాశ్వత మార్పు తీసుకురావడమే తమ లక్ష్యమని, ఇరాన్‌తో సంబంధాలను కొత్త దిశగా తీసుకెళ్లాలని ట్రంప్ సూచించారని పేర్కొన్నారు.చర్చల సందర్భంగా ఇరాన్‌కు చెందిన స్తంభింపజేసిన నిధుల విడుదలపై కార్యాచరణను ఖరారు చేసే దిశగా చర్చలు జరిగాయి. ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షల సడలింపుకు సంబంధించిన ప్రాథమిక ముసాయిదా కూడా సిద్ధమైనట్లు ఇరాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే అణు కార్యక్రమం సహా మిగిలిన కీలక అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.ఇక చర్చల మధ్యలో అమెరికా ప్రతిపాదించిన ఉమ్మడి ఫొటో, కరచాలన కార్యక్రమాన్ని కూడా ఇరాన్ తిరస్కరించింది. దానిని అమెరికా మీడియా ప్రదర్శనగా అభివర్ణిస్తూ.. ఘాలిబఫ్, అరాఘ్చీ పాల్గొనలేదు.మరోవైపు లెబనాన్‌లో రెండు రోజుల తీవ్ర ఘర్షణల తర్వాత పరిస్థితి కొంత ప్రశాంతంగా కనిపించినప్పటికీ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం దక్షిణ లెబనాన్‌లో ఏర్పాటు చేసిన భద్రతా మండలిని అవసరమైనంత కాలం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గే సూచనలు కనిపించడం లేదు.స్విట్జర్లాండ్‌లో శాంతి కోసం చర్చలు జరుగుతున్నా.. లెబనాన్‌లో యుద్ధం, హర్ముజ్‌లో ఉద్రిక్తతలు, ట్రంప్ హెచ్చరికలు, ఇరాన్ ప్రతిస్పందనలు చర్చల భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చాయి. తొలి విడత చర్చలు నిలిచిపోయినా.. ముగియలేదని ఇరాన్ చెబుతోంది. ఇప్పుడు రెండో విడత చర్చలు మిడిల్ఈస్ట్లో శాంతిని తీసుకువస్తాయా? లేక మరోసారి యుద్ధానికి దారితీస్తాయా? అన్నదే ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. -
త్వరలో ‘ఇంధన అత్యవసర’ ఆంక్షల ఎత్తివేత!
న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ మార్కెట్ రక్షణ కోసం అమలు చేసిన ‘ఇంధన అత్యవసర’ ఆంక్షలను అంతర్జాతీయ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత దశలవారీగా ఉపసంహరించే అవకాశముందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి గురువారం వెల్లడించారు. ఇటీవల అమెరికా–ఇరాన్ మధ్య 111 రోజుల యుద్ధానికి ముగింపు పలికే మధ్యంతర ఒప్పందం కుదిరింది. దీంతో వ్యూహాత్మకంగా కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ జలసంధి ద్వారా నౌకాయాన కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థితికి రానుండటం ప్రపంచంలోనే అతిపెద్ద చమురు దిగుమతిదారుల్లో ఒకటైన భారతదేశానికి భారీ ఊరటనిచ్చే అంశం.ముందస్తు రక్షణ చర్యలుగా ఆంక్షలు ఫిబ్రవరి చివరిలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి చమురు, సహజ వాయువు సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది. ముడి చమురు ధరలు, షిప్పింగ్ భీమా ప్రీమియంలు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. సంక్షోభం తీవ్రరూపం దాల్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం పలు అత్యవసర ప్రత్యామ్నాయ చర్యలను అమలు చేసింది. అందులో భాగంగా... ఎల్పీజీ సరఫరాలపై నిఘా పెంచింది. సిలిండర్ల అక్రమ రవాణా, నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన నిబంధనలు తెచ్చింది. ఇందులో భాగంగానే పెట్రోకెమికల్స్ ఉత్పత్తికి వాడే గ్యాస్‌ను ఎల్పీజీ వైపు మళ్లించాలని రిఫైనరీలను ఆదేశించింది.హోటళ్లు, రెస్టారెంట్ల వంటి వాణిజ్య వినియోగదారులకు ఎల్పీజీ సరఫరాను తగ్గించడంతో పాటు, గృహ వినియోగదారుల సిలిండర్ బుకింగ్ వ్యవధిని పెంచి నిల్వలను నియంత్రించింది. గృహ అవసరాలు, రవాణా (సీఎన్జీ), ఎరువుల రంగానికి ప్రాధాన్యత ఇస్తూ దేశీయ సహజ వాయువు కేటాయింపుల్లో మార్పులు, చేర్పులు చేసింది.‘‘ఈ ఆంక్షలన్నీ కేవలం ముందస్తు నివారణా చర్యలే. అంతర్జాతీయంగా చమురు మార్కెట్ స్థిరపడి, సరఫరా ముప్పు తొలగిపోగానే ఈ ఆంక్షలను దశలవారీగా ఉపసంహరిస్తాం’’ అని అధికారి స్పష్టం చేశారు.చమురు కంపెనీలకు రోజూ రూ.550 కోట్ల నష్టం యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 70–72 ডy్థయి నుంచి గరిష్టంగా 119 డాలర్లకు చేరుకున్నాయి. అయితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం కొంతకాలం పాటు పెరగకుండా నియంత్రించింది. మార్చి 27న పశి్చమ బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.10 చొప్పున కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అనంతరం ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు సుమారు రూ.7.50 చొప్పున, సీఎన్జీ ధరలను కిలోకు రూ.6 మేర పెంచింది.గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌పై రెండు విడతల్లో మొత్తం రూ.89 పెంపు అమలు చేసింది. ఈ ధరల పెంపు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ ధరలతో పోలిస్తే దేశీయ రిటైల్ ఇంధన ధరలు ఇంకా తక్కువగానే ఉండటంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ఇప్పటికీ రోజుకు సుమారు రూ.550 కోట్ల నష్టాన్ని భరిస్తున్నాయని అధికారి వెల్లడించారు. గత రెండు రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మూడు నెలల కనిష్టానికి పతనమమయ్యాయి. గురువారం బ్యారెల్ ధర సుమారు 78 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
మొజ్తాబా ఖమేనీ సంచలన వ్యాఖ్యలు
అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తొలిసారి స్పందించారు. ఇరాన్ ప్రయోజనాలు, "రెసిస్టెన్స్ ఫ్రంట్" హక్కులు కాపాడతామనే హామీతోనే తాను ఈ ఒప్పందానికి అంగీకరించానని అన్నారాయన. ఈ క్రమంలోనే ట్రంప్ తీరుపైనా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా–ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందం (MoU) కుదిరిన తర్వాత ప్రజలను ఉద్దేశించి విడుదల చేసిన సందేశంలో మొజ్తబా ఖమేనీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం కోసం తామేమీ ప్రయత్నించలేదని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే తీవ్రంగా ఆరాటపడ్డారని.. ఈ క్రమంలో "అన్ని రకాల ఒత్తిళ్లు, ఎత్తుగడలు" ఉపయోగించారని పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..తొలుత తాను ఈ ఒప్పందాన్ని సూత్రప్రాయంగా వ్యతిరేకించానని.. అయితే ఈ విషయంలో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, జాతీయ భద్రతా మండలి సభ్యులు తనను ఒప్పించారని అన్నారు. ఇరాన్ ప్రయోజనాలు దెబ్బతినవని హామీ ఇవ్వడంతోనే ఆమోదం తెలిపినట్లు చెప్పారు. "ఈ ఒప్పందం కోసం ఇరాన్ అధికారులు నిజాయితీగా కృషి చేశారు. కానీ దీనిని సాధించేందుకు అన్ని రకాల ఒత్తిళ్లు ఉపయోగించిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడే. నిరాశతోనే ఈ డీల్‌ను ముందుకు తీసుకొచ్చాడు" అని ఖమేనీ వ్యాఖ్యానించారు.భవిష్యత్తులో అమెరికా ఒప్పంద పరిధిని దాటి అదనపు షరతులు విధించాలనుకుంటే వాటికి తాము లొంగబోమని అధ్యక్షుడు తనకు స్పష్టంగా చెప్పారని ఖమేనీ వెల్లడించారు. ఇరాన్ హక్కులు, స్వాతంత్ర్యం, గౌరవం విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. అలాగే భవిష్యత్తులో అమెరికాతో ముఖాముఖి చర్చలు జరగడం అంటే.. అమెరికా వైఖరిని అంగీకరించినట్లు కాదని కూడా ఆయన స్పష్టం చేశారు.ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు సంయుక్తంగా ఫిబ్రవరి 28వ తేదీన యుద్దం ప్రారంభించాయి. ఆ దాడుల్లో ఆనాడు ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఉన్న అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. అదే దాడిలో తీవ్రంగా గాయపడిన మొబ్తాబా ఖమేనీ.. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ మధ్యలో నాయకత్వ బాధ్యతలు ఇరాన్లో తీవ్ర చర్చలు జరిగాయి. చివరకు.. మత, భద్రతా వర్గాల మద్దతుతో మొజ్తాబానే కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యారు. తాజాగా అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందంపై ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.ఖమేనీకి మద్దతుగా విదేశాంగ మంత్రిఖమేనీ ప్రకటనతో.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఏకీభవించారు. సుప్రీం లీడర్ మార్గదర్శకాల ప్రకారమే చర్చలు కొనసాగుతాయని పేర్కొన్నారు. చర్చల తదుపరి దశలో దేశ ప్రయోజనాలు, గౌరవం, స్వాతంత్ర్యాన్ని కాపాడేందుకు తమ పూర్తి సామర్థ్యాన్ని వినియోగిస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే.. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముగించే ఒప్పంద తాలుకా ఎంవోయూపై ఇరు దేశాల అధినేతలు డిజిటల్ సంతకాలు చేశారు. ఒప్పందం కుదిరిన వెంటనే తొలి చర్యలు ప్రారంభమయ్యాయి. హర్ముజ్ జలసంధి పరిసరాల్లో అమలు చేస్తున్న సముద్ర నిర్బంధ చర్యలను అమెరికా సెంట్రల్ కమాండ్ నిలిపివేసింది. ఇకపై ఇరాన్ నౌకాశ్రయాలకు వచ్చీపోయే వాణిజ్య నౌకలపై ఆంక్షలు ఉండవని ప్రకటించింది.మరోవైపు హర్ముజ్ జలసంధి గుండా వాణిజ్య రవాణాను పునరుద్ధరించేందుకు ఇరాన్ చర్యలు ప్రారంభించింది. వచ్చే 60 రోజుల పాటు నౌకలకు వేగవంతమైన అనుమతులు, జలసంధి రుసుముల మినహాయింపు కల్పిస్తామని వెల్లడించింది.ఒప్పందంలో అసలు ఏముంది?"ఇస్లామాబాద్ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్" పేరుతో కుదిరిన ఈ తాత్కాలిక ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు సైనిక చర్యలను నిలిపివేయాలి. హర్ముజ్ జలసంధిలో సాధారణ రవాణా పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలి. అలాగే 60 రోజుల వ్యవధిలో పూర్తి స్థాయి శాంతి ఒప్పందం కోసం చర్చలు జరపాలి. ఆ చర్చల్లో ఆంక్షల ఎత్తివేత, ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఇక..ఇటు స్విట్జర్లాండ్‌లో జరగాల్సిన కీలక సమావేశం యథాతథంగా జరగనుంది. అమెరిరా, ఇరాన్‌తో పాటు పశ్చిమాసియా ప్రతినిధులు ఈ భేటీకి హాజరు కానున్నారు. అవగాహన ఒప్పందం అమలుతో పాటు తుది ఒప్పందం విధివిధానాలపై చర్చించే అవకాశం ఉంది. -
బీబీకి దొరికిన ‘బెస్ట్ డీల్’ ఇదేనా!?
ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ఇరాన్‌తో కుదిరిన తాజా శాంతి ఒప్పందం అనేది ఇజ్రాయెల్‌కు దక్కిన బెస్ట్ డీల్ అని.. ఇంతకు మించి ఆ దేశానికి ఇంకేది అక్కర్లేదని.. ఇదే విషయాన్ని తాను నెతన్యాహుకి చెప్పానని అన్నారాయన.ఇరాన్–అమెరికా మధ్య తాజాగా కుదిరిన శాంతి ఒప్పందం అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒప్పందానికి ముందు తాను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడినట్లు చెప్పారు. అలాగే ఈ ఒప్పందం వల్ల ఇజ్రాయెల్‌కు ఉన్న అత్యంత పెద్ద భద్రతా ముప్పు తొలగిపోయిందని ఆయన అన్నారు. ఆ సంభాషణలో “ఆలోచించు బీబీ(నెతన్యాహుని ఉద్దేశించి.. ఆయన ముద్దు పేరు, పైగా రాజకీయ వర్గాల్లో అలానే పిలుస్తారు).. నీకు ఇది బెస్ట్ డీల్. ఇకపై ఇజ్రాయెల్‌పై అణు దాడి ప్రమాదం ఉండదు” అని చెప్పినట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండే ప్రమాదమే ఇజ్రాయెల్‌కు అతిపెద్ద భయం అని, ఈ ఒప్పందంతో ఆ ముప్పు తగ్గిందని ఆయన వ్యాఖ్యానించారు. “ఇజ్రాయెల్ కోరుకున్న అత్యంత కీలకమైన భద్రతా హామీ ఇదే” అని నెతన్యాహుకు చెప్పినట్లు వెల్లడించారు.ఫ్రాన్స్ ఈవియన్-లెస్-బెయిన్స్‌లో G7 సమావేశం జరిగింది. దీనికి హాజరైన ట్రంప్ పారిస్‌లోని ఓ హోటల్లో ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇచ్చిన విందుకు ట్రంప్ హాజరయ్యారు. అక్కడే ఆయన ఇరాన్‌తో ఒప్పందానికి సంబంధించిన ఎంవోయూ మీద సంతకం చేశారు. ఆ సమయంలోనే ఆయన పై వ్యాఖ్యలు చేశారు.మరోవైపు అమెరికా-ఇరాన్ ఒప్పందంపై పూర్తి స్పష్టత ఇంకా లేదు. ఎంవోయూ ప్రకారం.. ఇరాన్ తన అధిక శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తగ్గించాల్సి ఉంటుందని, అలాగే కొన్ని ఆంక్షల సడలింపు అంశాలు కూడా ఉన్నాయని సమాచారం. ఇదే సమయంలో లెబనాన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ సైనిక చర్యలు, హెజ్బొల్లా గ్రూపుల అంశం వంటి సున్నిత విషయాలు కూడా ఈ ఒప్పంద చర్చల్లో భాగమయ్యాయి.అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త బలగాలు ఇరాన్‌పై దాడికి దిగడంతోనే పశ్చిమాసియా యుద్ధం మొదలైందన్న సంగతి తెలిసిందే. అయితే మధ్యలో కాల్పుల విరమణకు ఇరు వర్గాలు అంగీకరించినప్పటికీ.. హెజ్బొల్లాను తుడిచిపెట్టే ఉద్దేశంతో లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు జరిపింది. ట్రంప్ స్వయంగా జోక్యం చేసుకుని వద్దని వారించినా.. నెతన్యాహు మాత్రం పరిమిత దాడులు కొనసాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో లెబనాన్‌లో భారీగా ప్రాణ నష్టం(దాదాపు 5 వేలమంది) సంభవించింది. అయితే ఇరాన్-అమెరికా ఒప్పందంలో లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో సైనికచర్యలు నిలిపి వేయాలనే ప్రతిపాదన ఉంది.ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాత్రం తమ భద్రత కోసం చేపట్టే చర్యల నుంచి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు, ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్ రాజకీయ వర్గాల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపక్షాలతో పాటు సొంత వర్గంలోని కొందరు మాజీ నేతలు నెతన్యాహుపై ఒత్తిడిని పెంచే అవకాశం లేకపోలేదు. మొత్తం మీద, ఇరాన్–అమెరికా ఒప్పందం కేవలం ప్రాంతీయ రాజకీయాలకే కాకుండా, ఇజ్రాయెల్ భద్రతా సమీకరణాలపై కూడా పెద్ద ప్రభావం చూపేలా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. -
అమెరికా-ఇరాన్ యుద్ధం: ప్రపంచాన్ని కుదిపేసిన మహా నష్టం
వాషింగ్టన్: గత కొన్ని నెలలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన అమెరికా-ఇరాన్ యుద్ధం ఎట్టకేలకు ముగిసింది. జూన్ 17న ఇరు దేశాలు 14 పాయింట్ల చారిత్రాత్మక శాంతి ఒప్పందం పై సంతకాలు చేయడంతో యుద్ధ మేఘాలు విడిపోయాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ భీకర పోరు ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలను బలితీసుకోవడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేసింది. ఈ యుద్ధం వల్ల అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు ఎంతటి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందో అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.ప్రాణ నష్టం ఇలా..ఈ 108 రోజులకు పైగా సాగిన యుద్ధంలో అమెరికాకు చెందిన 13 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, ఇరాన్ అధికారిక మీడియా ప్రకారం 3,300 మందికి పైగా ఇరానియన్లు మరణించారు. అలాగే లెబనాన్‌లో 3,826 మంది, ఇజ్రాయెల్‌లో దాదాపు 60 మంది ఈ హింసకు బలయ్యారు. కాగా తాజా ఒప్పందం ప్రకారం ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ జలసంధిని తక్షణమే తిరిగి తెరుస్తున్నారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయకూడదనే నిబంధనతో పాటు, ఆ దేశ పునర్నిర్మాణం కోసం 300 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 25 లక్షల కోట్లు) భారీ ఆర్థిక ప్యాకేజీని అందించడానికి అమెరికా అంగీకరించింది.అమెరికాపై భారీ ఆర్థిక భారంమూడీస్ అనలిటిక్స్ నివేదిక ప్రకారం, ఈ యుద్ధం కారణంగా అమెరికా వినియోగదారులు, పన్ను చెల్లింపుదారులు ఇప్పటివరకు సుమారు 132 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 11 లక్షల కోట్లు) మేరకు నష్టపోయారు. పెంటగాన్ గణాంకాల ప్రకారం కేవలం సైనిక చర్యలకే 29 బిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. యుద్ధం ప్రారంభంలో గ్యాలన్ గ్యాస్ ధర 3 డాలర్ల లోపు ఉండగా, హోర్ముజ్ జలసంధి దిగ్బంధనంతో అది ఏకంగా 4.56 డాలర్లకు చేరింది. దీనివల్ల అమెరికన్లు ప్రతిరోజూ చమురు కోసం వందల మిలియన్ల డాలర్లు అదనంగా వెచ్చించాల్సి వచ్చింది. డీజిల్ ధరలు కూడా గ్యాలన్‌కు 5.69 డాలర్ల రికార్డు స్థాయికి చేరడంతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకాయి.ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బఈ యుద్ధ ప్రభావం కేవలం అమెరికా, ఇరాన్లకే పరిమితం కాలేదు. ప్రపంచబ్యాంక్ 2026 అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి రేటు అంచనాను కోవిడ్ కాలం తర్వాత అత్యంత కనిష్టంగా 2.5 శాతానికి తగ్గించింది. మధ్యప్రాచ్య దేశాల జీడీపీ వృద్ధి రేటు 4.5 శాతం నుండి 1.3 శాతానికి పడిపోయింది. వ్యవసాయానికి కీలకమైన ఎరువుల ధరలు ఏకంగా 47 శాతం పెరిగాయి. భారతదేశంలో కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది. కమర్షియల్ ఎల్పీజీ ధరలు విపరీతంగా పెరగడంతో పాటు వంటగ్యాస్ కొరత ఏర్పడి సామాన్యులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.ఇది కూడా చదవండి: నీట్ వివాదం వేళ 19 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య -
అమెరికా–ఇరాన్ డీల్ జరగబోయేది ఇక్కడే..!
స్విట్జర్లాండ్‌లోని ఓ ప్రశాంత పర్వత ప్రాంతం ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా లగ్జరీ రిసార్ట్‌గా, పర్యాటక వేదికగా మాత్రమే గుర్తింపు పొందిన ఈ ప్రదేశం… ఇప్పుడు యూఎస్–ఇరాన్ శాంతి ఒప్పంద సంతకానికి వేదికగా మారనుండటంతో అంతర్జాతీయంగా ఆసక్తి పెరుగుతోంది. కానీ ఈ ప్రదేశానికి ఉన్న చరిత్ర, అక్కడ జరిగిన గత కీలక పరిణామాలు చూస్తే… ఇది కేవలం ఒక రిసార్ట్ మాత్రమే కాదనే ఫీలింగ్ కలగకమానదు.స్విట్జర్లాండ్‌లోని బుర్గెన్‌స్టాక్ (Bürgenstock) రిసార్ట్ ప్రపంచ రాజకీయాలకు మరోసారి కేంద్రబిందువుగా మారింది. నాలుగు నెలలుగా కొనసాగిన యుద్ధాన్ని ముగించేందుకు యూఎస్–ఇరాన్ మధ్య కుదిరిన మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్పై సంతకాలు ఈ శుక్రవారం ఇక్కడే జరగనున్నట్లు సమాచారం. అయితే.. పర్వత శిఖరంపై, సరస్సును చుట్టుముట్టినట్లుగా ఉన్న ఈ రిసార్ట్‌ను సమావేశానికి ఎంపిక చేయడం వెనుక భద్రతా కారణాలు ప్రధానంగా ఉన్నాయని స్విస్ అధికారులు తెలిపారు. యూఎస్, ఇరాన్‌తో పాటు పాకిస్తాన్ మరియు ఖతర్ మధ్యవర్తుల సూచనల మేరకు ఈ ప్రదేశాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ లగ్జరీ హోటల్ సముదాయం 150 ఏళ్ల చరిత్ర కలిగినది. ప్రపంచ నేతలు, రాజ కుటుంబాలు, హాలీవుడ్ ప్రముఖులు తరచూ ఇక్కడి అతిథులుగా వచ్చారు. ప్రశాంత వాతావరణం, బహుముఖ భద్రతా ఏర్పాట్లు, చేరుకోవడం కష్టమైన భౌగోళిక స్థానం దీనిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఇక్కడి చరిత్రలో ప్రముఖ ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. 1950లలో ప్రపంచ నాయకులు, కళాకారులు ఈ రిసార్ట్‌ను కలుసుకునే వేదికగా ఉపయోగించారు. బ్రిటిష్ నటుడు సీన్ కానరీ జేమ్స్ బాండ్ సినిమా “గోల్డ్‌ఫింగర్” షూటింగ్ సమయంలో ఇక్కడే నెలరోజులు ఇక్కడే బస చేశారు. ఈ రిసార్ట్‌లోని నిర్మాణం కూడా విశిష్టంగా ఉంటుంది. పర్వత అంచున 450 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ సముదాయం నాలుగు ప్రధాన హోటల్ భవనాలు, విలాసవంతమైన సూట్లు, విల్లాలతో కూడి ఉంటుంది. కొన్ని సూట్ల ధరలు ఒక్క రాత్రికి వేల డాలర్ల వరకు ఉంటాయి. ప్రత్యేక రైల్వే మార్గాలు, లిఫ్టులు, సరస్సు ద్వారా రాకపోకలు ఈ ప్రాంతాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి.హాలీవుడ్ క్లాసిక్ జేమ్స్ బాండ్ సినిమా షూటింగ్‌కు వేదికైన ఈ లగ్జరీ ప్రదేశం… ఇప్పుడు యుద్ధం ముగింపు చర్చలు అక్కడే ఎందుకు జరుగుతున్నాయన్న ప్రశ్నకు ప్రపంచం సమాధానం వెతుకుతోంది. అయితే.. ప్రపంచ రాజకీయ చర్చలు, శాంతి ఒప్పందాలు కూడా ఇదే ప్రదేశంలో జరిగిన సందర్భాలు ఉన్నాయట. గతంలో కూడా ఇక్కడ ప్రపంచ స్థాయి రాజకీయ సమావేశాలు జరిగాయి. ఉక్రెయిన్ యుద్ధంపై చర్చలు, సుడాన్ శాంతి ఒప్పందం, సైప్రస్ సమస్యపై చర్చలు వంటి కీలక సమావేశాలకు ఇది వేదికగా నిలిచింది. అంతేకాదు, బిల్డర్‌బర్గ్ వంటి అత్యంత రహస్య గ్లోబల్ మీటింగ్స్ కూడా ఇక్కడే జరిగిన చరిత్ర ఉంది. మొత్తానికి, సినిమాల్లో కనిపించే లాంటి ఆ లగ్జరీ పర్వత రిసార్ట్ ఇప్పుడు మరోసారి ప్రపంచ రాజకీయాలకు కేంద్రబిందువుగా మారుతోంది. -
పైసా ఇవ్వని అమెరికా.. ఇరాన్ డీల్‌లో మెగా ట్విస్ట్
ఇరాన్–అమెరికా మధ్య శాంతి చర్చలు దేని కోసం అన్న ప్రశ్నకు అణు ఒప్పందం, హర్ముజ్ జలసంధి వంటి అంశాల చుట్టూ భిన్న భిన్న వెర్షన్లు వినిపిస్తున్నాయి. డీల్‌లో అసలు ఏముంది అన్నదానిపై స్పష్టత లేకపోయినా, ఒక్కో వర్గం ఒక్కో కోణాన్ని ప్రధానంగా చూపిస్తోంది. ఇక ఈ మొత్తం సమీకరణాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తున్న పదం మాత్రం ఇప్పుడు చర్చల్లో బలంగా వినిపిస్తోంది… అదే మెగా డీల్.ఇరాన్–అమెరికా మధ్య కొనసాగుతున్న శాంతి చర్చలు కేవలం రాజకీయ ఒప్పందాలకే పరిమితం కావడం లేదు. అణు కార్యక్రమంపై నియంత్రణలు, ఆంక్షల ఎత్తివేత, అలాగే ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి అంశాలు ఈ డీల్‌లో ప్రధాన భాగాలుగా కనిపిస్తున్నాయి. ఈ రెండు అంశాలు భౌగోళిక రాజకీయాల కోణంలో అత్యంత కీలకమైనవిగా పరిగణించబడుతున్నాయి. హర్ముజ్ జలసంధి విషయానికి వస్తే, ఇది ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాకు అత్యంత కీలక మార్గం. ఈ మార్గంపై స్థిరత్వం లేకపోతే గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లు నేరుగా ప్రభావితమవుతాయి. అందుకే శాంతి ఒప్పందంలో దీనిపై ప్రత్యేక అంగీకారాలు అవసరమవుతున్నాయి. అదే సమయంలో ఇరాన్ అణు కార్యక్రమం కూడా ఈ చర్చల కేంద్రబిందువుగా కొనసాగుతోంది.అయితే ఈ రెండు కీలక అంశాల మధ్య ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది ఆర్థిక ప్యాకేజీ. సుమారు 300 బిలియన్ డాలర్ల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మొత్తం ఈ చర్చను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇరాన్-యూఎస్ పీస్ ఫ్రేమ్ వర్క్ అగ్రిమెంట్లో భాగంగా ప్రతిపాదించిన ఈ ఫండ్.. యుద్ధానంతర పునర్నిర్మాణం కోసం రూపొందించిన భారీ ఆర్థిక ప్యాకేజీగా భావిస్తున్నారు.రాయిటర్స్ కథనం ప్రకారం.. ఈ ఫండ్ పూర్తిగా ప్రైవేట్ పెట్టుబడులతోనే నడుస్తుంది. అమెరికా ప్రభుత్వం నుంచి పైసా సాయం ఉండదు. అయితే.. ఇప్పటికే సుమారు 150 బిలియన్ డాలర్లకు పైగా కమిట్మెంట్లు వచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా, గల్ఫ్ దేశాలు, ఆసియా, యూరప్, ఆఫ్రికా ప్రాంతాలకు చెందిన కంపెనీలు ఇందులో భాగస్వామ్యం కానున్నాయి. ఈ ఫండ్ ప్రధాన లక్ష్యం యుద్ధం వల్ల దెబ్బతిన్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థను తిరిగి నిలబెట్టడమట. ఎనర్జీ, రవాణా, లాజిస్టిక్స్, పరిశ్రమలు వంటి రంగాల్లో భారీ పెట్టుబడులు తీసుకురావడం ద్వారా దేశాన్ని మళ్లీ గ్లోబల్ ఎకానమీకి కలపడం దీని ఉద్దేశమని ఆ కథనం పేర్కొంది. ముఖ్యంగా ఈ ఆర్థిక ప్యాకేజీని అణు ఒప్పంద చర్చలు, అలాగే హర్ముజ్ జలసంధి అంశం నుండి వేరుగా ఉంచినట్లు సమాచారం. అంటే ఒక వైపు రాజకీయ భద్రతా ఒప్పందాలు కొనసాగుతుండగా, మరోవైపు ఈ ఫండ్ పూర్తిగా ఆర్థిక ట్రాక్‌లో ముందుకు వెళ్లనుందన్నమాట.ఇరాన్ మొదట యుద్ధ నష్టాలకు 400 బిలియన్ డాలర్ల పరిహారం కోరినప్పటికీ.. అమెరికా ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలుస్తోంది. దాంతో ప్రత్యామ్నాయంగా ఈ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఆలోచన ముందుకు వచ్చింది. ఈ మార్పే ఇప్పుడు ఈ డీల్‌ను పూర్తిగా కొత్త దిశలోకి తీసుకెళ్తోందనే విశ్లేషణ నడుస్తోంది.విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. హర్ముజ్ జలసంధి భద్రత, అణు ఒప్పందం రాజకీయ స్థిరత్వాన్ని నిర్ణయిస్తే… ఈ 300 బిలియన్ డాలర్ల ఫండ్ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే గేమ్‌చేంజర్‌గా మారే అవకాశం ఉంది. అంటే ఒకవైపు వ్యూహాత్మక భద్రత, మరోవైపు ఆర్థిక జాక్‌పాట్ – రెండూ ఈ డీల్‌ను నడిపిస్తున్న రెండు ఇంజిన్లలా భావిస్తున్నారు. -
డీల్‌పై ట్రంప్ ఒక మాట.. ఇరాన్ మరో మాట!
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు తెరదించుతూ.. తమ మధ్య ఓ కీలక అవగాహన ఒప్పందం కుదిరినట్టు అమెరికా–ఇరాన్‌లు ప్రకటించాయి. అయితే ఈ ఒప్పందంలో నిజంగా ఏముంది? ప్రచారంలో వినిపిస్తున్నట్లుగా 14 ప్రతిపాదనల ప్యాకేజీ నిజమేనా? అణు కార్యక్రమంపై ఇరాన్ ఎలాంటి హామీలు ఇచ్చింది? ఈ చర్చల్లో అమెరికా ఎక్కడైనా వెనక్కి తగ్గిందా? ఇరాన్ నిజంగానే అణ్వస్త్రాల అభివృద్ధికి శాశ్వతంగా స్వస్తి చెప్పిందా?.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలతో అంతర్జాతీయ సమాజంలో మరింత గందరగోళం నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. ‘‘ఇరాన్ ఎప్పటికీ అణ్వస్త్రాలను కలిగి ఉండబోదని అంగీకరించింది. ఈ మేరకు స్పష్టమైన హామీని కూడా ఇచ్చింది’’ అని అన్నారాయన. అలాగే గత కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్న ఆర్థిక ప్యాకేజీ ఊహాగానాలకు ఆయన చెక్ పెట్టారు. ‘‘అమెరికా ఇరాన్‌కు 300 మిలియన్ డాలర్లు చెల్లిస్తోందన్న వార్త పూర్తిగా అబద్ధం" అని స్పష్టం చేశారాయన. అయితే ఇరాన్ మాత్రం పాత పాటే పాడింది. అవును.. మేం అణ్వాస్త్రాలు వదిలేశాం అని చెప్పడం లేదు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ స్పందిస్తూ.. ప్రాథమిక అవగాహన ఒప్పందాన్ని "ఒక ముఖ్యమైన ముందడుగు"గా అభివర్ణించినప్పటికీ తుది ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేశారు. అలాగే ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధులు కూడా ‘‘చర్చలు ముందుకు వెళ్తున్నాయి.. కీలక పురోగతి చోటు చేసుకుంది.. ముసాయిదా ఒప్పందాలు ఉన్నాయి’’అని చెబుతున్నారే తప్ప.. తుది నిర్ణయం తీసుకున్నట్లు ఎక్కడా చెప్పడం లేదు. దీంతో అణు కార్యక్రమానికి సంబంధించిన పూర్తి నిబంధనలు, ఆంక్షల సడలింపు వంటి కీలక అంశాలు ఇంకా చర్చల దశలోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది. అలాగే ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య కుదిరింది పూర్తి శాంతి ఒప్పందం కాదు. ఇరు దేశాలు ఒక ప్రాథమిక అవగాహన ఒప్పందం (MoU)పై అంగీకరించాయి. అదీ నెలల తరబడి జరిగిన చర్చల తర్వాతే. అయితే ఖతార్ సమక్షంలో ఎంవోయూపై డిజిటల్ సంతకాలు కూడా పూర్తయ్యాయని అమెరికా అధికారులు చెబుతున్నారు. తుది సంతకాల కార్యక్రమం మాత్రం ఈ వారం(19న) జెనీవా( స్విట్జర్లాండ్)లో జరగనుంది. అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరయ్యే అవకాశం ఉంది. ట్రంప్ హాజరుపై స్పష్టత లేదు.ఈ అవగాహన ఒప్పందంలో అత్యంత కీలక అంశం హర్ముజ్ జలసంధి పునఃప్రారంభం. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గం మళ్లీ పూర్తిస్థాయిలో తెరుచుకుంటే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లకు ఊరట లభించనుంది. ఇప్పటికే చమురు ధరలపై ఒత్తిడి తగ్గినట్లు అంతర్జాతీయ మార్కెట్ల కదలికలు చెబుతున్నాయి.అలాగే ఇరాన్‌పై విధించిన కొన్ని ఆంక్షల సడలింపుపై కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇరాన్‌కు నేరుగా నగదు బదిలీ చేయబోమని జేడీ వాన్స్ స్పష్టం చేశారు. ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తగ్గించడం, అంతర్జాతీయ తనిఖీలకు అంగీకరించడం వంటి షరతులు నెరవేర్చిన తర్వాతే ఆంక్షల సడలింపు అమల్లోకి వస్తుందని ఆయన చెబుతున్నారు.ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ట్రంప్ "ఇరాన్ అణ్వస్త్రాలు కలిగి ఉండదు" అని ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు బయటకు వచ్చిన వివరాల ప్రకారం అణు కార్యక్రమానికి సంబంధించిన పూర్తి నిబంధనలు ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుత అవగాహన ఒప్పందం కేవలం చర్చలకు మార్గం సుగమం చేసే ఫ్రేమ్‌వర్క్ మాత్రమేనని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అణు కార్యక్రమం, యురేనియం నిల్వలు, ఆంక్షల పూర్తి ఎత్తివేత వంటి అంశాలపై తదుపరి చర్చలు జరగాల్సి ఉంది.లేటెస్ట్ అప్డేట్స్:* అమెరికా, ఇరాన్ మధ్య ప్రాథమిక అవగాహన ఒప్పందం కుదిరింది.* జెనీవాలో ఈ వారం తుది సంతకాల కార్యక్రమం జరగనుంది.* హర్ముజ్ జలసంధి పూర్తిస్థాయిలో తెరుచుకునే అవకాశం ఉంది. * ఇరాన్‌కు 300 మిలియన్ డాలర్లు చెల్లిస్తున్నారన్న వార్తలను ట్రంప్ ఖండించారు. * అణు కార్యక్రమంపై తుది ఒప్పందం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ట్రంప్ దీనిని చారిత్రాత్మక విజయంగా ప్రచారం చేస్తున్నప్పటికీ.. అసలు పరీక్ష ఇప్పుడు మొదలయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ నిజంగానే అణ్వస్త్రాల దిశగా అడుగులు ఆపుతుందా? అమెరికా వాగ్దానం చేసిన ఆంక్షల సడలింపు ఎంతవరకు అమలవుతుంది? జెనీవా సమావేశం తర్వాతే దీనిపై పూర్తి స్పష్టత రానుంది. -
డీల్‌తో ఎగుమతులకు బూస్ట్
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో దాదాపు నాలుగు నెలలుగా సాగుతున్న ఉద్రిక్తతలకు ఫుల్స్టాప్ పెడుతూ, శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలన్న అమెరికా–ఇరాన్ నిర్ణయంతో భారత్‌కి ఊరట లభించనుంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈసారైనా ఒప్పందం సజావుగా అమలైతే, పశ్చిమాసియాకి భారత్ ఎగుమతులు మళ్లీ పుంజుకునేందుకు ఊతం లభిస్తుందని ఎగుమతిదారులు, నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే దిగుమతి బిల్లుల భారం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుతాయని, రూపాయి స్థిరపడగలదని భావిస్తున్నారు. వెరసి వాణిజ్యానికి మరింత అనుకూల వాతావరణం ఏర్పడవచ్చని వారు తెలిపారు. జూన్ 19 స్విట్జర్లాండ్‌లో శాంతి ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. ‘ దాదాపు 50 శాతం క్రూడాయిల్, సుమారు 70 శాతం వంట గ్యాస్, 90 శాతం ద్రవీకృత సహజ వాయువు దిగుమతుల కోసం పశ్చిమాసియాపై భారత్ ఆధారపడుతోంది. అక్కడ ఉద్రిక్తతలతో సరఫరా సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో శాంతి ఒప్పందంతో భారత్‌కి తక్షణం ఆర్థికంగా ఊరట లభిస్తుంది. హార్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకుంటే, ఇంధన మార్కెట్లు స్థిరపడతాయి. చమురు..గ్యాస్ ధరలపై ఒత్తిడి తగ్గి రూపాయి బలపడవచ్చు. భారత్ వృద్ధి అవకాశాలు మెరుగుపడొచ్చు‘ అని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. అనిశ్చితికి తెర.. శాంతి ఒప్పంద ప్రకటనతో అనిశ్చితి, ఆర్థిక మందగమనం, అనవసర సమస్యలకి తెర పడుతుందని టెక్నోక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపక చైర్మన్ శరద్ కుమార్ సరాఫ్ తెలిపారు. ఎగుమతులు ఎగియడంతో పాటు కొత్త వ్యాపార అవకాశాలు కూడా లభించవచ్చన్నారు. మరోవైపు, పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గితే అంతర్జాతీయంగా ఇంధనాల సరఫరా, ధరలు తిరిగి సాధారణ స్థాయికి తిరిగి రావొచ్చని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ తెలిపారు. హార్మూజ్ మూసివేత వల్ల నౌకలు ఆఫ్రికా చుట్టు తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీనితో సముద్ర మార్గంలో రవాణా, నౌకల బీమా వ్యయాలు భారీగా పెరిగిపోవడంతో పాటు డెలివరీల్లోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. హార్మూజ్ తెరుచుకుంటే నౌకల రాకపోకలకు కూడా వెసులుబాటు లభిస్తుందని నిపుణులు తెలిపారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిరోధించే లక్ష్యంతో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఫిబ్రవరి 28న ఆ దేశంపై దాడి చేసిన సంగతి తెలిసిందే. దానితో మార్చిలో భారత్ ఎగుమతులు 7 శాతం క్షీణించి అయిదు నెలల కనిష్ట స్థాయి 38.92 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. పశ్చిమాసియాకి ఏకంగా 58 శాతం తగ్గి 3.5 బిలియన్ డాలర్లకు క్షీణించాయి. గల్ఫ్ దేశాల నుంచి దిగుమతులు 52 శాతం పడిపోయాయి. ఇక ఇంధనాల సరఫరాపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు చాలా కాలం తర్వాత పెట్రోల్, డీజిల్ రేట్లను ఇటీవల పాక్షికంగా పెంచినప్పటికీ, అంతర్జాతీయంగా ఎగిసిన స్థాయికి తగ్గట్లు పెంచకపోవడంతో ఆదాయ నష్టాలను చవిచూస్తున్నాయి. అవి పూర్తి ఆర్థిక సంవత్సరపు లాభాలకు సరిసమానంగా ఒక్క త్రైమాసికంలోనే నష్టాలు నమోదు చేసినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. హార్మూజ్ జలసంధి తెరుచుకుంటే సరఫరా మెరుగుపడి, ముడి చమురు ధరలు నెమ్మదించవచ్చు. -
డీల్ ఓకే.. ఎట్టకేలకు శాంతి వీచికలు
ఇస్లామాబాద్/వాషింగ్టన్/టెల్ అవీవ్: దాదాపు 107 రోజులుగా హార్మూజ్ జలసంధి దిగ్బంధంతో నెలకొన్న అంతర్జాతీయ చమురు సంక్షోభానికి ముగింపు పలుకుతూ, పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలను ఆర్పేస్తూ అమెరికా, ఇరాన్ చరిత్రాత్మక శాంతి ఒప్పందం కోసం సమష్టిగా ముందుకొచ్చాయి. పరస్పర షరతులకు సమ్మతి తెలుపుతూ జూన్ 19వ తేదీన శాంతి ఒప్పందంపై సంతకాలు చేయబోతున్నట్లు అటు అమెరికా, ఇటు ఇరాన్ ప్రకటించాయి. స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరంలో అమెరికా, ఇరాన్‌ల మధ్య సంతకాల కార్యక్రమాన్ని తమ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నట్లు పాకిస్తాన్ సోమవారం ప్రకటించింది. శాంతి ఒప్పందంలో ఏఏ వివరాలను పొందుపర్చబోతున్నారనే సమాచారం ఇంకా వెల్లడికాలేదు. ప్రపంచ మార్కెట్లపై యుద్ధ్దకుంపట్లను రాజేసిన అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ అమెరికా కాలమానంప్రకారం ఆదివారం రాత్రి ఇరాన్‌తో డీల్‌పై ప్రకటన చేశారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్‌సోషల్‌లో ఒక పలు పోస్ట్‌లు పెట్టారు. ‘‘ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరింది. అందరికీ అభినందనలు. ఇకపై ఎలాంటి సుంకాల్లేకుండా హార్మూజ్ తెరుచుకోబోతుంది. హార్మూజ్ వద్ద అమెరికా నావికాదళ దిగ్బంధాన్ని ఎత్తేస్తున్నాం. ప్రపంచ నౌకలకు ఇదే నా పిలుపు. ఇంజిన్లు స్టార్ట్ చేయండి. చమురు సరఫరాను సముద్రమార్గంలో ఉరకలెత్తించండి. గొప్పదైన ఈ ఒప్పందంలో పశ్చిమాసియాలో శాంతి, భద్రత నెలకొంటాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని గతంలో ఎంతో మంది అమెరికా అధ్యక్షులు ప్రయత్నించి విఫలమయ్యారు. తొలిసారిగా నేను శాంతి పవనాలు వీచేలా చేశా. శుక్రవారం సంతకాలు పూర్తయ్యాక హార్మూజ్ తెరుచుకుంటుంది. సముద్ర మందుపాతరల తొలగింపు ప్రక్రియ మొదలవుతుంది. హార్మూజ్ జలసంధికి ఇరువైపులా చమురు నౌకల రాకపోకలు ఆరంభమవుతాయి’’అనిట్రంప్ తెలిపారు. 60 రోజుల సంప్రదింపుల వ్యవధి! ‘‘ఇరు వైపుల ప్రతినిధి బృందాలు వచ్చాక శుక్రవారం స్విట్జర్లాండ్‌లో సంతకాలు చేస్తారు. అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాక 60 రోజులపాటు సంప్రదింపుల వ్యవధి ఉంటుంది. యురేనియంను అత్యంత నాణ్యత స్థాయికి శుద్ధిచేయడం, ఇప్పటికే శుద్ధచేసిన యురేనియంను నిర్వీర్యంచేయడం, ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు, రెండో దశ ఆంక్షలు, అంతర్జాతీయ ఆంక్షల ఎత్తివేతపై చర్చలు జరుగుతాయి’’అని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాసిం ఘరిబాబాడీ వెల్లడించారు. మరోవైపు ఒప్పందానికి అంగీకరించిన అమెరికాకు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలిపారు. మధ్యవర్తిత్వం వహించిన ఖతర్, తుర్కియే, సౌదీ అరేబియాలను షెహబాజ్ అభినందించారు. దాడి చేస్తే ప్రతిదాడి: ఇజ్రాయెల్ ఓవైపు శాంతి ఒప్పందానికి అమెరికా ముందడుగేస్తుంటే మిత్రదేశం ఇజ్రాయెల్ మాత్రం అదే యుద్ధధోరణిని మళ్లీ కనబర్చింది. ‘‘ఇరాన్ గనక మళ్లీ మాపై దాడులకు దిగితే మేం యుద్ధాన్ని కొనసాగిస్తాం. ఇప్పటిదాకా గాజా స్ట్రిప్, సిరియా, లెబనాన్‌లో మేం ఆక్రమించుకున్న సరిహద్దు ప్రదేశాలకు ఖాళీచేసేదే లేదు’’అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ప్రకటించారు. శాంతి ఒప్పందంలో లెబనాన్నూ చేర్చాలని ఓవైపు ఇరాన్ పట్టుబడుతుంటే అదే లెబనాన్‌పై దాడులు ఆపేదిలేదని ఇజ్రాయెల్ సోమవారం సైతం స్పష్టంచేయడంతో శాంతి ఒప్పందం ఏ మేరకు సవ్యంగా అమలవుతుందనే కొత్త అనుమానాలు బయల్దేరాయి. గత రెండున్నరేళ్లలో సిరియా, లెబనాన్, గాజా స్ట్రిప్‌లో మొత్తంగా 1,000 చదరపు కిలోమీటర్ల భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించింది. ఇది దాదాపు అమెరికాలోని న్యూయార్క్ సిటీ అంత ఉంటుంది. ‘‘కొత్త ఒప్పందాన్ని సమర్థవంతంగా అమలుచేయాల్సిన బాధ్యత అమెరికాదే. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను అమెరికా నిలువరించాల్సిందే’’అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పష్టంచేశారు. ఖమేనీ మృతి నుంచి ఒప్పందం దాకా.. వాషింగ్టన్/ఇస్లామాబాద్: ఇరాన్‌తో మూడ్రోజుల్లో అవగాహన ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని ట్రంప్ ప్రకటించడంతో ఇన్నాళ్లూ ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇరాన్‌పై అమెరికా కాల్పులు మొదలెట్టి తాజాగా చర్చలు మొదలెట్టిన దాకా జరిగిన క్రమంలో కీలక పరిణామాలు కొన్ని... ఫిబ్రవరి 28: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ మెరుపు దాడులు. దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా సయీద్ అలీ ఖమేనీ సహా పలువురు టాప్ కమాండర్ల దుర్మరణం మార్చి 1: దూరంగా ఉన్న అమెరికా భూభాగాలకు బదులు అమెరికా స్థావరాలున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై ఇరాన్ దాడులు మార్చి 2: పొరపాటున అమెరికా యుద్ధవిమానాలను నేలకూల్చిన కువైట్ మార్చి 4: ఇరాన్ యుద్దనౌక ఐఆర్ఎస్ డేనాను హిందూమహాసముద్రంలో టోర్పెడోతో దాడిచేసి ముంచేసిన అమెరికా మార్చి 8: సౌదీ అరేబియాపై ఇరాన్ దాడి. శకలాలు పడి భారతీయుడు మృతి మార్చి 9: తండ్రి స్థానంలో ఇరాన్ సుప్రీంనేతగా బాధ్యతలు చేపట్టిన మొజ్తాబా ఖమేనీ మార్చి 17: అమెరికా దాడిలో ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీ అంతం మార్చి 18: సౌత్ పార్స్ సహజవాయు క్షేత్రంపై అమెరికా భీకర దాడులు మార్చి 21: చమురు సంక్షోభం పెరగడంతో సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ ముడిచమురు విక్రయానికి అమెరికా తాత్కాలిక అనుమతి మార్చి 27: ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలపై అమెరికా బాంబర్ విమానాల దాడి మార్చి 31: ఐదు అంశాలతో శాంతి ప్రతిపాదనలను తెచ్చిన చైనా, పాకిస్తాన్ ఏప్రిల్ 3: తొలిసారిగా అమెరికా యుద్ధవిమానాన్ని కూల్చేసిన ఇరాన్ ఏప్రిల్ 8: రెండు వారాల కాల్పుల విరమణ ప్రతిపాదనను ఓకే చెప్పిన అమెరికా, ఇరాన్ ఏప్రిల్ 11: పాక్ వేదికగా తొలిసారిగా చర్చలకొచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏప్రిల్ 12: చర్చలు విఫలమైనట్లు అమెరికా ప్రకటనఏప్రిల్ 15: ఇరాన్లో పర్యటించిన అగ్రనాయకత్వంతో చర్చించిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఏప్రిల్17: హార్మూజ్‌ను తెరుస్తున్నామన్న ఇరాన్. తాము దిగ్బంధించామన్న అమెరికా ఏప్రిల్ 20: ఇరాన్ జెండాతో రాకపోకలు సాగించే నౌకలను అడ్డుకోవడం మొదలెట్టిన అమెరికా ఏప్రిల్ 22: హార్మూజ్‌లో మూడు నౌకలపై దాడిచేసి రెండింటిని స్వా«దీనంచేసుకున్న ఇరాన్ ఏప్రిల్ 24: తమ ప్రతిపాదనలు తెలియజేసేందుకు పాక్‌లో పర్యటించిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబాŠబ్స్ అరాఘ్చీ ఏప్రిల్ 27: అమెరికా దిగ్బంధాన్ని ఎత్తేస్తే హార్మూజ్‌ను తెరుస్తామని తొలిసారిగా ప్రకటించిన ఇరాన్ మే 6: విదేశీ నౌకలు హార్మూజ్‌ను సురక్షితంగా దాటేందుకు ఇకపై అమెరికా యుద్దనౌకలు రక్షణగా రాబోవని ప్రకటించిన ట్రంప్ మే 13: ఒమన్ తీరంలో భారతీయ నౌకపై దాడి మే 18: చర్చలు కీలకదశలో ఉండటంతో దాడులు తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు అమెరికా ప్రకటన జూన్ 1: తమ ఎంక్యూ–1 ప్రిడేటర్ డ్రోన్‌ను కూల్చినందుకు ఇరాన్‌పై భీకర దాడులు మొదలెట్టినట్లు ట్రంప్ వెల్లడి జూన్ 3: కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్ దాడిలో భారతీయుడి దుర్మరణం జూన్ 6: బహ్రెయిన్, కువైట్‌లపై బాలిస్టిక్ క్షిపణుల వర్షం కురిపించిన ఇరాన్ జూన్ 7: చర్చల ప్రక్రియలో కదలిక తెచ్చిన పాక్ జూన్ 8: కాల్పుల విరమణకు తూట్లుపొడుస్తూ పరస్పర దాడులకు దిగిన ఇజ్రాయెల్, ఇరాన్ జూన్ 9: అమెరికా ఆర్మీ హెలికాప్టర్‌ను కూల్చేసినందుకు ప్రతీకారం తీర్చుకుంటానన్న ట్రంప్ జూన్ 10: పలావూ జెండాతో ఉన్న నౌకపై అమెరికా దాడిలో ముగ్గురు భారతీయుల దుర్మరణం జూన్ 15: కాల్పులకు ముగింపు పలుకుతూ ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని ట్రంప్ ప్రకటన ఒప్పందంలో ఏముంది ? మరో మూడ్రోజుల్లో ముసాయిదా ఒప్పందంపై అమెరికా, ఇరాన్‌లు సంతకాలుచేసి తదుపరి సమగ్రమైన సంప్రదింపుల ప్రక్రియకు తెరలేపనున్నారనే వార్తల నేపథ్యంలో అసలు ఈ ముసాయిదా ఒప్పందంలో ఏమేం అంశాలను పొందుపరిచారనే ఆసక్తి ప్రపంచ దేశాల్లో ఎక్కువైంది. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై సుంకాలు విధిస్తారా? అణ్వాయుధం తయారీ కోసం ఇప్పటికే అత్యంత నాణ్యమైన యురేనియం శుద్ధికి సాహసించిన ఇరాన్‌ను ఆ దిశగా మరో అడుగు ముందుకువేయకుండా అమెరికా షరతు విధించింది? అనే పలు సందేహాల నడుమ ఇరాన్ మీడియా ఈ ముసాయిదాలోని 14 అంశాలను సంపాదించిందని కథనాలు వెలువడ్డాయి. సైనిక, ఆర్థిక, అణు అంశాలతో ఈ ముసాయిదాను సిద్ధంచేసినట్లు తెలుస్తోంది. ఈ అంశాల గురించి క్లుప్తంగా...1. అమెరికా, ఇరాన్ దశాబ్దాల శత్రుత్వాలకు ఇకనైనా ముగింపు పలకడం 2. ముడి చమురు సహా వాణిజ్య వస్తూత్పత్తుల సరఫరా కోసం నౌకల రాకపోకల నిమిత్తం హార్మూజ్ తెరవడం 3. ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా విధించిన ఆంక్షలు, అమెరికా నావికాదళ దిగ్బంధాన్ని ఎత్తేయడం 4. చర్చలు ఓవైపు జరుగుతుండగా ఒప్పందం తమకు అనుకూలంగా కుదిరేలా ఇరాన్‌పై ఒత్తిడి పెంచేలా ఆ దేశంపై అమెరికా కొత్తగా ఆంక్షలు విధించకపోవడం 5. ఈలోపు ఇరాన్ ముడి చమురు ఎగుమతులపై తక్షణం ఆంక్షలు ఎత్తేయడం 6. విదేశీ బ్యాంకుల ఖాతాల్లో అమెరికా, మిత్రదేశాలు స్తంభింపజేసిన ఇరాన్ ప్రభుత్వానికి చెందిన వేల కోట్ల డాలర్ల నిధులను విడుదలచేయడం 7. కనీసం 60 రోజులపాటు నిరాటంకంగా సవ్యంగా సంప్రదింపులు జరపడం 8. ఇరాన్ ఇకపై అణ్వస్త్ర సమీకరణ కోసం ప్రయత్నాలను విరమించుకోవడం 9. ఇరాన్ ఇకపై మిలటరీ గ్రేడ్‌లో నాణ్యత స్థాయికి యురేనియంను శుద్ధిచేయకుండా మిన్నకుండిపోవడం 10. అణు కేంద్రాల విస్తరణ ప్రతిపాదనలను ఇరాన్ పక్కనపడేయడం 11. అణుకేంద్రాలపై అమెరికా బాంబర్ దాడులతో భూస్థాపితమైన శుద్ధయురేనియం అప్పగింత లేదా నిర్వీర్యంచేయడంపై చర్చలు జరపడం 12. పశ్చిమాసియాలో యుద్ధం ముగిసిందని స్పష్టమయ్యేలా ఇరాన్ సైనిక చర్యలను ఉపసంహరించుకోవడం 13. ఆర్థికపర ఆంక్షలను అమెరికా ఎత్తేయడంతోపాటు ఇరాన్ పునర్నిర్మాణ కార్యక్రమానికి కృషిచేయడం 14. సమగ్రమైన తుది ఒప్పందం కోసం కృషిచేయడంతెరమీదకు మరికొన్ని అంశాలు! ఇవిగాక మరిన్ని ప్రతిపాదనలు ముసాయిదా ఒప్పందంలో ఉన్నాయని మీడియాలో వార్తలొచ్చాయి. ఇరాన్‌కు 300 బిలియన్ డాలర్లతో ఆర్థికాభివృద్ధి ప్యాకేజీని ట్రంప్ అందించడం, ఇరాన్లో అమెరికా సంస్థలు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టి ఇరాన్ పునరుజ్జీవనానికి పాటుపడటం, ఆర్థికసహకారం, రుణాలు అందివ్వడం, భవిష్యత్‌లో ఉద్రిక్తతలు తలెత్తకుండా తగు పరస్పర సహకార విభాగాలను ఏర్పాటుచేయడం, గ్లోబల్ మార్కెట్లతో ఇరాన్‌ను మరింతగా అనుసంధానం చేయడం వంటివీ ఇందులో ఉన్నాయని వార్తలొచ్చాయి. పరస్పర దాడులు ఆపేస్తే సరిపోదని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. ‘‘ఇరాన్ యుద్ధంలో కీలకమైన నాలుగు అంశాలు దాగి ఉన్నాయి. చమురు సంక్షోభం భవిష్యత్‌లో తలెత్తకుండా సుంకాల్లేకుండా చమురు నౌకల రాకపోకలను శాశ్వతంచేయడం, దెబ్బతిన్న ఇరాన్ ఆర్థికవ్యవస్థ మళ్లీ పుంజుకునేలా పలు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందివ్వడం, అణ్వస్త్ర సామర్థ్యంలేకపోవడంతోనే తమపై అగ్రదేశాలు దాడులుచేస్తున్నాయనే భావన ఇరాన్లో లేకుండా చేయడం, తద్వారా ఇరాన్.. లెబనాన్(హెజ్»ొల్లా), యెమెన్(హూతీ), గాజా(హమాస్)లో పరోక్ష సైన్యాలను పెంచిపోషించకుండా అడ్డుకోవడం వంటివి చేయగలిగితేనే పశ్చిమాసియాలో శాశ్వత శాంతి సుసాధ్యమవుతుంది’’అని నిపుణులు విశ్లేషించారు. తర్వాత ఏం జరగొచ్చు? ప్రతిపాదిత ముసాయిదా ఒప్పందం అమల్లోకి వచ్చాక తొలి 60 రోజులపాటు హార్మూజ్ తెరుచుకోవడంతో చమురు సంక్షోభం తాత్కాలికంగా సద్దుమణిగే ఆస్కారముంది. అయితే ఈ 60 రోజుల్లో సమగ్ర శాంతి ఒప్పందం కుదిరితే అందరికీ లాభమే. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే సమస్య మళ్లీ మొదటికొస్తుంది. ఏళ్ల తరబడి ఇరాన్‌పై అమెరికా సహా ఏ దేశమూ ఆంక్షలు విధించకుండా చూసుకోవడం, ఒప్పందాన్ని సమగ్రస్థాయిలో అమలుచేసే వ్యవస్థను కొలువుతీర్చడం, ఇరాన్ దొంగచాటుగా యురేనియంను శుద్ధిచేయకుండా అడ్డుకోవడం వంటివి కీలకంగా మారనున్నాయి. 14 అంశాలపై ఇరుదేశాలు ఉమ్మడిగా ఏకాభిప్రాయానికొస్తే చరిత్రాత్మక శాంతి ఒప్పందానికి ఈ 14 అంశాలే మూలస్తంభాలుగా నిలుస్తాయి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా–ఇరాన్ ఒప్పందంపై స్పందించిన మోదీ
పశ్చిమాసియాలో నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా అమెరికా–ఇరాన్ మధ్య అవగాహన కుదిరింది. ఇరు దేశాలు కాల్పుల విరమణ పాటిస్తూ.. శాంతి ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించాయి. ఈ పరిణామాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఆయన ఓ పోస్ట్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. పశ్చిమాసియాలో జరిగిన ఈ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపిందని, అనేక దేశాల్లో ప్రాణనష్టం కూడా జరిగిందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం అమలైతే ప్రాంతంలో శాంతి, స్థిరత్వం పునరుద్ధరించడమే కాకుండా ప్రపంచ వాణిజ్య మార్గాలకు ఊరట లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. “పశ్చిమాసియాలో జరిగిన ఘర్షణను ముగించేందుకు అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన అవగాహనను నేను స్వాగతిస్తున్నాను. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అంతరాయాలను కలిగించింది, అనేక దేశాల్లో ప్రాణనష్టానికి కారణమైంది. ఈ ఒప్పందం అమలైతే ప్రాంతంలో శాంతి, స్థిరత్వం పునరుద్ధరించబడుతుంది. కీలక సముద్ర మార్గాల ద్వారా వాణిజ్యం సజావుగా కొనసాగుతుంది. ఈ అవగాహన అమలు పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వాన్ని తీసుకురావడమే కాకుండా వాణిజ్య నౌకా మార్గాల్లో స్వేచ్ఛాయుత రవాణాను నిర్ధారిస్తుందని మేము ఆశిస్తున్నాం అని ప్రధాని మోదీ తెలిపారు. మిగిలిన అంశాలపై.. అమెరికా–ఇరాన్ మధ్య జరిగే చర్చలు స్థిరమైన, దీర్ఘకాలిక ఒప్పందానికి దారితీయాలని కూడా మోదీ ఆకాంక్షించారు.I welcome the understanding reached between the United States and Iran on ending the conflict in West Asia, which has caused serious economic disruption across the world and led to loss of life in many countries. India hopes that the implementation of this understanding will…— Narendra Modi (@narendramodi) June 15, 2026ప్రస్తుతం మోదీ స్లోవేకియా పర్యటనలో ఉన్నారు. 1993 తర్వాత ఆ దేశంలో పర్యటిస్తున్న భారత ప్రధాని ఆయనే కావడం గమనార్హం. ఫ్రాన్స్ నుంచి అక్కడికి వెళ్లిన ఆయనకు.. వందేమాతరంతో ఘన స్వాగతం లభించింది.ఇక.. ఇరాన్-అమెరికా డీల్‌కు సంబంధించి కొన్ని మీడియా సంస్థల నివేదికల ప్రకారం.. ఈ ఫ్రేమ్‌వర్క్‌లో కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. హర్ముజ్ జలసంధి ద్వారా నౌకా రవాణా పునరుద్ధరణ, ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు తిరిగి ప్రారంభం, తాత్కాలిక ఆంక్షల సడలింపు, అలాగే ఇరాన్‌కు నిలిచిపోయిన ఆస్తుల విడుదల వంటి అంశాలు ఇందులో భాగమని తెలుస్తోంది. హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గం కావడంతో.. ఈ ఒప్పందం భారత్ వంటి దేశాలకు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్‌కు, ఈ మార్గంలో ఉద్రిక్తతలు తగ్గితే ఇంధన ధరల ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ప్రమాదంలో ఇరాన్–అమెరికా డీల్?!
పశ్చిమాసియా సంక్షోభం మరో కీలక మలుపు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. యుద్ధం ముగిసిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలోనే ఇజ్రాయెల్ వైఖరి కొత్త ఉద్రిక్తతలకు దారితీసింది. భద్రతా విషయంలో తగ్గేదేలే అంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చెబుతుండడం.. లెబనాన్‌పై కొనసాగుతున్న భీకర దాడులు శాంతి చర్చలపై తీవ్ర ప్రభావం చూపొచ్చన్న ఆందోళనలు పెంచుతున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య నెలల తరబడి సాగిన శాంతి చర్చలు తుది దశకు చేరుకుంటున్న సమయంలోనే మిడిల్ఈస్ట్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. డీల్‌కు ససేమీరా చెబుతూ.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ చర్యలకు దిగింది. లెబనాన్ రాజధాని బీరూట్‌తో పాటు దక్షిణ ప్రాంతాల్లో డ్రోన్ దాడులు జరిగినట్లు లెబనాన్ మీడియా తెలిపింది. కఫర్ టెబ్నిట్ ప్రాంతంలో కూడా డ్రోన్ దాడి జరిగినట్లు సమాచారం. ఆదివారం హెజ్బొల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇవి జనావాసాలను కూడా ప్రభావితం చేస్తున్నాయని లెబనాన్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూ, అంతర్జాతీయ జోక్యం కోరుతున్నారు. డీల్ కుదిరిందని ట్రంప్ ప్రకటించిన వేళ.. ఇజ్రాయెల్ వైపు నుంచి మరింత కఠిన వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. ‘‘ట్రంప్ నిర్ణయాలు మమ్మల్ని ప్రభావితం చేయలేవు. లెబనాన్‌పై దాడులు కొనసాగిస్తాం. భద్రతా విషయంలో రాజీ పడేది లేదు’’ అని నెతన్యాహు చెప్పినట్లు అంతర్జాతీయా మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. ఇక ట్రంప్ కుదిర్చిన ఒప్పందం తమను కట్టిపడేయదని ఇజ్రాయెల్ మంత్రి ఇత్మార్ బెన్ గ్విర్ వ్యాఖ్యానించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. “భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు” అనే సందేశాన్ని ఇజ్రాయెల్ స్పష్టంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడుతూ, ప్రధాని నెతన్యాహుతో కలిసి తాము స్పష్టమైన భద్రతా విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. లెబనాన్, సిరియా, గాజా ప్రాంతాల్లో భద్రతా జోన్లలో ఇజ్రాయెల్ సైన్యం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఒత్తిడులున్నప్పటికీ తమ వైఖరిలో మార్పు ఉండదని, దేశ భద్రతే ప్రధాన ప్రాధాన్యమని ఆయన తేల్చిచెప్పారు. లెబనాన్ పరిణామాల కారణంగా ఇరాన్ దాడి చేస్తే తక్షణ ప్రతిచర్య తప్పదని ఆయన హెచ్చరించారు.🔴 Israel’s Defense Minister Israel Katz says that along with Prime Minister Benjamin Netanyahu, he is leading a clear policy that states that the Israeli army will remain in the security zones in Lebanon, Syria and Gaza🔴 Katz says that Israel opposes the Israeli army’s… pic.twitter.com/dYPahEDsTE— Al Arabiya English (@AlArabiya_Eng) June 15, 2026అంతకు ముందు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ‘ది న్యూయార్క్ టైమ్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, నెతన్యాహు చాలా కఠినమైన నాయకుడని, ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు శాంతి చర్చలను క్లిష్టం చేశాయని వ్యాఖ్యానించారు. బీరూట్ ఘటనలు అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందంపై ప్రతికూల ప్రభావం చూపినట్లు కూడా ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తం పరిణామాలను చూస్తే, ఒకవైపు అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై ఆశలు కొనసాగుతున్నప్పటికీ, మరోవైపు లెబనాన్ కేంద్రంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ చర్యలు ఆ ప్రక్రియకు ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ గనుక ఈ దాడులకు ప్రతిస్పందిస్తే.. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలు మళ్లీ ప్రమాదంలో పడిన పరిస్థితి నెలకొంది. -
19న జెనీవాకు ట్రంప్ వస్తారా? జేడీ వాన్స్ వ్యాఖ్యలతో ఉత్కంఠ!
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం ఖరారైనప్పటికీ, ఇప్పుడు ట్రంప్ ఎటువంటి మెలిక పెడతారో, చివరి నిముషంలో ఏం చేస్తారో అనే సందేహం ప్రపంచవ్యాప్తంగా పలువురి మదిలో మెదులుతోంది. అలాగే ఆయన జనీవా రాకపై సస్పెన్స్ నెలకొంది. మధ్యప్రాచ్యంలో శాంతిని పునరుద్ధరించడంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదుటపరిచే ఈ కీలక ఒప్పందంపై వచ్చే జూన్ 19న స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో సంతకాలు జరగనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ట్రంప్ స్వయంగా హాజరవుతారా లేదా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ ఒప్పందాన్ని తన ప్రభుత్వ దౌత్య విజయంగా భావిస్తున్నప్పటికీ, ఆయన నేరుగా వేదికపైకి వస్తారా అనే విషయంలో ట్రంప్ వైఖరి ఇంకా స్పష్టంగా వెల్లడి కాలేదు.ఈ సస్పెన్స్‌కు మరింత బలాన్ని చేకూరుస్తూ యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తాము ఇంకా దీనికి సంబంధించిన లాజిస్టిక్స్ వివరాలను పరిశీలిస్తున్నామని, తాను కచ్చితంగా ఈ కార్యక్రమానికి హాజరవుతానని చెబుతూనే, అధ్యక్షుడు ట్రంప్ కూడా వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందం అమెరికా ప్రజలకు దక్కిన విజయమని, దీనివల్ల దీర్ఘకాలంలో ఇంధన ధరలు భారీగా తగ్గి, మిడిల్ ఈస్ట్‌లో కొత్త శకానికి నాంది పడుతుందని వాన్స్ ధీమా వ్యక్తం చేశారు. అయితే ట్రంప్ రాకపై తుది నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించకపోవడం దౌత్య వర్గాలలో చర్చనీయాంశమైంది.మరోవైపు, ఇరాన్ సైతం జూన్ 19న ఒప్పందం జరగనుందనే విషయాన్ని ధృవీకరిస్తూనే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంతకాల కార్యక్రమాన్ని వర్చువల్ (రిమోట్) పద్ధతిలో నిర్వహించే అవకాశం కూడా ఉందని గతవారమే స్పష్టం చేసింది. టెహ్రాన్ తరఫున ఈ చారిత్రాత్మక ఘట్టంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్-బాగర్ గాలిబాఫ్ లేదా విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీలలో ఒకరు హాజరయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ వైపు నుంచి రిమోట్ సైనింగ్ ఆప్షన్ తెరపైకి రావడం కూడా ట్రంప్ స్వయంగా జెనీవా రావడంపై సస్పెన్స్‌ను మరింత పెంచేలా చేసింది.అన్నింటికంటే ముఖ్యంగా, ట్రంప్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చిన ఇరాన్ అణు కార్యక్రమంపై ఈ ఒప్పందంలో పెద్దగా స్పష్టత లేకపోవడం గమనార్హం. ఇరాన్ తన యురేనియం సంపదను అప్పగించాలని ట్రంప్ డిమాండ్ చేస్తుండగా, తమ అణు కార్యక్రమం కేవలం పౌర అవసరాల కోసమేనని ఇరాన్ వాదిస్తోంది. ఈ వివాదాస్పద అణు సమస్య అలాగే ఉండిపోవడం, దీనికి తోడు హార్ముజ్ జలసంధిపై దిగ్బంధనాన్ని తొలగించడం, ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తులను పునరుద్ధరించడంపై వాషింగ్టన్ వైఖరిని పరిశీలించేందుకు ఇరాన్ 60 రోజుల డెడ్‌లైన్ విధించడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యూహాత్మక ఉత్కంఠల నడుమ, ఒప్పందాన్ని ఖరారు చేసిన ట్రంప్ జూన్ 19న జెనీవా వేదికపై ప్రత్యక్షంగా కనిపిస్తారా లేదా అనేదే ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది. -
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో స్టాక్ సూచీలు ఎగిశాయి. నిఫ్టీ 50 ఇండెక్స్ 461.30 పాయింట్లు లేదా 1.99 శాతం పెరిగి 23,622.90 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 1,695.40 పాయింట్లు లేదా 2.30 శాతం పెరిగి 75,527.95 వద్ద స్థిరపడింది.నిఫ్టీ 50 ఇండెక్స్‌లో శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, లార్సెన్ అండ్ టూబ్రో టాప్ గెయినర్లుగా నిలిచాయి. విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 2.43 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ 2.8 శాతం నష్టపోయాయి. రంగాల వారీగా, నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 3 శాతానికి పైగా పెరిగాయి. నిఫ్టీ ఐటీ తక్కువ పనితీరు కనబరిచింది. -
ట్రంప్‌ను రెచ్చగొడుతూ.. ఇజ్రాయెల్ కొత్త ప్లాన్ ఇదేనా?
పశ్చిమాసియా సంక్షోభంలో సంయమనం పాటించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే కోరుతున్నారు. కానీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం తన దారి తనదేనన్నట్లు వ్యవహరిస్తున్నారు. లెబనాన్ రాజధాని బీరూట్‌పై దాడులతో మళ్లీ యుద్ధాన్ని మొదలుపెట్టినంత పని చేశారు. ఇది శాంతి ప్రయత్నాల్లో ఉన్న ట్రంప్‌నకు సాధారణంగానే చిర్రెత్తుకొచ్చేలా చేసింది.ఒకవైపు తాను కాల్పుల విరమణ కోరుతూ ఇరాన్‌తో ఒప్పందం కోసం ప్రయత్నిస్తుంటే.. ఇజ్రాయెల్ ప్రధాని మాత్రం కవ్వింపు చర్యలకు దిగడాన్ని ట్రంప్ ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఈ మధ్య కాలంలోనే వీళ్లిద్దరి మధ్య వాడివేడి సంభాషణలు జరిగినట్లు.. అందులో ట్రంప్ నెతన్యాహును చెడామడా వాయించినట్లు అమెరికా మీడియా వరుసబెట్టి కథనాలు ఇస్తోంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఆ స్థాయిలో తిట్టనేలేదని.. సున్నితంగా మందలించారనే అంటోంది. ఈ క్రమంలో మంచి స్నేహాన్ని చెడగొట్టుకుంటూ.. ‘ఒంటరి అయిపోతావ్ జాగ్రత్త!’ అని హెచ్చరించేదాకా నెతన్యాహు ఎందుకు తెచ్చుకుంటున్నారు అనేది పరిశీలిస్తే..ఇరాన్‌పై మరోసారి దాడులకు ఆదేశించడం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పైకి చూస్తే ఇది కేవలం హెజ్బొల్లా కోసమో, ప్రతీకారం కోసమో చేసిన దాడిలా కనిపించినా.. అసలు లక్ష్యం మాత్రం వేరే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో ఇజ్రాయెల్‌కు ప్రాధాన్యం దక్కేలా ఒత్తిడి తీసుకురావడమేనని చెబుతున్నారు. లెబనాన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. దీంతో ఏప్రిల్‌లో కుదిరిన కాల్పుల విరమణ తర్వాత తొలిసారిగా ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్ లక్ష్యాలపై దాడులు చేసినట్లయ్యింది. అయితే ట్రంప్ జోక్యంతో ఇరుదేశాలు తాత్కాలికంగా కాల్పులు నిలిపివేశాయి. ప్రస్తుతం అమెరికా, ఇరాన్‌తో శాంతి ఒప్పందం కోసం చర్చలు జరుపుతోంది. కానీ, ఆ చర్చల నుంచి ఇజ్రాయెల్‌ను తొలి నుంచే దూరంగా ఉంచినట్లు.. ట్రంప్ వ్యవహార శైలిని బట్టి ఇట్టే అర్థమవుతోంది.ఈ నేపథ్యంలో "మా ప్రయోజనాలను పట్టించుకోకుండా ఎలాంటి తుది ఒప్పందమూ సాధ్యం కాదు" అనే సంకేతాన్ని వాషింగ్టన్కు పంపేందుకే నెతన్యూహు ఈ పరిమిత దాడులకు ఆదేశించి ఉంటారని చర్చ నడుస్తోంది. ఇది మాత్రమే కాదు. ఇజ్రాయెల్‌కు అత్యంత కీలకమైన అంశం.. దక్షిణ లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై దాడులు జరిపే స్వేచ్ఛ. ఒకవేళ భవిష్యత్తులో అమెరికా-ఇరాన్ ఒప్పందం కుదిరితే.. ఆ సైనిక చర్యలకు అవకాశమే ఉండకపోవచ్చు అని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకే ఇరాన్ దాడులకు నేరుగా ప్రతిస్పందించి, "లెబనాన్‌లో మా చర్యలకు ఇరాన్ జోక్యం అంగీకరించం" అనే గట్టి సందేశాన్ని పంపింది.ఇక.. కాల్పుల విరమణ నేపథ్యంలో ట్రంప్, నెతన్యాహూ మధ్య విభేదాలు కొంతకాలంగా బయటపడుతున్నాయి. గత వారం బీరూట్‌పై జరగాల్సిన వైమానిక దాడులను ట్రంప్ ఫోన్ చేయడంతో నెతన్యాహూ నిలిపివేశారు. శాంతి చర్చలు దెబ్బతినకుండా ఉండాలన్నదే ట్రంప్ ఉద్దేశం. అయితే ఇజ్రాయెల్‌లో ప్రతిపక్షాలు మాత్రం "అమెరికా చర్చల కోసం దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెడుతున్నారా?" అంటూ నెతన్యాహూపై విమర్శలు గుప్పిస్తున్నాయి. స్వదేశం నుంచి ఈ ఒత్తిళ్లు కూడా నెతన్యాహును దాడులకు ఆదేశించి ఉండొచ్చన్న వాదన ఒకటి వినిపిస్తోంది.సైనిక నిపుణులు చెబుతోంది ఏంటంటే.. ఇజ్రాయెల్ ఒంటరిగా ఇరాన్‌పై దాడులు చేయగలిగినా దీర్ఘకాలిక యుద్ధాన్ని కొనసాగించే సీన్ మాత్రం లేదు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి, రక్షణ వ్యవస్థల కోసం అమెరికా సహకారం కీలకం. అందువల్ల ట్రంప్‌తో పూర్తిగా విభేదించే పరిస్థితి కూడా ఇజ్రాయెల్‌కు లేదని విశ్లేషకులు చెబుతున్నారు.ఇరాన్‌పై తాజా దాడులు కేవలం సైనిక చర్యలు మాత్రమే కాదు. అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో ఇజ్రాయెల్ ప్రయోజనాలను విస్మరించవద్దనే రాజకీయ హెచ్చరికగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ట్రంప్ శాంతి ప్రయత్నాలు, నెతన్యాహూ భద్రతా ఆందోళనల మధ్య ఈ సమీకరణం భవిష్యత్తులో మరింత సంక్లిష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
శాశ్వత శాంతి విరమణ ఒప్పందం.. హర్మూజ్ జలసంధి ఓపెన్..!
-
దురుసుగా ప్రవర్తిస్తే మళ్లీ దాడులు చేస్తాం
వాషింగ్టన్: పశ్చిమాసియాలో తాత్కాలికంగా నిలిచిపోయిన యుద్ధాన్ని పూర్తిగా ముగించేందుకు ఇరాన్ నుంచి వచ్చిన తాజా ప్రతిపాదనను సమీక్షిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఒకవేళ ఇరాన్ గనక దురుసుగా ప్రవర్తిస్తే ఆ దేశంపై దాడులు మళ్లీ ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఆయన శనివారం ఫ్లోరిడాలోని పామ్ బీచ్ నుంచి మియామీ వెళ్తూ విలేకరులతో మాట్లాడారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ తప్పుగా ప్రవర్తిస్తే, ఏదైనా చెడు చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందన్నారు. ఇరాన్ పంపిన కొత్త ప్రతిపాదనను నిశీతంగా పరిశీలిస్తున్నానని, దానిపై మళ్లీ మీడియాతో మాట్లాడతానని తెలిపారు. ఈ కొత్త ఆఫర్ కూడా తనకు అంతగా నచ్చలేదని పరోక్షంగా సంకేతాలిచ్చారు. తర్వాత ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గత 47 ఏళ్లుగా మానవాళిపై పాల్పడిన అకృత్యాలకు ఇరాన్ ఇంకా మూల్యం చెల్లించలేదని ఆక్షేపించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ నూతన ప్రతిపాదన అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని తాను భావించడం లేదన్నారు. ఇరాన్‌కు పెద్ద శిక్ష పడాల్సి ఉందని తేల్చిచెప్పారు. అయితే, పశ్చిమాసియాలో శాంతి సాధన విషయంలో ఇరాన్ కొత్త ప్రతిపాదన ఏమిటన్నది ఆయన బయటపెట్టలేదు. ఈ ప్రపోజల్‌ను ఇరాన్ గురువారం అమెరికాకు పంపించినట్లు తెలిసింది. గతంలో ఇరాన్ చేసిన ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించి విషయం విదితమే. దానిపై తాను సంతృప్తిగా లేనని ఆయన తేల్చిచెప్పారు. బంతి అమెరికా కోర్టులోనే ఉంది: ఇరాన్ నూతన ప్రతిపాదన పట్ల ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ ప్రతిస్పందించింది. చర్చల ద్వారా పరిష్కారాన్ని కోరుకుంటారా? లేక యుద్ధానికి తిరిగి వెళ్తారా? అనేది అమెరికా ఇష్టమని తేల్చిచెప్పింది. ఇప్పుడు బంతి అమెరికా కోర్టులోనే ఉందని ఇరాన్ విదేశాంగ శాఖ ఉప మంత్రి కజెమ్ ఘరీబాబాదీ పేర్కొన్నారు. దౌత్య మార్గాన్ని ఎంచుకుంటారో లేక ఘర్షణను కొనసాగిస్తారో వారే నిర్ణయించుకోవాలని ఉద్ఘాటించారు. తన జాతీయ ప్రయోజనాలు, భద్రతను కాపాడుకోవడమే తమకు ముఖ్యమని స్పష్టంచేశారు. ఇరాన్ రెండు మార్గాలకు.. చర్చలకు లేదా యుద్ధానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఏమిటీ కొత్త ప్రతిపాదన? అమెరికా చేసిన 9 పాయింట్ల ప్రతిపాదనకు ప్రతిస్పందనగా ఇరాన్ 14 పాయింట్లతో ఈ కొత్త ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో అమెరికా దిగ్బంధనాన్ని ముగించడం, ఇరాన్, లెబనాన్‌లో యుద్ధానికి శాశ్వతంగా ముగింపు పలకడంపై ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరాన్ ప్రతిపాదించినట్లు సమాచారం. ఆయా అంశాలపై చర్చలకు ఒక నెల గడువు విధించింది. అటువంటి ఒప్పందం కుదిరిన తర్వాతే అణు కార్యక్రమంపై మరో ఒప్పందానికి వచ్చేందుకు మరో నెల రోజులపాటు చర్చలు కొనసాగించాలని పేర్కొంది. భవిష్యత్తులో ఎలాంటి దాడులు చేయకూడదని, తమ భద్రతకు హామీ ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేసింది. అణ్వాయుధాల అభివృద్ధిని నిలిపివేస్తామంటూ ఇరాన్ స్పష్టమైన గ్యారంటీ ఇవ్వలేదని సమాచారం. హార్మూజ్‌ను తెరుస్తామని, తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించే చర్యలపై దృష్టి సారిస్తామని ఇరాన్ వెల్లడించింది. అమెరికా ఈ ప్రాంతం నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని, తమ చమురు ఎగుమతులపై ఆంక్షలు సహా ఆర్థిక ఆంక్షలను తొలగించాలని షరతు విధించింది. సముద్ర వాణిజ్యం, చమురు సరఫరా పునరుద్ధరణను అణు కార్యక్రమాల చర్చల నుంచి వేరు చేయాలన్నదే ఇరాన్ వ్యూహమని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ నిబంధనల కింద తమ అణు కార్యక్రమ హక్కులను అధికారికంగా గుర్తించాలని ఇరాన్ కోరుతోంది. ఏ ఒప్పందమైనా శాశ్వతంగా ఉంటుందని, ఏకపక్ష ఉపసంహరణకు తావులేదన్న హామీలు ఇవ్వాలని అంటోంది. -
ఇక చాలూ.. ఇజ్రాయెల్‌పై ట్రంప్ అసహనం
పశ్చిమాసియా ఉద్రిక్తతలు, శాశ్వత శాంతి స్థాపనకు ప్రయత్నాలు కొనసాగుతున్న వేళ.. మిత్రదేశం ఇజ్రాయెల్ తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా లెబనాన్‌పై దాడులు కొనసాగించడం సరికాదన్నారు. ఈ క్రమంలో దాడులు ఇకనైనా ఆపాలంటూ ట్రంప్ సూచించారు.‘‘లెబనాన్‌పై ఇజ్రాయెల్ ఇక దాడులు చేయడానికి వీల్లేదు. వాళ్లు దాడులు చేయకుండా అమెరికా నిషేధం విధించింది. ఇక చాలు..’’ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. అమెరికా మధ్యవర్తిత్వంతోనే లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం.. గురువారం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం తర్వాతే హర్ముజ్ జలసంధిని ఇరాన్ తెరిచేందుకు అంగీకరించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ రెండు వారాల యుద్ధ విరమణ.. శాంతి చర్చలకు ఇరాన్-అమెరికాలు ముందుకు వచ్చాయి. అయితే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగడంతో ఇరాన్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ దాడులు ఆగకుంటే శాంతి చర్చలు ముందుకు సాగవని చెబుతూ వచ్చింది. ఇజ్రాయెల్ ఏమో.. లెబనాన్ గడ్డపై ఆశ్రయం పొందుతున్న హెజ్బొల్లా గ్రూపులతో తమ దేశానికి ముప్పు ఉందని చెబుతూ దాడులు కొనసాగించింది. దీంతో లెబన్నాన్-ఇజ్రాయెల్ మధ్య చర్చల కోసం అమెరికా రంగంలోకి దిగాల్సి వచ్చింది.ట్రంప్ తాజా హెచ్చరికలపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు. కానీ, ఈ వార్నింగ్ కంటే ముందే ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ అంశంపై పరోక్షంగా స్పందించారు. దక్షిణ లెబనాన్‌లో తమ సైన్యం మోహరింపు కొనసాగుతుందని ప్రకటించారు. ‘‘రాకెట్ దాడులు, డ్రోన్ల ముప్పు ఇంకా ఇజ్రాయెల్ తొలగిపోలేదు. అందుకే మేం చేయాలనుకున్నది చేస్తాం. అదేంటో ఇప్పుడు నేను మీ ముందు చెప్పలేను’’ అని మీడియా ముందు నెతన్యాహు ప్రకటించారు.ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాల దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చెలరేగాయి. 38 రోజుల తర్వాత ఇరు దేశాలకు శాంతి చర్చలకు అంగీకరించాయి. అయితే లెబనాన్ కూడా ఈ కాల్పుల విరమణలో భాగమని ఇరాన్ చెబుతుండగా.. అదసలు వేరే అంశమని ట్రంప్ చెబుతూ వస్తున్నారు. ఎల్లుండి ఇస్లామాబాద్ వేదికగా రెండో దఫా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఏప్రిల్ 22వ తేదీతో ఇరాన్ అమెరికా మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగియనుంది. -
తేల్చకుంటే సర్వనాశనమే
దుబాయ్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో రణజ్వాలలను ఉవ్వెత్తున ఎగదోసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం ఇరాన్‌కు తీవ్రస్థాయి హెచ్చరికలతో అల్టిమేటం ఇచ్చారు. అత్యంత శుద్ధ యురేనియం నిల్వలను అప్పగిస్తూ, యుద్ధం నుంచి తప్పుకుంటూ శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని లేదంటే ఇరాన్‌ను సర్వనాశనం చేస్తానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పలు పోస్ట్‌లు పెట్టారు. ‘‘ఇరాన్లో మేం చేపట్టిన సైనిక చర్యలను తక్షణం ఆపేసే అంశంపై ఇరాన్ దేశ నూతన పాలక వర్గంతో విస్తృతస్థాయిలో సమగ్రంగా సహేతుకంగా చర్చలు జరుపుతున్నాం. చర్చల్లో అద్భుతమైన పురోగతి సాధించాం. కానీ ఏదైనా కారణంతో ఈ ఒప్పందం గనక సఫలీకృతంకాకపోతే ఇరాన్ అంతుచూస్తాం. సరుకు రవాణా నౌకల రాకపోకల కోసం హార్మూజ్‌ను తెరవకపోతే ఇన్నిరోజులు ఇరాన్ విషయంలో మేం చూపించిన సహనం మాలో చచ్చిపోతుంది. వెంటనే ఇరాన్‌లోని అన్ని చమురు క్షేత్రాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఆయిల్ రిఫైనరీలు, ఖర్గ్ ద్వీపంసహా ఉప్పునీటిని తాగు నీటిగా మార్చే డీశాలినైజేషన్ ప్లాంట్లనూ సర్వనాశంచేస్తాం. ఇరాన్ గత 47 ఏళ్ల ఉగ్రపాలనలో వేలాది మంది అమెరికన్ సైనికుల ప్రాణాలు తీసింది. వారి మరణాలకు తాజా దాడులతో మేం ప్రతీకారం తీర్చుకుంటాం’’అని ట్రంప్ హెచ్చరించారు. ఖర్గ్‌ను స్వాధీనం చేసుకోవచ్చేమో.. ఇరాన్ చమురు మౌలికరంగంలో గుండెకాయ అయిన ఖర్గ్ ద్వీపాన్ని స్వా«దీనం చేసుకునే ఆలోచన ఉందని ట్రంప్ ‘ఫైనాన్షియల్ టైమ్స్’ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘ఖర్గ్ ద్వీపాన్ని స్వా«దీనం చేసుకోవచ్చు. చేసుకోకపోవచ్చు కూడా. ఈ విషయంలో మాకెన్నో ఆప్షన్లు ఉన్నాయి. మా పంతం నెగ్గాలంటే ఖర్గ్ ద్వీపం మా అ«దీనంలో ఉంటే మంచిదేమో. దానిని కాపాడుకునే వ్యవస్థ ఏదీ ఇరాన్ వద్ద లేదు. సులభంగా స్వా«దీనం చేసుకుంటాం’’ అని ట్రంప్ అన్నారు. డిమాండ్లను తప్పుబట్టిన ఇరాన్ అమెరికా పంపిన 15 అంశాల డిమాండ్లను ఇరాన్ చెత్త ప్రతిపాదనలుగా అభివరి్ణంచింది. ‘‘గల్ఫ్ అరబ్ దేశాల్లోకి ఇప్పటికే అమెరికా సేనలు ప్రవేశించాయి. కానీ పర్షియన్ గల్ఫ్ సముద్రజలాల్లోకి అమెరికా సేనలు అడుగుపెడితే ఆ ప్రాంతం మొత్తాన్నీ సముద్ర మందుపాతరలతో నింపేస్తాం. అమెరికా పంపిన డిమాండ్లు అన్నీ అతిగా, అవాస్తవంగా, ఏమాత్రం హేతుబద్ధత లేకుండా ఉన్నాయి’’ అని ఇరాన్ విదేశాంగశాఖ అధికారప్రతినిధి ఇస్మాయిల్ బఘేల్ వ్యాఖ్యానించారు. పాక్ మధ్యవర్తిత్వం మాకొద్దు.. ‘‘ఇప్పుడు నేరుగా అమెరికాతో చర్చలు లేవు. మధ్యవర్తుల ద్వారా కేవలం అసంబద్ధమైన ప్రతిపాదనలు వస్తున్నాయి. అమెరికా దౌత్యం మాటమాటకి మాటిమాటికీ మారుతోంది. మధ్యవర్తిత్వంపై అమెరికా పిల్లిమొగ్గలేస్తోంది. మేం స్థిరంగా ఒకే నిర్ణయంపై కట్టుబడి ఉన్నాం. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం మాకు అవసరం లేదు. ప్రాంతీయ పోరు ఆగాలనే పిలుపు మంచిదే. కానీ అసలే పోరు మొదలెట్టింది ఎవరు?’’ అని ముంబైలోని కాన్సులేట్ జనరల్ సోమవారం ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో ఎలాంటి చర్చలు జరగట్లేదు. అమెరికా బలగాల కోసం ఇరాన్ సైనికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాగానే కాల్చి బూడిదచేస్తాం. అమెరికా మిత్రదేశాలకూ ఇదే మా హెచ్చరిక’’ అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖాలిబాహ్ అన్నారు. ఇరాన్ దాడుల పరంపర అమెరికా మిత్రదేశాలపై ఇరాన్ సోమవారం సైతం దాడులను కొనసాగించింది. కువైట్‌లోని జల, విద్యుత్ కేంద్రంపై బాంబుల వర్షం కురిపించింది. ఉత్తర ఇజ్రాయెల్‌లోని హైఫా సిటీలోని భారీ చమురు రిఫైనరీపై ఇరాన్ బాంబులేసింది. దీంతో మంటలు వ్యాపించి దట్టమైన పొగలు వెలువడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ అయ్యాయి. సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్‌పై క్షిపణులను ప్రయోగించగా ఐదింటిని గగనతల రక్షణవ్యవస్థలు కూల్చేశాయి. దుబాయ్‌లోనూ ఒక క్షిపణిని అడ్డుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధాన అణు పరిశోధనా కేంద్రం మీదా ఇరాన్ దాడులుచేసింది. దీంతో ఆ ప్రాంతమంతా హెచ్చరికల సైరన్లతో మోగిపోయింది. అయితే ఇప్పటిదాకా అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 1,900 మంది చనిపోయారని ఇరాన్ ప్రకటించింది. మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలోముగ్గురు ఐరాస శాంతివిభాగ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. బీరుట్ శివారు టైర్ ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఒక లెబనాన్ సైనికుడు చనిపోయారు. మరోవైపు ఇరాక్‌లోని మొహమ్మద్ అలా వైమానిక స్థావరంపై రాకెట్ల దాడి జరిగింది. ఈ దాడి తమ ఆంటోనోవ్–132 ఆర్మీ రవాణా విమానం ధ్వంసమైందని ఇరాక్ రక్షణ శాఖ తెలిపింది.గగనతలాన్ని మూసేసిన స్పెయిన్ ఇరాన్‌పై దాడుల కోసం అమెరికా తమ గగనతలాన్ని వినియోగిస్తుండటంపై ఆగ్రహంతో ఉన్న స్పెయిన్ సోమవారం తమ ఎయిర్‌స్పేస్‌ను మూసేసింది. ‘‘సంయుక్తంగా నిర్వహిస్తున్న సైనికస్థావరాలను యుద్ధం కోసం ఉపయోగించకూడదు. కానీ మా మాట అమెరికా వినట్లేదు. అందుకే మా గగనతలాన్ని మూసేస్తున్నాం. ఈ యు ద్ధం చట్టవ్యతిరేకం, అన్యాయం’’అని స్పెయిన్ రక్షణమంత్రి మార్గరీటీ రూబెల్స్ ప్రకటించారు. నేవీ చీఫ్ మరణాన్ని ద్రువీకరించిన ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ)లోని నేవీ విభాగ సారథి అలీరెజా తంగసిరి ఇటీవల దాడుల్లో కన్నుమూశారని ఇరాన్ ఎట్టకేలకు అధికారికంగా ధ్రువీకరించింది. ఇరాన్ నేవీ రియర్ అడ్మిరల్ను గత గురువారమే అంతంచేశామని ఇజ్రాయెల్ ప్రకటించినా ఇప్పటిదాకా ఇరాన్ ధ్రువీకరించలేదు. ‘‘దాడుల్లో తీవ్రంగా గాయపడిన అలీరెజా అమరుడయ్యారు. దేశసేవలో అత్యున్నత త్యాగం చేశారు’’ అని ఇరాన్ నేవీ సోమవారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తంచేసింది. కువైట్‌లో భారతీయుని దుర్మరణం కువైట్‌లో సముద్రనీటిని మంచినీరుగా మార్చే డీశాలినైజేషన్ ప్లాంట్‌లో పనిచేస్తున్న ఒక భారతీయుడు సోమవారం ఆ ప్లాంట్‌పై ఇరాన్ జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటిదాకా పశ్చిమాసియా యుద్ధ ఘటనల్లో చనిపోయిన భారతీయుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. ప్లాంట్‌లోని ఒక భవనం దెబ్బతినడంతో ఇతను చనిపోయాడని కువైట్ విద్యుత్, జల, పునరుత్పాదక ఇంధన శాఖ తెలిపింది. -
గాజాలో శాంతి స్థాపనే లక్ష్యంగా ట్రంప్ ముందడుగు
-
శాంతి ఒప్పందానికి చేరువలో...
వాషింగ్టన్: ఉక్రెయిన్–రష్యా యుద్ధం త్వరలో ముగిసిపోతుందన్న సంకేతాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చారు. శాంతి ఒప్పందం విషయంలో ఆ రెండు దేశాలు ఎన్నడూ లేనంత సమీపంలోకి వచ్చాయని తెలిపారు. ఆదివారం ఫ్లోరిడాలోని ఓ రిసార్ట్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ సమావేశమయ్యారు. దాదాపు మూడు గంటల పాటు ఈ భేటీ జరగడం విశేషం. ప్రధానంగా ఉక్రెయిన్–రష్యా శాంతి ఒప్పందంతోపాటు యుద్ధం ముగించడంపైనే వారు చర్చించినట్లు తెలుస్తోంది. జెలెన్స్కీతో అద్భుతమైన సంభాషణ జరిగిందని ట్రంప్ పేర్కొన్నారు. భేటీ అనంతరం జెలెన్స్కీతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రష్యా అధినేత పుతిన్ శాంతిని కోరుకుంటున్నారని తాను భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. జెలెన్స్కీ నిజంగా ధైర్యవంతుడైన నాయకుడు అంటూ కొనియాడారు. మరోవైపు జెలెన్స్కీ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడికి దిగడం గమనార్హం. ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై రష్యా సైన్యం దాడులకు పాల్పడింది. ఏం చర్చించారు? ఉక్రెయిన్–రష్యా శాంతి ఒప్పందం ఇంకా ఖరారు కాలేదు. కొన్ని అంశాలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఉక్రెయిన్‌కు సంబంధించిన కొన్ని భూభాగాలను రష్యా ఆక్రమించింది. వాటిని తిరిగి అప్పగించాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తుండగా రష్యా అంగీకరించడం లేదు. వాటిపై హక్కులు వదులుకోవడంతోపాటు రష్యాలో అంతర్భాగంగా అధికారికంగా గుర్తిస్తేనే యుద్ధాన్ని ఆపేస్తామని తేలి్చ చెబుతోంది. ఇందుకు ఉక్రెయిన్ ససేమిరా అంటోంది. మరోవైపు భవిష్యత్తులో తమపై దాడులు జరగకుండా భద్రతాపరమైన గ్యారెంటీలు ఇవ్వాలని కోరుతోంది. ఈ రెండు ముఖ్యమైన అంశాలపైనే ట్రంప్, జెలెన్స్కీ చర్చించినట్లు తెలుస్తోంది. యూరోపియన్ నాయకులతో సమావేశం కావాలని వారిద్దరూ నిర్ణయించారు. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లెయన్తోపాటు ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, పోలాండ్ తదితర దేశాల అధినేతలతో సమావేశం ఏర్పాటుచేస్తానని ట్రంప్ చెప్పారు. వచ్చే నెలలో ఈ భేటీ జరిగే అవకాశం ఉంది. శాంతి కోసం ట్రంప్ ఎంతగానో కృషి చేస్తున్నారంటూ ఆయనకు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలియజేశారు. శాంతికి తాము సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. ఇదిలా ఉండగా, రష్యా అధినేత పుతిన్‌తో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. శాంతి ఒప్పందంపై వారు అభిప్రాయాలు పంచుకున్నారు. -
ట్రంప్ పీస్ ప్లాన్.. ఇదేం ట్విస్టు?!
దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు దిశగా కీలక అడుగు పడింది. ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందం విషయంలో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో జరిపిన భేటీ ఫలవంతంగా ముగిసింది. తుది ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా.. ఇద్దరు దేశాధినేతలు చర్చలు కీలక దశకు చేరుకున్నాయనే సంకేతాలు మాత్రం ఇచ్చారు. కానీ..ఫ్లోరిడాలోని తన మార్ ఎ లాగో నివాసంలో సుమారు మూడు గంటలపాటు ట్రంప్ జెలెన్స్కీతో చర్చలు జరిపారు. శాంతి ఒప్పందానికి 90-95 శాతం ఆమోదం లభించిందని ఇరువురు నేతలు ప్రకటించారు. అయితే కీలకమైన సరిహద్దు అంశంపైనే ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని ఇద్దరి మాటల్లో వెల్లడి అయ్యింది.ఉక్రెయిన్‌కు భద్రత కల్పించే అంశాలపై 95 శాతం చర్చలు పూర్తయ్యాయని ట్రంప్ అన్నారు. అయితే.. తూర్పు భాగంలోని సరిహద్దుల అంశమే ఎటూ తేలడం లేదని మీడియా ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘చాలా అంశాలపై చర్చించాం. దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లే అనుకోవచ్చు. గతంతో పోలిస్తే ఇది ఎంతో మెరుగైన ఫలితం. మరికొన్ని వారాల్లోనే ఈ యుద్ధం ముగిసే అవకాశం ఉంది. అయితే ఈ చర్చలకు డెడ్‌లైన్ అంటూ ఏదీ లేదని గమనించాలి. కాబట్టి సరైన సమయంలో.. అదీ అమెరికా సమక్షంలో రష్యా-ఉక్రెయిన్లు ఈ యుధ్దానికి ముగింపు పలుకుతాయి’’ అని అన్నారాయన. ఇక ట్రంప్‌కు మరోసారి కృతజ్ఞతలు తెలియజేసిన జెలెన్స్కీ.. ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల ప్రణాళికలో ఇరువైపులా సంబంధించిన అంశాలను పొందుపరిచారని.. ఇందులో 90 శాతం ఆమోదయోగ్యంగానే ఉన్నాయన్నారు. అయితే అంతిమంగా.. శాశ్వత శాంతి సాధనలో భద్రతా హామీలే కీలకమైన మైలురాయిగా అభివర్ణించారు. మిగిలిన అంశాలపై యూరోపియన్ యూనియన్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతామని.. జనవరిలో వాషింగ్టన్లో మరిన్ని చర్చలు జరుగుతాయని.. త్వరలోనే ట్రంప్ పీస్ ప్లాన్‌కు తుది రూపం ఇవ్వనున్నట్లు జెలెన్స్కీ చెప్పారు. ట్రంప్ మాట్లాడుతూ.. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ యుద్ధానికి తాత్కాలికంగా ఆపేందుకు సుముఖంగా లేరు. అందుకే ఆయన కాల్పుల విరమణకు అంగీకరించలేదు. ఉక్రెయిన్‌లో పర్యటించాలని, అక్కడి పార్లమెంట్లో ప్రసంగించాలని తాను కోరుకుంటున్నప్పటికీ.. ముందుగా శాంతి ఒప్పందం ఓ కొలిక్కి రావాలని జెలెన్స్కీ ఆకాంక్షిస్తున్నారని, ఆ అభిప్రాయాన్ని తాను గౌరవిస్తాను అని అన్నారు.అసలు చిక్కల్లా అక్కడే.. డోన్బాస్ (Donbas) అనేది తూర్పు ఉక్రెయిన్‌లోని ఒక చారిత్రక.. ఆర్థిక ప్రాంతం. డొనెట్స్క్ (Donetsk), లుహాన్స్క్ (Luhansk) ప్రాంతాల కలయిక. అందుకే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కేంద్ర బిందువుగా మారింది. రష్యా అనుకూల వేర్పాటువాదులకు, ఉక్రెయిన్‌కు మధ్య ఈ ప్రాంతంపై పట్టు కోసం తీవ్ర పోరాటం జరుగుతోంది. వ్యూహాత్మకంగా భావిస్తుండడంతో.. రష్యా దీనిని తమ భూభాగంగా ప్రకటించుకుంటోంది. అందుకే శాంతి చర్చలలో కీలక అంశంగా మారింది. అయితే.. ఈ అంశంపైనా చర్చలు దాదాపు కొలిక్కి వచ్చినట్లేనని ట్రంప్ ఇప్పుడు చెబుతుండగా, డోన్బాస్‌పై ఉక్రెయిన్ వైఖరి స్పష్టంగా ఉందని.. అది రష్యా అభిప్రాయానికి భిన్నమని వ్యాఖ్యానించడం కొసమెరుపు. భేటీకి ముందు.. జెలెన్స్కీతో భేటీకి ముందు మీడియాతో ట్రంప్ మాట్లాడుతూ.. తుది గడువు ఏమీ లేదని, యుద్ధం ముగింపుపైనే దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. దౌత్య ప్రయత్నాలు తుది దశకు వచ్చినట్లు పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ ఫోన్లో మాట్లాడానని.. ఆయనతో ఫలితం సాధించే దిశగా చర్చలు జరిగినట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు.‘‘రష్యా, ఉక్రెయిన్ శాంతిని కోరుకుంటున్నాయి. నేను జెలెన్స్కీతో జరుపుతున్న సమావేశంపై పుతిన్ చిత్తశుద్ధితో ఉన్నారు. తుది గడువు ఏమీ లేదు.. యుద్ధం ముగింపుపైనే దృష్టి సారిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితులపై పుతిన్, జెలెన్స్కీ ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల చాలా మంది చనిపోయారు. ఇప్పటికే 8 యుద్ధాలు ఆపాను.. ఇదీ చాలా క్టిష్టమైనది. ఫ్లోరిడాలో సమావేశం కోసం జెలెన్స్కీ చాలా కృషి చేశారు. ఆయన, ఉక్రెయిన్ ప్రజలు చాలా ధైర్యవంతులు. రష్యా, ఉక్రెయిన్ పరిస్థితులపై చర్చలు కొనసాగిస్తుంటాం. చర్చలు చివరి దశలో ఉన్నాయి.. ఏం జరుగుతుందో చూద్దాం’’ అని ట్రంప్ అన్నారు.ట్రంప్‌తో జరిగే సమావేశంలో ఉక్రెయిన్‌కు కల్పించాల్సిన భద్రతా హామీల అంశాన్ని లేవనెత్తనున్నట్లు ఇది వరకే జెలెన్స్కీ వెల్లడించారు. ముఖ్యంగా 20సూత్రాల ప్రణాళికపై చర్చిస్తామని, ఇది దాదాపుగా(90 శాతం) సిద్ధమైందని తెలిపారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్, అమెరికా మాత్రమే కాకుండా యూరప్ దేశాలూ పాలుపంచుకోవాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. -
ఆదివారం ట్రంప్‌తో భేటీ: జెలెన్స్కీ
కీవ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆదివారం ఫ్లోరిడాలో సమావేశమయ్యే అవకాశముందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శుక్రవారం తెలిపారు. ‘మేం ఒక్క రోజు కూడా వృథాగా పోనివ్వడం లేదు. అధ్యక్షుడు ట్రంప్‌తో అతి త్వరలోనే ఉన్నత స్థాయి సమావేశం జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం. నూతన సంవత్సరం ప్రవేశించే లోగానే కీలక పరిణామాలు సంభవించొచ్చు’అని ఆయన మీడియాకు తెలిపారు. ట్రంప్ ప్రతిపాదిత 20–సూత్రాల ప్రణాళికలో 90 శాతం మేర ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. ఆదివారం జరిగే సమావేశం సందర్భంగా ఉక్రెయిన్‌కు అమెరికా ఇచ్చే భద్రతా హామీలపై చర్చించనున్నామన్నారు. జెలెన్స్కీ వ్యాఖ్యలతో చర్చలు పురోగతిలో ఉన్నట్లు భావించవచ్చని పరిశీలకులు అంటున్నారు. అమెరికా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుషె్నర్తో ఫలవంతమైన చర్చలు జరిగినట్లు జెలెన్స్కీ అంతకుముందు గురువారం ప్రకటించారు. పారిశ్రామికంగా కీలకమైన తూ ర్పు ప్రాంతం తమ బలగాలను ఉపసంహరించుకునేందుకు సిద్ధమని జెలెన్స్కీ తెలిపారు. అయితే, రష్యా కూడా ఆ ప్రాంతం నుంచి బలగాలను ఉపసంహరించుకుని, నిస్సైనిక ప్రాంతంగా ప్రకటించేందుకు సిద్ధం కావాలన్నారు. -
గాజా యుద్ధం మళ్లీ మొదటికి! ట్రంప్ ఏమన్నారంటే..
గాజా సంక్షోభం మళ్లీ మొదటికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాల్పుల విమరణ ఒప్పందం కుదిరినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన దాడుల్లో.. ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు, 97 మంది పాలస్తీనీయులు మరణించారు. శాంతి ఒప్పందం ఉల్లంఘనపై ఇరు దేశాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో.. తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఆదివారం రాత్రి మార్-ఎ-లాగో నుంచి వాషింగ్టన్కు తిరుగు ప్రయాణం అవుతుండగా.. ఓ రిపోర్టర్ గాజా తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రశ్నించారు. గాజా కాల్పుల విరమణ ఒప్పందం ఇంకా అమల్లో ఉందని భావిస్తున్నారా? అనే అడగ్గా.. ఆయన ‘అవును’ అనే సమాధానం ఇవ్వడం కొసమెరుపు. ‘‘గాజా శాంతి ఒప్పందానికి వచ్చిన ఢోకా ఏం లేదు. మేము హమాస్‌తో పరిస్థితి చాలా శాంతియుతంగా ఉండేలా చూసుకోవాలనుకుంటున్నాం. కానీ, మీకు తెలుసు కదా.. వాళ్లు కొంచెం అతి చేస్తున్నారు. కొన్ని చోట్ల కాల్పులకు దిగుతున్నారు. అయితే.. ఆ దాడులకు హమాస్ నాయకత్వానికి సంబంధం లేదేమో అనిపిస్తోంది. బహుశా రెబల్స్ ఈ తరహా ఘటనలకు పాల్పడుతున్నారేమో. అయినా సరే.. ఈ వ్యవహారాన్ని పరిష్కరిస్తాం. అందుకోసం కఠినంగా అయినా వ్యవహరిస్తాం’’ అని ట్రంప్ సున్నితంగా హెచ్చరికలు జారీ చేశారు.ఏం జరిగిందంటే.. దక్షిణ గాజాలోని రఫా (Rafah) వద్ద ఇజ్రాయెల్ రక్షణ బలగాలపై హమాస్ దాడి జరిపింది. ఈ దాడిలో ఇద్దరు సైనికులు చనిపోయారు. ప్రతిగా ఇజ్రాయెల్ బలగాలు జరిపిన వైమానిక దాడుల్లో 19 మంది పాలస్తీనీయులు మరణించారు.ఇజ్రాయెల్ యాక్షన్.. అక్టోబర్ 19వ తేదీన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(Israel Defense Forces) ఇంజనీరింగ్ వాహనంపై ఓ ఆంటీ-ట్యాంక్ మిస్సైల్ దూసుకొచ్చింది. ఈ దాడిలో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. ఈ ఘటనను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా పరిగణించారు. ఇది హమాస్ పనేనని, కాల్పుల విరమణ ఒప్పందానికి స్పష్టమైన ఉల్లంఘనగా పేర్కొంటూ.. గాజాకు మానవతా సాయం ఆపేశారు. అంతేకాదు.. ప్రతిదాడులతో ప్రతీకారం తీర్చుకోవాలని సైన్యాన్ని ఆదేశించారు.దీంతో.. గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ బలగాలు దాడులు జరిపాయి. ఈ తాజా దాడుల్లో 19 మంది పాలస్తీనయులు మరణించారు. హమాస్ ఏమందంటే.. ఇదిలా ఉంటే రఫా దాడికి హమాస్.. రక్షణాత్మక చర్యలుగా చెబుతోంది. ఇజ్రాయెల్ బలగాలే తమపై ముందుగా దాడులు చేశాయని, ప్రతిగానే తామూ దాడులు చేయాల్సి వచ్చిందని చెబుతోంది. దీంతో ఇరు దేశాలు శాంతి ఒప్పందానికి తూట్లు పొడిచినట్లైంది. ఈ పరస్పర ఆరోపణలు.. గాజాలో శాంతి స్థితిని మరింత సంక్లిష్టంగా మార్చేసే పరిస్థితి నెలకొంది. అయితే.. ఈ దాడులతో గాజా శాంతి ఒప్పందానికి వచ్చిన నష్టమేమీ లేదని ట్రంప్ అంటున్నారు. ఇదీ చదవండి: నువ్వేం రాజువి కాదయ్యా బాబూ! -
ట్రంప్ లూప్ ఆగట్లే.. నెక్స్ట్ ఆపేది ఆ యుద్ధమేనంట!
ప్రపంచ శాంతికాముకుడిగా తనను తాను అభివర్ణించుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump).. నోబెల్ శాంతి బహుమతిని మాత్రం దక్కించుకోలేకపోయారు. అయితే ఈ ఫలితం తనను కుంగదీయబోదని, శాంతిని నెలకొల్పాలన్న తన ప్రయత్నాలను ఏమాత్రం ఆపబోదని అంటున్నారాయన. తాజాగా ఆయన మరో యుద్ధంపై కన్నేశారు. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగం, ఈజిప్ట్‌లో జరగబోయే గాజా శాంతి సదస్సు నేపథ్యంతో పర్యటన బయల్దేరిన టైంలో ఆయన మీడియాతో కాసేపు ముచ్చటించారు. ఆ సమయంలో.. , యుద్ధాలను ఆపడంలో తాను నేర్పరినని, తన పాలనలో ఎన్నో ప్రపంచ సంక్షోభాలు పరిష్కారం అయ్యాయని వ్యాఖ్యానించారాయన. అలాగే.. ప్రస్తుతం తన దృష్టి పాక్-అఫ్గన్ ఘర్షణలపై(Pak Afghan Clashes) ఉందని అన్నారు.ఇది నేను ఆపిన 8వ యుద్ధం(గాజా సంక్షోభాన్ని ఉద్దేశించి..). అఫ్గనిస్తాన్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతోందని విన్నాను. తిరిగి వచ్చాక దాని సంగతి చూస్తా. ఎందుకంటే.. యుద్ధాలను ఆపడంలో నేను నేర్పరిని కదా అని వ్యాఖ్యానించారు. అయితే తన శాంతి ప్రయత్నాలు అవార్డులను తేలేకపోయినా(నోబెల్‌ను ఉద్దేశించి..) ప్రాణాలను నిలబెడుతోందని, అది తనకెంతో గౌరవాన్ని అందిస్తోందని వ్యాఖ్యానించారాయన.ఇదిలా ఉంటే.. పశ్చిమాసియా పర్యటనకు బయల్దేరే ముందు కూడా ట్రంప్ మళ్లీ అదే పాట పాడారు(Trump On India Pak Tensions). భారత్-పాక్ మధ్య యుద్ధం టారిఫ్‌ల బెదిరింపులతోనే ఆగిందని పునరుద్ఘాటించారు. ‘‘భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల గురించి ఓసారి ఆలోచించండి. కొన్ని యుద్ధాలు మూడు, నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. లక్షల మంది మరణించారు. నేను వాటిని ఒక్క రోజులోనే ముగించాను. అది గొప్ప విషయం’’ అని అన్నారు. అణ్వాయుధాలు ఉన్న రెండు దేశాలు యుద్ధానికి దిగాయి. దౌత్యంతో ప్రయత్నిద్దామనుకుంటే మాట వింటారా?. అందుకే సుంకాలు విధిస్తా అని బెదిరించా. 24 గంటలు గడవకముందే దెబ్బకు దిగొచ్చారు. లేకుంటే యుద్ధం ఆగి ఉండేదా? అని మే నెలలో జరిగిన భారత్-పాక్ ఉద్రిక్తతలపై ట్రంప్ వ్యాఖ్యానించారు. అఫ్కోర్స్.. ఈ కాల్పుల విమరణలో మూడో దేశం, వ్యక్తి.. ప్రేమయం లేదని, పాక్ కోరితేనే కాల్పుల విరమణకు అంగీకరించామని భారత్ చెబుతూ వస్తోంది. ఇక ఇదిలా ఉంటే.. పాక్-అఫ్గన్ సరిహద్దుల మధ్య గత రాత్రి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భీకర దాడులతో 58 మంది పాక్ సైనికులను మట్టుబెట్టినట్లు అఫ్గన్ అధికారులు ప్రకటించారు. అయితే చనిపోయింది 23 మందేనని పాక్ సైన్యం అంటోంది. ఇదీ చదవండి: తాలిబన్ల దెబ్బ.. పాక్‌కు భారీ నష్టం -
నో అంటే నరకమే!
గాజా స్ట్రిప్: గాజాలో శాంతి సాధన కోసం తాను ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక పట్ల హమాస్ మిలిటెంట్లు ఇంకా స్పందించకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6 గంటల్లోగా ఒప్పుకోవాలని అల్టిమేటం విధించారు. లేకపోతే నరకం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూపిస్తామని హమాస్‌ను హెచ్చరించారు. ఈ మేరకు ట్రంప్ శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం మొదలై ఈ నెల 7వ తేదీకి రెండేళ్లు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని వెంటనే ముగించాలని ట్రంప్ పట్టుదలతో ఉన్నారు. ఇటీవలే 20 శాతం శాంతి ప్రణాళికను తెరపైకి తెచ్చారు. ట్రంప్ ప్లాన్‌ను ఇజ్రాయెల్ అంగీకరించింది. ప్రపంచ దేశాలు సైతం స్వాగతించాయి. హమాస్ మాత్రం ఇంకా స్పందించలేదు. ట్రంప్ ప్రణాళిక తమకు ఆమోదయోగ్యం కాదని, ఇందులో కొన్ని అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని పరోక్షంగా పేర్కొంది. అభ్యంతకర అంశాలపై చర్చించాల్సి ఉందని మధ్య వర్తులుగా వ్యవహరిస్తున్న ఈజిప్టు, ఖతార్ కూడా చెబుతున్నాయి. మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పుతాం గడువులోగా హమాస్ తమతో ఒప్పందానికి రావాల్సిందేనని ట్రంప్ స్పష్టంచేశారు. ఇదే ఆఖరి అవకాశంగా భావించాలన్నారు. ఒప్పందానికి రాకపోతే ఇప్పటిదాకా ఎవరూ చూడని నరకాన్ని హమాస్‌కు చూపిస్తామని ఉద్ఘాటించారు. మిలిటెంట్లపై పూర్తిస్థాయి సైనిక చర్య ప్రారంభమవుతుందన్నారు. ఒక మార్గంలో కాకపోతే.. మరో మార్గంలోనైనా మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పుతామని ట్రంప్ పేర్కొన్నారు. హమాస్‌ను పూర్తిగా అంతం చేస్తామన్న సంకేతాలిచ్చారు. -
ట్రంప్-నెతన్యాహు గాజా గేమ్.. ఇదే లాస్ట్ ఛాన్స్!
గాజా సంక్షోభానికి తెర దించే క్రమంలో.. శాంతి ప్రణాళిక(Gaza Peace Plan) ఓ కొలిక్కి వచ్చింది. అమెరికా ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ఎట్టకేలకు అంగీకారం తెలిపింది. వైట్‌హౌజ్ వేదికగా.. ఇజ్రాయెల్ అద్యక్షుడు బెంజిమన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంయుక్తంగా ఈ ప్రకటన చేశారు. అయితే ఈ ప్రతిపాదనకు హమాస్ గ్రూప్ అంగీకరిస్తుందో లేదో అనే అనుమానాన్ని ఇద్దరూ వ్యక్తం చేయడం గమనార్హం. అమెరికా ప్రతిపాదించిన ఈ 20 సూత్రాల శాంతి ఫార్ములాను హమాస్ గనుక ఒప్పుకుంటే.. 72 గంటల్లో వాళ్ల చేతుల్లో ఉన్న బందీలందరినీ విడుదల చేయాల్సి ఉంటుంది. యుద్ధ విరమణ తక్షణమే అమల్లోకి వచ్చింది. హింసను వదిలిన హమాస్ సభ్యులకు క్షమాభిక్ష దక్కడంతో పాటు భద్రత నడుమ ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కల్పిస్తారు. హమాస్ ఆయుధాలు వదిలి పాలన నుంచి తప్పుకుంటుంది కాబట్టి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటునకు గాజాలో Board of Peace ఏర్పాటు చేస్తారు. గాజా పునర్నిర్మాణం కోసం అంతర్జాతీయ సహాయానికి గేట్లు తెరుస్తారు. ఇలా మిగిలిన అంశాలు ఉన్నాయి. అయితే.. ఒకవైపు శాంతి అంటూనే మరోవైపు హమాస్(Hamas)కు మరోసారి ఈ ఇద్దరు నేతలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తాము ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని హమాస్ అంగీకరించాల్సిందేనన్న ధోరణితో ట్రంప్, నెతన్యాహులు మాట్లాడారు. ‘‘హమాస్ గనుక ఈ డీల్‌కు ఒప్పుకోకపోతే.. వారిని తుదముట్టించేందుకు ఇజ్రాయెల్‌కు నా పూర్తి మద్దతు ఉంటుంది. ఇది నా తుది హెచ్చరిక.. మరొకటి ఉండదు’’ అని ట్రంప్ ప్రకటించారు. మరోవైపు.. ఈ ఒప్పందం అమలు సులభ మార్గంలో అయినా.. కఠిన మార్గంలో అయినా అమలు అయ్యి తీరుతుంది అంటూ హమాస్‌కు ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ట్రంప్-నెతన్యాహు(Trump-Netanyahu) ప్రకటించిన శాంతి ఒప్పందానికి సౌదీ అరేబియా, ఈజిప్ట్ సహా 8 ముస్లిం దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. యూరప్ దేశాధినేతలు మాక్రాన్, స్టార్మర్ ఈ ప్రణాళికకు మద్దతు ప్రకటించారు. హమాస్ ఇంతదాకా అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ.. పక్షపాతంగా ఉందనే ‘గాజాలో యుద్ధాన్ని ముగించడమే కాదు. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరగాలని కోరుకుంటున్నా. శాంతి కోసం మీ ప్రణాళికకు మద్దతు తెలుపుతున్నా. అయితే హమాస్ నుంచి మళ్లీ ఇజ్రాయెల్‌కు ముప్పు ఉండకూడదు. ఒప్పందంలో తొలి ఘట్టంగా.. గాజా నుంచి బలగాల దశలవారీ ఉపసంహరణ ఉంటుంది. వెంటనే 72 గంటల్లో బందీలను విడుదల చేయాలి. ఆ తరువాత అంతర్జాతీయ పాలకవర్గం ఏర్పాటు కావాలి. హమాస్ ఆయుధాలను వదిలేయాలి. గాజాను నిరాయుధీకరణ చేయాలి. అంతర్జాతీయ పాలకవర్గం విజయవంతమైతే యుద్ధాన్ని శాశ్వతంగా ముగిస్తాం. హమాస్ నిరాయుధీకరణకు అనుగుణంగా ఇజ్రాయెల్ గాజా నుంచి వైదొలగుతుంది. కానీ భవిష్యత్తు భద్రత దృష్ట్యా చుట్టుపక్కల మోహరించి ఉంటాం’ అని నెతన్యాహు వివరించారు. గాజా శాంతి ప్రణాళిక.. ముఖ్యాంశాలుగాజా నగరాన్ని ఉగ్రవాదం లేని ప్రాంతంగా మార్చడం.హమాస్‌కు పాలనా హక్కు లేకుండా, తాత్కాలిక పాలనను ఏర్పాటు చేయడం.ఇజ్రాయెల్ బంధీలను 72 గంటల్లో విడుదల చేయడం.ఇజ్రాయెల్ 250 జీవిత ఖైదీలు, మరియు 1,700 గాజా ఖైదీలను విడుదల చేయడం.ప్రతి ఇజ్రాయెల్ బంధీ మృతదేహానికి, 15 మంది గాజా మృతదేహాలను తిరిగి ఇవ్వడం.హమాస్ సభ్యులు ఆయుధాలు వదిలి శాంతిగా జీవించాలనుకుంటే, వారికి క్షమాభిక్ష ఇవ్వడం.హమాస్ సభ్యులు గాజా విడిచి వెళ్లాలనుకుంటే, భద్రతతో కూడిన మార్గం కల్పించడం.యుద్ధం ఆగిన వెంటనే, పూర్తి మానవతా సహాయం ప్రారంభించడం.జల, విద్యుత్, ఆసుపత్రులు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం.రఫా సరిహద్దు రెండు దిశలలో తెరవడం.బోర్డ్ ఆఫ్ పీస్ (Board of Peace) అనే అంతర్జాతీయ సంస్థ ద్వారా గాజా పాలన.ట్రంప్ అధ్యక్షతన, ఈ బోర్డు పునర్నిర్మాణం, నిధుల పంపిణీ నిర్వహిస్తుంది.బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సహా పలువురు అంతర్జాతీయ నాయకులకు ఈ బోర్డులో భాగం.పాలనా కమిటీ apolitical, technocratic Palestinians తో ఏర్పాటవుతుంది.పాలస్తీనా అథారిటీ పునరుద్ధరణ తర్వాతే గాజా పాలన చేపట్టాలి.ఇజ్రాయెల్ పూర్తిగా ఉపసంహరించడానికి, దశలవారీగా ప్రణాళిక.అంతర్జాతీయ మానిటర్లు ద్వారా గాజా లోని ఆయుధాల నిర్మూలన.ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక ద్వారా “New Gaza” నిర్మాణం.ప్రత్యేక ఆర్థిక మండలం (Special Economic Zone) ఏర్పాటు.గాజా ప్రజలు అక్కడే ఉండేందుకు ప్రోత్సాహం, బలవంతంగా తరలింపు ఉండదు. -
ఉక్రెయిన్‌పై ఏం చేద్దాం?
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు కట్టుబడి ఉన్నట్టు భారత్, ఫ్రాన్స్ పునరుద్ఘాటించాయి. ప్రధాని నరేంద్ర మోదీతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ శనివారం ఫోన్లో సంభాషించారు. యుద్ధానికి తెర దించే మార్గాలపై ఇరు నేతలు లోతుగా చర్చలు జరిపారు. అనంతరం ఇరు దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. మాక్రాన్‌తో చర్చలు ఫలప్రదంగా సాగినట్టు మోదీ తెలిపారు. పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారం తదితరాలను సమీక్షించినట్టు వివరించారు. ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం కనిపెట్టాలన్న వైఖరికే భారత్ తొలినుంచీ గట్టి మద్దతుదారుగా ఉందని పునరుద్ఘాటించారు. ప్రపంచ శాంతి, సుస్థిరతలను పెంపొందించడంలో ఇరు దేశాలు ఇకపై కూడా కీలకపాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు. వచ్చే ఫిబ్రవరిలో భారత్‌లో జరిగే ఐఏ శిఖరాగ్రంలో పాల్గొనేందుకు అంగీకరించినందుకు మాక్రాన్‌కు మోదీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో తన ఇటీవలి చర్చలు ఫలప్రదంగా సాగాయని మాక్రాన్ పేర్కొన్నారు. -
ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలపై ఆసక్తి పోయిందా?
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందంపై అమెరికా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌లో యుద్ధం ఆపడం సాధ్యం కాకపోతే తమ ప్రయత్నాలు విరమించుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో(Marco Rubio) కీలక వ్యాఖ్యలు చేశారు.ఉక్రెయిన్ (Ukraine) యుద్ధం ముగించడం సాధ్యంకాని పక్షంలో.. చర్చల ప్రయత్నాలు ఆపేసి అమెరికా తన దారి తాను చూసుకుంటుందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో తేల్చి చెప్పారు. ఈ యుద్ధాన్ని మేం ప్రారంభించలేదు. ఇన్నాళ్లూ కేవలం ఉక్రెయిన్‌కు సాయం చేస్తున్నాం. ఇది మా యుద్ధం కాదు కాబట్టి ముగించాలనుకుంటున్నాం అని మార్కో రూబియో అన్నారు.ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ యుద్ధాన్ని ఓ ముగింపునకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగని నెలలు, సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉండబోరు. ఆయనకు ప్రపంచంలో ఇతర ప్రాధాన్యాలు కూడా ఉన్నాయి. చర్చల్లో గనుక పురోగతి కనిపించకపోతే ఆయన దీనిని వదిలేస్తానన్నారు అని రుబియో వెల్లడించారు.తాజాగా ఐరోపా నేతలతో భేటీ సందర్భంగా ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతి తొందరలోనే ఇది సాకారం కావచ్చని పేర్కొన్నారు. అమెరికా ఓ శాంతిఒప్పందం ముసాయిదా తయారుచేసి ఐరోపా నేతలకు వెల్లడించింది. వారినుంచి సానుకూల స్పందనలు వచ్చినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇక దీనినే మార్కో రూబియో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌కు వెల్లడించారు. -
నెతన్యాహుపై హమాస్ సంచలన ఆరోపణలు
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం ఇజ్రాయెల్ ఆర్మీ చేసిన వైమానిక దాడుల్లో 29 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు.. గాజాలో ఉద్రిక్తతలు తగ్గించటంతో పాటు, కాల్పుల విరమణ ఒప్పందం ప్రయత్నాల కోసం అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకన్ ఇజ్రాయెల్‌కు వెళ్లారు.ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం.. అమెరికా, ఈజిప్ట్, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో దోహాలో రెండు రోజుల చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ చర్చల్లో ఇజ్రాయెల్ అధికారులు కాల్పుల విరమణపై కొంత సానుకూలంగా వ్యవహరించినట్లు తెలిపారు. మరోవైపు.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కొత్త షరతులు విధించారని గాజా నుంచి పూర్తిగా బలగాల ఉపసంహరణను తిరస్కరించారని హమాస్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘మధ్యవర్తుల ప్రయత్నాలను, ఒప్పందాన్ని అడ్డుకోవాలని ప్రధాని నెతన్యాహు చూస్తున్నారు. గాజాలో బంధీల జీవితాలకు పూర్తి బాధ్యత ఆయనదే’ అని హమాస్ ఆరోపించింది.ఇక.. ఇప్పటివరకు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 40 వేల మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. 2.3 మిలియన్ ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. భీకరమైన ఇజ్రాయెల్ దాడులతో గాజాలో ఆహార ఇబ్బందులు, పోలీయో వంటి వ్యాధలు ప్రబలుతున్నాయని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. -
వేర్పాటువాదులతో శాంతి ఒప్పందం
న్యూఢిల్లీ: అస్సాంలోని కార్బీ అంగ్లాంగ్ ప్రాంతంలో హింసకు చరమగీతం పాడి, శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా అదే రాష్ట్రానికి చెందిన ఐదు వేర్పాటువాద సంస్థలతో కేంద్ర ప్రభుత్వం శాంతి ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ ఒప్పందంపై కేంద్రం, అస్సాం ప్రభుత్వం సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. తాజా ఒప్పందంతో కార్బీ అంగ్లాంగ్లో ఇక శాశ్వతంగా శాంతి నెలకొంటుందని, అభివృద్ధి పరుగులు పెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతి ఒప్పందంపై కార్బీ లోంగ్రీ నార్త్ చచార్ హిల్స్ లిబరేషన్ ఫ్రంట్, పీపుల్స్ డెమొక్రటిక్ కౌన్సిల్ ఆఫ్ కార్బీ లోంగ్రీ, యునైటెడ్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, కార్బీ పీపుల్స్ లిబరేషన్ టైగర్స్ తదితర వేర్పాటువాద సంస్థలు సంతకాలు చేశాయి. ఆయా సంస్థలకు చెందిన 1,000 మంది వేర్పాటువాదుల తమ ఆయుధాలతో సహా ఇప్పటికే లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. హింసకు తావులేని సౌభాగ్యవంతమైన ఈశాన్య భారతాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షిస్తున్నారని, ఆ దిశగా కార్బీ అంగ్లాంగ్Š అగ్రీమెంట్ ఒక కీలకమైన ముందడుగు అని అమిత్ షా వివరించారు. -
ఈ శాంతి ఒప్పందం ఓ ఆశాకిరణం
ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ఆగస్టు 13న కుదిరిన శాంతి ఒప్పందం మూడు కారణాల వల్ల అత్యంత ప్రాధాన్యత సంతరిం చుకుంది. 1. యూదు ఇజ్రాయెల్, అరబ్ ముస్లింల మధ్య ఉన్న తీవ్రమైన వైషమ్యాలకు ముగింపు పలుకుతూ ఇజ్రాయెల్, అరబ్ లీగ్ మధ్య దౌత్య సంబంధాలు నెలకొనడానికి ఇది ఒక దారి చూపగలదు. 2, ఈ శాంతి ఒప్పందం ముస్లిం ప్రపంచాన్ని విభజిస్తుంది. 3, పాలస్తీనియన్ల స్థానభ్రంశం, దాని కొనసాగింపుగా జరిగే ప్రమాదం ఉన్న రక్తపాతాన్ని నివారించగలుగుతుంది. ఈ ఒప్పందం ప్రకారం పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణకు కేంద్రబిందువైన వెస్ట్ బ్యాంకులోని చాలా భాగాలను తనలో కలుపుకునే ప్రయత్నాలను ఇజ్రాయెల్ ఆపేస్తుంది. అలాగే ఇజ్రాయెల్, యూఏఈ వాణిజ్యం, శాస్త్ర సాంకేతిక వైద్య పరిశోధనా రంగాల్లో సహకరించుకుంటాయి. జోర్డాన్, ఈజిప్టు తర్వాత ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు నెలకొల్పుకున్న మూడో అరబ్ దేశం యూఏఈ. పాలస్తీనాగా పిలుస్తున్న ప్రాంతం మధ్యధరా సముద్రం, జోర్డాన్ నది మధ్య నెలకొని 1922 వరకు అట్టోమాన్ సామ్రాజ్య పరిధిలో ఉండింది. అయితే మొదటి ప్రపంచ యుద్ధ అనంతర కాలంలో నానాజాతి సమితి ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం దాని కార్యనిర్వహణ బ్రిటన్ పరమైంది. పాలస్తీనాలోని ప్రాంతాలు ధార్మికంగా యూదులకు, క్రైస్తవులకు, అరబ్బులకు కూడా ప్రాధాన్యత కలిగినవి. రెండో ప్రపంచ యుద్ధ అనంతరం నాజీ జర్మనీలో హోలోకాస్ట్ అనుభవించిన యూదులకు భూమిని కేటాయిస్తూ ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దాని ప్రకారం పాలస్తీనా రెండుగా విభజించబడింది. ఈ విభజనకు ఇజ్రాయెల్ ఆమోదించినా, సమీప దేశాలు తిరస్కరిం చాయి. అనంతర రాజకీయ పరిణామాలు 1948లో ఘోర యుద్ధానికి దారితీశాయి. ఇజ్రాయెల్ ఒకవైపు; ఐదు అరబ్ దేశాలు జోర్డాన్, ఇరాక్, సిరియా, ఈజిప్ట్, లెబనాన్ మరోవైపు నిలిచి పోరాడాయి. ఇజ్రాయెల్, అరబ్ ప్రపంచం మధ్య దశాబ్దాల ఘర్షణకు తెరలేచింది. 1949లో యుద్ధాన్ని నిలుపుచేస్తూ కుదిరిన ఒప్పందాలు ఆయా ప్రాంతాల మీద ఆధిపత్యాన్ని ఏర్పరచాయి. తనకు కేటాయించిన భూభాగంతో పాటు పాలస్తీనాకు కేటాయించిన భాగానికి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల మీద కూడా ఇజ్రాయెల్ తన సార్వభౌమత్వాన్ని ప్రకటించుకుంది. వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేం జోర్డాన్ నియంత్రణలోకి వస్తే, గాజా స్ట్రిప్ ఈజిప్ట్ నియంత్రణలోకి వచ్చింది. 1967 నాటి ఆరు రోజుల యుద్ధంలో గాజా స్ట్రిప్, సినాయ్ ద్వీపకల్పంను ఈజిప్ట్ నుంచి; వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేంను జోర్డాన్ నుంచి; గోలన్ హైట్స్‌ను సిరియా నుంచి ఇజ్రాయెల్ వశం చేసుకుంది. 1948లో తన స్వాతంత్య్రం ఇజ్రాయెల్ ప్రకటించుకున్న నాటి నుంచి హింసాత్మక ఘర్షణల కారణంగా లక్షలాది మంది పాలస్తీనియన్లు తమ ప్రాంతాల నుంచి తరలిపోవాల్సి వచ్చింది. యూదులు పవిత్రంగా తలచే ఎన్నో స్థలాలకు వెస్ట్ బ్యాంక్ కేంద్రం. అక్కడ ఐదు లక్షల మంది యూదులు స్థిరపడ్డారు. ఇందులో అత్యధికులు ఇజ్రాయెల్ సరిహద్దులో నివసిస్తున్నారు. వీటినే ఇజ్రాయెల్ కలుపుకోవాలని అనుకుంది. వెస్ట్ బ్యాంకు 30 లక్షల మంది పాలస్తీనియన్లకు నివాస స్థలం కూడా. నిజానికి దీనిమీద తన ఆధిపత్యాన్ని పూర్తిగా ఇజ్రాయెల్ నిలుపుకున్నప్పటికీ దాన్ని తన ప్రాంతంగా ప్రకటించుకోలేదు. అలా చేస్తే లక్షలాది పాలస్తీనియన్లు స్థానభ్రం శానికి గురికావాల్సి రావడమేగాక, ఐసిస్, ఇస్లామిక్ తీవ్రవాదం కారణంగా తీవ్ర రాజకీయ ఆర్థికపరమైన ఆంక్షలు ఎదుర్కొంటున్న సరిహద్దు దేశాలు మహా విపత్తు బారిన పడతాయి. శాంతి ఒప్పందం ఈ ప్రమాదాన్ని తప్పించింది. అయితే ఈ ఒప్పందం మధ్యప్రాచ్యంలో కొత్త పరిణామాలకు దారితీయగలదు. ముస్లిం ప్రపంచం స్పష్టంగా చీలి పోతుంది. షియాల ప్రాబల్యం ఉన్న ఇరాన్, సున్నీల ప్రాబల్యం గల సౌదీ అరేబియా సారథ్యంలోని అరబ్ దేశాలు ఇప్పటికే సిరియా, యెమెన్, ఇరాక్, లెబనాన్‌లో తీవ్రమైన ముఖాముఖి పోరులో ఉన్నాయి. యెమెన్‌లో హైతీ, లెబనాన్‌లో హెజ్బుల్లా, గాజాలో హమాస్ లాంటి తిరుగుబాటుదారులు, ఇతర పాలస్తీనా గ్రూపులు అయిన ఇస్లామిక్ జిహాద్ లాంటి వాటికి ఇరాన్ సహకరిస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. అందుకే ఇరాన్ మీద విధిం చిన ఆయుధాల కొనుగోలుకు సంబంధించిన నిషేధ పొడిగింపునకు మద్దతునిస్తూ, బెహ్రాయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ సభ్యులుగా గల గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఆగస్టు 10న సంయుక్త వినతిపత్రాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సమర్పించింది. కాబట్టి ఈ శాంతి ఒప్పందానికి ఇరాన్ తీవ్రంగా స్పందించడంతో పాటు, ఆయా తిరుగుబాటుదారు వర్గాలకు మరింత మద్దతు ఇచ్చే వీలుంది. దీనివల్ల సున్నీ ముస్లిం దేశాలు ఏకతాటిపైకి రావడం, ఫలితంగా తీవ్రమైన ఆయుధ పోటీ నెలకొనడం జరగవచ్చు. అమెరికా, ఇరాన్ ఘర్షణల్లో మధ్యప్రాచ్య దేశాలు అమెరికా వైపు నిలబడి ఇరాన్‌ను ఒంట రిని చేస్తాయి. అట్లా అమెరికా, ఇజ్రాయెల్, అరబ్ దేశాల కొత్త ఐక్యత సాధ్యం అయ్యే వీలుంది. సహజంగానే దీనివల్ల అమెరికా, దాని మిత్ర దేశాలు భాగస్వాములు కాని దేశాల వైపు ఇరాన్ స్నేహహస్తాన్ని సాచే వీలుంది. అలా మధ్య ప్రాచ్యంలోకి చైనా ప్రవేశించడానికి వీలు ఏర్పడుతుంది. ఇప్పటికే చైనా, పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ వలన అరేబియా సముద్రంలో చైనాకు ప్రవేశం దొరికింది. ఇది మరింతగా విస్తృతమై భిన్న ధ్రువ ప్రపంచంలో సరికొత్త కూటమికి దారితీస్తుంది. ఈ ఘర్షణలో భాగస్వాములైన ఇజ్రాయెల్, పాలస్తీ నాతో సహా, అన్ని అరబ్ దేశాలతోనూ భారత్ విజయవంతంగా స్నేహ సంబంధాలను కొనసాగించగలిగింది. అయితే మౌలిక సదుపాయాల కల్పనలో ఇరాన్, చైనా భాగస్వామ్యం ఇండియాలో కొంత ఆందోళనకు కారణమైంది. చైనా సహకారం ఉన్న పాకిస్తాన్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్‌ను విచ్ఛిన్నం చేయడానికి చేసిన ప్రయత్నం ఇప్పటికే అరబ్ ప్రపంచంలో అనుమానాలు రేకెత్తించింది. అందుకే కశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా సౌదీ అరేబియా గట్టి వైఖరి తీసుకుంది. పాలస్తీనా, ఇజ్రాయెల్ రెండు దేశాల విధానానికి కట్టుబడి ఈ శాంతి ఒప్పందాన్ని భారత్ స్వాగతించింది. అయితే రానున్న రోజుల్లో మారిపోయే రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా పాలస్తీనా, ఇజ్రాయెల్, ఇరాన్ విషయంలో చూపాల్సిన సంయమనం పరంగా భారత విదేశాంగ విధానానికి కొత్త సవాళ్లు ఎదురవుతాయి. వ్యాసకర్త:డా. గద్దె ఓం ప్రకాష్ , అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ సిక్కిం, గ్యాంగ్‌టక్ ‘ మొబైల్: 94749 79304 -
ఇజ్రాయెల్, యూఏఈ శాంతి ఒప్పందం
వాషింగ్టన్: నిత్యం రావణకాష్టంలా రగిలి పోయే మధ్యప్రాచ్యంలో దౌత్యపరంగా భారీ ముందడుగు పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం ఫలించి గురువారం ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లు శాంతి స్థాపన దిశగా అడుగులు వేశాయి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల పటిష్టతకు చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్‌కు స్నేహహస్తం చాచిన మొట్టమొదటి గల్ఫ్ దేశంగా, అరబ్ ప్రపంచంలో మూడో దేశంగా యూఏఈ నిలిచింది. పాలస్తీనా ఆక్రమణపై ఇరు దేశాల మధ్య పాతికేళ్లుగా కొనసాగుతున్న వైరానికి ట్రంప్ చొరవతో తెరపడింది. ‘‘మాకు అత్యంత మిత్రదేశాలైన ఇజ్రాయెల్, యూఏఈల మధ్య చారిత్రక శాంతి ఒప్పందం కుదిరింది’’అంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిన వెంటనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ చారిత్రక దినం అంటూ ట్వీట్ చేశారు. అరబ్ ప్రపంచంతో కొత్త శకం ఏర్పాటవుతోందని పేర్కొన్నారు. పాలస్తీనా భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించకూడదన్న షరతు మీదే ఒప్పందం కుదుర్చుకున్నామని యూఏఈ యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ ట్వీట్ చేశారు. -
తాలిబన్ అగ్రనేతకు ట్రంప్ ఫోన్
వాషింగ్టన్: తాలిబన్ల అగ్రనేత, తాలిబన్ సహవ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. అఫ్గాన్‌లో శాంతి నెలకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అరగంట పాటు సంభాషణ నడిచిందని తాలిబన్ తెలిపింది. అమెరికా, తాలిబన్ల మధ్య ఒప్పందం కుదిరేందుకు అఫ్గానిస్తాన్‌లో హింసాత్మక ఘటనలు తగ్గడమే కారణమని, ఇదే పరిస్థితి కొనసాగాలని ట్రంప్ స్పష్టం చేసినట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. శాంతికి కట్టుబడి ఉంటే అఫ్గాన్‌కు సాయం అందించడంలో అమెరికా ముందుంటుందని ట్రంప్ చెప్పారు. ‘తాలిబన్ అగ్రనేతతో ఈ రోజు మాట్లాడాను. హింసకు తావులేదన్న అంశాన్ని ఇరువురూ అంగీకరించాం. ఏమవుతుందో చూద్దాం’ ట్రంప్ వ్యాఖ్యానించారు. ముల్లాతో తనకు మంచి సంబంధాలే ఉన్నాయన్నారు. చర్చలపై నీలినీడలు: అఫ్గానిస్తాన్ బలగాలను రక్షించే ఉద్దేశంతో అమెరికా బుధవారం తాలిబన్‌పై వైమానిక దాడులకు దిగడంతో మార్చి 10వ తేదీన ఓస్లోలో ప్రభుత్వానికి, ఇతరులకు మధ్య చర్చలు జరిగే అంశం డోలాయమానంలో పడింది. బరాదర్‌తో ట్రంప్ ఫోన్లో మాట్లాడిన కొన్ని గంటల్లోనే హెల్మాండ్‌లో వైమానిక దాడులు జరగడం గమనార్హం. అమెరికా, తాలిబన్ల మధ్య గత శనివారం శాంతి ఒప్పందం కుదరగా, రానున్న 14 నెలల కాలంలో అమెరికా తన బలగాలను ఉపసంహరించుకుంటున్న విషయం తెలిసిందే. హెల్మాండ్‌లో మంగళవారం తాలిబన్లు 43 సార్లు దాడులకు ప్రయత్నించారని, వాటిని తిప్పికొట్టేందుకే తాము వైమానిక దాడులకు దిగామని అఫ్గానిస్తాన్‌లో అమెరికా బలగాల అధికార ప్రతినిధి సన్నీ లెగ్గెట్ తెలిపారు. తాలిబన్లు ఇలాంటి దాడులను కట్టిపెట్టి శాంతి ఒప్పందానికి కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. బుధవారం తాలిబన్ జరిపిన దాడుల్లో సుమారు 20 మంది అఫ్గాన్ సైనికులు మరణించారని మిలటరీ వర్గాలు తెలిపాయి. -
తాలిబన్లను విడుదల చేయం
కాబుల్: అమెరికా–తాలిబన్ల శాంతి ఒప్పందం అమలుకు ఆదిలోనే ఆటంకాలు ఎదురయ్యాయి. జైళ్లలో ఉన్న తాలిబన్లను తక్షణమే విడుదల చేయడం కుదిరే పని కాదని అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తేల్చి చెప్పారు. మార్చి 10 నుంచి నార్వే రాజధాని ఓస్లోలో అఫ్గాన్ ప్రభుత్వం, ఇతర రాజకీయ పార్టీలు, వివిధ వర్గాలతో అధికార పంపిణీపై సంప్రదింపులున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు తాలిబన్లను విడుదల చేయలేమని ఘనీ స్పష్టం చేశారు. రెండు దశాబ్దాల యుద్ధానికి స్వస్తి పలుకుతూ శాంతి ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా తన సైనిక బలగాలను వచ్చే 14 నెలల్లో ఉపసంహరిస్తామని ప్రకటించింది. అయితే ఈలోగా తాలిబన్లు ఎలాంటి దాడులకు పాల్పడకూడదని షరతు విధించింది. అలాంటప్పుడు అఫ్గాన్ అధికార యంత్రాంగంతో చర్చలు జరగకుండా తాము తాలిబన్లను జైళ్ల నుంచి ఎందుకు విడుదల చేయాలని అధ్యక్షుడు ఘనీ ప్రశ్నించారు. జైళ్ల నుంచి ఖైదీలను విడుదల చేసే నిర్ణయం పూర్తిగా తమ ప్రభుత్వం ఇష్టమేనని, తదుపరి చర్చలు మొదలవకుండా ఖైదీలను విడుదల చేసే ఉద్దేశం లేదని చెప్పారు. మరోవైపు అమెరికా శాంతి దూత జల్మే ఖలీల్‌జద్ తాలిబన్లను జైళ్ల నుంచి విడుదల చేస్తేనే వారిలో విశ్వాసం వస్తుందని అంటున్నారు. ఓస్లోలో చర్చలకు ముందే అఫ్గాన్ ప్రభుత్వం 5 వేల మంది తాలిబన్ ఖైదీలను విడుదల చేస్తుందని ఈ ఒప్పందం సందర్భంగా అమెరికా హామీ ఇచ్చింది. ఇప్పుడు అధ్యక్షుడు ఎదురు తిరగడంతో ఈ ఒప్పందం అమలుపై సందేహాలు నెలకొన్నాయి. అఫ్గాన్ మహిళల్లో భయం భయం అమెరికా–తాలిబన్ల ఒప్పందం అఫ్గాన్ మహిళల్లో భయాన్ని నింపుతోంది. తాలిబన్లు అధికారంలోకి వస్తే ఎలాంటి సమస్యలు తెస్తారోనని ఆందోళన చెందుతున్నారు. 2001 తర్వాత అమెరికా అఫ్గాన్‌ని ఆక్రమించడానికి ముందు తాలిబన్లు అయిదేళ్ల పాటు చేసిన అరాచకాలు అక్కడ మహిళల్ని వెంటాడుతూనే ఉన్నాయి. అఫ్గాన్‌లో శాంతి నెలకొనాలంటే తమ జీవితాల్ని పణంగా పెట్టాలేమోనన్న అనుమానం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. -
ఆఫ్రికాలో శాంతి నెలకొనాలి
వాటికన్ సిటీ: అంతర్యుద్ధంతో సతమతమైపోతున్న ఆఫ్రికా దేశాల్లో శాంతి స్థాపన జరగాలని పోప్ ఫ్రాన్సిస్ ఆకాంక్షించారు. మధ్యప్రాచ్యం, వెనిజులా, లెబనాన్ ఇతర దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణానికి ఇకనైనా ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం పోప్ వాటికన్ నగరం నుంచి తన సందేశాన్నిచ్చారు. ఆఫ్రికాలో క్రైస్తవులపై తీవ్రవాద సంస్థలు జరుపుతున్న దాడుల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. హింసతో రగిలిపోతున్న దేశాల్లో ప్రకృతి వైపరీత్యాలతో సతమతమైపోతున్న దేశాల్లో, వ్యాధులు పడగవిప్పిన నిరుపేద దేశాల్లో ఈఏడాదైనా శాంతి, సుస్థిరతలు నెలకొనాలని పోప్ ఆకాంక్షించారు. ‘మధ్యప్రాచ్యం సహా ఎన్నో దేశాల్లో యుద్ధ వాతావరణంలో చిన్నారులు భయంతో బతుకులీడుస్తున్నారు. వారందరి జీవితాల్లో ఈ క్రిస్మస్ వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను‘‘అని పోప్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. అంబరాన్నంటిన సంబరాలు క్రిస్మస్ సంబరాలు ప్రపంచవ్యాప్తంగా అంబరాన్నంటాయి. క్రిస్టియన్ నేతలు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ శాంతి సందేశాలను పంపించుకున్నారు. సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. తీవ్ర తుఫాన్‌తో అల్లాడిపోయిన ఫిలిప్పీన్స్‌లో వేలాది మంది వరద ముప్పులో చిక్కుకోవడంతో క్రిస్మస్ హడావుడి కనిపించలేదు. ఇక ఫ్రాన్స్‌లో పింఛను సంస్కరణలకు వ్యతిరేకంగా నాలుగు వారాలుగా జరుగుతున్న రవాణా సమ్మెతో రాకపోకలు నిలిచిపోయాయి. బంధువులు, స్నేహితులు తమవారిని చేరుకోకపోవడంతో క్రిస్మస్ సందడి కనిపించలేదు. -
సైనిక–రాజకీయ పద్ధతిలో శాంతి స్థాపన
న్యూఢిల్లీ: కశ్మీర్లో శాంతి స్థాపన కోసం మిలిటరీ కార్యకలాపాలు, రాజకీయ ప్రయత్నాలు సమన్వయంతో కొనసాగాలని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. పాక్ సైన్యం పట్ల మన సైనికులు మరింత దూకుడుగా వ్యవహరిస్తే సీమాంతర ఉగ్రవాదాన్ని నిరోధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పరిస్థితి మెరుగవ్వాలంటే జమ్మూకశ్మీర్‌లోని మన సైన్యం చేతులు ముడుచుకుని కూర్చోకుండా, కొత్త ఎత్తుగడలు, వ్యూహాలను రచించాల్సి ఉందని పీటీఐ ఇంటర్వ్యూలో రావత్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం స్థానికుల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి రాజకీయంగా చేయగలిగినదంతా చేయాలని సూచించారు. -
కశ్మీర్‌పై చర్చలు ప్రారంభిస్తాం!
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో శాంతి స్థాపనలో భాగంగా.. కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఆ రాష్ట్రంలోని అన్ని భాగస్వామ్య పక్షాలతో చర్చల ప్రక్రియను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఆ బాధ్యతలను ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) మాజీ డైరెక్టర్ దినేశ్వర్ శర్మకు అప్పగించింది. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోహోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ వివరాలు వెల్లడిస్తూ..‘కశ్మీర్ అంశంపై కేంద్ర ప్రభుత్వం దృఢ వైఖరి, నమ్మకంతో ఉంది. ఆ మార్గంలోనే ముందుకు సాగుతుంది. అందులో భాగంగా చర్చల ప్రక్రియను మొదలుపెట్టాలని నిర్ణయించాం. అందుకే భారత ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా దినేశ్వర్ శర్మను నియమిస్తున్నాం. కశ్మీర్‌లోని అన్ని వర్గాల ప్రజలు, సంస్థలతో ఆయన చర్చలు కొనసాగిస్తారు’ అని తెలిపారు. ఇంతటి సున్నిత అంశంపై చర్చలు జరపగల సామర్థ్యం ఒక పోలీసు అధికారికి ఉంటుందా? అని ప్రశ్నించగా ‘అందులో తప్పేముంది. ఆయన రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి.అదే పెద్ద అనుకూల అంశం’ అని అన్నారు. 1979 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన దినేశ్వర్ శర్మ 2014 నుంచి 2016 వరకూ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా పనిచేశారు. కశ్మీర్‌పై చర్చల కోసం కేంద్రం చొరవను కశ్మీర్ సీఎం మెహబూబా స్వాగతించారు. -
శాంతి కపోతాలు
-
దక్షిణ సుడాన్లో శాంతి పవనాలు
జుబా: అంతర్యుద్ధంతో అట్టుడికిపోతున్న ప్రపంచంలోనే అతిపిన్న దేశం దక్షణ సుడాన్లో శాంతి స్థాపనకు బీజం పడింది. తిరుగుబాటు దళాలకు, ప్రభుత్వానికి మధ్య బుధవారం శాంతి ఒప్పందం జరిగింది. దీంతో నెలలుగా కొనసాగుతున్న అంతర్యుద్ధానికి తెరపడినట్లయింది. రాజధాని నగరం జుబాలో బుధవారం దేశాధ్యక్షుడు సాల్వా కీర్, తిరుగుబాటు దళాల నాయకుడు రిక్ మచార్ ల ప్రతినిధులు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. నిజానికి గతవారమే ఈ ఒప్పందం జరగాల్సిఉండేది కానీ తిరుగుబాటుదారుల డిమాండ్లకు అధ్యక్షుడు సల్వా నో చెప్పడంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. కాగా, శాంతిఒప్పందానికి అంగీకరించకుంటే అంతర్జాతీయ సమాజం నుంచి బహిష్కరణ వేటు తప్పదని ఐక్యరాజ్యసమితి హెచ్చరించడంతో సాల్వా దిగివచ్చారు. శాంతి ఒప్పందం విజయవంతానికి దక్షిణ సుడాన్ పొరుగుదేశాలైన కెన్యా, ఉగాండా, ఇథియోపియా తదితర దేశాల అదినేతలు సహకరించారు. 2011లో దక్షిణ సుడాన్ స్వతంత్ర్యదేశంగా ఆవిర్భవించింది. అధ్యక్షుడు సాల్వా.. ఉపాధ్యక్షుడైన రిక్ మచార్ ను పదవి నుంచి తొలగించడంతో ప్రారంభమైన విబేధాలు తీవ్ర రూపందాల్చి అంతర్యుద్ధానికి దారితీసింది. నేటి శాంతి ఒప్పందంతో రిక్ తిరిగి ఉపాధ్యక్ష పదవిని చేపట్టేందుకు మార్గం సుగమమైంది.


