అమెరికాలో కలకలం.. రద్దీ రైల్వే స్టేషన్‌లో రక్తపాతం | Six Injured In Knife Attack At New York’s Penn Station, Suspect Arrested Amid Security Concerns | Sakshi
Sakshi News home page

అమెరికాలో కలకలం.. రద్దీ రైల్వే స్టేషన్‌లో రక్తపాతం

Jun 8 2026 11:48 AM | Updated on Jun 8 2026 12:04 PM

Bloodiest Sunday at NY Penn Station: 6 Injured in Stabbing Spree

న్యూయార్క్‌: అమెరికాలోనే అత్యంత రద్దీగా ఉండే రవాణా కేంద్రాలలో ఒకటైన న్యూయార్క్ లోని పెన్ స్టేషన్ రక్తపాతానికి వేదికైంది. స్టేషన లోపల ఒక దుండగుడు విచక్షణారహితంగా కత్తులతో దాడికి తెగబడటంతో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటనతో ఒక్కసారిగా అమెరికా ఉలిక్కిపడింది. ఆ సమయంలో స్టేషన్ లో ఉన్న ప్రయాణికులు భయాందోళనలతో పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన ఆమ్‌ట్రాక్ పోలీస్ డిపార్ట్‌మెంట్ నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకుంది. ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్‌లు జరగనున్న తరుణంలో ఈ దాడి చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది.

రక్తసిక్తంగా మారిన రైల్వే స్టేషన్
పెన్ స్టేషన్‌లోని ట్రాక్ 5, 6 సమీపంలో ఈ ఘోర దాడి జరిగింది. ఘటన జరిగిన  ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. న్యూయార్క్ ఫైర్ డిపార్ట్‌మెంట్, నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ స్పందిస్తూ, ఈ దాడిలో ఆరుగురు గాయపడ్డారని, వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.

మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తే..
ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడి వివరాలను, దాడికి గల కారణాలను అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే నిందితుడు మానసిక వికలాంగుడైన ఒక నిరాశ్రయుడని భావిస్తున్నట్లు న్యూయార్క్ సిటీ కంప్ట్రోలర్ మార్క్ లెవిన్ తెలిపారు. ఈ దాడిని న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్ తీవ్రంగా ఖండించారు. ఇదొక ‘భయంకరమైన హింసాత్మక చర్య’ అని అభివర్ణించిన ఆమె, ప్రజల భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. పోలీసులు ఈ దాడి వెనుక గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.

ప్రతిష్టాత్మక టోర్నీల వేళ భద్రత కట్టుదిట్టం
మరో కొన్ని రోజుల్లో న్యూయార్క్ నగరం రెండు ప్రధాన క్రీడా ఈవెంట్‌లకు ఆతిథ్యం ఇవ్వబోతున్న తరుణంలో ఈ ఘటన జరగడం భద్రతా సంస్థలను ఆందోళనలో పడేసింది. మేడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో ఎన్‌బీఏ ఫైనల్స్ (గేమ్స్ 3, 4), అలాగే పొరుగున ఉన్న న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగే ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం నగరం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నగరవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అత్యవసర చర్యల దృష్ట్యా పెన్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

ఇదికూడా చదవండి: ‘దీదీ’కి మరో షాక్‌: ఇద్దరు రాజ్యసభ ఎంపీల రాజీనామా
 

Advertisement
 
Advertisement
Advertisement