ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన ఫుట్‌బాల్ క్రీడ మెగా ఈవెంట్ సూపర్ సక్సెస్ అయింది. అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన 23వ ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీకి భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున తెరపడింది. 39 రోజులపాటు 48 జట్ల మధ్య 104 మ్యాచ్‌లు జరిగాయి.
స్పెయిన్, అర్జెంటీనా జట్ల మధ్య న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ఫైనల్ ఏకపక్షంగా ముగిసినా... మ్యాచ్ విరామ సమయంలో జరిగిన కార్యక్రమాలు కట్టిపడేశాయి.
షకీరా, మడోన్నా, బీటీఎస్, స్పీడ్, జస్టిన్ బీబెర్‌లాంటి స్టార్స్‌తో కార్యక్రమం ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ టోర్నీలోని మ్యాచ్‌లను ఏకంగా 68,10,966 ప్రేక్షకులు మైదానంలోకి వచ్చి ప్రత్యక్షంగా వీక్షించడం ఓ కొత్త రికార్డు. నాలుగేళ్ల తర్వాత జరిగే 24వ ప్రపంచకప్ టోర్నీకి 2030లో స్పెయిన్, పోర్చుగల్, మొరాకో దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. 2030లో ప్రపంచకప్ టోర్నీకి 100 ఏళ్లు పూర్తవుతాయి.
ఈ నేపథ్యంలో తొలి ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యమిచ్చిన ఉరుగ్వే, రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనా, పరాగ్వే మూడు సెంటీనరీ మ్యాచ్‌లకు వేదికగా నిలుస్తాయి. ఫలితంగా స్పెయిన్, పోర్చుగల్, మొరాకో, ఉరుగ్వే, పరాగ్వే, అర్జెంటీనా దేశాలు 2030 ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధించాయి. 2030 ప్రపంచకప్‌ను 64 దేశాలతో నిర్వహించాలని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) భావిస్తోంది. దీనిపై తుది నిర్ణయం రాబోయే రోజుల్లో తీసుకుంటారు.


