ఇక చాలూ.. ఇజ్రాయెల్‌పై ట్రంప్‌ అసహనం | Trump Banned Israel From Bombing Lebanon, Gives Warning | Sakshi
Sakshi News home page

ఇక చాలూ.. ఇజ్రాయెల్‌పై ట్రంప్‌ అసహనం

Apr 18 2026 10:53 AM | Updated on Apr 18 2026 11:15 AM

Trump Banned Israel From Bombing Lebanon, Gives Warning

పశ్చిమాసియా ఉద్రిక్తతలు, శాశ్వత శాంతి స్థాపనకు ప్రయత్నాలు కొనసాగుతున్న వేళ.. మిత్రదేశం ఇజ్రాయెల్‌ తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా లెబనాన్‌పై దాడులు కొనసాగించడం సరికాదన్నారు. ఈ క్రమంలో  దాడులు ఇకనైనా ఆపాలంటూ ట్రంప్‌ సూచించారు.

‘‘లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ ఇక దాడులు చేయడానికి వీల్లేదు. వాళ్లు దాడులు చేయకుండా అమెరికా నిషేధం విధించింది. ఇక చాలు..’’ అంటూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు. అమెరికా మధ్యవర్తిత్వంతోనే లెబనాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం.. గురువారం నుంచి ఇది అమల్లోకి వచ్చింది.  ఈ ఒప్పందం తర్వాతే హర్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ తెరిచేందుకు అంగీకరించింది. 

పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ రెండు వారాల యుద్ధ విరమణ.. శాంతి చర్చలకు ఇరాన్‌-అమెరికాలు ముందుకు వచ్చాయి. అయితే లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగడంతో ఇరాన్‌ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ దాడులు ఆగకుంటే శాంతి చర్చలు ముందుకు సాగవని చెబుతూ వచ్చింది. ఇజ్రాయెల్‌ ఏమో.. లెబనాన్‌ గడ్డపై ఆశ్రయం పొందుతున్న హెజ్‌బొల్లా గ్రూపులతో తమ దేశానికి ముప్పు ఉందని చెబుతూ దాడులు కొనసాగించింది. దీంతో లెబన్‌నాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య చర్చల కోసం అమెరికా రంగంలోకి దిగాల్సి వచ్చింది.

ట్రంప్‌ తాజా హెచ్చరికలపై ఇజ్రాయెల్‌ ఇంకా స్పందించలేదు. కానీ, ఈ వార్నింగ్‌ కంటే ముందే ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఈ అంశంపై పరోక్షంగా స్పందించారు. దక్షిణ లెబనాన్‌లో తమ సైన్యం మోహరింపు కొనసాగుతుందని ప్రకటించారు. ‘‘రాకెట్‌ దాడులు, డ్రోన్ల ముప్పు ఇంకా ఇజ్రాయెల్‌ తొలగిపోలేదు. అందుకే మేం చేయాలనుకున్నది చేస్తాం. అదేంటో ఇప్పుడు నేను మీ ముందు చెప్పలేను’’ అని మీడియా ముందు నెతన్యాహు ప్రకటించారు.

ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ బలగాల దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చెలరేగాయి. 38 రోజుల తర్వాత ఇరు దేశాలకు శాంతి చర్చలకు అంగీకరించాయి. అయితే లెబనాన్‌ కూడా ఈ కాల్పుల విరమణలో భాగమని ఇరాన్‌ చెబుతుండగా.. అదసలు వేరే అంశమని ట్రంప్‌ చెబుతూ వస్తున్నారు. ఎల్లుండి ఇస్లామాబాద్‌ వేదికగా రెండో దఫా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఏప్రిల్‌ 22వ తేదీతో ఇరాన్‌ అమెరికా మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగియనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement