breaking news
football world cup
-
భళా బ్రెజిల్...
మయామి: ప్రపంచకప్ టైటిల్ సాధించి రెండు పుష్కరాలు దాటినా... అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో నిలకడగా రాణించే జట్లలో ఒకటైన బ్రెజిల్ మరోసారి సత్తా చాటుకుంది. 23వ ప్రపంచకప్ టోర్నీలో బ్రెజిల్ జట్టు దర్జాగా నాకౌట్ దశకు అర్హత సాధించింది. స్కాట్లాండ్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘సి’ చివరి లీగ్ మ్యాచ్‌లో బ్రెజిల్ 3–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. వినిసియస్ జూనియర్ (7వ, 45+3వ నిమిషంలో) రెండు గోల్స్‌తో మెరిపించగా... మథియాస్ కునా (60వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. తొలి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న స్టార్ ప్లేయర్ నెమార్ ఈ మ్యాచ్‌లో 76వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగినా గోల్ చేయలేకపోయాడు. రెండు విజయాలు, ఒక ‘డ్రా’తో బ్రెజిల్ ఏడు పాయింట్లతో గ్రూప్ ‘సి’లో టాపర్‌గా నిలిచింది. ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన బ్రెజిల్ జట్టు ప్రపంచకప్ టోర్నీలో లీగ్ దశలో తమ గ్రూప్‌లో అగ్రస్థానాన్ని సంపాదించడం వరుసగా ఇది 12వసారి (1982 నుంచి 2026 వరకు) కావడం విశేషం. మొరాకోతో జరిగిన తొలి మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకున్న బ్రెజిల్... రెండో మ్యాచ్‌లో 3–0తో హైతీపై గెలిచింది. లీగ్ దశలో బ్రెజిల్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ వినిసియస్ గోల్స్ చేయడం విశేషం. తద్వారా ప్రపంచకప్‌లోని గ్రూప్ దశ మూడు లీగ్ మ్యాచ్‌ల్లోనూ గోల్స్ కొట్టిన ఐదో బ్రెజిలియన్గా వినిసియస్ గుర్తింపు పొందాడు. గతంలో బ్రెజిల్ తరఫున జైర్జినో (1970లో), రొమారియో (1994లో), రొనాల్డో నజారియో (2002లో), రివాల్డో (2002లో) ఒక్కోసారి ఈ ఘనత సాధించారు. ఈ మూడుసార్లూ బ్రెజిల్ జట్టు ప్రపంచకప్ టైటిల్ నెగ్గడం విశేషం. మొరాకో మెరుపులు అట్లాంటా: గత ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరిన ఆఫ్రికా జట్టు మొరాకో ఈసారి అదరగొడుతోంది. హైతీ జట్టుతో జరిగిన గ్రూప్ ‘సి’ చివరి లీగ్ మ్యాచ్‌లో మొరాకో 4–2తో గెలిచింది. మొరాకో తరఫున అచ్రఫ్ హకీమి (39వ నిమిషంలో), ఇస్మాయిల్ సైబారి (45+1వ నిమిషంలో), సూఫియాన్ రహీమి (78వ నిమిషంలో), గెసిమి యాసిన్ (89వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. మొరాకో ప్లేయర్ యాసిన్ బునూ (10వ నిమిషంలో) ‘సెల్ఫ్ గోల్’తో ఖాతా తెరిచిన హైతీ జట్టుకు విల్సిన్ ఇసిడోర్ (43వ నిమిషంలో) మరో గోల్ అందించాడు. ఏడు పాయింట్లతో బ్రెజిల్, మొరాకో గ్రూప్ ‘సి’లో సమంగా నిలిచినా... గోల్స్ అంతరం కారణంగా బ్రెజిల్‌కు అగ్రస్థానం ఖరారైంది. మొరాకోకు రెండో స్థానంతో నాకౌట్ బెర్త్ దక్కింది. కెనెడా ఓడినా... టొరంటో: తాము ఆడిన గత రెండు ప్రపంచకప్‌లలో ఒక్క మ్యాచ్‌లోనూ నెగ్గని కెనడా జట్టు ఈసారి ఆతిథ్య దేశం హోదాలో సంచలన ప్రదర్శనతో నాకౌట్ దశకు చేరుకుంది. స్విట్జర్లాండ్‌తో జరిగిన గ్రూప్ ‘బి’ చివరి మ్యాచ్‌లో కెనడా 1–2తో ఓడిపోయింది. అయితే ఖతర్ జట్టుపై 6–0తో గెలిచి, బోస్నియా అండ్ హెర్జెగోవినాతో మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకున్న కెనడా నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు చేరుకుంది. రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న స్విట్జర్లాండ్ ఏడు పాయింట్లతో గ్రూప్ ‘బి’లో అగ్రస్థానం దక్కించుకొని నాకౌట్ బెర్త్‌ను సాధించింది. దక్షిణాఫ్రికా కొత్త చరిత్రమోంటెరె (మెక్సికో): నాలుగో ప్రయత్నంలో దక్షిణాఫ్రికా జట్టు ప్రపంచకప్‌లో తొలిసారి నాకౌట్ దశకు చేరుకుంది. దక్షిణ కొరియా జట్టుతో జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 1–0తో గెలిచింది. 63వ నిమిషంలో థపెలో మసెకో గోల్‌తో దక్షిణాఫ్రికా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని చివరిదాకా కాపాడుకొని గ్రూప్ ‘ఎ’లో నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి నాకౌట్ దశకు అర్హత పొందింది. నాకౌట్ మ్యాచ్‌లో కెనడా జట్టుతో దక్షిణాఫ్రికా ఆడుతుంది. 1998, 2002, 2010 ప్రపంచకప్‌లలో దక్షిణాఫ్రికా జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించింది. మెక్సికో ‘హ్యాట్రిక్’ మెక్సికో సిటీ: ప్రపంచకప్ ఆతిథ్య దేశాల్లో ఒకటైన మెక్సికో గ్రూప్ దశను అజేయంగా ముగించింది. చెక్ రిపబ్లిక్‌తో జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో మెక్సికో 3–0తో గెలిచి ‘హ్యాట్రిక్’ విజయం అందుకుంది. మెక్సికో తరఫున మటియో చావెజ్ (55వ నిమిషంలో), జూలియన్ క్వినోనెస్ (61వ నిమిషంలో), అల్వారో ఫిడాల్గో (90+4వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన మెక్సికో తొమ్మిది పాయింట్లతో గ్రూప్ ‘ఎ’ టాపర్‌గా నిలిచింది. ప్రపంచకప్ చరిత్రలో గ్రూప్ దశలో ఒక్క గోల్ సమర్పించుకోకుండా ఆడిన మూడుమ్యాచ్ల్లోనూ గెలిచిన ఆరో జట్టుగా మెక్సికో గుర్తింపు పొందింది. ఈ జాబితాలో నెదర్లాండ్స్ (1978), బ్రెజిల్ (1986), ఇటలీ (1990), అర్జెంటీనా (1998), ఉరుగ్వే (2018) జట్లున్నాయి. గెలిచి నిలిచిన బోస్నియా సియాటెల్: నాకౌట్ దశకు చేరుకునే అవకాశాలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో బోస్నియా అండ్ హెర్జెగోవినా జట్టు అదరగొట్టింది. ఖతర్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘బి’ ఆఖరి మ్యాచ్‌లో బోస్నియా 3–1తో విజయం సాధించింది. నాలుగు పాయింట్లతో బోస్నియా, కెనడా గ్రూప్ ‘బి’లో సమంగా నిలిచినా... గోల్స్ అంతరం కారణంగా కెనడా ముందంజ వేసింది. మూడో స్థానంలో ఉన్న ఎనిమిది అత్యుత్తమ జట్లలో బోస్నియా నిలిస్తే ఆ జట్టుకూ నాకౌట్ బెర్త్ లభిస్తుంది. -
ఎంబాపె ‘డబుల్’ ధమాకా
గత వరల్డ్‌కప్ రన్నరప్ ఫ్రాన్స్ కూడా విజయంతో గెలుపు బోణీ కొట్టింది. గ్రూప్ ‘ఐ’లో భాగంగా భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్ 3–1 గోల్స్ తేడాతో సెనెగల్ జట్టును ఓడించింది. కెప్టెన్ కిలియన్ ఎంబాపె (66వ, 90+6వ నిమిషంలో) రెండు గోల్స్‌తో విజృంభించగా... బ్రాడ్లీ బార్కోలా (82వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. సెనెగల్ తరఫున ఇబ్రహీం ఎంబాయె (90+5వ నిమిషంలో) ఏకైక గోల్ నమోదు చేశాడు. 2002 ప్రపంచకప్‌లో సెనెగల్‌తో ఆడిన ఆరంభ మ్యాచ్‌లో ఓడిపోయిన ఫ్రాన్స్‌కు ఈసారి కూడా గట్టిపోటీనే ఎదురైంది. ముఖ్యంగా స్టార్ ప్లేయర్ ఎంబాపెను సెనెగల్ డిఫెండర్లు కట్టడి చేశారు. దాంతో తొలి అర్ధభాగంలో ఎంబాపె కేవలం 14 సార్లు మాత్రమే బంతిని టచ్ చేశాడు. అయితే రెండో అర్ధభాగంలో ఎంబాపెను నిలువరించడంలో సెనెగల్ ప్లేయర్లు విఫలమయ్యారు. 66వ నిమిషంలో మైకేల్ ఒలిసె అందించిన పాస్‌ను ఎంబాపె గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. ఖాతా తెరిచిన తర్వాత ఫ్రాన్స్ మరింత జోరును పెంచింది. బార్కోలా గోల్‌తో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లిన ఫ్రాన్స్ ఇంజ్యూరీ టైమ్‌లో గోల్ సమర్పించుకుంది. అయితే ఆ వెంటనే ఎంబాపె 30 అడుగుల దూరం నుంచి కళ్లు చెదిరే కిక్‌తో ఫ్రాన్స్ ఖాతాలో మూడో గోల్ చేరింది.పోర్చుగల్‌ను నిలువరించిన కాంగోహ్యూస్టన్: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. భారీ విజయంతో బోణీ కొడుతుందనుకున్న క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ జట్టు తొలి మ్యాచ్‌ను ‘డ్రా’తో సరిపెట్టుకుంది. 52 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించిన డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో జట్టు అసాధారణ ఆటతీరును కనబరిచింది. రొనాల్డో కెప్టెన్సీలోని పోర్చుగల్‌తో మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’ చేసుకుంది. ఆరో నిమిషంలో నెవాస్ గోల్‌తో పోర్చుగల్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 45+5వ నిమిషంలో యోన్ విస్సా గోల్‌తో కాంగో జట్టు స్కోరును 1–1తో సమం చేసింది. ప్రపంచకప్ చరిత్రలో కాంగో జట్టుకు తొలి గోల్ అందించిన ప్లేయర్‌గా విస్సా నిలిచాడు. 1974 ప్రపంచకప్‌లో కాంగో జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఒక్క గోల్ కూడా చేయకుండానే ఓడిపోయింది. మరోవైపు ఈ మ్యాచ్ ద్వారా వరుసగా ఆరో ప్రపంచకప్ ఆడిన రెండో ప్లేయర్‌గా పోర్చుగల్ దిగ్గజం, 41 ఏళ్ల రొనాల్డో గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో మెస్సీ సరసన రొనాల్డో నిలిచాడు. 58 అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఫ్రాన్స్ ప్లేయర్‌గా ఎంబాపె గుర్తింపు పొందాడు. 57 గోల్స్‌తో ఒలివర్ గిరూడ్ పేరిట ఉన్న రికార్డును ఎంబాపె బద్దలు కొట్టాడు.14 ప్రపంచకప్ చరిత్రలో ఎంబాపె చేసిన గోల్స్. ఈ మెగా ఈవెంట్లో అత్యధిక గోల్స్ చేసిన ఫ్రాన్స్ ప్లేయర్‌గా ఎంబాపె అవతరించాడు. 13 గోల్స్‌తో జస్ట్ ఫోంటెన్ పేరిట ఉన్న రికార్డును ఎంబాపె సవరించాడు. ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్ల జాబితాలో ఎంబాపె మూడో స్థానానికి ఎగబాకాడు.ఆ్రస్టియా... 1990 తర్వాతశాన్ఫ్రాన్సిస్కో: తొలిసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఆసియా జట్టు జోర్డాన్‌కు నిరాశ ఎదురైంది. గ్రూప్ ‘జె’లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఆ్రస్టియా 3–1తో జోర్డాన్‌ను ఓడించింది. ఆ్రస్టియా తరఫున రొమానో (20వ నిమిషంలో), మార్కో అర్నాటోవిక్ (90+12వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. జోర్డాన్ ప్లేయర్ యాజాన్ అలారబ్ (76వ నిమిషంలో) సెల్ఫ్ గోల్ సాధించాడు. జోర్డాన్ తరఫున అలీ ఒల్వాన్ (50వ నిమిషంలో) రెగ్యులర్ గోల్ చేశాడు. చివరిసారి 1998లో ప్రపంచకప్‌లో ఆడిన ఆ్రస్టియా 1990 తర్వాత ప్రపంచకప్‌లో గెలుపు రుచి చూసింది. 1998లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన ఆ్రస్టియా 1990లో 2–1తో అమెరికాపై నెగ్గింది. 1994 ప్రపంచకప్ టోర్నీకి ఆ్రస్టియా అర్హత సాధించలేదు. -
అడ్డుగోడలా నిలబడి...
అట్లాంటా: ఒక జట్టేమో 17వసారి ప్రపంచకప్‌లో ఆడుతోంది... మరో జట్టుకేమో ఇదే తొలి ప్రపంచ కప్... అనుభవం, బలాబలాలదృష్ట్యా 17వసారి ప్రపంచకప్‌లో పోటీపడుతున్న జట్టు అలవోకగా గెలవాలి. కానీ అలా జరగలేదు. ప్రత్యర్థి జట్టు ఎంత బలంగా ఉన్నా... పట్టుదలతో పోరాడితే అద్భుతం చేయవచ్చని ప్రపంచకప్‌లో అరంగేట్రం చేసిన జట్టు నిరూపించింది. వెరసి తాజా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో గోల్స్ నమోదు కాకుండానే 0–0తో ‘డ్రా’ అయిన మ్యాచ్‌గా స్పెయిన్, కేప్ వెర్డె పోరు నిలిచింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న ప్రస్తుత యూరోపియన్ చాంపియన్ స్పెయిన్‌కు ఈ ప్రపంచకప్‌లో ఆశించిన ఆరంభం లభించలేదు. గ్రూప్ ‘హెచ్’లో భారీ విజయంతో బోణీ కొట్టాలని భావించిన స్పెయిన్‌కు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 64వ స్థానంలో ఉన్న అనామక జట్టు కేప్ వెర్డెనుంచి ఊహంచని ప్రతిఘటన ఎదురైంది. ముఖ్యంగా కేప్ వెర్డె గోల్‌కీపర్, 40 ఏళ్ల వొజిన్హా అసాధారణ ప్రతిభ కనబరిచాడు. ఏకంగా ఏడుసార్లు స్పెయిన్ ప్లేయర్లు గోల్ పోస్ట్ లక్ష్యంగా కొట్టిన షాట్లను అతను సమర్థవంతంగా అడ్డుకున్నాడు. స్పెయిన్ యువ సూపర్ స్టార్ లామినె యామల్ 71వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ మ్యాచ్‌లో స్పెయిన్ ఆటగాళ్లు బంతిని 62 శాతం తమ ఆ«దీనంలో ఉంచుకున్నా కేప్ వెర్డె గోల్కీపర్ను బోల్తా కొట్టించడంలో విఫలమయ్యారు. నెదర్లాండ్స్‌ను నిలువరించిన జపాన్ 2–2తో మ్యాచ్ ‘డ్రా’ డాలస్: ‘ఫిఫా’ ప్రపంచకప్‌లో ఆసియా జట్టు జపాన్ మరోసారి స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చింది. 2020 టోర్నీలో మాజీ చాంపియన్లు జర్మనీ, స్పెయిన్‌లను ఓడించిన జపాన్... ఈసారి మరో పటిష్ట యూరోపియన్ టీమ్ నెదర్లాండ్స్‌ను నిలువరించింది. జపాన్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన గ్రూప్ ‘ఎఫ్’ మ్యాచ్ 2–2తో డ్రాగా ముగిసింది. నెదర్లాండ్స్ తరఫున వాన్ విర్జిల్ (50వ నిమిషంలో), సమ్మర్విల్లే (64వ నిమిషంలో) గోల్స్ సాధించగా... జపాన్ ఆటగాళ్లలో కీటో నకముర (57వ నిమిషంలో), కమాడా డైచీ (88వ నిమిషంలో) గోల్స్ కొట్టారు. దాదాపు మ్యాచ్ చివరి వరకు నెదర్లాండ్స్ ఆధిక్యం కొనసాగించగా... కమాడా అనూహ్య హెడర్‌తో స్కోరును సమం చేశాడు. ప్రపంచకప్‌లో మూడుసార్లు ఫైనల్‌కు చేరినా... ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయిన నెదర్లాండ్స్ తర్వాతి దశకు అర్హత సాధించే ప్రయత్నంలో గెలిచేందుకు అవకాశం ఉన్న మ్యాచ్‌ను చేజార్చుకుంది. దాంతో డచ్ ఆటగాళ్లు, అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.వెల్డన్... స్వీడన్మరో గ్రూప్ ‘ఎఫ్’ మ్యాచ్‌లో స్వీడన్ 5–1 గోల్స్ తేడాతో ట్యునీషియాను చిత్తు చేసింది. 2893 రోజుల నిరీక్షణకు తెరదించుతూ ప్రపంచకప్‌లో స్వీడన్ గోల్స్ ఖాతా తెరిచింది. 13వ సారి ప్రపంచకప్‌లో ఆడుతున్న స్వీడన్ తమ తొలి మ్యాచ్‌లోనే ఐదు గోల్స్ చేయడం ఇదే తొలిసారి. యాసిన్ అయారి (7వ, 90+6వ నిమిషంలో) రెండు గోల్స్ సాధించగా... అలెగ్జాండర్ ఇసాక్ (30వ నిమిషంలో), విక్టర్ గ్యోకర్స్ (59వ నిమిషంలో), మతియాస్ స్వాన్బెర్గ్ (84వ నిమిషంలో) ఒక్కో గోల్ కొట్టారు. ట్యునీషియా ఆటగాళ్లలో ఒమర్ రెకిక్ (43వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. 2018లో క్వార్టర్ ఫైనల్లో ఓడిన స్వీడన్ 2022 ప్రపంచకప్‌కు అర్హత సాధించలేదు. 19 మ్యాచ్‌ల తర్వాత... మరోవైపు ఈక్వెడార్‌తో జరిగిన గ్రూప్ ‘ఇ’ పోరులో ఐవరీకోస్ట్ 1–0తో విజయం సాధించింది. కొద్ది క్షణాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా సబ్‌స్టిట్యూట్ అమాద్ డియాలో (90వ నిమిషంలో) చేసిన ఏకైక గోల్‌తో ఐవరీకోస్ట్ అనూహ్యంగా గెలిచింది. దాంతో వరుసగా 19 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచిన ఈక్వెడార్‌కు తొలి ఓటమి ఎదురైంది. 2014లో చివరిసారి ప్రపంచకప్‌లో ఆడి ఓ మ్యాచ్‌లో గెలిచిన ఐవరీకోస్ట్... 2018, 2022 ప్రపంచకప్ టోరీ్నలకు అర్హత పొందలేదు. -
జయహో జర్మనీ
హ్యూస్టన్: గత రెండు ప్రపంచకప్‌లలో గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టిన నాలుగుసార్లు చాంపియన్ జర్మనీ జట్టు తాజా ప్రపంచకప్‌ను ఘనవిజయంతో ప్రారంభించింది. తొలిసారి ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఆడుతున్న కురసావ్ జట్టుతో ఆదివారం జరిగిన ‘ఇ’ లీగ్ మ్యాచ్‌లో జర్మనీ 7–1 గోల్స్ తేడాతో గెలుపొందింది. జర్మనీ తరఫున ఫెలిక్స్ నెమాచా (6వ నిమిషంలో), నికో ష్కాల్టెర్బెక్ (38వ నిమిషంలో), జమాల్ ముసియాలా (47వ నిమిషంలో), నథానియల్ బ్రౌన్ (68వ నిమిషంలో), డెనిజ్ ఉండావ్ (78వ నిమిషంలో) ఒక్కో గోల్ చేయగా... కాయ్ హావెట్జ్ (45+5వ నిమిషంలో, 88వ నిమిషంలో) రెండు గోల్స్ సాధించాడు. కురసావ్ జట్టుకు లివానో కొమెన్సియా (21వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. ‘డ్రా’తో గట్టెక్కిన బ్రెజిల్... గత ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరిన ఆఫ్రికా జట్టు మొరాకోతో జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఐదుసార్లు చాంపియన్ బ్రెజిల్ ఓటమి తప్పించుకొని 1–1తో గట్టెక్కింది. మొరాకో తరఫున ఇస్మాయిల్ సైబారి (21వ నిమిషంలో) గోల్ చేయగా... బ్రెజిల్ జట్టుకు వినిసియస్ జూనియర్ (32వ నిమిషంలో) గోల్ అందించాడు. పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెమార్ ఈ మ్యాచ్‌లో ఆడలేదు. 1938 ప్రపంచకప్ నుంచి బ్రెజిల్ జట్టు ఈ మెగా ఈవెంట్లో ఆడిన తొలి మ్యాచ్‌లో ఓడిపోలేదు. ఈసారి తమ అజేయ రికార్డును కొనసాగించింది. గ్రూప్ ‘బి’లో ఖతర్, స్విట్జర్లాండ్ మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. 90+4వ నిమిషంలో స్విట్జర్లాండ్ ప్లేయర్ మిరో ముహీమ్ ‘సెల్ఫ్ గోల్’ చేసి తమ జట్టుకు విజయాన్ని దూరం చేశాడు. గ్రూప్ ‘సి’లోని మరో మ్యాచ్‌లో స్కాట్లాండ్ 1–0తో హైతీ జట్టును ఓడించి 36 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని అందుకుంది. గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 2–0తో టర్కీ జట్టుపై గెలిచింది. -
క్లిక్ @ కిక్
ఫొటో జర్నలిస్ట్‌గా ఫుట్‌బాల్ ప్రపంచకప్ పోటీలను ఒక్కసారి కవర్ చేయడమే విశేషంగా భావిస్తారు. అస్సాంకు చెందిన గీతికా తలుక్దార్ మన దేశం నుంచి వరుసగా మూడోసారి ఫిఫా వరల్డ్ కప్‌ను కవర్ చేసే అవకాశం పొందిన ఏకైక ఉమెన్ ఫోటో జర్నలిస్ట్‌గా ప్రత్యేకత సాధించారు. వరుసగా మూడుసార్లు పురుషుల ఫిఫా వరల్డ్ కప్‌కు అధికారిక గుర్తింపు పొందిన గీతిక అంతర్జాతీయ ఫుట్‌బాల్ రంగానికి సంబంధించి రిపోర్టింగ్, ఫొటోగ్రఫీలో అపారమైన అనుభవం ఉన్న మీడియా నిపుణుల ప్రత్యేక బృందంలో చేరారు.గీతికా తలుక్దార్కు అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లను కవర్ చేయడంలో రెండు దశాబ్దాల అనుభవం ఉంది. 2018లో రష్యా, 2022లో ఖతార్ తర్వాత ఇది ఆమెకు వరుసగా మూడవ ఫిఫా ప్రపంచకప్ అసైన్మెంట్.అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో జన్మించారు గీతిక. తండ్రి ఉద్యోగరీత్యా దేశంలోని వివిధ ప్రాంతాలలో పెరిగారు. కేంద్రీయ విశ్వవిద్యాయంలో చదువుకున్నారు.దక్షిణ కొరియాలోని ‘సియోల్ నేషనల్ యూనివర్శిటీ’లో గ్లోబల్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ చేశారు. దక్షిణ కొరియా క్రీడా, సాంస్కృతిక మంత్రిత్వశాఖ నుంచి స్కాలర్షిప్ అందుకున్నారు. ‘సియోల్ నేషనల్ యూనివర్శిటీ’లో చదువుకోవడం ఆమె ప్రాపంచిక దృక్పథాన్ని విశాలం చేసింది.ఈశాన్య ప్రాంత ప్రతిభ ఏ అంతర్జాతీయ వేదికపైనైనా పోటీపడగలదనే ఆమె నమ్మకాన్ని బలపరిచింది. ఆ తరువాత క్రీడా జర్నలిజం వైపు అడుగులు వేసి ఫొటోగ్రఫీని తన కెరీర్‌గా ఎంచుకున్నారు గీతిక.మానవీయ కోణంలో....ఒక ఫొటో న్యూస్ ఏజెన్సీతో గీతిక కెరీర్ మొదలైంది. ఆ తరువాత పూర్తిస్థాయిలో స్పోర్ట్స్ జర్నలిజం, స్పోర్ట్స్ ఫొటోగ్రఫీ వైపు వచ్చారు. స్పోర్ట్స్ ఫొటోగ్రఫీ అంటే కేవలం ప్లేయర్స్ గోల్స్ కొడుతున్నప్పుడు ఫొటోలు తీయడం మాత్రమే కాదు. ఇలా కనిపించి అలా క్షణాల్లో మాయమయ్యే ఒత్తిడి, ప్రతిచర్యలు, భావోద్వేగాలను వేగంగా బంధించడం కూడా. ఆ కళలలో ఆరితేరారు గీతిక. ఆటలను చూసే క్రమంలో అభిమానుల స్పందన, అథ్లెట్ల సంబరాలు, ఒత్తిడిలో ఉన్న జట్టు... ఇలా క్రీడలు, క్రీడా కార్యక్రమాల చుట్టు ఉన్న వాతావరణాన్ని, క్రీడలలోని మానవీయ కోణాన్ని డాక్యుమెంట్ చేస్తాయి ఆమె తీసిన ఫొటోలు. గణాంకాలు ఎప్పటికీ తెలియజేయలేని కథలను గీతిక తీసిన ఫొటోలు చెబుతాయి.అత్యంత పోటీలో... అరుదైన అవకాశంరష్యా, ఖతార్‌లలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌తోపాటు ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరిగిన ఫిఫా మహిళల వరల్డ్‌కప్‌లు, టోక్యో ఒలింపిక్స్, పారిస్ ఒలింపిక్స్, ఐపీయల్ సీజన్లు, కామన్వెల్త్ గేమ్స్, ఐసీసీ టోర్నమెంట్స్ కవర్ చేశారు గీతిక. ఆమె కెరీర్లో ఫిఫా అక్రిడిటేషన్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈ టోర్నమెంట్లలో ప్రవేశం పొందడం అత్యంత పోటీతో కూడుకున్నది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది జర్నలిస్ట్‌లు, ఫొటోగ్రాఫర్లు దరఖాస్తు చేసుకుంటారు.కెరీర్లో మైలురాయిఫిఫా వరల్డ్ కప్ కోసం అంతర్జాతీయ మీడియా కవరేజ్ బృందంలో మూడోసారి ఎంపిక కావడాన్ని తన కెరీర్లో ఒక మైలురాయిగా అభివర్ణిస్తూ, తనకు మద్దతు ఇచ్చిన ఫిఫా, అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య, ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్యలకు గీతిక ధన్యవాదాలు తెలియజేశారు.స్పోర్ట్స్ ఫొటోగ్రఫీ ఇప్పటికీ పురుషాధిక్యతతోనే ఉంది. నిరంతర ప్రయాణాలు, ఎక్కువ పనిగంటలు అవసరమయ్యే ప్రపంచస్థాయి టోర్నమెంట్లలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. మహిళా జర్నలిస్ట్‌లు, ఫొటోగ్రాఫర్లని ప్రోత్సహించడంలో భాగంగా 2024లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, పారిస్ ఒలింపిక్స్‌ను కవర్ చేయడానికి గీతికకు నేరుగా గుర్తింపు ఇచ్చింది. భారతదేశం నుండి ఈ గుర్తింపు పొందిన తొలి, ఏకైక మహిళా ఫొటోగ్రాఫర్‌గా నిలిచారు గీతిక.ఇదొక సుదీర్ఘ ప్రయాణంఏదీ ఒక్కరోజులోగానీ, ఒక్క ప్రయత్నంలోగానీ రాలేదు. ఇదొక సుదీర్ఘమైన ప్రయాణం. నా అభిరుచి, నేను ఎంచుకున్న ప్రొఫెషన్లో పడిన కఠోరశ్రమ, అంకితభావం ప్రపంచవ్యాప్త గుర్తింపును ఇచ్చింది. అవకాశాలను అందించింది. నా ప్రయాణంలో నాకు వెన్నుదన్నుగా ఉండి ప్రోత్సహించిన వారికి, విలువలు నేర్పిన కుటుంబసభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.– గీతికా తలుక్దార్ -
అంగరంగ వైభవంగా..
మెక్సికో సిటీ: విశ్వవ్యాప్త అభిమానులను అలరించేందుకు ‘ఫిఫా’ ప్రపంచకప్–2026 ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు గురువారం తెరలేచింది. మెక్సికో, కెనడా, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ ఆరంభ వేడుకలు గురువారం అర్ధరాత్రి మెక్సికో సిటీలో అట్టహాసంగా జరిగాయి. దాదాపు 90 వేల మంది సామర్థ్యం గల అజ్టెకా స్టేడియంలో మెక్సికో సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింభించేలా ఈ వేడుకలు సాగాయి. ఇందులో ప్రముఖ పాప్ సింగ్ షకీరా, డానీ ఓసియన్, బాల్విన్, బెలిండాతో పాటు పలువురు అంతర్జాతీయ స్టార్లు ఆడిపాడారు. షకీరా ప్రపంచకప్ అధికారిక పాటకు కాలు కదపగా... స్టేడియం మొత్తం ఊగిపోయింది. కళాకారులు సంప్రదాయ నృత్యాలతో ‘ఫిఫా’ వరల్డ్‌కప్ ట్రోఫీ భారీ నమూనాను మైదానంలో ప్రదర్శించగా... ఆ సమయంలో బాణాసంచా మోతతో స్టేడియంలో మరో ప్రపంచం ఆవిష్కృతమైంది. ప్రారంభ వేడుకలను వీక్షించేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరగా... కళాకారుల విన్యాసాలు ఆహుతులను కట్టిపడేశాయి. టోర్నమెంట్ ఆరంభానికి ముందు ‘ఫిఫా’ అధ్యక్షుడు గియానీ మాట్లాడుతూ... ‘ప్రశాంతంగా సేదతీరుతూ ఆస్వాదించండి’ అని పిలుపునిచ్చాడు. 2010 ప్రపంచకప్ మాదిరిగానే మెక్సికో–దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్‌తోనే 2026 వరల్డ్‌కప్ ప్రారంభమైంది. -
ప్రపంచం 'గోల్'మయం!
ఎప్పుడూ క్రికెట్, క్రికెట్టేనా... ఇంకేం ఆటలు లేవా చూసేందుకు... మళ్లీ మళ్లీ పెళ్లిలాగా ఏడాదికో ప్రపంచ కప్ అంటూ వచ్చిపోతోంది... పైగా పేరుకే కానీ నాలుగు పెద్ద జట్లు కూడా లేని వరల్డ్‌కప్‌లో వినోదం ఏముంటుంది... ఈ మాటలన్నీ మనమంతా వింటూనే ఉన్నాం. అయితే వీటన్నింటికి సమాధానమిచ్చేందుకు మన కోసం మరో ఆటలో మెగా ఈవెంట్ వచ్చేసింది. ఏకంగా 48 దేశాలు తమ సర్వశక్తులూ ఒడ్డేందుకు సిద్ధమవుతున్నాయి... అసలైన ‘విశ్వ’ విజేతను తేల్చే ఈ సమరం నాలుగేళ్లకు ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఇక్కడా సూపర్ స్టార్లు ఉంటారు... కానీ వారు మాత్రమే ఉండరు... ఒక్కో జట్టులో ఎంతో మంది అసాధారణ ప్రతిభావంతులు ... వారి ప్రతి అడుగులో, ప్రతీ కదలికలో కనిపించే చురుకుదనం, వేగం మనల్ని కట్టిపడేస్తాయి. పెద్దా, చిన్నా తేడా లేదు... సంచలనాలకు ఇంతకంటే సరైన వేదిక లేదు... ఏ జట్లు ఆడినా... చివరకు మ్యాచ్‌లో ఎవరు గెలిచినా... ఆ 90 నిమిషాల పోరాటం మన నరాల్లోకి కూడా ఎక్కేస్తుంది.మిగతా మూడేళ్ల 11 నెలలు ఎవరు ఎక్కడ ఎలా ఆడినా పట్టించుకోని అభిమానులు ఈనెల రోజుల పాటు ఆటగాళ్లకు అతి పెద్ద ఫ్యాన్లుగా మారిపోయి నీరాజనాలు పడతారు... ప్రత్యక్షంగా స్టేడియాల్లో చూసే అభిమానులే కాదు... ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో, ఫోన్లలో ఈ మెగా సంబరాన్ని వీక్షించే కోట్లాది మందికి ఈ ఫుట్‌బాల్ పండగ ఫుల్ వినోదం పంచడం గ్యారంటీ... భారత అభిమానులు నెల రోజులకు పైగా జరిగే ఈ 104 మ్యాచ్‌ల సంబరాలను చూసేందుకు నిద్ర లేని రాత్రులు గడపాల్సిందే. అంతటితో ఆగకుండా తెల్లవారుజామున ఆటగాళ్ల విన్యాసాల కబుర్లతో చాయ్ పే చర్చ జరగాల్సిందే... మెస్సీ, రొనాల్డో, నెమార్, మోడ్రిచ్, సలా, ఎంబాపె, లామినె యామల్, ఎండ్రిక్, ఫ్లోరియన్ విట్జ్... ఇలా కొన్ని పేర్లు అలా పెదాలపై పరుగెడుతూనే ఉంటాయి... అయినా ఫుట్‌బాల్ ప్రపంచకప్ చూడాలంటే అన్ని రూల్స్, ఆటగాళ్లంతా తెలిసే ఉండాలా ఏంటి? కంటిచూపుతో బంతిని అనుసరిస్తూ వెళ్లిపోతే చాలు... ఆ ఊపు, ఆ జోష్‌తో మనమే మైదానంలో పరుగెడుతున్న భావన రావడం ఖాయం!మెక్సికో సిటీ: ప్రపంచంలోనే అత్యంత జనాదరణ కలిగిన ఈవెంట్ వరల్డ్‌కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు నేడు తెరలేవనుంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలకు మెక్సికో సిటీలో ఆతిథ్య మెక్సికో, దక్షిణాఫ్రికా జట్ల మధ్య గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ మొదలవుతుంది. 23వ ప్రపంచకప్ టోర్నీలో తొలిసారి 48 జట్లు పాల్గొంటున్నాయి. 1998 నుంచి 2022 వరకు ప్రపంచకప్ టోర్నీల్లో 32 జట్లు పోటీపడ్డాయి. అంతేకాకుండా తొలిసారి మూడు దేశాలు (అమెరికా, మెక్సికో, కెనడా) కలిసి టోర్నీని నిర్వహిస్తున్నాయి.అమెరికాలో 11 వేదికల్లో... మెక్సికోలో 3 వేదికల్లో... కెనడాలో 2 వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. డిఫెండింగ్ చాంపియన్ జట్లకు తదుపరి టోర్నీ అంతగా అచ్చిరాలేదు. ఇప్పటి వరకు రెండు జట్లు (ఇటలీ; 1934, 1938... బ్రెజిల్; 1958, 1962) మాత్రమే ప్రపంచకప్ టైటిల్‌ను నిలబెట్టు కున్నాయి. మెస్సీ సారథ్యంలో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా జట్టు బ్రెజిల్, ఇటలీ సరసన చేరుతుందో లేదో జూలై 19వ తేదీన తెలుస్తుంది. ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, ఇంగ్లండ్, నెదర్లాండ్స్, జర్మనీ జట్లు కూడా టైటిల్ రేసులో ఉన్నాయి. 39 రోజులపాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 104 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశ ముగిశాక 12 గ్రూప్‌ల్లో టాప్–2లో నిలిచిన జట్లతోపాటు మూడో స్థానంలో నిలిచిన 8 అత్యుత్తమ జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయి. ప్రపంచకప్‌లో దక్షిణ అమెరికా, యూరోప్ దేశాలే ఆధిపత్యం చలాయిస్తున్నాయి. 12 సార్లు యూరోప్ దేశాలు, 10 సార్లు దక్షిణ అమెరికా దేశాలు విశ్వవిజేతలుగా నిలిచాయి. ఆసియా నుంచి దక్షిణ కొరియా (2002లో నాలుగో స్థానం), ఆఫ్రికా నుంచి మొరాకో (2022లో మొరాకో నాలుగో స్థానం) మాత్రమే ఒక్కోసారి సెమీఫైనల్ చేరుకున్నాయి. ఈసారి ఆసియా నుంచి జపాన్, దక్షిణ కొరియా, ఆ్రస్టేలియా... ఆఫ్రికా నుంచి మొరాకో, ఘనా, సెనెగల్ నాకౌట్ దశకు చేరుకోవచ్చు. ఇక ఫుట్‌బాల్‌లోని అన్ని ప్రముఖ టైటిల్స్ గెల్చుకున్న క్రిస్టియానో రొనాల్డో ఈసారైనా అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచకప్ టైటిల్‌ను అందుకుంటాడో లేదో మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది. సీనియర్ స్టార్స్ మెస్సీ, రొనాల్డో, ఎంబాపె (ఫ్రాన్స్), లుకా మోడ్రిచ్ (క్రొయేíÙయా), హ్యారీ కేన్ (ఇంగ్లండ్), నెమార్ (బ్రెజిల్)లకు దీటుగా టీనేజ్ స్టార్స్ లామినె యామల్ (స్పెయిన్), జమాల్ ముసియాలా (జర్మనీ), ఎండ్రిక్ (బ్రెజిల్), అర్దా గులెర్ (టర్కీ), ఇబ్రహీం ఎంబాయె (సెనెగల్) తమ ప్రత్యేకతను చాటుకోవడానికి సిద్ధమయ్యారు. 3 అత్యధికంగా ఆరుసార్లు ప్రపంచకప్‌లో ఆడబోతున్న ముగ్గురు ప్లేయర్లుగా మెస్సీ (అర్జెంటీనా), క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్), గిలెర్మో ఒచోవా (మెక్సికో) రికార్డు సృష్టించనున్నారు.8 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో మెక్సికో జట్టు పాలుపంచుకోనుండటం ఇది ఎనిమిదోసారి. మరే జట్టు ఇన్ని ఆరంభ మ్యాచ్‌ల్లో పోటీపడలేదు. 2010 ప్రపంచకప్ కూడా మెక్సికో–దక్షిణాఫ్రికా మ్యాచ్‌తోనే మొదలైంది.2 మరో రెండు గోల్స్ చేస్తే పోర్చుగల్ కెపె్టన్ క్రిస్టియానో రొనాల్డో (ప్రస్తుతం 15 గోల్స్) ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా మిరోస్లావ్ క్లోజ్ (16 గోల్స్; జర్మనీ) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడతాడు. అంతేకాకుండా వరుసగా 6 ప్రపంచకప్‌లలో గోల్ కొట్టిన ఏకైక ప్లేయర్‌గా చరిత్ర లిఖిస్తాడు.1248 ఈ ప్రపంచకప్‌లో 48 జట్ల తరఫున బరిలోకి దిగనున్న మొత్తం క్రీడాకారులు. 1248లో 891 మంది ప్లేయర్లు తమ దేశం తరఫున తొలిసారి ప్రపంచకప్ ఆడుబోతున్నారు.7 ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆడుతున్న వరల్డ్ చాంపియన్స్ (బ్రెజిల్, జర్మనీ, అర్జెంటీనా, ఫ్రాన్స్, ఉరుగ్వే, ఇంగ్లండ్, స్పెయిన్) జట్లు. నాలుగుసార్లు ప్రపంచకప్ గెలిచిన ఇటలీ వరుసగా మూడోసారి అర్హత సాధించలేదు. ఇప్పటి వరకు 22 సార్లు ప్రపంచకప్ జరగ్గా... 8 దేశాలు విజేతలుగా నిలిచాయి.4 ఉజ్బెకిస్తాన్, కురసావ్, కేప్ వెర్డె, జోర్డాన్ జట్లు తొలిసారి ప్రపంచకప్‌లో ఆడుతున్నాయి. మిగతా 44 జట్లలో బ్రెజిల్ మాత్రమే వరుసగా 23 ప్రపంచకప్ టోర్నీల్లో ఆడుతున్న ఏకైక జట్టు కానుంది. బ్రెజిల్ తర్వాత అత్యధికసార్లు ప్రపంచకప్ ఆడుతున్న జట్లుగా జర్మనీ (21), అర్జెంటీనా (19), మెక్సికో (18), ఇటలీ (18), ఇంగ్లండ్, ఫ్రాన్స్, స్పెయిన్ (17 సార్లు చొప్పున), బెల్జియం, ఉరుగ్వే (15 సార్లు చొప్పున) ఉన్నాయి.ప్రైజ్‌మనీ ఎంతంటే...ప్రపంచకప్ ఫుట్‌బాల్–2026 టోర్నీ విజేత జట్టుకు 5 కోట్ల డాలర్లు (సుమారు రూ. 476 కోట్లు) లభిస్తాయి. రన్నరప్ జట్టుకు 3 కోట్ల 30 లక్షల డాలర్లు (రూ. 314 కోట్లు), మూడో స్థానంలో నిలిచిన టీమ్‌కు 2 కోట్ల 90 లక్షల డాలర్లు (రూ. 276 కోట్లు), నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు 2 కోట్ల 70 లక్షల డాలర్లు (రూ. 257 కోట్లు) ఇస్తారు.5–8వ స్థానాలజట్లకు 1 కోటీ 90 లక్షల డాలర్ల (రూ. 181 కోట్లు) చొప్పున... 9–16వ స్థానాల జట్లకు 1 కోటీ 50 లక్షల డాలర్ల (రూ. 142 కోట్లు) చొప్పున ... 17 నుంచి 32వ స్థానాల్లో నిలిచిన జట్లకు 1 కోటీ 10 లక్షల డాలర్ల (రూ. 104 కోట్లు) చొప్పున... 33–48వ స్థానం వరకు నిలిచిన జట్లకు 90 లక్షల డాలర్ల (రూ. 85 కోట్లు) చొప్పున లభిస్తాయి. -
‘ఆసియా’ అంతంతే!
టేబుల్ టెన్నిస్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, జూడో, బ్యాడ్మింటన్... తదితర వ్యక్తిగత క్రీడాంశాల్లో విశ్వవేదికపై ఆసియా దేశాల క్రీడాకారులు సంపూర్ణ ఆధిపత్యం చలాయిస్తుంటారు. కానీ జట్టు క్రీడ అయిన ఫుట్‌బాల్‌లో మాత్రం ఆసియా దేశాలు ఇప్పటికీ వెనుకబడి ఉన్నాయి. కోట్లాది మంది క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా తిలకించే ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లోనైతే ఆసియా దేశాలు చిరస్మరణీయ ప్రదర్శన చేయలేదనే చెప్పాలి. 2002లో దక్షిణ కొరియా–జపాన్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లో దక్షిణ కొరియా జట్టు సెమీఫైనల్ చేరడమే ఈ మెగా ఈవెంట్ చరిత్రలో ఆసియా దేశాల నుంచి వచ్చిన అత్యుత్తమ ప్రదర్శన. పెరిగిన ఆసియా బెర్త్‌లు... 32 జట్లతో ప్రపంచకప్ నిర్వహించినపుడు ఆసియాకు నేరుగా 4 బెర్త్‌లు దక్కేవి. ఇంటర్ కాన్ఫడరేషన్ ప్లే ఆఫ్ మ్యాచ్ ద్వారా ఐదో బెర్త్‌కు కూడా అవకాశం ఉండేది. ఈసారి జట్ల సంఖ్య 48కి పెరగడంతో ఆసియా దేశాలు బెర్త్‌లు రెట్టింపై 8కి చేరుకున్నాయి. ఇంటర్ కాన్ఫడరేషన్ ప్లే ఆఫ్ మ్యాచ్ ద్వారా తొమ్మిదో బెర్త్ కూడా అవకాశం లభించింది. 47 దేశాలు పోటీపడ్డ ఆసియా క్వాలిఫయింగ్ ద్వారా ఈసారి దక్షిణ కొరియా, జపాన్, ఆ్రస్టేలియా, సౌదీ అరేబియా, ఖతార్, ఉజ్బెకిస్తాన్, జోర్డాన్, ఇరాన్ జట్లు ఎనిమిది బెర్త్‌లు దక్కించుకోగా... ఇంటర్ కాన్ఫడరేషన్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఇరాక్ జట్టు 2–1 గోల్స్‌తో బొలీవియా జట్టును ఓడించి తొమ్మిదో బెర్త్‌ను సంపాదించింది. జోర్డాన్, ఉజ్బెకిస్తాన్ జట్లు తొలిసారి ప్రపంచకప్ టోరీ్నకి అర్హత సాధించాయి. ఆ మూడు జట్లపైనే... దక్షిణ కొరియా జట్టు 12వసారి, జపాన్ జట్టు 8వసారి బరిలోకి దిగుతున్నాయి. ఇరాన్, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా జట్లకు ఇది ఏడో ప్రపంచకప్ కానుంది. ఖతార్, ఇరాక్ జట్లు రెండోసారి ప్రపంచకప్‌లో పోటీపడుతున్నాయి. జపాన్ జట్టు నాలుగుసార్లు, ఆస్ట్రేలియా రెండుసార్లు ప్రిక్వార్టర్ ఫైనల్ వరకు వచ్చాయి. ఈసారి కూడా దక్షిణ కొరియా, జపాన్, ఆ్రస్టేలియా జట్లపైనే ఆసియా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. మిగతా ఆరు జట్లు గ్రూప్ దశను దాటి ముందుకు వెళితే బోనస్ అనుకోవాలి. – సాక్షి క్రీడా విభాగం -
పూర్వ వైభవం కోసం!
ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలో అత్యంత నిలకడగా రాణిస్తున జట్లలో జర్మనీ జట్టు కచ్చితంగా ఉంటుంది. ఇప్పటి వరకు 22 సార్లు ప్రపంచకప్ జరగ్గా... అత్యధికసార్లు ఫైనల్ చేరుకున్న జట్టుగా జర్మనీకి పేరుంది. నాలుగుసార్లు (1954, 1974, 1990, 2014) విశ్వవిజేతగా నిలిచిన జర్మనీ జట్టు... మరో నాలుగుసార్లు ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా (1966, 1982, 1986, 2002) నిలిచింది. మరో నాలుగుసార్లు మూడో స్థానం (1934, 1970, 2006, 2010) సంపాదించింది. 2014లో బ్రెజిల్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లో నాలుగోసారి చాంపియన్‌గా నిలిచిన జర్మనీ... ఆ తర్వాత అనూహ్యంగా వెనుకబడిపోయింది. పలువురు స్టార్ ఆటగాళ్లు రిటైర్ కావడం... వారి స్థానాలను భర్తీ చేసేవాళ్లు ఇంకా తయారు కాకపోవడం... వెరసి జర్మనీ జట్టు తొలిసారి వరుసగా రెండు ప్రపంచకప్‌లలో (2018, 2022) గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. రెండేళ్ల క్రితం స్వదేశంలో జరిగిన ‘యూరో’ టోర్నీలో జర్మనీ క్వార్టర్ ఫైనల్లో చాంపియన్ స్పెయిన్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఇక ప్రపంచకప్ క్వాలిఫయింగ్‌లో గ్రూప్ ‘ఎ’లో ఉన్న జర్మనీ 15 పాయింట్లతో టాపర్‌గా నిలిచి మెగా ఈవెంట్‌కు అర్హత సాధించింది. పూర్వ వైభవం కోసం తాపత్రయపడుతున్న జర్మనీ ఈసారి గ్రూప్ దశ సులువుగానే దాటే అవకాశం ఉంది. గ్రూప్ ‘ఇ’లో కురసావ్, ఐవరీకోస్ట్, ఈక్వెడార్ జట్లతో జర్మనీకి చోటు కల్పించారు. జర్మనీ తొలి మ్యాచ్‌ను జూన్ 14న కురసావ్తో, రెండో మ్యాచ్‌ను జూన్ 20న ఐవరీకోస్ట్‌తో, జూన్ 25న ఈక్వెడార్‌తో ఆడుతుంది. మిడ్‌ఫీల్డర్లు జమాల్ ముసియాలా, ఫ్లోరియన్ విట్జ్, లెనార్ట్ కార్ల్, కాయ్ హావెట్జ్లతోపాటు వెటరన్ గోల్‌కీపర్ మాన్యుయెల్ న్యూయెర్ ప్రదర్శనపై జర్మనీ ముందంజ వేసే ఆశలు ఆధారపడి ఉన్నాయి. జర్మనీ జట్టుకు నాకౌట్ దశ ప్రిక్వార్టర్ ఫైనల్లో గత ప్రపంచకప్ రన్నరప్ ఫ్రాన్స్ ఎదురయ్యే అవకాశముంది. ఫ్రాన్స్ అడ్డంకిని అధిగమిస్తే జర్మనీ నుంచి అద్భుత ఫలితం ఆశించవచ్చు. – సాక్షి క్రీడావిభాగం -
మెస్సీ మాయ చేసేనా!
చివరిసారి అమెరికా ఆతిథ్యమిచ్చిన 1994 ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీ అర్జెంటీనా జట్టుకు చేదు అనుభవాలే మిగిల్చింది. దిగ్గజ ప్లేయర్ డీగో మారడోనా డోపింగ్ పరీక్షలో విఫలం కావడంతో అతనిపై అనర్హత వేటు పడింది. లీగ్ దశలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో అర్జెంటీనా 4–0తో గ్రీస్‌పై, 2–1తో నైజీరియాపై గెలిచింది. ఆ తర్వాత మారడోనా డోపింగ్‌లో దొరికిపోవడంతో నిర్వాహకులు అతనిపై వేటు వేశారు. మారడోనా లేకుండానే బల్గేరియాతో మూడో లీగ్ మ్యాచ్ ఆడిన అర్జెంటీనా 0–2తో ఓడిపోయింది. మూడో స్థానంలో నిలిచిన నాలుగు అత్యుత్తమ జట్లలో ఒకటిగా అర్జెంటీనా ముందంజ వేయగలిగింది. అయితే మారడోనా లేని అర్జెంటీనా ప్రిక్వార్టర్ ఫైనల్‌ను దాటలేకపోయింది. రొమేనియా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 2–3 గోల్స్ తేడాతో ఓడిపోయి నిష్క్రమించింది. ఈ ప్రపంచకప్ తర్వాత మారడోనా కెరీర్ కూడా ముగిసింది. 32 ఏళ్ల అనంతరం మరోసారి ప్రపంచకప్ టోర్నీకి అమెరికా ఆతిథ్యమివ్వనుంది. ఈసారి అర్జెంటీనా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. అంతేకాకుండా మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టును టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకటిగా పరిగణిస్తున్నారు. 39 ఏళ్ల మెస్సీ ఈ ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పడం లాంఛనమే. తన చివరి ప్రపంచకప్‌ను చిరస్మరణీయం చేసుకోవాలని మెస్సీ కూడా భావిస్తున్నాడు. సహచరులు కూడా మెస్సీకి ప్రపంచకప్ టైటిల్‌ను బహుమతిగా ఇవ్వాలని పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అర్జెంటీనా మరోసారి తమ అత్యుత్తమ ఆటతీరు కనబరిచేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం అమెరికాలోని మేజర్ లీగ్‌లో మెస్సీ ఇంటర్ మయామి జట్టు తరఫున ప్రొఫెషనల్ లీగ్ ఆడుతున్నాడు. కన్సాస్ సిటీలో ఏర్పాటు చేసిన మయామి జట్టు శిబిరంలో మెస్సీ సాధన చేస్తున్నాడు. అగ్రస్థానంతో... డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా క్వాలిఫయింగ్‌లో నిలకడగా రాణించి ప్రపంచకప్ బెర్త్‌ను దక్కించుకుంది. దక్షిణ అమెరికా జోన్ క్వాలిఫయింగ్‌లో అర్జెంటీనా 18 మ్యాచ్‌లు ఆడి 12 విజయాలు అందుకుంది. నాలుగు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని, నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయి 38 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. వరుసగా ఆరో ప్రపంచకప్ ఆడబోతున్న మెస్సీ ఈసారి కూడా అర్జెంటీనాను విజేతగా నిలబెడితే చరిత్ర పుటల్లో చోటు సంపాదిస్తాడు. వరుసగా రెండు ప్రపంచకప్‌లు అందించిన ఏకైక కెపె్టన్‌గా మెస్సీ గుర్తింపు పొందుతాడు. అంతేకాకుండా ఇటలీ (1934, 1938), బ్రెజిల్ (1958, 1962) తర్వాత వరుసగా రెండు ప్రపంచకప్‌లు గెలిచిన మూడో జట్టుగా అర్జెంటీనా నిలుస్తుంది. మరో నాలుగు గోల్స్ చేస్తే... 2022 ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా జట్టులోని 26 మంది ప్లేయర్లలో 17 మంది 2026 ప్రపంచకప్‌లోనూ ఆడుతున్నారు. ఇప్పటికే అత్యధిక ప్రపంచకప్ మ్యాచ్‌లు (26) ఆడిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పిన మెస్సీ మరో నాలుగు గోల్స్ చేస్తే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా మిరోస్లావ్ క్లోజ్ (జర్మనీ; 16 గోల్స్) పేరిట ఉన్న రికార్డును కూడా బద్దలు కొడతాడు. – సాక్షి క్రీడా విభాగంలీగ్ దశ తర్వాత పరీక్ష తాజా ప్రపంచకప్‌లో అర్జెంటీనాకు లీగ్ దశలో అనుకూలమైన ‘డ్రా’ పడింది. అయితే నాకౌట్ దశ నుంచి అర్జెంటీనాకు ప్రతి మ్యాచ్ పరీక్షలా నిలువనుంది. గ్రూప్ ‘జె’లో ఉన్న అర్జెంటీనా తమ తొలి మ్యాచ్‌ను జూన్ 16న అల్జీరియాతో, 22న రెండో మ్యాచ్‌ను ఆ్రస్టియాతో, 27న మూడో మ్యాచ్‌ను జోర్డాన్‌తో ఆడుతుంది. అర్జెంటీనా ఫామ్ దృష్ట్యా ఆ జట్టు మూడు మ్యాచ్‌ల్లో గెలిచి గ్రూప్ ‘టాపర్’గా నాకౌట్ దశకు చేరుకోవడం కష్టమేమీకాదు. ఇక నాకౌట్ దశలో గ్రూప్ ‘హెచ్’ రన్నరప్ జట్టుతో అర్జెంటీనా ఆడాల్సి ఉంది. గ్రూప్ ‘హెచ్’ నుంచి స్పెయిన్, ఉరుగ్వే జట్లు నాకౌట్ దశకు చేరుకోవచ్చు. అర్జెంటీనా ప్రిక్వార్టర్ ఫైనల్ ప్రత్యర్థిగా అమెరికా లేదా ఈజిప్ట్ ఉండవచ్చు. అంతా అనుకున్నట్లు జరిగితే.. క్వార్టర్ ఫైనల్లో క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్ జట్టు అర్జెంటీనాకు ఎదురవుతుంది. -
‘ఫిఫా’ వరల్డ్‌కప్ సరి‘కొత్త’గా...
విశ్వవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ ఉన్న ఫుట్‌బాల్ ప్రపంచకప్ పోరుకు సమయం ఆసన్నమైంది. అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ‘ఫిఫా’ వరల్డ్‌కప్ మరో ఏడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో పలు విప్లవాత్మక మార్పులు చేసేందుకు ‘ఫిఫా’ సిద్ధమైంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్ బోర్డు (ఐఎప్ఏబీ)తో కలిసి మెరుగైన నిబంధనలను రూపొందించింది. గతంలో మాదిరిగా ప్లేయర్లు సమయాన్ని వృథా చేయడానికి వీలు లేకుండా... ఆటలో మరింత పోటీతత్వం పెంచేందుకు ఈ నిబంధనలు ఉపకరించనున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం... – సాక్షి, క్రీడావిభాగం » బంతి మైదానం వెలుపలికి వెళ్తే... దాన్ని తిరిగి 5 సెకన్ల లోపు గ్రౌండ్లోకి తేవాల్సి ఉంటుంది. ఏ ఆటగాడైనా ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తే... దానికి బదులుగా ప్రత్యర్థి జట్టుకు ‘త్రో ఇన్’ అవకాశం ఇవ్వనున్నారు. గతంలో ఆటగాళ్లు తమ ప్లేయర్లు ఎక్కడ ఉన్నారో చూసుకొని బంతిని త్రో చేసేవారు. ఇప్పుడు ఆ అవకాశం ఉండదు. » ‘గోల్ కిక్’ల సమయాన్ని కూడా 5 సెకన్లకు పరిమితం చేశారు. కావాలని సమయాన్ని వృథా చేస్తే ప్రత్యర్థి జట్టుకు కార్నర్ కిక్ లభిస్తుంది. » ఎవరైనా ఆటగాడు సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాలంటే డిజిటల్ డిస్ప్లేపై ప్రదర్శించిన 10 సెకన్లలోపు ఒక ప్లేయర్ మైదానాన్ని వీడి అతడి స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాడు రావాలి. సమయాన్ని పాటించని జట్టు ఒక నిమిషం పాటు 10 మంది ప్లేయర్లతోనే ఆడాల్సి ఉంటుంది. » ప్లేయర్లు చికిత్స నిమిత్తం మైదానాన్ని వీడితే... తిరిగి గ్రౌండ్లోకి రావడానికి ముందు ఒక నిమిషం పాటు బయటే ఉండాలి. తీవ్రమైన గాయాల విషయంలో ఇందులో సడలింపులు ఇవ్వనున్నారు. » మైదానంలో ప్లేయర్లు తమ నోటిని చేత్తో మూయడం గానీ అడ్డంగా ఎలాంటి వస్తువులు పెట్టుకోవడం గానీ చేయరాదు. ఇది కేవలం వరల్డ్‌కప్‌లో మాత్రమే కాకుండా... ప్రపంచవ్యాప్తంగా అన్ని మ్యాచ్‌లలో అమలు చేయనున్నారు. జాత్యహంకారాన్ని అరికట్టేందుకు ‘ఫిఫా’ ఈ నిబంధన తీసుకొచ్చింది. దీన్ని అతిక్రమిస్తే ఎలాంటి హెచ్చరికలు లేకుండా నేరుగా ‘రెడ్ కార్డ్’ చూపిస్తారు. » మ్యాచ్‌కు రెండు చొప్పున ‘హైడ్రేషన్’ విరామాలు లభించనున్నాయి. 3 నిమిషాల ఈ బ్రేక్స్‌ను ఆట ఆరంభమైన 20 నిమిషాల తర్వాత తీసుకోవచ్చు. -
‘కిక్’ఎక్కించే సమరం
వేసవిలో వినోదం అందించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ ముగిసింది. ఇక వర్షాకాలంలో ‘కిక్’ ఎక్కించేందుకు మరో క్రీడా సమరం ముస్తాబైంది. విశ్వవ్యాప్త క్రీడాభిమానులను ఉర్రూతలూగించేందుకు ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీ వచ్చేస్తోంది. మరో ఎనిమిది రోజుల్లో ఈ మెగా ఈవెంట్‌కు తెర లేవనుంది. క్వాలిఫయింగ్‌లో 200కు పైగా దేశాలు పోటీపడితే... చివరకు 45 దేశాలు తమ అత్యుత్తమ ఆటతీరుతో ప్రపంచకప్ బెర్త్‌లు దక్కించుకున్నాయి. ఆతిథ్య దేశాల హోదాలో అమెరికా, మెక్సికో, కెనడా జట్లు నేరుగా అర్హత పొందాయి. ఓవరాల్‌గా 48 దేశాలు 39 రోజులపాటు విశ్వకిరీటం కోసం పోరాడనున్నాయి. జూన్ 11న మెక్సికో సిటీ స్టేడియంలో మెక్సికో, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌తో ప్రపంచకప్ మొదలవుతుంది. జూలై 19న న్యూయార్క్ స్టేడియంలో జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది. – సాక్షి క్రీడా విభాగంసూపర్ స్టార్ మెస్సీ సారథ్యంలో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా టైటిల్ నిలబెట్టుకుంటుందా? క్రిస్టియానో రొనాల్డోకు అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచకప్‌ను పోర్చుగల్ అందిస్తుందా? నెమార్ తన మ్యాజిక్‌తో బ్రెజిల్‌కు పూర్వ వైభవం లభిస్తుందా? ఐదోసారి ప్రపంచకప్‌ను ముద్దాడి బ్రెజిల్ సరసన జర్మనీ నిలుస్తుందా? బ్రెజిల్, జర్మనీ, అర్జెంటీనా, ఫ్రాన్స్, ఉరుగ్వే, ఇంగ్లండ్, స్పెయిన్ కాకుండా కొత్త చాంపియన్‌ను ఈసారైనా చూస్తామా? వీటన్నింటికీ సమాధానం జూలై 19వ తేదీన లభిస్తుంది. తొలిసారి మూడు దేశాల్లో... ఇప్పటి వరకు 22 సార్లు ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ జరిగింది. 1930లో ఉరుగ్వే తొలి ప్రపంచకప్ టోర్నీకి ఆతిథ్యమిచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1942, 1946లలో ప్రపంచకప్‌ను నిర్వహించలేదు. 1998 వరకు జరిగిన ప్రపంచకప్ టోర్నీలకు ఒక దేశం వేదికగా జరిగాయి. 2002లో తొలిసారి దక్షిణ కొరియా–జపాన్ దేశాలు సంయుక్తంగా ప్రపంచకప్‌ను నిర్వహించాయి. 2026 ప్రపంచకప్ టోర్నీకి మొదటిసారి (అమెరికా, మెక్సికో, కెనడా) మూడు దేశాలు కలిసి ఆతిథ్యమిస్తున్నాయి. 2030 ప్రపంచకప్ కూడా మూడు దేశాల్లో (మొరాకో, పోర్చుగల్, స్పెయిన్) జరగనుంది. ఇక 2034 ప్రపంచకప్ టోర్నీ ఆతిథ్య హక్కులు సౌదీ అరేబియాకు లభించాయి. మెక్సికో మూడోసారి... ప్రపంచకప్‌ను అత్యధికంగా మూడుసార్లు నిర్వహించిన దేశంగా మెక్సికో రికార్డు నెలకొల్పనుంది. గతంలో మెక్సికోలో 1970, 1986 ప్రపంచకప్ టోర్నీలు జరిగాయి. బ్రెజిల్ (1950, 2014), ఫ్రాన్స్ (1938, 1998), జర్మనీ (1974, 2006), ఇటలీ (1934, 1990) రెండుసార్లు చొప్పున ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించగా... తాజాగా ఈ జాబితాలో అమెరికా (1996, 2026) కూడా చేరనుంది. బ్రెజిల్ మాత్రమే... ఇప్పటి వరకు జరిగిన ప్రతి ప్రపంచకప్‌లోనూ ఆడిన ఏకైక జట్టుగా బ్రెజిల్ గుర్తింపు పొందింది. 2026 ప్రపంచకప్‌తో కలిపి బ్రెజిల్ వరుసగా 23వసారి ఈ మెగా ఈవెంట్లో ఆడనుంది. రెండో స్థానంలో జర్మనీ (21 సార్లు), మూడో స్థానంలో అర్జెంటీనా (19 సార్లు), నాలుగో స్థానంలో ఇటలీ, మెక్సికో (18 సార్లు చొప్పున), ఐదో స్థానంలో ఇంగ్లండ్, ఫ్రాన్స్, స్పెయిన్ (17 సార్లు చొప్పున), ఆరో స్థానంలో బెల్జియం, ఉరుగ్వే (15 సార్లు చొప్పున) ఉన్నాయి. 48 జట్లతో... మొదటి ప్రపంచకప్‌లో 13 దేశాలు పాల్గొన్నాయి. 1978 వరకు 16 జట్లతో నిర్వహించారు. 1982 నుంచి 1994 ప్రపంచకప్‌లను 24 జట్లకు అవకాశం ఇచ్చారు. 1998 నుంచి 2022 వరకు 32 దేశాలు ప్రపంచకప్ కోసం పోటీపడ్డాయి. తాజా ప్రపంచకప్‌లో ఏకంగా 48 జట్లు బరిలో ఉండనున్నాయి. 39 రోజులపాటు జరిగే ఈ టోర్నీలో మొత్తం 104 మ్యాచ్‌లు జరుగుతాయి. అమెరికా అత్యధికంగా 78 మ్యాచ్‌లకు ఆతిథ్యమిస్తుంది. మెక్సికో, కెనడా దేశాల్లో 13 మ్యాచ్‌ల చొప్పున జరుగుతాయి. మ్యాచ్‌లు అమెరికాలోని 11 నగరాల్లో, మెక్సికోలోని 3 నగరాల్లో, కెనడాలోని 2 నగరాల్లో జరుగుతాయి. నాకౌట్ దశకు 32 జట్లు జట్ల సంఖ్య పెరగడంతో ఈసారి ఫార్మాట్ కూడా మారింది. మొత్తం 48 జట్లను 12 గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో నాలుగు జట్లకు చోటు కల్పించారు. లీగ్ దశ ముగిశాక 12 గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లతోపాటు మూడో స్థానంలో నిలిచిన ఎనిమిది ఉత్తమ జట్లు నాకౌట్ దశకు (32 జట్లు) అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత ప్రిక్వార్టర్ ఫైనల్స్ (16 జట్లు), క్వార్టర్ ఫైనల్స్ (8 జట్లు), సెమీఫైనల్స్ (4 జట్లు), ఫైనల్ (2 జట్లు) జరుగుతాయి. నాలుగుసార్లు చాంపియన్ ఇటలీ వరుసగా మూడోసారి ఈ మెగా ఈవెంట్‌కు అర్హత పొందడంలో విఫలం కాగా... కెప్ వెర్డె, కురసావ్, జోర్డాన్, ఉజ్బెకిస్తాన్ జట్లు తొలిసారి ప్రపంచకప్‌లో అరంగేట్రం చేయనున్నాయి. నిద్ర మానేసి... ప్రపంచకప్ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి గం. 9:30, 10:30 నుంచి; అర్ధరాత్రి గం. 12:30 నుంచి, గం. 1:30 నుంచి; తెల్లవారుజాము గం. 3:30 నుంచి, 4:30 నుంచి; ఉదయం గం. 6:30 నుంచి, గం. 7:30 నుంచి, గం. 9:30 నుంచి జరుగుతాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో అభిమానులు ప్రపంచకప్ మ్యాచ్‌లు తిలకించాలంటే రాత్రంతా నిద్ర మానేయాల్సి ఉంటుంది. భారత్‌లో మ్యాచ్‌లను ‘జీ’ స్పోర్ట్స్ చానెల్స్ ప్రత్యక్ష ప్రసారం చేయున్నాయి. -
మెక్సికోలో పీలే విగ్రహావిష్కరణ
గ్వాడలహారా (మెక్సికో): ఫుట్‌బాల్ ప్రపంచకప్ ప్రారంభానికి ముందు... మెక్సికోలో బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే విగ్రహం ఏర్పాటు చేశారు. జూన్ 11 నుంచి జూలై 19 వరకు ‘ఫిఫా’ ప్రపంచకప్ జరగనుండగా... మెగా టోరీ్నకి కెనడా, మెక్సికో, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు జరిగే మెక్సికోలోని గ్వాడలహారాలో బ్రెజిల్ దివంగత దిగ్గజం పీలే భారీ విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు. సుదీర్ఘ కెరీర్లో బ్రెజిల్‌కు మూడు ‘ఫిఫా’ ప్రపంచకప్‌లు అందించిన పీలే... 1970లో మెక్సికోలో జరిగిన మెగా టోర్నీలో తమ జట్టుకు టైటిల్ అందించాడు. తమ దేశంతో పీలేకు ప్రత్యేక అనుబంధం ఉన్న నేపథ్యంలో... ఈ విగ్రహం ఏర్పాటు చేసినట్లు స్థానిక గవర్నర్ తెలిపారు. 82 ఏళ్ల వయసులో పీలే 2022లో మృతి చెందారు. ‘ఇక్కడ మ్యాచ్‌లు ఆడి, ఒక గొప్ప గోల్ చేసిన స్టార్ ఆటగాడి స్మారక విగ్రహం స్థానిక ప్రజలు, అభిమానులకు గొప్ప బహుమతి. పీలే గ్వాడలహారాను ప్రేమించారు. 1970లో మెక్సికన్ ప్రజలు అతడికి బ్రహ్మరథం పట్టారు. వరల్డ్‌కప్ మ్యాచ్‌లు చూసేందుకు వస్తున్న అభిమానులందరూ పీలే ఘనతలను తలచుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది’ అని గవర్నర్ పాబ్లో లెమస్ తెలిపారు. 1970, 1986 ‘ఫిఫా’ ప్రపంచకప్‌లకు ఆతిథ్యమిచ్చిన జలిస్కో స్టేడియం వెలుపల 9.5 మీటర్ల ఎత్తు గల పీలే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 1970లో బ్రెజిల్ జట్టు టైటిల్ గెలవడానికి ముందు లీగ్ దశ మ్యాచ్‌లతో పాటు, క్వార్టర్‌ఫైనల్, సెమీఫైనల్ మ్యాచ్‌లను ఇదే స్టేడియంలో ఆడింది. అనంతరం మెక్సికో అజ్టెకా స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఇటలీని ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ఈసారి ప్రపంచకప్‌లో తొలిసారి 48 దేశాలు పాల్గొంటున్నాయి. మొత్తం 104 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. -
‘ఎల్లో’ కార్డులపై సడలింపులు!
వాషింగ్టన్: రాబోయే ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లో అగ్రశ్రేణి ఆటగాళ్లు అనూహ్యంగా కీలక మ్యాచ్‌లకు దూరం కాకూడదని భావిస్తున్న అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) క్రమశిక్షణకు సంబంధించి పలు కొత్త నిబంధనలను తీసుకొచి్చంది. ఆటగాళ్లకు ‘ఎల్లో’ కార్డులు జారీ చేయడం, దానికి సంబంధించి శిక్షను అమలు చేసే విషయంలో సడలింపు ఇచ్చింది. సాధారణంగా వరుసగా రెండు ఎల్లో కార్డులు జారీ అయితే ఆ ఆటగాడు తర్వాతి మ్యాచ్‌లో ఆడకుండా సస్పెన్షన్ విధిస్తారు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనన ప్రకారం టోరీ్నలో ఎల్లో కార్డుకు గురైనా సరే... నాకౌట్ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. రెండుసార్లు ఎల్లో కార్డు రికార్డును అధికారులు తొలగిస్తారు. అంటే గ్రూప్ మ్యాచ్‌లలో ఎల్లో కార్డు అందుకున్నా... నాకౌట్‌కు ముందు దానిని పరిగణనలోకి తీసుకోరు. ఫలితంగా అతనిపై నిషేధం ఉండదు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ తర్వాత కూడా ఇదే తరహాలో గత రికార్డును పక్కన పెట్టి కొత్తగా మొదలు పెట్టే అవకాశం ఇస్తారు. అంటే ఒకవేళ క్వార్టర్ ఫైనల్లో రెండో ఎల్లో కార్డులను ఎదుర్కొన్నా అతను సెమీస్ ఆడటంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కీలక మ్యాచ్‌లకు టాప్ ప్లేయర్లు దూరం కాకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందని ‘ఫిఫా’ అభిప్రాయ పడింది. మరోవైపు కొందరు ఆటగాళ్లు తమ నోటిపై చేతిని అడ్డుగా పెట్టుకొని ప్రత్యర్థి ఆటగాళ్లను దూషిస్తున్నారు. దీనిని నివారించేందుకు కూడా ‘ఫిఫా’ కొత్త నిబంధన తెచి్చంది. ఇకపై ఇలా నోటికి చేతిని అడ్డుగా పెట్టి గొడవకు దిగితే అతనికి రిఫరీ ఏకంగా ‘రెడ్ కార్డు’ జారీ చేయవచ్చు. -
ఫిఫా వరల్డ్‌కప్.. రసవత్తరంగా పోటీ
ఫిఫా వరల్డ్‌కప్ కోసం ఫుట్‌బాల్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది జూన్‌లో ప్రారంభం కానున్న పురుషుల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో 48 జట్లు ఆడనున్నాయి. ఇందుకోసం క్వాలిఫైయింగ్ పోటీలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 34 జట్లు సాకర్ కప్‌లో ఆడేందుకు అర్హత సాధించాయి. ఇంకా 14 స్థానాలు ఖరారు కావాల్సి ఉంది. ఫిఫా చరిత్రలో మొదటిసారిగా మూడు దేశాలు (అమెరికా, కెనడా, మెక్సికో) ఈ మెగా టోర్నీని నిర్వహిస్తున్నాయి. 16 వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. సాకర్ కప్ 2026.. జూన్ 11న ప్రారంభమై, జూలై 19న ముగుస్తుంది.ఆతిథ్య దేశాలు అమెరికా, కెనడా, మెక్సికో.. క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు ఆడకుండానే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. కేప్ వెర్డే, కురాకావో, జోర్డాన్, ఉజ్బెకిస్తాన్ తొలిసారిగా సాకర్ బరిలో నిలిచాయి. 2022లో మూడవ టైటిల్‌ను గెలుచుకున్న అర్జెంటీనా (Argentina) డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో పోటీకి దిగుతుంది. ఇంగ్లండ్, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రెజిల్ వంటి అగ్రశేణి జట్లు ఇప్పటికే అర్హత సాధించి పోటీకి సై అంటున్నాయి. 8 క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ ఎనిమిదింటిలోనూ గెలిచి జోరు మీద ఉంది.27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నార్వే (Norway) జట్టు వరల్డ్‌కప్‌కు అర్హత సాధించింది. గ్రూప్ 'ఐ'లో జరిగిన చివరి మ్యాచ్‌లో పటిష్టమైన ఇటలీ జట్టును 4-1 గోల్స్ తేడాతో ఓడించింది. 24 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచి 1998 తర్వాత మళ్లీ ప్రపంచకప్ రేసులో నిలిచింది. గ్రూప్ 'ఎఫ్' నుంచి పోర్చుగల్ వరుసగా ఏడోసారి వరల్డ్‌కప్ బెర్త్ దక్కించుకుంది. 2010లో టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇచ్చిన దక్షిణాఫ్రికా 15 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రపంచ కప్‌లో అడుగుపెట్టింది. ఆఫ్రికా నుంచి 9, ఆసియా నుంచి 8, యూరప్ నుంచి 7, దక్షిణ అమెరికా నుంచి 6 జట్లు ఇప్పటివరకు అర్హత సాధించాయి.ఫుట్‌బాట్ ప్రపంచ కప్ 2026కు అర్హత సాధించిన జట్లు ఇవే ఆఫ్రికా:అల్జీరియాకేప్ వెర్డేఈజిప్ట్ఘానాఐవరీ కోస్ట్మొరాకోసెనెగల్దక్షిణాఫ్రికాట్యునీషియాఆసియా:ఆస్ట్రేలియాఇరాన్జపాన్జోర్డాన్ఖతార్సౌదీ అరేబియాదక్షిణ కొరియాఉజ్బెకిస్తాన్యూరప్:క్రొయేషియాఇంగ్లాండ్ఫ్రాన్స్జర్మనీనెదర్లాండ్స్నార్వేపోర్చుగల్ఉత్తర- మధ్య అమెరికా:కెనడా (సహ-హోస్ట్)మెక్సికో (సహ-హోస్ట్)యునైటెడ్ స్టేట్స్ (సహ-హోస్ట్)ఓషియానియా:న్యూజిలాండ్దక్షిణ అమెరికా:అర్జెంటీనాబ్రెజిల్కొలంబియాఈక్వెడార్పరాగ్వేఉరుగ్వేఫిఫా ప్రపంచ కప్ కోసం డ్రా డిసెంబర్ 5న వాషింగ్టన్ DCలోని కెన్నెడీ సెంటర్లో జరుగుతుంది. 2026 ప్రపంచ కప్ (FIFA World Cup 2026) జూన్ 11న ప్రారంభమవుతుంది. మెక్సికో నగరంలోని ఎస్టాడియో అజ్టెకా స్టేడియంలో మొదటి మ్యాచ్ జరుగుతుంది. జూలై 19న న్యూజెర్సీలోని మెట్ లైఫ్ స్టేడియంలో ఫైనల్ జరుగుతుంది.చదవండి: నార్వే నిరీక్షణ ముగిసె..ప్రపంచ కప్‌కు అర్హత సాధించే 48 జట్లతో నాలుగు చొప్పున 12 గ్రూపులుగా విభజిస్తారు. పాయింట్ల ఆధారంగా ప్రతి గ్రూప్ నుంచి రెండు జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయి. టోర్నమెంట్లో టాప్ 4లో నిలిచిన జట్లు సెమీఫైనల్ ఆడతాయి. ఇందులో నెగ్గిన జట్లు టైటిల్ కోసం పోటీ పడతాయి. మూడో స్థానం కోసం సెమీస్‌లో ఓడిన రెండు జట్ల మధ్య పోటీ ఉంటుంది. 34/48 ✅@aramco | #FIFAWorldCup pic.twitter.com/IULE2TlTsD— FIFA World Cup (@FIFAWorldCup) November 18, 2025 -
సౌదీ అరేబియాకే ఆతిథ్య హక్కులు
జ్యూరిచ్: పుష్కర కాలం వ్యవధిలో ఆసియాలోని మరో అరబ్ దేశం ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఖాయమైంది. 2022లో ఖతర్‌లో ఈ మెగా ఈవెంట్ జరగ్గా... ఇప్పుడు సౌదీ అరేబియా ఆ అవకాశం దక్కించుకుంది. 2034లో జరిగే ప్రపంచ కప్‌ను సౌదీ అరేబియాలో నిర్వహించనున్నట్లు ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అధికారికంగా ప్రకటించింది. 2034 వరల్డ్ కప్ కోసం ఒక్క సౌదీ మాత్రమే బిడ్ వేసింది. గత 15 నెలలుగా బిడ్డింగ్ ప్రక్రియ కొనసాగింది. మరే దేశం నుంచి పోటీ లేకపోవడంతో ఆ దేశానికే ఆతిథ్య హక్కులు గతంలోనే ఖాయమయ్యాయి. అయితే ‘ఫిఫా’ అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫ్యాంటినో నేతృత్వంలో బుధవారం 200 మంది ‘ఫిఫా’ సభ్యులు ఆన్లైన్ ద్వారా సమావేశమై దీనికి ఆమోద ముద్ర వేశారు. ఖతర్ తరహాలోనే ఈ దేశంలోనూ మానవ హక్కుల ఉల్లంఘన సాగుతోందని, వరల్డ్ కప్ అవకాశం ఇవ్వరాదని విమర్శలు వచి్చనా... ‘ఫిఫా’ వీటిని లెక్క చేయకుండా ముందుకు సాగింది. దేశ రాజధాని రియాద్‌తో పాటు ఇంకా ఇప్పటికీ నిర్మాణం ప్రారంభించని కొత్త నగరం ‘నియోమ్’లో వరల్డ్ కప్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. మూడు దేశాల్లో 2030 టోర్నీ... ‘ఫిఫా’ సమావేశంలో 2030 వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులను కూడా ఖాయం చేశారు. ఈ టోర్నీని యూరోప్ దేశాలు స్పెయిన్, పోర్చుగల్‌తో పాటు ఆఫ్రికా దేశం మొరాకో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తాయి. దీంతో పాటు 1930లో జరిగిన తొలి వరల్డ్ కప్‌కు వందేళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని దక్షిణ అమెరికాలోని మూడు దేశాల్లో తొలి మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. 1930 విజేత ఉరుగ్వే, రన్నరప్ అర్జెంటీనాతో పాటు ప్రపంచంలోనే అతి పురాతనమైన ‘దక్షిణ అమెరికా ఫుట్‌బాల్ సమాఖ్య’ ప్రధాన కేంద్రం ఉన్న పరాగ్వేలో కూడా ఒక మ్యాచ్ జరుగుతుంది. టోర్నీలోని మొత్తం 104 మ్యాచ్‌లను మూడు వేర్వేరు ఖండాల్లో నిర్వహించనుండటం విశేషం. -
మెస్సీ లేకుండానే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్ బరిలో ఆర్జెంటీనా
బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా ఫుట్‌బాల్ సూపర్‌స్టార్, 2022 ప్రపంచకప్ విజయసారథి లయోనల్ మెస్సీ గాయంతో ఫుట్‌బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌కు దూరమయ్యాడు. వచ్చేనెలలో రెండు క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో తలపడే అర్జెంటీనా జట్టును కోచ్ లయోనల్ స్కాలొని మంగళవారం ప్రకటించారు. మొత్తం 28 మంది సభ్యులతో క్వాలిఫయింగ్ పోటీలకు అర్జెంటీనా జట్టు సిద్ధమైంది. అయితే 37 ఏళ్ల మెస్సీ కుడి కాలి చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతను... సెప్టెంబర్ 5న చిలీతో, 10న కొలంబియాతో జరిగే రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ప్రపంచకప్ చాంపియన్ అర్జెంటీనా దక్షిణ అమెరికా క్వాలిఫయింగ్ రౌండ్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లాడిన అర్జెంటీనా ఖాతాలో 15 పాయింట్లున్నాయి. -
భారత్ శుభారంభం
కువైట్ సిటీ: ఫుట్‌బాల్ ప్రపంచకప్–2026 ఆసియా జోన్ రెండో రౌండ్ క్వాలిఫయింగ్ పోటీల్లో భారత్ శుభారంభం చేసింది. సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత జట్టు 1–0 గోల్ తేడాతో కువైట్ జట్టును ఓడించింది. ఆట 75వ నిమిషంలో మాన్విర్ సింగ్ గోల్‌తో భారత్ ఖాతా తెరిచింది. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని 22 ఏళ్ల తర్వాత వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో విదేశీ గడ్డపై భారత్ తొలి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈనెల 21న ఆసియా చాంపియన్ ఖతర్ జట్టుతో భారత్ రెండో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ ‘ఎ’లో భారత్, ఖతర్, కువైట్, అఫ్గానిస్తాన్ జట్లున్నాయి. ఇంటా, బయట పద్ధతిలో జరిగే లీగ్ మ్యాచ్‌లు ముగిశాక గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మూడో రౌండ్‌కు అర్హత పొందుతాయి. ఇప్పటి వరకు భారత జట్టు ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో మూడో రౌండ్ కు అర్హత సాధించలేదు -
ముద్దు వివాదం.. పదవికి రాజీనామా చేసిన ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్
ప్రపంచకప్ గెలిచిన ఆనందంలో తమ దేశ స్టార్ ఫుట్‌బాలర్ జెన్నిఫర్ హెర్మోసోను బలవంతంగా ముద్దు పెట్టుకుని వివాదాల్లో చిక్కుకున్న స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశాడు. కొద్ది రోజుల కిందట ఫిఫా రుబియాలెస్‌పై వేటు వేసింది. తాజాగా రుబియాలెసే స్వయంగా తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు తన రాజీనామా లేఖను స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్‌కు సమర్పించాడు. కాగా, స్పెయిన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు జగజ్జేతగా అవతరించిన అనంతరం మెడల్స్ ప్రజెంటేషన్ సందర్భంగా రుబియాలెస్.. జెన్నిఫర్ హెర్మోసోను పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో రుబియాలెస్.. జెన్నిఫర్‌తో పాటు మిగతా క్రీడాకారిణులను కూడా చెంపలపై ముద్ద పెట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. రుబియాలెస్ నుంచి ఊహించని ఈ ప్రవర్తన చూసి జెన్నిఫర్‌తో పాటు అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. ఈ ఉదంతంపై స్పెయిన్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగడంతో రుబియాలెస్ తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేశాడు. ఈ ఏడాది ఆగస్ట్‌లో జరిగిన ఫిఫా మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో స్పెయిన్.. ఇంగ్లండ్‌పై 1-0 గోల్స్ తేడాతో గెలిచి జగజ్జేతగా అవతరించింది. -
అర్జెంటీనాను గెలిపించిన మెస్సీ
2026 ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నమెంట్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు మొదలయ్యాయి. బ్యూనస్ ఎయిర్స్లో శుక్రవారం జరిగిన దక్షిణ అమెరికా జోన్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా 1–0తో ఈక్వెడార్ జట్టును ఓడించింది. 83 వేల మంది ప్రేక్షకులు హాజరైన ఈ మ్యాచ్‌లో ఆట 78వ నిమిషంలో కెపె్టన్ మెస్సీ చేసిన గోల్‌తో అర్జెంటీనా ఆధిక్యంలోకి వెళ్లింది. 176 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో మెస్సీకిది 104వ గోల్ కావడం విశేషం. వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీల్లో మెస్సీకిది 29వ గోల్. 29 గోల్స్‌తో లూయిస్ స్వారెజ్ (ఉరుగ్వే) పేరిట ఉన్న రికార్డును మెస్సీ సమం చేశాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో కొలంబియా 1–0తో వెనిజులాపై గెలుపొందగా... పరాగ్వే–పెరూ మ్యాచ్ 0–0తో ‘డ్రా’ అయింది. 2026 ప్రపంచకప్‌ను అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. మొత్తం 48 దేశాలు బరిలోకి దిగుతాయి. -
బలవంతపు ముద్దుకు తగిన మూల్యం.. ఫెడరేషన్ చీఫ్‌పై సస్పెన్షన్ వేటు
స్పెయిన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ తమ దేశ స్టార్ క్రీడాకారిణి జెన్నిఫర్ హెర్మోసోను పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టుకున్నందుకు తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఈ ఉదంతం అనంతరం స్పెయిన్‌లో చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో రుబియాలెస్‌పై ఫిఫా సస్పెన్షన్ వేటు వేసింది. ఈ సస్పెన్షన్ ప్రాథమికంగా 90 రోజుల పాటు అమల్లో ఉంటుందని ఫిఫా పేర్కొంది. సస్పెన్షన్‌తో పాటు రుబియాలెస్‌పై క్రమశిక్షణా చర్యలు కూడా ఉంటాయని తెలిపింది. కాగా, స్పెయిన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు జగజ్జేతగా అవతరించిన అనంతరం మెడల్స్ ప్రజెంటేషన్ సందర్భంగా రుబియాలెస్.. జెన్నిఫర్ హెర్మోసోను పెదాలపై బలవంతంగా ముద్దు పెట్టుకున్న విషయం తెలిసందే. ఆ సమయంలో రుబియాలెస్.. జెన్నిఫర్‌తో పాటు మిగతా క్రీడాకారిణులను కూడా చెంపలపై ముద్ద పెట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. రుబియాలెస్ నుంచి ఊహించని ఈ ప్రవర్తన చూసి జెన్నిఫర్‌తో పాటు అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. ఈ ఉదంతంపై స్పెయిన్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఓ మహిళలను అయిష్టంగా చుంబించడం సమర్ధనీయం కాదని స్పానిష్ ప్రజలు నిరసనలకు దిగారు. ఈ ఉదంతం స్పెయిన్‌లో రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది. నిరసనలు, ఆందోళలను తీవ్రరూపం దాల్చడంతో ఆ దేశ ప్రధాని పెడ్రో సాంచెజ్ రంగంలోకి దిగారు. రుబియాలెస్ బాధ్యతాయుతమైన వివరణ ఇవ్వాలని సూచించారు. క్రీడా శాఖకు సంబంధించిన స్పానిష్ హై కౌన్సిల్ రుబియాలెస్‌పై చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో ఫిఫా జోక్యం చేసుకుని రుబిమాలెస్పై తూలెసస్పెన్షన్ వేటు వేసింది. -
ఫుట్‌బాల్ క్రీడాకారిణికి ముద్దు పెట్టిన ఫెడరేషన్ చీఫ్.. స్పెయిన్‌లో రచ్చ రచ్చ
2023 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను స్పెయిన్ తొలిసారిగా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆగస్ట్ 20న జరిగిన ఫైనల్లో స్పెయిన్.. ఇంగ్లండ్‌ను 1-0 గోల్స్ తేడాతో మట్టికరిపించి జగజ్జేతగా ఆవిర్భవించింది. అయితే మ్యాచ్ అనంతరం ఆ దేశ ఫుట్‌బాల్ ఫెడరేషన్ చీఫ్ లూయిస్ రుబియాలెస్ సొంత క్రీడాకారిణుల పట్ల వ్యవహరించిన తీరు స్పెయిన్‌లో రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది. మెడల్స్ ప్రజెంటేషన్ సందర్భంగా లూయిస్.. స్వదేశీ స్టార్ ఫుట్‌బాలర్ జెన్నిఫర్ హెర్మోసోను పెదాలపై ముద్దు పెట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. మిగతా క్రీడాకారిణులను కూడా చెంపలపై ముద్ద పెట్టుకుని వల్గర్‌గా బిహేవ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో స్పెయిన్‌లో నిరసనలు హోరెత్తాయి. దీంతో లూయిస్ ఓ మెట్టుకిందికి దిగొచ్చి సదరు క్రీడాకారిణిలకు, అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. అయినా స్పెయిన్‌లో నిరసనలు శాంతించలేదు. ఔ లూయిస్ ఉద్దేశపూర్వకంగా తప్పుచేసి, సారీ చెబితే సరిపోతుందా అంటూ నిరసనకారులు స్వరాలను పెంచారు. నిరసనలు, ఆందోళలను తీవ్రరూపం దాల్చడంతో ఆ దేశ ప్రధాని పెడ్రో సాంచెజ్ జోక్యం చేసుకున్నారు. లూయిస్ నామమాత్రం సారీ చెబితే సరిపోదని నిరసనకారులతో స్వరం కలిపారు. ముద్దు వివాదంపై లూయిస్ బాధ్యతాయుతమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, ఫెడరేషన్ అధ్యక్షుడిపై చర్యలు తీసుకునే అధికారం తనకు లేదని చేతులు దులుపుకున్నాడు. దీంతో క్రీడా శాఖకు సంబంధించిన స్పానిష్ హై కౌన్సిల్ రంగంలోకి దిగింది. స్పెయిన్ ప్రభుత్వం కాని సాకర్ కౌన్సిల్ కాని లూయిస్‌పై చర్యలు తీసుకోకపోతే తాను చర్యలకు ఉపక్రమిస్తానని కౌన్సిల్ అధ్యక్షుడు ప్రకటన విడుదల చేశారు. మొత్తానికి స్పెయిన్‌లో ముద్దు వివాదం చినికిచినికి గాలివానలా మారుతుంది. -
ఫిఫా ప్రపంచకప్‌లో ఆడిన అతిపిన్న వయస్కురాలిగా..
సిడ్నీ: ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీల్లో మ్యాచ్ ఆడిన అతి పిన్న వయస్కురాలిగా దక్షిణ కొరియా అమ్మాయి కేసీ పెయిర్ (16 ఏళ్ల 26 రోజులు) రికార్డు సృష్టించింది. కొలంబియాతో మంగళవారం జరిగిన మహిళల ప్రపంచకప్ మ్యాచ్‌లో కేసీ పెయిర్ కొరియా తరఫున 78వ నిమిషంలో బరిలోకి దిగింది. గతంలో ఈ రికార్డు ఐఫెనీ చిజ్నీ (నైజీరియా; 16 ఏళ్ల 34 రోజులు; 1999 ప్రపంచకప్‌లో) పేరిట ఉంది. చదవండి: MLC 2023: విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన క్లాసెన్.. ప్లే ఆఫ్స్‌కు ముంబై -
ఎంబాపెకు బంపరాఫర్.. ఏకంగా రూ. 2,716 కోట్లు!
సిడ్నీ: సమకాలీన ఫుట్‌బాల్‌లో అత్యుత్తమ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న కిలియాన్ ఎంబాపె కోసం సహజంగానే క్లబ్‌లు క్యూ కడతాయి. 2018 వరల్డ్‌కప్‌ను ఫ్రాన్స్ గెలవడంతో పాటు 2022లో తమ జట్టు ఫైనల్ చేరడంలో కూడా అతను కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఎంబాబెకు సౌదీ అరేబియా క్లబ్ అల్–హిలాల్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. అతనితో ఒప్పందం కోసం 332 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2 వేల 716 కోట్లు) ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఎంబాపె పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్జీ) టీమ్‌తో ఉన్నాడు. ఈ టీమ్‌తో అతను కాంట్రాక్ట్ పొడిగించుకునే అవకాశం కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో అల్–హిలాల్ ముందుకు వచి్చంది. ప్రస్తుతం దీనిపై చర్చలు కొనసాగుతున్నాయి. -
వచ్చేసారైనా భారత్ ఉంటుందా?
92 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో ఏనాడూ భారత్ నేరుగా అర్హత సాధించలేకపోయింది. బ్రెజిల్ వేదికగా 1950లో జరిగిన ప్రపంచకప్‌లో పాల్గొనాలని భారత్‌కు ఆహ్వానం లభించినా పలు కారణాలతో వెళ్లలేకపోయింది. 1950 నుంచి 1970 వరకు భారత ఫుట్‌బాల్ జట్టు ఓ వెలుగు వెలిగింది. 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్ లో నాలుగో స్థానంలో నిలిచిన భారత జట్టులో హైదరాబాద్ నుంచి ఏకంగా ఎనిమిది మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించారు. హైదరాబాద్‌కే చెందిన సయ్యద్ అబ్దుల్ రహీమ్ భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. 1962 జకార్తా ఆసియా క్రీడల్లో రహీమ్ శిక్షణలో భారత జట్టు ఫైనల్లో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణ పతకాన్ని సాధించింది. 1963లో కోచ్ రహీమ్ క్యాన్సర్‌తో మృతి చెందడంతో భారత ఫుట్‌బాల్ కూడా వెనుకడుగులు వేయడం ప్రారంభించింది. కాలానుగుణంగా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో వస్తున్న మార్పులకు తగ్గట్టు ఆలిండియా ఫుట్‌బాల్ సమాఖ్య అభివృద్ధి చర్యలు తీసుకోకపోవడంతో దేశంలో ఫుట్‌బాల్‌కు క్రమక్రమంగా ఆదరణ తగ్గిపోవడం మొదలైంది. ఒకప్పుడు ఆసియాలో నంబర్‌వన్‌గా ఉన్న జట్టు నేడు దక్షిణాసియాలోని బంగ్లాదేశ్, నేపాల్ జట్లపై కూడా గెలవడానికి ఇబ్బంది పడుతోంది. 2022 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్ గ్రూప్ దశలోనే వెను దిరిగింది. 2026 ప్రపంచకప్ కోసం ఆసియా నుంచి 8 లేదా 9 జట్లకు బెర్త్‌లు లభిస్తాయి. ఈ నేపథ్యంలో భారత్ తమ ప్రపంచకప్ కలను సాకారం చేసుకోవాలంటే పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం భారత్ 106వ ర్యాంక్‌లో... ఆసియా లో 19వ స్థానంలో ఉంది. జపాన్, కొరియా, సౌదీ అరేబియా, ఇరాన్, ఆస్ట్రేలియా, ఖతర్, యూఏఈ, ఒమన్, ఉజ్బెకిస్తాన్, చైనా, బహ్రెయిన్, జోర్డాన్ లాంటి పటిష్ట జట్లను దాటుకొని భారత్ ప్రపంచకప్ బెర్త్ సాధించాలంటే అత్యద్భుతంగా ఆడాలి. భారత జట్టు మాజీ గోల్‌కీపర్ కల్యాణ్ చౌబే ఇటీవల అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ మాజీ ఫుట్‌బాలర్ అధ్యక్షతలోనైనా భారత ఫుట్‌బాల్ అభివృద్ధివైపు అడుగులు వేస్తుందో లేదో వేచి చూడాలి. -
నేడే ప్రపంచకప్ ఫుట్‌బాల్ ఫైనల్.. అర్జెంటీనాతో అమీతుమీ తేల్చుకోనున్న ఫ్రాన్స్
దోహా: ఎనిమిదేళ్ల క్రితం ప్రపంచకప్ అందినట్టే అంది చేజారిన క్షణం ఇప్పటికీ అర్జెంటీనా కెప్టెన్ లయనెల్ మెస్సీకి గుర్తుండే ఉంటుంది. ఎనిమిదేళ్ల తర్వాత ప్రపంచకప్‌ను ముద్దాడే అవకాశం మళ్లీ మెస్సీ ముంగిట వచ్చింది. ఈరోజు జరిగే ప్రపంచకప్ ఫైనల్ తన అంతర్జాతీయ కెరీర్లో అర్జెంటీనా తరఫున చివరి మ్యాచ్ కాబోతుందని ఇప్పటికే ప్రకటించిన 35 ఏళ్ల మెస్సీ ఈ తుది సమరాన్ని చిరస్మరణీయం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. పేరుకు అర్జెంటీనా–ఫ్రాన్స్ జట్ల మధ్య సాకర్ ప్రపంచకప్ ఫైనల్ అంటున్నా... దీనిని మెస్సీ, ఫ్రాన్స్ మధ్య పోరుగానే అభివర్ణించాల్సి ఉంటుంది. తటస్థ అభిమానులందరూ అర్జెంటీనా గెలిచి మెస్సీ తన కెరీర్‌ను ఘనంగా ముగించాలని కోరుకుంటున్నా... అత్యంత పటిష్టంగా ఉన్న ఫ్రాన్స్ మెస్సీ కల కలగానే మిగిలిపోవాలనే లక్ష్యంతో పోరాటం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అంతా తానై... టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకటిగా ఖతర్‌కు వచ్చిన అర్జెంటీనాకు తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా చేతిలో అనూహ్య ఓటమి ఎదురైంది. దాంతో మెస్సీపైనే కాకుండా అర్జెంటీనా జట్టు సత్తాపై అందరికీ సందేహం కలిగింది. అయితే కెప్టెన్‌గా మెస్సీ రెండో మ్యాచ్ నుంచి అంతా తానై జట్టును ముందుండి నడిపించాడు. మెరుపు కదలికలతో ప్రత్యర్థి డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ ఐదు గోల్స్ చేయడంతోపాటు సహచరులు గోల్స్ చేయడానికి తోడ్పడ్డాడు. ముఖ్యంగా క్రొయేషియాతో జరిగిన సెమీఫైనల్లో మెస్సీ విశ్వరూపం ప్రదర్శించాడు. ఆ మ్యాచ్‌లో మెస్సీ మ్యాజిక్‌తోనే అర్జెంటీనా మూడో గోల్ చేయగలిగింది. క్రొయేషియా డిఫెండర్ గ్వార్డియోల్ ఎంత వెంటపడ్డా మెస్సీ తన పాదరసంలాంటి కదలికలతో అతడిని తప్పిస్తూ సహచరుడు అల్వారెజ్‌కు అందించిన పాస్, క్షణాల్లో నమోదైన గోల్‌ను ఎప్పటికీ మర్చిపోలేము. అయితే ఫ్రాన్స్‌తో జరిగే ఫైనల్‌ను అర్జెంటీనా కెప్టెన్ మెస్సీతోపాటు అతడి సహచరులు తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఆడినా తమ నుంచి ట్రోఫీ మరోసారి చేజారిపోతుందని అర్జెంటీనాకు తెలుసు. మెస్సీతోపాటు ఈ టోర్నీలో నాలుగు గోల్స్ చేసిన అల్వారెజ్, ఎంజెల్ డి మారియా, రోడ్రిగో డి పాల్, ఎంజో ఫెర్నాండెజ్, గోల్‌కీపర్ మార్టినెజ్ రాణించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అర్జెంటీనా ఆద్యంతం పకడ్బందీగా ఆడి ట్రోఫీని అందుకుంటుందా లేక ఆఖరి మెట్టుపై తడబడి నాలుగోసారి ట్రోఫీని చేజార్చుకుంటుందో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. ఎంబాపె ఒక్కడే కాదు... అర్జెంటీనా విజయావకాశాలు మెస్సీ ఆటపై ఆధారపడి ఉండగా... ఫ్రాన్స్ మాత్రం ఒకరిద్దరిపై ఆధారపడకుండా సమష్టి ఆటతో ఫైనల్‌కు చేరుకుంది. 23 ఏళ్ల కిలియాన్ ఎంబాపె ఐదు గోల్స్‌తో అదరగొట్టగా... 36 ఏళ్ల ఒలివియర్ జిరూడ్ నాలుగు గోల్స్‌తో మెరిపించాడు. థియో హెర్నాండెజ్, చువమెని, రాన్‌డల్, రాబియోట్ ఒక్కో గోల్ చేయగా... గ్రీజ్మన్ గోల్స్ చేయకున్నా సహచరులు గోల్స్ చేయడానికి తోడ్పడ్డాడు. గోల్‌కీపర్, కెప్టెన్ హుగో లోరిస్ ఏకంగా 53 సార్లు గోల్స్ కాకుండా అడ్డుగోడలా నిలబడ్డాడు. 1998లో తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన ఫ్రాన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న దీదీర్ డెషాంప్స్... కోచ్‌గా మారి 2018లో ఫ్రాన్స్‌కు రెండోసారి ప్రపంచ కప్‌ను అందించాడు. ఈ నేపథ్యంలో అత్యంత పటిష్టంగా కనిపిస్తున్న ఫ్రాన్స్ జట్టుకు మరోసారి గెలవాలంటే ఎలా ఆడాలో తెలుసు కాబట్టి నేటి ఆఖరి సమరం రంజుగా సాగుతుందని కచ్చితంగా చెప్పవచ్చు. 6: అర్జెంటీనాకిది ఆరో ప్రపంచకప్ ఫైనల్. 1978, 1986లలో విజేతగా నిలిచిన అర్జెంటీనా 1930, 1990, 2014లలో రన్నరప్‌గా నిలిచింది. నేటి ఫైనల్లో అర్జెంటీనా ఓడిపోతే అత్యధిక సార్లు ఫైనల్లో ఓడిపోయిన జట్టుగా జర్మనీ (4 సార్లు) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తుంది. 4: ఫ్రాన్స్ జట్టుకిది నాలుగో ప్రపంచకప్ ఫైనల్. 1998, 2018లలో టైటిల్ నెగ్గిన ఫ్రాన్స్ 2006లో రన్నరప్‌గా నిలిచింది. 3: నేటి ఫైనల్లో ఫ్రాన్స్ గెలిస్తే ఇటలీ (1930, 1934), బ్రెజిల్ (1958, 1962) జట్ల తర్వాత వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ గెలిచిన మూడోజట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. 4: ప్రపంచకప్ చరిత్రలో ఫ్రాన్స్, అర్జెంటీనా జట్ల మధ్య జరగనున్న నాలుగో మ్యాచ్ ఇది. 1930లో అర్జెంటీనా 1–0తో... 1978లో అర్జెంటీనా 2–1తో ఫ్రాన్స్‌పై గెలిచింది. 2018 ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 4–3తో అర్జెంటీనాను ఓడించింది. 10: దక్షిణ అమెరికా జట్లతో జరిగిన గత 10 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్ ఓడిపోలేదు. ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి, నాలుగు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. చివరిసారి దక్షిణ అమెరికా జట్టు చేతిలో ఫ్రాన్స్ ఓడిపోవడం 1978లో (అర్జెంటీనా చేతిలో 1–2తో) జరిగింది. 11: దక్షిణ అమెరికా, యూరోప్ ఖండాలకు చెందిన దేశాల మధ్య జరగనున్న 11వ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఇది. ఏడుసార్లు దక్షిణ అమెరికా జట్లకు టైటిల్ లభించగా... మూడుసార్లు యూరోప్ జట్ల ఖాతాలో టైటిల్ చేరింది. -
FIFA World Cup Qatar 2022 Semi-Final: అందరి కళ్లు మొరాకో పైనే...
దోహా: అందరి అంచనాలను తారుమారు చేస్తూ... ఊహకందని ప్రదర్శనతో అదరగొడుతున్న ఆఫ్రికా జట్టు మొరాకో మరో సంచలనం సృష్టించాలనే పట్టుదలతో ఉంది. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో భాగంగా నేడు జరిగే రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌తో మొరాకో తలపడనుంది. ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య ఇదే తొలి ముఖాముఖి మ్యాచ్ కాగా... వేర్వేరు టోర్నీలలో ఈ రెండు జట్లు 11 సార్లు తలపడ్డాయి. 1963లో ఒక్కసారి ఫ్రాన్స్‌ను ఓడించిన మొరాకో ఆ తర్వాత ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి, మూడు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. 2007 తర్వాత ఈ రెండు జట్ల మధ్య మరోసారి మ్యాచ్ జరుగుతుండటం విశేషం. ఎంబాపె, జిరూడ్, గ్రీజ్మన్, థియో హెర్నాండెజ్, చువమెని, గోల్‌కీపర్ హుగో లోరిస్లాంటి స్టార్ ఆటగాళ్లతో ఫ్రాన్స్ పటిష్టంగా ఉంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 22వ స్థానంలో ఉన్న మొరాకో ప్రపంచకప్‌లో సెమీఫైనల్ చేరిన తొలి ఆఫ్రికా దేశంగా రికార్డు నెలకొల్పింది. కెనడాతో మ్యాచ్‌లో సెల్ఫ్ గోల్ మినహా ఈ మెగా టోర్నీలో ప్రత్యర్థి జట్టుకు ఒక్క గోల్ కూడా సమర్పించుకొని ఏకైక జట్టుగా మొరాకో నిలిచింది. గ్రూప్ దశలో గత ప్రపంచకప్ రన్నరప్ క్రొయేషియా జట్టును నిలువరించిన మొరాకో ఆ తర్వాత రెండో ర్యాంకర్ బెల్జియంపై... ప్రిక్వార్టర్ ఫైనల్లో 2010 విశ్వవిజేత స్పెయిన్‌పై... క్వార్టర్ ఫైనల్లో 2016 యూరో చాంపియన్ పోర్చుగల్‌ను ఓడించి తమను ఏమాత్రం తక్కువ అంచనా వేయొద్దని ఫ్రాన్స్‌కు హెచ్చరికలు పంపించింది. మొరాకో తరఫున యూసుఫ్ ఎన్ నెసిరి, అచ్రఫ్ హకీమి, హకీమ్ జియెచ్, సఫ్యాన్ అమ్రాబత్, గోల్‌కీపర్ యాసిన్ బోనో ప్రదర్శన మరోసారి కీలకం కానుంది. ఈ టోర్నీలో ప్రత్యర్థి ఆటగాళ్లు గోల్‌పోస్ట్ లక్ష్యంగా కొట్టిన 39 షాట్లను గోల్‌కీపర్ యాసిన్ బోనో నిలువరించడం విశేషం. -
భారత్ లో ఫుట్ బాల్ ఎందుకు పాపులర్ కాలేదు..?
-
FIFA World Cup Qatar 2022: బెల్జియం అవుట్
దోహా: స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన ప్రపంచ రెండో ర్యాంకర్, గత ప్రపంచకప్‌లో మూడో స్థానం పొందిన బెల్జియం జట్టు తాజా మెగా ఈవెంట్లో గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టింది. నాకౌట్ దశ బెర్త్ దక్కాలంటే గత వరల్డ్‌కప్ రన్నరప్ క్రొయేషియా జట్టుపై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ను బెల్జియం 0–0తో ‘డ్రా’ చేసుకుంది. బెల్జియంను నిలువరించిన క్రొయేషియా ఐదు పాయింట్లతో గ్రూప్ ‘ఎఫ్’లో రెండో స్థానంలో నిలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. క్రొయేషియాతో మ్యాచ్‌లో బెల్జియం జట్టు ఓటమి స్వయంకృతమే అని చెప్పాలి. స్టార్ ఫార్వర్డ్ రొమెలు లుకాకుకు ఏకంగా ఐదుసార్లు గోల్ చేసే సువర్ణావకాశాలు వచ్చినా అతను వృథా చేశాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5101504615.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA World Cup 2022: ఒకే సమయానికి రెండు మ్యాచ్‌లు.. ఎందుకిలా..?
ఫిఫా వరల్డ్‌కప్‌లో అన్ని జట్లు తమ ఆఖరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు (ఒకే గ్రూప్‌కు చెందినవి) ఒకే సమయంలో ఎందుకు ఆడతాయన్న విషయం చాలామంది సాకర్ ఫాలోవర్స్‌కు అర్ధం కాకపోవచ్చు. అయితే దీని వెనుక చాలా పెద్ద చరిత్ర ఉందన్నది అందరూ తెలుసుకోవాలి. వివరాల్లోకి వెళితే.. స్పెయిన్ వేదికగా జరిగిన 1982 వరల్డ్‌కప్‌లో అల్జీరియా తదుపరి రౌండ్‌కు క్వాలిఫై అయ్యే అవకాశాలు వెస్ట్ జర్మనీ, ఆస్ట్రియా జట్ల మధ్య జరిగే మ్యాచ్‌పై ఆధారపడి ఉన్నాయి. దీంతో గ్రూప్ మ్యాచ్‌లన్నీ ముగిసిన అల్జీరియా, ఆ మ్యాచ్ ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూసింది. ఆ మ్యాచ్‌లో పటిష్టమైన వెస్ట్ జర్మనీ రెండు గోల్స్ తేడాతో గెలిస్తే అల్జీరియా తర్వాతి రౌండ్‌కు చేరుతుంది. ఈ క్రమంలో ఆట మొదలయ్యాక 11 నిమిషాల్లోనే గోల్ చేసిన వెస్ట్ జర్మనీ.. ఆ తర్వాత గోల్ చేసే అవకాశం వచ్చినా ఉదాసీనంగా వ్యవహరించి, అల్జీరియా ఇంటిదారి పట్టడానికి పరోక్ష కారణమైంది. కారణం ఏంటంటే.. అల్జీరియా తమ గ్రూప్ దశ ఓపెనింగ్ మ్యాచ్‌లో వెస్ట్ జర్మనీపై విజయం సాధించింది. ఈ అక్కసుతో వెస్ట్ జర్మనీ.. అల్జీరియా తదుపరి రౌండ్‌కు చేరకుండా చావు దెబ్బకొట్టింది. వెస్ట్ జర్మనీ ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ మోసాన్ని అప్పట్లో సాకర్ ప్రపంచం మొత్తం వేలెత్తి చూపింది. వెస్ట్ జర్మనీని సస్పెండ్ చేయాలని అల్జీరియా.. ఫిఫా గవర్నింగ్ బాడీకి ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కు చేరిన వెస్ట్ జర్మనీ.. అల్జీరియాకు చేసిన మోసానికి ఫలితం అనుభవించింది. వెస్ట్ జర్మనీ.. నాటి చారిత్రక ఫైనల్లో ఇటలీ చేతిలో 1-3 గోల్స్ తేడాతో చావుదెబ్బ తినింది. అల్జీరియాతో మ్యాచ్‌లో వెస్ట్ జర్మనీ తొండాట ఆడిందని విచారణలో తెలుసుకున్న ఫిఫా.. ఆ జట్టుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ, ఆ తర్వాతి వరల్డ్‌కప్ (1986) నుంచి రూల్స్ మాత్రం మార్చింది. గ్రూప్ స్టేజ్‌లో అన్ని జట్ల తమ చివరి మ్యాచ్‌లు ఒకే సమయంలో ఆడాలని రూల్స్‌ను సవరించింది. ఇలా చేయడం వల్ల ఏ జట్టు ఉద్దేశపూర్వకంగా మరో జట్టుకు (ఒకే గ్రూప్) నష్టం కలిగించే విధంగా వ్యవహరించే అవకాశం ఉండదు. నాకౌట్స్‌కు చేరాలంటే ఓ మ్యాచ్ ఫలితంపై మరో జట్టు భవితవ్యం ఆధార పడే ఆస్కారం ఉండదు. నాకౌట్స్‌కు చేరే క్రమంలో ఆఖరి గ్రూప్ మ్యాచ్ కీలకం కాబట్టి ఫిఫా ఈ నిర్ణయం తీసుకుంది. 1986 నుంచి ఆఖరి గ్రూప్ మ్యాచ్ విషయంలో ఇదే పద్దతి పాటిస్తుంది. కాగా, నాటి రూల్ ప్రకారం ప్రస్తుత వరల్డ్‌కప్‌లోనూ తొలి 8 రోజులు రోజుకు నాలుగేసి మ్యాచ్‌లు, ఒక్కోటి ఒక్కో సమయంలో (మధ్యాహ్నం 3:30, సాయంత్రం 6:30, రాత్రి 9:30, అర్ధరాత్రి 12:30) జరిగాయి. రౌండ్ ఆఫ్ 16కి (నాకౌట్) ముందు జరగాల్సిన ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లు (ఒకే గ్రూప్‌కు చెందినవి) మాత్రం రెండూ ఒకే సమయంలో (రాత్రి 8:30, అర్ధరాత్రి 12:30) జరుగుతున్నాయి. నవంబర్ 29 నుంచి ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లు జరుగుతున్న విషయం తెలిసిందే. -
FIFA World Cup Qatar 2022: జర్మనీ... డ్రాతో గట్టెక్కింది!
దోహా: ప్రపంచకప్ ఫుట్‌బాల్ చరిత్రలో జర్మనీది ఘనచరిత్రే! బ్రెజిల్ అంతటి మేటి జట్టు జర్మనీ. బ్రెజిల్ ఐదుసార్లు గెలిస్తే... జర్మనీ నాలుగుసార్లు ప్రపంచకప్‌ను అందుకుంది. అంతేకాదు గెలిచినన్ని సార్లు రన్నరప్‌గా నిలిచింది. మరో నాలుగుసార్లు మూడో స్థానంలో నిలిచింది. ఇలా పాల్గొన్న ప్రతీ మెగా ఈవెంట్లోనూ సత్తా చాటుకున్న మేటి జట్టు గత టోర్నీలో తొలి రౌండ్ దాటకపోవడమే పెద్ద షాక్ అనుకుంటే మళ్లీ ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొంటుంది. స్పెయిన్‌తో జరిగిన లీగ్ పోరులో జర్మనీ 1–1తో డ్రాతో గట్టెక్కింది. స్పెయిన్ తరఫున సబ్‌స్టిట్యూట్ అల్వారో మొరాటా (62వ ని.లో), జర్మనీ జట్టులో సబ్‌స్టిట్యూట్ ఫుల్క్రుగ్ (83వ ని.లో) గోల్ చేశారు. ఇప్పుడు ఒక ఓటమి, ఒక డ్రాతో ఉన్న జర్మనీ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కోస్టారికాను ఓడిస్తేనే సరిపోదు. మిగతా జట్ల ఫలితాలు కూడా కలిసి రావాలి. ఈ గ్రూపులో ఆఖరి లీగ్ పోటీల్లో కోస్టారికాతో జర్మనీ... జపాన్‌తో స్పెయిన్ తలపడతాయి. ఈ రెండు మ్యాచ్‌లు గురువారమే జరుగనున్నాయి. దీంతో ఇంకో రెండు రోజుల్లో ఏ రెండు ముందుకో, ఏ రెండు ఇంటికో తేలిపోతుంది. -
FIFA World Cup Qatar 2022: ‘ఘన’మైన విజయం
దోహా: తొలి మ్యాచ్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చినా... చివరకు పోర్చుగల్ ముందు తలొగ్గిన ఆఫ్రికా దేశం ఘనా తర్వాతి పోరులో సత్తా చాటింది. తమకంటే బలమైన, ర్యాంకింగ్స్‌లో ఎంతో మెరుగ్గా ఉన్న దక్షిణ కొరియాను చిత్తు చేసి గ్రూప్ ‘హెచ్’లో సమరాన్ని ఆసక్తికరంగా మార్చింది. ఈ మ్యాచ్‌లో ఘనా 3–2 గోల్స్ తేడాతో కొరియాపై విజయం సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ కుడూస్ (34వ, 68వ ని.లో) రెండు గోల్స్‌తో చెలరేగగా, మొహమ్మద్ సలిసు (24వ ని.లో) మరో గోల్ చేశాడు. కొరియా ఆటగాడు చో గూసంగ్ (58వ, 61వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. ఘనా ఆరంభం నుంచి దూకుడుగా ఆడింది. ఆ జట్టు ఫార్వర్డ్లు దూసుకుపోవడంతో తొలి 24 నిమిషాల్లోనైతే బంతి పూర్తిగా కొరియా ఏరియాలోనే కనిపించింది. చివరకు ఘనా ఫలితం రాబట్టింది. జోర్డాన్ ఆయూ ఎడమ వైపు నుంచి కొట్టిన ఫ్రీ కిక్‌ను హెడర్‌తో కెప్టెన్ ఆండ్రూ ఆయూ నియంత్రణలోకి తెచ్చుకోగా, ఆ వెంటనే సలిసు గోల్‌గా మలిచాడు. మరో పది నిమిషాల్లోనే ఘనా ఆధిక్యం పెంచుకుంది. ఈసారి కూడా జోర్డాన్ ఆయూనే పాస్ అందించగా... కుడూస్ హెడర్‌తో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపడంతో విస్తుపోవడం కొరియా వంతైంది. తొలి అర్ధభాగంలో ఘనా ఆట చూస్తే కొరియా చిత్తుగా ఓడుతుందనిపించింది. అయితే విరామం తర్వాత కొరియా కోలుకుంది. 168 సెకన్ల వ్యవధిలో చో గూసంగ్ చేసిన రెండు హెడర్ గోల్స్ ఒక్కసారిగా మ్యాచ్ పరిస్థితిని మార్చేశాయి. లీ కాంగ్ ఇచ్చిన క్రాస్తో తొలి గోల్ చేసిన గూసంగ్, రెండో గోల్‌తో అద్భుతాన్ని ప్రదర్శించాడు. కిమ్ జిన్ కిక్ కొట్టగా, గోల్ పోస్ట్ ముందు గిడియాన్ మెన్సాను తప్పించి గాల్లోకి ఎగురుతూ గోల్ సాధించడం హైలైట్‌గా నిలిచింది. స్కోరు సమం కావడంతో మళ్లీ హోరాహోరీ మొదలైంది. అయితే కొరియా డిఫెన్స్ వైఫల్యాన్ని సొమ్ము చేసుకుంటూ కుడూస్ మళ్లీ జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత కొరియా ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. చివర్లో ఘనా గోల్‌కీపర్ లారెన్స్ అతీ జిగీ మెరుపు వేగంతో కదులుతూ గోల్స్‌ను అడ్డుకోవడం విశేషం. మ్యాచ్ తర్వాత పెనాల్టీ విషయంలో రిఫరీ ఆంథోనీ టేలర్‌తో వాదనకు దిగిన కొరియా కోచ్ బెంటో రెడ్‌కార్డుకు గురయ్యాడు. ప్రపంచకప్‌లో నేడు ఈక్వెడార్ X సెనెగల్ రాత్రి గం. 8:30 నుంచి నెదర్లాండ్స్ X ఖతర్ రాత్రి గం. 8:30 నుంచి ఇరాన్ X అమెరికా అర్ధరాత్రి గం. 12:30 నుంచి ఇంగ్లండ్ X వేల్స్ అర్ధరాత్రి గం. 12:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమా చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం. -
FIFA World Cup Qatar 2022: నెదర్లాండ్స్, ఈక్వెడార్ మ్యాచ్ ‘డ్రా’
దోహా: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మరో మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. నెదర్లాండ్స్, ఈక్వెడార్ జట్ల మధ్య శుక్రవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్ 1–1తో ‘డ్రా’ అయింది. ఈ మ్యాచ్ ఫలితంతో గ్రూప్ ‘ఎ’లో ఉన్న ఆతిథ్య ఖతర్ జట్టు ప్రస్థానం గ్రూప్ దశలోనే ముగిసింది. ఆట ఆరో నిమిషంలో కోడి గాప్కో గోల్‌తో నెదర్లాండ్స్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. విరామ సమయం వరకు ఆధిక్యంలో నిలిచిన ‘ఆరెంజ్ జట్టు’ రెండో అర్ధభాగంలో తడబడింది. ఆట 49వ నిమిషంలో ఈక్వెడార్ ప్లేయర్ ఎనెర్ వాలెన్సియా గోల్ సాధించి స్కోరును 1–1తో సమం చేశాడు. ఒక విజయం, ఒక ‘డ్రా’తో ప్రస్తుతం గ్రూప్ ‘ఎ’లో నెదర్లాండ్స్, ఈక్వెడార్ నాలుగు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. తమ గ్రూప్ చివరి లీగ్ మ్యాచ్‌లను ఈ రెండు జట్లు ‘డ్రా’ చేసుకుంటే నాకౌట్ దశకు (ప్రిక్వార్టర్ ఫైనల్స్) అర్హత సాధిస్తాయి. -
FIFA World Cup Qatar 2022: పోర్చు‘గోల్’ కొట్టింది..!
దోహా: ‘ఫిఫా’ ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో పోర్చుగల్ ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా బోణీ కొట్టింది. గోల్ లేకుండా తొలి అర్ధ భాగం చప్పగా సాగగా... ద్వితియార్ధంలో పెనాల్టీ కిక్ మ్యాచ్‌ను ఉన్నపళంగా మార్చేసింది. చకాచకా గోల్స్‌తో నమోదవడంతో మ్యాచ్‌లో ఆసక్తి అంతకంతకూ పెరిగింది. చివరకు పోర్చుగల్ 3–2తో ఘనాపై గెలిచింది. ఆట 64వ నిమిషంలో స్టార్ స్ట్రయికర్ క్రిస్టియానో రొనాల్డోను మొరటుగా కిందపడేయడంతో రిఫరీ పెనాల్టీ కిక్ ఇచ్చాడు. దీన్ని సులువుగానే రొనాల్డో గోల్‌గా మలిచాడు. కానీ 8 నిమిషాల వ్యవధిలో ఘన ఆటగాడు అండ్రూ అవియు (73వ ని.) ఫీల్డ్ గోల్‌తో స్కోరును 1–1గా సమం చేశాడు. మళ్లీ ఐదు నిమిషాల్లో ఆధిక్యం మారింది. జొవో ఫెలిక్స్ (78వ ని.), రాఫెల్ లియో (80వ ని.) ఫీల్డ్ గోల్స్ చేయడంతో పోర్చుగల్ 3–1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెగ్యులర్ టైమ్ ముగిసే దశలో ఘనా ఆటగాడు ఉస్మాన్ బుకారి (89వ ని.) హెడర్‌తో అద్భుతమైన గోల్ సాధించాడు. ఇంజ్యూరి టైమ్‌లో స్కోరును సమం చేసేందుకు ఘనా ఆటగాళ్లు శక్తికి మించి శ్రమించారు. ఆఖరి క్షణందాకా వారు గోల్‌పోస్ట్‌పై చేసిన దాడుల్ని పోర్చుగల్ డిఫెండర్లు అడ్డుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య పదే పదే ఘర్షణ వాతావరణం ఏర్పడింది. రిఫరీ ఆరు సార్లు ఎల్లో కార్డు ప్రయోగించాడు. పోర్చుగల్ జట్టులో ఇద్దరు, ఘనా బృందంలో నలుగురు ఎల్లో కార్డుకు గురయ్యారు. 5: ఐదు ప్రపంచకప్‌లలోనూ గోల్ చేసిన ఏకైక ఆటగాడు రొనాల్డో. ఈ సాకర్ స్టార్ 2006 మొదలు 2010, 2014, 2018, 2022 ప్రపంచకప్‌లలో గోల్ చేశాడు. ఓవరాల్‌గా 8 గోల్స్ సాధించాడు. -
FIFA World Cup Qatar 2022: స్పెయిన్ ‘సెవెన్’ స్టార్ ప్రదర్శన
దోహా: ఫుట్‌బాల్ ప్రపంచకప్ టైటిల్ ఫేవరెట్స్‌లో ఒక జట్టయిన స్పెయిన్ భారీ విజయంతో బోణీ కొట్టింది. గ్రూప్ ‘ఇ’లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో 2010 విశ్వవిజేత స్పెయిన్ 7–0 గోల్స్ తేడాతో కోస్టారికా జట్టును చిత్తుగా ఓడించింది. స్పెయిన్ తరఫున ఫెరాన్ టోరెస్ (31వ, 54వ ని.లో) రెండు గోల్స్ సాధించగా... డానీ ఓల్మో (11వ ని.లో), మార్కో అసెన్సియో (21వ ని.లో), గావి (74వ ని.లో), కార్లోస్ సోలెర్ (90వ ని.లో), అల్వారో మొరాటా (90+2వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. తమ ప్రపంచకప్ చరిత్రలో స్పెయిన్కిదే అతిపెద్ద విజయం. ఆ జట్టు ప్రపంచకప్ మ్యాచ్‌లో ఏడు గోల్స్ చేయడం ఇదే తొలిసారి. కోస్టారికాతో మ్యాచ్‌లో స్పెయిన్ సంపూర్ ఆధిపత్యం చలాయించింది. 82 శాతం బంతి స్పెయిన్ ఆధీనంలో ఉండటం వారి ఆధిపత్యానికి నిదర్శనం. స్పెయిన్ ప్రత్యర్థి గోల్‌పోస్ట్ లక్ష్యంగా ఎనిమిది షాట్లు కొట్టగా... కోస్టారికా ఒక్కసారి కూడా స్పెయిన్ గోల్‌పోస్ట్ లక్ష్యంగా షాట్ కొట్టలేకపోయింది. స్పెయిన్ ఆటగాళ్లు ఏకంగా 1,043 పాస్‌లు పూర్తి చేశారు. ప్రపంచకప్ చరిత్రలో ఏ జట్టు కూడా ఒక మ్యాచ్‌లో ఇన్ని పాస్‌లు పూర్తి చేయలేదు. కోస్టారికా ఆటగాళ్లు 231 పాస్‌లతో సరిపెట్టుకున్నారు. ప్రపంచకప్ మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో స్పెయిన్ మూడు గోల్స్ చేయడం 1934 తర్వాత ఇదే తొలిసారి. 1934లో బ్రెజిల్‌పై తొలి అర్ధభాగంలో స్పెయిన్ మూడు గోల్స్ సాధించింది. క్రొయేషియా 0 మొరాకో 0 గత ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీ రన్నరప్ క్రొయేషియాను మొరాకో నిలువరించింది. బుధవారం గ్రూప్ ‘ఎఫ్’లో జరిగిన లీగ్ మ్యాచ్ 0–0తో డ్రాగా ముగిసింది. సీనియర్ స్ట్రయికర్, క్రొయేషియా కెప్టెన్ మోడ్రిచ్ ఖాతా తెరిచేందుకు గట్టి ప్రయత్నాలే చేసిన మొరాకో ఆటగాళ్లు అడ్డుగోడ కట్టేయంతో గోల్ నమోదు కాలేదు. -
FIFA World Cup Qatar 2022: ఫ్రాన్స్ సూపర్ షో
అల్ వాక్రా (ఖతర్): వరుసగా రెండు ప్రపంచకప్‌లలో ఒకే జట్టు విజేతగా నిలిచి 60 ఏళ్లయింది. బ్రెజిల్ పేరిట ఉన్న ఈ ఘనతను తాము కూడా సాధించాలనే లక్ష్యంతో ఖతర్‌కు వచ్చిన డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ తొలి పరీక్షలో పాస్ అయింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్ ‘డి’ లీగ్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ జట్టు 4–1 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియా జట్టును ఓడించి శుభారంభం చేసింది. ఫ్రాన్స్ తరఫున ఒలివియర్ జిరూడ్ (32వ, 71వ ని.లో) రెండు గోల్స్ సాధించగా... అడ్రియన్ రాబియోట్ (27వ ని.లో), ఎంబాపె (68వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. ఆస్ట్రేలియా తరఫున ఏకైక గోల్‌ను క్రెయిగ్ గుడ్విన్ (9వ ని.లో) సాధించాడు. షాక్ నుంచి తేరుకొని... వరుసగా ఐదోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఆస్ట్రేలియా మైదానంలో అభిమానులందరూ పూర్తిగా సర్దుకొని కూర్చునేలోపే ఖాతా తెరిచింది. ఆట తొమ్మిదో నిమిషంలో కుడి వైపు నుంచి లెకీ అందించిన పాస్‌ను క్రెయిగ్ గుడ్విన్ లక్ష్యానికి చేర్చడంతో ఆస్ట్రేలియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. దాంతో అభిమానులకు మరో సంచలన ఫలితం తప్పదా అనే అనుమానం కలిగింది. అయితే ఫ్రాన్స్ జట్టు వెంటనే తేరుకుంది. సమన్వయంతో ఆడింది. ఆస్ట్రేలియా జట్టుకు పగ్గాలు వేసింది. ఐదు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ సాధించి 2–1తో ఆధిక్యాన్ని అందుకుంది. 27వ నిమిషంలో ఎడమ వైపు నుంచి థియో హెర్నాండెజ్ కొట్టిన షాట్‌ను ‘డి’ ఏరియాలో ఉన్న ఆడ్రియన్ రాబియోట్ హెడర్ షాట్‌తో ఆస్ట్రేలియా గోల్కీపర్ను బోల్తా కొట్టించాడు. 32వ నిమిషంలో ఎడమ వైపు నుంచి రాబియోట్ అందించిన పాస్‌ను ఒలివియర్ జిరూడ్ గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఫ్రాన్స్ 2–1తో ముందంజలో ఉంది. రెండో అర్ధభాగంలోనూ ఫ్రాన్స్ ఆధిపత్యం కనబరిచింది. ఈసారి మూడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ సాధించి ఆస్ట్రేలియాకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ఈ గెలుపుతో ఫ్రాన్స్ జట్టుకు మూడు పాయింట్లు లభించాయి. 51 ఆస్ట్రేలియాపై రెండు గోల్స్ చేసిన క్రమంలో ఒలివియర్ జిరూడ్ ఫ్రాన్స్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా థియరీ హెన్రీ (51 గోల్స్) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. -
FIFA World Cup Qatar 2022: జర్మనీకి జపాన్ షాక్
FIFA World Cup 2022 Germany Vs Japan Highlights: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మరో అనూహ్య ఫలితం వచ్చింది. మంగళవారం రెండుసార్లు విశ్వవిజేత అర్జెంటీనాను సౌదీ అరేబియా బోల్తా కొట్టిస్తే... బుధవారం ఏకంగా నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన జర్మనీ జట్టును జపాన్ ఓడించి పెను సంచలనం సృష్టించింది. ఆసియా గడ్డపై రెండు దశాబ్దాల తర్వాత జరుగుతున్న ప్రపంచకప్‌లో రెండు రోజుల వ్యవధిలో రెండు ఆసియా జట్లు అద్భుతం చేశాయి. దోహా: ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో మేటి జట్లు, మాజీ చాంపియన్లకు ఆసియా జట్లు ఎవరూ ఊహించని విధంగా షాక్ ఇస్తున్నాయి. బుధవారం గ్రూప్ ‘ఇ’లో భాగంగా నాలుగుసార్లు చాంపియన్ జర్మనీని జపాన్ కంగుతినిపించింది. ఇద్దరు సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లు రిత్సు డాన్, టకుమా అసానో చివరి 15 నిమిషాల్లో చేసిన రెండు గోల్స్‌తో జపాన్ 2–1 స్కోరుతో జర్మనీని గట్టిదెబ్బే తీసింది. తరచూ జర్మన్ క్లబ్‌లలో ఆడే రిత్సు (75వ ని.), అసానో (83వ ని.) ఈ ప్రపంచకప్‌లో ఆ జాతీయ జట్టును ఓడించడంలో కీలకపాత్ర పోషించారు. జర్మనీ తరఫున ఇల్కే గుయెండగన్ (33వ ని.) గోల్ సాధించాడు. ఈ గ్రూప్‌లో టైటిల్ ఫేవరెట్ జట్టయిన జర్మనీ ఆరంభం నుంచే గోల్స్ ప్రయత్నాలకు పదును పెట్టింది. ఈ క్రమంలో 24 సార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్ లక్ష్యంగా షాట్లు ఆడింది. ప్రథమార్ధంలోనే గుయెండగన్ గోల్‌తో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తీవ్రమైన ఒత్తిడిలో రెండో అర్ధభాగాన్ని మొదలుపెట్టిన జపాన్‌కు సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లు అసాధారణ ఫలితాలను సాధించి పెట్టారు. జపాన్ 2–1 ఆధిక్యంతో గెలుపు దారిలో పడగా... జర్మనీ మాత్రం ఎక్కడా పట్టు సడలించలేదు. ఆఖరి నిమిషం దాకా కష్టపడింది. నిర్ణీత సమయంలోని 90వ నిమిషం నుంచి ఇంజ్యూరీ టైమ్ 9 నిమిషాల పాటు స్కోరు సమం చేసేందుకు కడదాకా చెమటోడ్చింది. ఫుల్క్రగ్, రుడిగెర్, గోరెట్జా, సులే అదేపనిగా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై షాట్లు ఆడారు. అయితే జపాన్ డిఫెండర్లు, గోల్ కీపర్ సమన్వయంతో ఆడ్డుకోవడంతో జర్మనీ ప్రయత్నాలన్నీ నీరుగారాయి. జపాన్ గోల్ కీపర్ షుయిచి గొండా పెట్టని కోటలా నిలుచున్నాడు. ప్రపంచకప్ చరిత్ర లో ఆసియా జట్టు చేతిలో ఓడిపోవడం జర్మనీకిది రెండోసారి. 2018 ప్రపంచకప్‌లో దక్షిణ కొరియా చేతిలో జర్మనీ 0–2తో ఓడిపోయింది. చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్.. టీమిండియాకు భారీ షాక్! స్టార్ ఆటగాడు దూరం Abu Dhabi T10: కెప్టెన్సీ పోయిందన్న కసితో విధ్వంసం! 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో! -
FIFA World Cup Qatar 2022: ఇంగ్లండ్ శుభారంభం
దోహా: ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ బోణీ అదిరింది. గ్రూప్ ‘బి’లో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 6–2 గోల్స్ తేడాతో ఇరాన్‌పై ఘనవిజయం సాధించింది. గతేడాది ‘యూరో కప్’ ఫైనల్లో ఇటలీతో జరిగిన షూటౌట్లో నిరాశపరిచిన బుకయో సాకా, మార్కస్ రాష్‌ఫోర్డ్ తాజా మ్యాచ్‌లో ‘హీరో’లయ్యారు. బుకయో (43వ, 62వ నిమిషంలో) రెండు గోల్స్ చేయగా, మార్కస్ (71వ ని.లో) ఒక గోల్ సాధించాడు. మిగతా మూడు గోల్స్‌ను జూడ్ బెలింగమ్ (35వ ని.లో), రహీమ్ స్టెర్లింగ్ (45+1వ ని.లో), జాక్ గ్రెలిష్ (90వ ని.లో) సాధించారు. మెహది టరెమి (65వ ని., 90+13వ ని. ఇంజూరి టైమ్) చేసిన రెండు గోల్స్‌తో ఇరాన్ పరువు నిలిచింది. ఇంగ్లండ్ స్ట్రయికర్లు ఆటగాళ్లు పాదరసంలా కదలడంతో ఇరాన్ డిఫెండర్లకు కష్టాలు తప్పలేదు. మ్యాచ్ మొత్తంమీద బంతిని తమ గుప్పిటే పెట్టుకోవడంలో ఇంగ్లండ్ స్ట్రయికర్లు సఫలమయ్యారు. ఇంగ్లండ్ తొలి అర్ధభాగంలోనే 3–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి అర్ధభాగంలో ఇంగ్లండ్ ఆటగాళ్ల ఆధీనంలో బంతి 82 శాతం ఉండగా... ఆటగాళ్లు ఏకంగా 366 పాస్‌లను పూర్తి చేశారు. 1966 తర్వాత ఓ ప్రపంచకప్ తొలి అర్ధభాగంలో నమోదైన అత్యధిక పాస్‌లు ఇవే కావడం విశేషం. ఇరాన్ గోల్‌కీపర్‌కు గాయం మ్యాచ్ మొదలైన కాసేపటికే ఇరాన్ గోల్ కీపర్ అలి బెరన్వంద్ తీవ్రంగా గాయపడి మైదానం వీడాడు. సహచరుల తల అతని ముఖా నికి బలంగా తాకడంతో ముక్కు, గదవ దగ్గర రక్తస్రావమైంది. వెంటనే అతన్ని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. నెదర్లాండ్స్ గెలుపు సెనెగల్ జట్టుతో సోమవారమే జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 2–0తో గెలిచింది. ఆట 84వ నిమిషంలో కొడీ గాప్కో గోల్‌తో నెదర్లాండ్స్ ఖాతా తెరిచింది. ఇంజ్యూరీ టైమ్ (90+9వ ని.)లో డావీ క్లాసెన్ గోల్‌తో నెదర్లాండ్స్ విజయం ఖాయమైంది. ప్రపంచకప్‌లో నేడు అర్జెంటీనా X సౌదీ అరేబియా మధ్యాహ్నం గం. 3:30 నుంచి డెన్మార్క్ X ట్యునీషియా సాయంత్రం గం. 6:30 నుంచి మెక్సికో X పోలాండ్ రాత్రి గం. 9:30 నుంచి ఫ్రాన్స్ X ఆస్ట్రేలియా అర్ధరాత్రి గం. 12:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమా చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
FIFA World Cup Qatar 2022: వహ్వా! అయ్యో ఆతిథ్య జట్టు...
అట్టహాసంగా ప్రారంభోత్సవం ‘మనల్నందరినీ కలిపే ఈ క్షణం మనందరినీ విడదీసే ఘటనలకంటే ఎంతో గొప్పది... అయితే ఇది ఈ ఒక్క రోజుకు పరిమితం కాకుండా శాశ్వతంగా నిలిచిపోయేందుకు ఏమేం చేయాలి’... హాలీవుడ్ స్టార్ మోర్గన్ ఫ్రీమన్ గంభీర స్వరంతో ప్రేక్షకులను అడిగిన ఈ ప్రశ్నతో విశ్వ సంబరానికి విజిల్ మోగింది. ఖతర్ దేశం అంచనాలకు తగినట్లుగా అద్భుతమైన ప్రారంభోత్సవ వేడుకలతో ప్రపంచ అభిమానుల మనసులు దోచింది. తమ దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలను రూపొందించారు. అల్ బైత్ స్టేడియం మధ్యలో ఫ్రీమన్ ఆద్యంతం తన వ్యాఖ్యానంతో రక్తి కట్టిస్తుండగా... భిన్నమైన సాంస్కృతిక, సంప్రదాయ కార్యక్రమాలు కట్టి పడేశాయి. ప్రపంచకప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఖతర్ ‘యూ ట్యూబర్’ ఘనిమ్ అల్ ముఫ్తాతో ఫ్రీమన్ సంభాషణ ఆసక్తికరంగా సాగింది. కాడల్ రిగ్రెషన్ సిండ్రోమ్‌తో బాధపడుతూ ఘనిమ్ నడుము కింది భాగం మొత్తం చచ్చుబడిపోయింది. ఈ ప్రపంచంలో ఉన్న భిన్నత్వం గురించి ఫ్రీమన్ అడగ్గా... ఖురాన్‌లోని కొన్ని పంక్తులతో ఘనిమ్ సమాధానమిచ్చాడు. కొరియా ప్రఖ్యాత గాయకుడు జుంగ్ కూక్, ఖతర్ సింగర్ ఫహద్ అల్ కుబైసి కలిసి వరల్డ్ కప్ థీమ్ సాంగ్ ‘డ్రీమర్స్’ను ఆలాపించినప్పుడు 60 వేల సామర్థ్యం గల స్టేడియం దద్దరిల్లింది. సాంప్రదాయ కత్తి నృత్యం ‘అల్ అర్దా’ ప్రదర్శించినప్పుడు కూడా భారీ స్పందన వచ్చింది. వరల్డ్ కప్ మస్కట్ ‘లయీబ్’ను, టోర్నీలో పాల్గొంటున్న 32 దేశాల జెండాలను కూడా ఘనంగా ప్రదర్శించారు. చివరగా...ఖతర్ రాజు తమీమ్ బిన్ హమద్ అల్–థని ‘అరబ్ ప్రపంచం తరఫున అందరికీ ఈ వరల్డ్ కప్‌లో స్వాగతం పలుకుతున్నాం’ అంటూ మెగా టోర్నీ ప్రారంభమైనట్లు అధికారికంగా ప్రకటించడంతో కార్యక్రమం ముగిసంది. 92 సంవత్సరాల ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు ఆతిథ్య జట్టు తాము ఆడిన తొలి మ్యాచ్‌లో ఓడిపోలేదు. విజయం సాధించడం లేదంటే ‘డ్రా’తో సంతృప్తి పడటం జరిగింది. కానీ ఆదివారం ఈ ఆనవాయితీ మారింది. టోర్నీ చరిత్రలో తొలిసారి ఆతిథ్య జట్టు ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓటమి మూటగట్టుకుంది. ఈ మెగా ఈవెంట్ నిర్వహణ కోసం లక్షల కోట్లు వెచ్చించిన ఖతర్ దేశానికి తొలి మ్యాచ్ మాత్రం నిరాశను మిగల్చగా... నాలుగోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఈక్వెడార్ విజయంతో బోణీ కొట్టి శుభారంభం చేసింది. అల్ ఖోర్: గతంలో ఏనాడూ ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించలేకపోయిన ఖతర్ జట్టు ఆతిథ్య జట్టు హోదా కారణంగా తొలిసారి బరిలోకి దిగింది. ఈ మెగా టోర్నీకి సన్నాహాలు చాలా ఏళ్ల నుంచి సాగుతున్నా ఆతిథ్య జట్టు మాత్రం మైదానంలో ఆశించినస్థాయిలో మెరిపించలేకపోయింది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ 44వ ర్యాంకర్ ఈక్వెడార్ 2–0 గోల్స్‌తో ప్రపంచ 50వ ర్యాంకర్ ఖతర్ జట్టును ఓడించి శుభారంభం చేసింది. ఈక్వెడార్ తరఫున నమోదైన రెండు గోల్స్‌ను ఇనెర్ వాలెన్సియా (16వ నిమిషంలో, 31వ నిమిషంలో) సాధించడం విశేషం. ఈ గెలుపుతో ఈక్వెడార్‌కు మూడు పాయింట్లు లభించాయి. గత ప్రపంచకప్‌నకు అర్హత సాధించడంలో విఫలమైన ఈక్వెడార్ తాజా టోర్నీలో మాత్రం ఖతర్‌పై అదరగొట్టే ప్రదర్శన చేసింది. గతంలో ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు జరగ్గా... ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో గెలిచి, మరో మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించాయి. అయితే ఈసారి మాత్రం ఈక్వెడార్ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. పూర్తి సమన్వయంతో కదులుతూ ఖతర్ గోల్‌పోస్ట్‌పై తొలి నిమిషం నుంచే దాడులు చేసింది. ఆట మూడో నిమిషంలోనే ఈక్వెడార్ ఖాతా తెరిచింది. ఫెలిక్స్ టోరెస్ ఆక్రోబాటిక్ కిక్ షాట్ గాల్లోకి లేవగా వాలెన్సియా హెడర్ షాట్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపించాడు. ఈక్వెడార్ జట్టు సంబరంలో మునిగింది. అయితే ఖతర్ జట్టు గోల్‌పై సమీక్ష కోరింది. వీడియో అసిస్టెంట్ రిఫరీ (వీఏఆర్) టీవీ రీప్లేను పరిశీలించగా ‘ఆఫ్ సైడ్’ అని తేలింది. దాంతో రిఫరీ గోల్ ఇవ్వలేదు. అయితే ఈక్వెడార్ పట్టువదలకుండా తమ దాడులకు పదును పెట్టింది. ఫలితంగా ఖతర్ జట్టు ప్రత్యర్థి ఆటగాళ్లను నిలువరించడమే తప్ప ఎదురు దాడులు చేయలేకపోయింది. 16వ నిమిషంలో బంతితో ‘డి’ ఏరియాలోకి వచ్చిన ఈక్వెడార్ ప్లేయర్ వాలెన్సియాను ఖతర్ గోల్ కీపర్ సాద్ అల్ షీబ్ మొరటుగా అడ్డుకోవడంతో వాలెన్సియా పడిపోయాడు. ఫలితంగా రిఫరీ ఈక్వెడార్‌కు పెనాల్టీ కిక్ ప్రకటించగా... వాలెన్సియా ఈ పెనాల్టీని గోల్‌గా మలిచి ఈక్వెడార్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత 31వ నిమిషంలో సహచరుడు ఏంజెలో ప్రెసియాడో క్రాస్ షాట్‌ను వాలెన్సియా హెడర్ షాట్‌తో బంతిని లక్ష్యానికి చేర్చాడు. విరామ సమయానికి ఈక్వెడార్ 2–0తో ఆధిక్యంలోకి నిలిచింది. రెండో అర్ధ భాగంలోనూ ఈక్వెడార్ జోరు కొనసాగగా...ఖతర్ జట్టుకు ప్రత్యర్థిని నిలువరించడంలోనే సరిపోయింది. ఈక్వెడార్‌కు మూడో గోల్ ఇవ్వకుండా ఖతర్ మ్యాచ్‌ను ముగించగలిగింది. -
ప్రారంభమైన ఫుట్‌బాల్ వరల్డ్ కప్..
ప్రారంభమైన ఫుట్‌బాల్ వరల్డ్ కప్.. -
FIFA World Cup 2022: అర్జెంటీనా జోరు కనబర్చేనా!
‘ఫిఫా’ ఫుట్‌బాల్ ప్రపంచకప్ అంటే గుర్తొచ్చేది అర్జెంటీనా. దివంగత దిగ్గజం మారడోనా నుంచి నేటి తరం మెస్సీ దాకా అర్జెంటీనాను అందలంలో నిలిపిన వారే! ఇలాంటి జట్టు ఉన్న గ్రూప్‌లో మిగతా ప్రత్యర్థులకు గుండె హడల్ గ్యారంటీ. గ్రూప్ ‘సి’లో ఈ మేటి జట్టును ఎదుర్కొనేందుకు మెక్సికో, పోలాండ్, సౌదీ అరేబియా సర్వశక్తులు ఒడ్డాల్సిందే. ఓడించలేకపోయినా... కనీసం నిలువరించినా ఆయా జట్లకు గెలిచినంత సంబరం. ఈ నేపథ్యంలో ఏ జట్టు అర్జెంటీనాను ‘ఢీ’కొంటుందనేది అసక్తికరం! అర్జెంటీనా ప్రపంచకప్‌లో శక్తిమంతమైన జట్లలో అర్జెంటీనా ఒకటి. ఖతర్ ఈవెంట్లో తన బలాన్ని ప్రపంచానికి చాటేందుకు సిద్ధమైంది. తమ ఆల్ టైమ్ గ్రేటెస్టు ఫుట్‌బాలర్ లయెనల్ మెస్సీకి ఘనమైన వీడ్కోలు పలకాలనే పట్టుదలతో ఉంది. 35 ఏళ్ల మెస్సీ ప్రపంచకప్ మెరుపులకు ఖతరే ఆఖరి వేదిక. ఆ తర్వాత ఆటకు టాటా చెప్పడమే తరువాయి. గతేడాది గట్టి ప్రత్యర్థి బ్రెజిల్‌ను ఓడించి ‘కోపా అమెరికా కప్’ను గెలిచింది. ఆ టోర్నీలో మెస్సీతో పాటు ఏంజెల్ డి మరియా అద్భుతంగా రాణించారు. ఫిఫా ర్యాంక్: 3 ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: రెండుసార్లు విజేత (1978, 1986). ఇతర ఘనతలు: 15 సార్లు ‘కోపా అమెరికా కప్’ టైటిళ్లు. అర్హత: దక్షిణ అమెరికా క్వాలిఫయింగ్ టోర్నీలో రన్నరప్ ద్వారా. కీలక ఆటగాళ్లు: మెస్సీ, డి మరియా, లో సెల్సో. మెక్సికో ఈ గ్రూప్‌లో అర్జెంటీనా తర్వాత మరో మంచి జట్టు మెక్సికో. గత ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీని కంగుతినిపించి గ్రూప్ దశను ఆరంభించిన మెక్సికో తదుపరి రౌండ్ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. ఈసారి మాత్రం మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు చెమటోడ్చింది. అర్జెంటీనాకు చెందిన కోచ్ గెరార్డో మార్టినో 2019 నుంచి మూడున్నరేళ్లుగా జట్టును సానబెడుతున్నారు. స్టార్ ఆటగాళ్లు రాల్ జిమెనెజ్, హెక్టర్ హెరెరా, హిర్వింగ్ లొజానోలపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఫిఫా ర్యాంక్: 13. ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: క్వార్టర్ ఫైనల్ (1986). ఇతర ఘనతలు: కాన్ఫెడరేషన్ కప్ విజేత (1999). అర్హత: ఉత్తర, మధ్య అమెరికా క్వాలిఫయింగ్ టోర్నీ రన్నరప్‌తో. కీలక ఆటగాళ్లు: జిమినెజ్, హిరెరా. పోలాండ్ అర్జెంటీనా, మెక్సికోలతో పోల్చితే గట్టి ప్రత్యర్థి కాదు కానీ... ఈ గ్రూప్‌లో ‘డార్క్ హార్స్’ అని చెప్పొచ్చు. తనదైన రోజున ఒక్క గోల్‌తో పైచేయి సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. స్టార్ ఆటగాళ్లు ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. స్ట్రయికర్లు రాబర్ట్ లెవండోస్కీ, పీటర్ జెలిన్స్కీ, మాటీ కాష్లు ఇటీవల బాగా ఆకట్టుకుంటున్నారు. ఇంగ్లండ్, స్పెయిన్ లీగ్‌లలో సత్తా చాటుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలోనే కోచ్ బాధ్యతలు చేపట్టిన చెస్లా మిచ్నివిక్ (పోలాండ్) సొంత జట్టును ప్రపంచకప్‌కు సిద్ధం చేస్తున్నారు. అయితే మేటి జట్లను దాటుకుని నాకౌట్ చేరడం అంత సులువేమీ కాదు. ఫిఫా ర్యాంక్: 26. ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: మూడో స్థానం (1982). ఇతర ఘనతలు: ‘యూరో కప్’లో క్వార్టర్స్ (2016). అర్హత: యూరోపియన్ క్వాలిఫయింగ్ ప్లేఆఫ్ విన్నర్. కీలక ఆటగాళ్లు: లెవండోస్కీ, జెలిన్స్కీ. సౌదీ అరేబియా గ్రూప్‌లోని మిగతా జట్లకంటే తక్కువ ర్యాంక్ జట్టు. పైగా గత నాలుగు ప్రపంచకప్‌లలో గ్రూప్ దశనే దాటలేకపోయింది. ఇలాంటి జట్టు గ్రూప్ ‘సి’ నుంచి ప్రిక్వార్టర్స్ చేరితే అది సంచలనమే అవుతుంది. అయితే గల్ఫ్ దేశంలోనే మెగా ఈవెంట్ జరగడం కాస్త కలిసొచ్చే అంశం కానీ... ముందడుగు వేయడం కష్టమే! కీలక ఆటగాళ్లు సలేహ్ అల్ శెహ్రి, సలిమ్, సాల్మన్ అల్ ఫరాజ్ తమ ప్రదర్శనతో గల్ఫ్ సాకర్ ప్రియుల్ని అలరించడం ఖాయం. ఫ్రాన్స్‌కు చెందిన కోచ్ హెర్వ్ రినార్డ్ 2019 నుంచి జట్టును తీర్చిదిద్దుతున్నాడు. ఫిఫా ర్యాంక్: 51. ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: ప్రిక్వార్టర్స్ (1994). ఇతర ఘనతలు: ఆసియా చాంపియన్ (1984, 1988, 1996). అర్హత: ఆసియా క్వాలిఫయింగ్‌లో గ్రూప్ ‘బి’ రన్నరప్. కీలక ఆటగాళ్లు: సలేహ్ అల్ శెహ్రి, అల్ ఫరాజ్. –సాక్షి క్రీడా విభాగం -
FIFA World Cup Qatar 2022: ఇంగ్లండ్... ఈసారైనా!
ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ప్రతిసారీ భారీ అంచనాలతో అడుగు పెడుతుంది. ఈసారీ ఆ జట్టు టైటిల్ ఫేవరెట్‌గా ఉంది. గ్రూప్ ‘బి’లో ఇరాన్, అమెరికా, వేల్స్ జట్లతో పోటీపడనున్న ఇంగ్లండ్ స్థాయికి తగ్గట్టు ఆడితే గ్రూప్ దశను సులువుగా దాటుతుంది. ఇంగ్లండ్ ప్రపంచకప్ అత్యుత్తమ ప్రదర్శన: విజేత (1966) ఇతర ఘనతలు: యూరో కప్ రన్నరప్ (2020) ‘ఫిఫా’ ర్యాంక్: 5 అర్హత: యూరోప్‌లో గ్రూప్–1 విజేత హోదాలో. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఇంగ్లండ్ అజేయంగా నిలిచింది. అదే జోరును ప్రధాన టోర్నీలోనూ కొనసాగించాలని పట్టుదలతో ఉంది. 2018 రష్యాలో జరిగిన ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ సెమీఫైనల్లో ఓడి, ఆ తర్వాత ప్లే ఆఫ్ మ్యాచ్‌లో బెల్జియం చేతిలోనూ ఓడి నాలుగో స్థానంలో నిలిచింది. కెప్టెన్ హ్యారీ కేన్‌తోపాటు జాక్ గ్రేలిష్, డెక్లాన్ రైస్, ట్రెంట్ అలెగ్జాండర్, జాన్ స్టోన్స్, కైల్ వాకర్‌లాంటి స్టార్ ఆటగాళ్లతో ఇంగ్లండ్ పటిష్టంగా ఉంది. ఓవరాల్‌గా 16వసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఇంగ్లండ్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి రెండోసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది. . ఇరాన్ ప్రపంచకప్ అత్యుత్తమ ప్రదర్శన: గ్రూప్ దశ ఇతర ఘనతలు: ఆసియా విజేత (1968, 72, 76) ‘ఫిఫా’ ర్యాంక్: 20 అర్హత: ఆసియా క్వాలిఫయింగ్ మూడో రౌండ్ గ్రూప్ ‘ఎ’ విన్నర్ ఓవరాల్‌గా ఆరోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఇరాన్ ఏనాడూ గ్రూప్ దశలో తొలి రౌండ్‌ను దాటలేకపోయింది. ఆసియా క్వాలిఫయింగ్‌లో ఆడిన 18 మ్యాచ్‌ల్లో 14 విజయాలు అందుకున్న ఇరాన్ ప్రధాన టోర్నీలో ఈసారైనా తొలి రౌండ్ దాటాలని పట్టుదలతో ఉంది. సర్దార్ అజ్మౌన్, అలీరెజా, మాజిద్ హుస్సేన్‌లాంటి స్టార్ ఆటగాళ్ల ప్రదర్శనపై ఇరాన్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. అమెరికా ప్రపంచకప్ అత్యుత్తమ ప్రదర్శన: మూడో స్థానం (1930) ఇతర ఘనతలు: కాన్ఫడరేషన్స్ కప్ రన్నరప్ (2009) ‘ఫిఫా’ ర్యాంక్: 16 అర్హత: ఉత్తర, మధ్య అమెరికా, కరీబియన్ క్వాలిఫయింగ్‌లో మూడో రౌండ్లో మూడో స్థానం. నాలుగేళ్ల క్రితం రష్యాలో జరిగిన ప్రపంచకప్‌కు అర్హత పొందలేకపోయిన అమెరికా ఓవరాల్‌గా 11వసారి ఈ మెగా టోర్నీలో ఆడనుంది. పులిసిక్, వెస్టన్ మెకెనీ, రేనాలాంటి కీలక ఆటగాళ్లు రాణిస్తే నాకౌట్ దశకు చేరుకునే అవకాశముంది. వేల్స్ ప్రపంచకప్ అత్యుత్తమ ప్రదర్శన: క్వార్టర్ ఫైనల్ (1958) ఇతర ఘనతలు: యూరో టోర్నీలో మూడో స్థానం (2016) ‘ఫిఫా’ ర్యాంక్: 19 అర్హత: యూరోపియన్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్ విన్నర్. 1958 తర్వాత తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన వేల్స్ జట్టు ఆశలన్నీ గ్యారెత్ బేల్, డానియల్ జేమ్స్, ఆరోన్ రామ్సెలాంటి స్టార్ ఆటగాళ్ల ప్రదర్శనపై ఆధారపడి ఉన్నాయి. –సాక్షి క్రీడావిభాగం -
ఆతిథ్య జట్టు అజేయంగా.. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో కలిసొస్తున్న తొలి మ్యాచ్
తొమ్మిది దశాబ్దాల చరిత్ర కలిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో 2006 నుంచి తొలి మ్యాచ్‌లో ఆతిథ్య దేశం ఉండేలా అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య షెడ్యూల్ రూపొందిస్తోంది. గత నాలుగు ప్రపంచకప్‌లలోనే కాకుండా అంతకుముందు జరిగిన ప్రపంచ కప్‌లలోనూ ఆతిథ్య దేశం తాము ఆడిన తొలి మ్యాచ్‌లో శుభారంభం చేసింది. ప్రత్యర్థి ఎంతటి జట్టయినా ఆతిథ్య జట్టు గెలవడం లేదంటే ‘డ్రా’ చేయడం జరిగింది. గతంలో వరుసగా 11 సార్లు ఆసియా క్వాలిఫయింగ్ దశలోనే నిష్క్రమించిన ఖతర్ జట్టు ఆతిథ్య దేశం హోదాలో తొలిసారి ప్రపంచకప్ టోర్నమెంట్లో బరిలోకి దిగుతోంది. 12 ఏళ్ల క్రితం ఆతిథ్య హక్కులు పొందిన వెంటనే ఖతర్ జట్టు సన్నాహాలు మొదలయ్యాయి. ఈసారి ప్రధాన టోర్నీలో నేరుగా ఆడే అవకాశం రావడంతో మంచి ప్రదర్శనతో ఆకట్టుకోవాలని పట్టుదలతో ఉంది. ఈనెల 20న జరిగే ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో ఈక్వెడార్‌తో ఖతర్ ఆడుతుంది. ఇప్పటివరకు ఆతిథ్య జట్లకు తాము ఆడిన తొలి మ్యాచ్‌లలో అనుకూల ఫలితాలే వచ్చాయి. ఈ సంప్రదాయాన్ని ఖతర్ కూడా కొనసాగిస్తూ విజయంతో బోణీ కొడుతుందో, లేదంటే ‘డ్రా’తో పాయింట్ల ఖాతా తెరుస్తుందో వేచి చూడాలి. 2018 ప్రపంచకప్‌లో ఆతిథ్య దేశం రష్యా తొలి మ్యాచ్‌లో 5–0తో సౌదీ అరేబియాను ఓడించగా... 2014 మెగా ఈవెంట్లో బ్రెజిల్ 3–1తో క్రొయేషియాపై గెలిచింది. 2010 టోర్నీలో దక్షిణాఫ్రికా తొలి మ్యాచ్‌ను మెక్సికోతో 1–1తో ‘డ్రా’ చేసుకుంది. 2006లో జర్మనీ 4–2తో కోస్టారికాను ఓడించి శుభారంభం చేసింది. 2002లో దక్షిణ కొరియా–జపాన్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వగా... తమ తొలి మ్యాచ్‌ల్లో కొరియా 2–0తో పోలాండ్‌పై గెలుపొందగా... బెల్జియంతో జరిగిన మ్యాచ్‌ను జపాన్ 2–2తో ‘డ్రా’గా ముగించింది. 1998లో ఆతిథ్య ఫ్రాన్స్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో 3–0తో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. 1994లో ఆతిథ్య అమెరికా దేశం తొలి మ్యాచ్‌ను స్విట్జర్లాండ్‌తో 1–1తో ‘డ్రా’ చేసుకుంది. 1990లో ఇటలీ జట్టు తొలి మ్యాచ్‌లో 1–0తో ఆస్ట్రియాను ఓడించింది. 1986లో మెక్సికో జట్టు 2–1తో బెల్జియంపై గెలిచింది. 1982లో స్పెయిన్ తొలి మ్యాచ్‌ను హోండూరస్తో 1–1తో ‘డ్రా’గా ముగించింది. 1978లో ఆతిథ్య అర్జెంటీనా జట్టు 2–1తో హంగేరిపై గెలిచింది. 1974లో పశ్చిమ జర్మనీ 1–0తో చిలీపై నెగ్గగా, 1970లో మెక్సికో 0–0తో సోవియట్ యూనియన్‌తో... 1966లో ఇంగ్లండ్ 0–0తో ఉరుగ్వేతో ‘డ్రా’ చేసుకుంది. 1962లో చిలీ 3–1తో స్విట్జర్లాండ్‌పై... 1958లో స్వీడన్ 3–0తో మెక్సికోపై.. 1954లో స్విట్జర్లాండ్ 2–1తో ఇటలీపై... 1950లో బ్రెజిల్ 4–0తో మెక్సికోపై.. 1938లో ఫ్రాన్స్ 3–1తో బెల్జియంపై... 1934లో ఇటలీ 7–1తో అమెరికాపై... 1930లో ఉరుగ్వే 3–1తో పెరూపై విజయం సాధించాయి. –సాక్షి క్రీడావిభాగం -
ప్రపంచకప్ నుంచి వట్టి చేతులతో నిష్క్రమించిన టీమిండియా
అండర్-17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్-2022లో భారత చాప్టర్ క్లోజ్ అయ్యింది. టోర్నీ మొత్తంలో భారత అమ్మాయిలు ఒక్క గోల్ కూడా కొట్టకుండా నిష్క్రమించారు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కనీస పోరాటం కూడా చేయకుండా ప్రత్యర్ధులకు దాసోహమయ్యారు. తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో 0-8 తేడాతో ఓటమిపాలైన భారత అమ్మాయిలు, ఆతర్వాత మొరాకో చేతిలో 0-3 తేడాతో.. చివరి మ్యాచ్‌లో బ్రెజిల్ చేతిలో 0-5 తేడాతో చిత్తయ్యారు. ఆతిధ్య జట్టు హోదాలో మెగా టోర్నీకి అర్హత సాధించిన భారత కనీస పోటీ కూడా ఇవ్వకుండా, పేలవ ప్రదర్శనతో నిష్క్రమించడంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. టోర్నీలో ప్రస్తుత పరిస్ధితి విషయానికొస్తే.. గ్రూప్-ఏలో ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓడిన భారత్ ఆఖరి స్థానంలో నిలువగా.. అమెరికా అగ్రస్థానంలో, బ్రెజిల్, మొరాకో జట్లు 2,3 స్థానాల్లో నిలిచాయి. ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొనగా.. చెరి నాలుగు జట్లు నాలుగు గ్రూప్‌లుగా విభజించబడ్డాయి. గ్రూప్-బి నుంచి జర్మనీ, నైజీరియా.. గ్రూప్-సి నుంచి కొలొంబియా, స్పెయిన్.. గ్రూప్-డి నుంచి జపాన్, టాంజానియా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. అన్ని గ్రూపుల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. -
స్టార్ ఫుట్‌బాలర్ సంచలన ప్రకటన
ఆల్‌టైమ్ గ్రేట్స్‌లో ఒకడిగా పిలువబడే అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ సంచలన ప్రకటన చేశాడు. 35 ఏళ్ల మెస్సీ నిన్న తన రిటైర్మెంట్ తేదీని ప్రకటించి ఫుట్‌బాల్ ప్రేమికులకు ఊహించని షాకిచ్చాడు. వచ్చే నెల ఖతర్ వేదికగా జరిగే ప్రపంచకప్ తనకు చివరి అంతర్జాతీయ టోర్నీ అవుతుందని స్పష్టం చేశాడు. కెరీర్లో ఇప్పటివరకు నాలుగు వరల్డ్‌కప్ టోర్నీలు ఆడిన మెస్సీ.. తన జట్టును ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా నిలబెట్టలేకపోయాడు. ఈ నేపథ్యంలో తన చివరి వరల్డ్‌కప్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న మెస్సీ.. అర్జెంటీనాను జగజ్జేతగా నిలబెట్టాలని పట్టుదలగా ఉన్నాడు. అయితే తన చివరి టోర్నీ బరిలోకి దిగే ముందు ఆందోళన, ఒత్తిడికి గురవుతున్నట్లు పేర్కొన్నాడు. ప్రపంచకప్ బరిలో నిలిచే జట్లతో పోలిస్తే.. అర్జెంటీనాకు గెలుపు అవకాశాలు కాస్త తక్కువేనని ఇదే సందర్భంగా బాంబు పేల్చాడు. క్లబ్ స్థాయి టోర్నీలతో పోలిస్తే ప్రపంచకప్ మ్యాచ్‌లు చాలా కఠినంగా ఉంటాయని, అందుకే ఎంతటి జట్టునైనా ఫేవరెట్‌గా పరిగణించలేమని అభిప్రాయపడ్డాడు. కాగా, 1978, 1986 ప్రపంచకప్‌లలో ఛాంపియన్‌గా నిలిచిన అర్జెంటీనా.. ఆతర్వాత తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చనప్పటికీ ఇటీవలికాలంలో మాత్రం అద్భుతంగా రాణిస్తుంది. గత 35 మ్యాచ్‌ల్లో ఓటమి అన్నదే ఎరుగకుండా వరుస విజయాలతో దూసుకుపోతుంది. 2021 కోపా అమెరికా కప్ ఫైనల్లో ఆతిథ్య బ్రెజిల్‌కు షాకిచ్చి ఛాంపియన్‌గా అవతరించినప్పటి నుంచి అర్జెంటీనా విజయయాత్ర కొనసాగుతుంది. వరల్డ్‌కప్ హాట్ ఫేవరెట్లలో ముందు వరుసలో ఉన్న తన జట్టును ఫేవరెట్‌గా పరిగణించలేమని మెస్సీ అభిప్రాయపడటం ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే, వచ్చే నెల (నవంబర్) 22న గ్రూప్-సిలో సౌదీ అరేబియాతో పోరుతో అర్జెంటీనా ప్రపంచకప్‌లో తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తుంది. ఈ జట్టు ఆ తర్వాత మెక్సికో, పోలండ్‌తో తలపడుతుంది. -
ఫిఫా వరల్డ్‌కప్ 2022కు అర్హత సాధించిన చివరి జట్టుగా కోస్టారికా
దోహా: అందివచ్చిన ఆఖరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కోస్టారికా జట్టు ఆరోసారి ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించింది. చివరి బెర్త్ కోసం న్యూజిలాండ్‌తో జరిగిన ఇంటర్ కాంటినెంటల్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో కోస్టారికా 1–0తో గెలిచింది. ఆట మూడో నిమిషంలో జోయల్ క్యాంప్‌బెల్ గోల్ చేసి కోస్టారికాను ఆధిక్యంలో నిలిపాడు. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న కోస్టారికా జట్టు విజయంతోపాటు బెర్త్‌ను ఖరారు చేసుకొని వరుసగా మూడోసారి ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందింది. 50 లక్షల జనాభా కలిగిన కోస్టారికా ఇప్పటివరకు ఐదుసార్లు ప్రపంచకప్‌లో పాల్గొ ని 2014లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. కోస్టారికా, న్యూజిలాండ్ మ్యాచ్‌తో ప్రపంచకప్ క్వాలిఫయింగ్ దశ ముగిసింది. ఈ ఏడాది ఖతర్‌లో నవంబర్ 21 నుంచి డిసెంబర్ 18 వరకు జరిగే ప్రపంచకప్ ప్రధాన టోర్నీలో మొత్తం 32 జట్లు బరిలో ఉన్నాయి. ఆతిథ్య దేశం హోదాలో ఖతర్ జట్టుకు నేరుగా ఎంట్రీ లభించింది. -
డ్రగ్స్ అడిక్ట్ టూ విన్నర్!: ‘ఆ రోజు చేసిన పని నన్ను పదే పదే కలచివేసింది'
ఇటీవలకాలంలో యువత ఎక్కువగా సిగరెట్స్, మద్యం, డ్రగ్స్ వంటి వాటికి బానిసై తమ జీవితాలను ఏవిధంగా నాశనం చేసుకుంటున్నారో చూశాం. ఆఖరికి సినితారలను సైతం ఈ జాడ్యం వదలడం లేదు. ప్రముఖ సెలబ్రెటి పిల్లలతో సహా అందరూ వీటికి బానిసై పోతున్నారు. ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టిన ప్రజల్లోనూ, యువతలోను మార్పు రాకపోవడం మన దురదృష్టమో లేక మరోకటో తెలియదు. అయితే ఇక్కడొక మహారాష్ట్రవాసి చిన్నవయసులో సిగరెట్ కాల్చడం, మద్యం సేవించడం వంటి వాటికి బానిసయ్యాడు. అయితే అతను అలా వాటికి అడిక్టి అవ్వడమే తనకు వరంగా మారిందనే చెప్పలి. ఒక రకంగా తన జీవితాన్ని అర్థవంతంగా మార్చింది. అసలు విషయంలోకెళ్లితే...మహారాష్ట్రలోని గోధాని గ్రామ నివాసి అయిన పంకజ్ మహాజన్ నాల్గవ తరగతి చదువుతున్నప్పటి నుంచి పొగాకు, మద్యపానానికి బానిసయ్యాడు. దీనికితోడు మద్యానికి బానిసైన తండ్రి, వికలాంగురాలైన తల్లి ఉండటంతో పంకజ్కి సరైన మార్గదర్శకత్వం లేకుండా పోయింది. అయితే పంకజ్ తండ్రి పోగాకుతో సహా నిత్యావసరాల వస్తువులు విక్రయించే దుకాణాన్ని నడిపేవాడు. ఈమేరకు పంకజ్ తన తండ్రి, ఆ గ్రామ పెద్దలు స్టైయిలిష్‌గా పొగాకు తాగటం చూసి తాను కూడ వారి అడుగుజాడల్లోనే నడవాలని అనుకున్నాడు. అంతేకాదు ఎవరికి తెలియకుండా పొగాకు కాల్చడం కూడా నేర్చుకున్నాడు. అమ్మను కాపాడుకోలేని స్థితి.... అయితే అది ఎంతవరకు వచ్చిందంటే ఒక్కరోజులోనే పొగాకు ప్యాకెట్ మొత్తం అయిపోయిలా తాగేంతవరకు వచ్చింది. అంతేకాదు పంకజ్ సిగరెట్ కాలుస్తున్నప్పటికీ తండ్రి మందలించకపోవడంతో పంకజ్కి అది తప్పు అన్న విషయం తెలియలేదు. ఆ తర్వాత పంకజ్ మద్యం సేవించటం కూడా మొదలు పెట్టేశాడు. దీంతో ఆ బస్తీలో ఉన్న మిగతా పిల్లల తల్లిదండ్రులు పంకజ్ దగ్గరకు వెళ్లనిచ్చేవారు కాదు. మరోవైపు తన తండ్రి మద్యానికి బానిసై డబ్బులు కోసం తన తల్లిని, తనను కొడతుండటంతో పదిలోనే చదువుకు స్వస్తి పలికి డబ్బులు సంపాదించటం మొదలు పెట్టాడు. అయితే ఒకరోజు తన తండ్రి తాగి వచ్చి తన తల్లిని చితకొట్టాడు. ఈ క్రమంలో ఆమె తలకు పెద్ద గాయం అవుతుంది. అయితే అక్కడే ఉన్న పంకజ్ తన తండ్రిని ఆపడానికి గాని తన తల్లిన కాపాడుకోవటానికి గాని ప్రయత్నించకుండా అలా చూస్తుండిపోతాడు. జీవితాన్ని మలుపు తిప్పిన ఘటన.... చుట్టుపక్కల వాళ్లు వాళ్ల అమ్మను ఆసుపత్రిలో జాయిన్ చేసి కాపాడతారు. ఆ సంఘటనే తన జీవితాన్ని మారుస్తుంది. పంకజ్ ఈ చెడ్డఅలవాట్లకు బానిసయ్యి నీరసించపోవటం, అలిసిపోయి ఏ పని చేయలేని స్థితికి చేరుకుంటాడు. అందువల్లే ఆ రోజు అతను తన తండ్రి దాడి చేస్తున్నప్పుడు తల్లిని కాపాడే శక్తి కూడా లేక నిస్సత్తువగా చూస్తుండిపోయాడు. ఆ సంఘటనే తన జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. అనుకోకుండా పంకజ్ గ్రామానికి ఎన్జీవోలు వచ్చారు. అయితే ఆ గ్రామస్తులు కారణంగా పంకజ్ గురించి ఎన్జీవోలకు తెలుస్తుంది. ఈ మేరకు వారు స్వచ్ఛందంగా పంకజ్ విషయంలో జోక్యం చేసుకుని విజయ్ బార్సే ప్రారంభించిన ఆశ్రమంలో జాయిన్ చేశారు. అది ఎన్జీవోల ద్వారా జాయిన్ అయిన నిరాశ్రయులైన పిల్లలకు ఉచితంగా ఫుట్‌బాల్ శిక్షణ ఇచ్చే సెంటర్. ఈ మేరకు ఉచిత ఫుట్‌బాల్ శిక్షణ మాత్రమే కాక స్టైఫండ్ ఇచ్చి స్కూలుకి కూడా పంపిస్తారు. అయితే ఒక్కొక్కసారి తన చెడ్డ అలవాట్ల వైపు వెళ్లాలనిపించినా అతను వెళ్లలేదు. ఆ సంఘటనే కళ్ల ముందు మెదలడంతో... ఆ రోజు తన తల్లి నెత్తురోడుతుంటే అంబులెన్స్‌కి కూడా కాల్ చేయలేని నిస్సహాయ స్థితి అతనికి గుర్తుకు వచ్చేదని పంకజ్ ఇతరులకు పదే పదే చెబుతూ ఉండేవాడు. అంతేకాదు పంకజ్ ఎంతో కసిగా ఫుట్ బాల్ ఆడటం కూడా నేర్చకునేవాడు. పైగా ఒక్కరోజు కూడా ప్రాక్టీస్ చేయడం మానేవాడు కాదు. ఆ నిర్విరామ కృషే అతన్ని రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఫుట్బాల్ని ఆడేలా చేసింది. ఆ తర్వాత అతను 2013లో హోమ్‌లెస్ వరల్డ్ కప్ కోసం తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు పోలాండ్‌కు వెళ్లాడు. అప్పుడే అతని గురించి పత్రికల్లోనూ, మీడియాల్లోనూ బాగా వచ్చింది. అంతేకాదు ఏ గ్రామస్థులైతే అసహ్యంగా చూశారో వారే నన్ను ఇప్పుడూ మెచ్చకుంటున్నారని చెప్పాడు. అయితే తనలాంటి పిల్లలకు సాయం చేయడం కోసం ఎన్జీవోలో పేరు నమోదు చేసుకున్నానని, పైగా తాను ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశానని చెప్పాడు. ఇతని కథ నిజంగా స్ఫూర్తిధాయకం కదా! (చదవండి: బాప్రే! 14 అంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం... ఐతే ఆ ఇద్దరు...!! షాకింగ్ వీడియో) -
ఎనిమిదేళ్ల తర్వాత ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు నెదర్లాండ్స్..
రోటర్‌డామ్: ఎనిమిదేళ్ల విరామం తర్వాత ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు నెదర్లాండ్స్ జట్టు అర్హత పొందింది. యూరోపియన్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా నార్వే జట్టుతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 2–0తో గెలిచింది. తద్వారా గ్రూప్ ‘జి’లో నెదర్లాండ్స్ 23 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచి 2022 ప్రపంచకప్ బెర్త్‌ను దక్కించుకుంది. మరోవైపు మాజీ చాంపియన్ అర్జెంటీనా దక్షిణ అమెరికా జోన్ నుంచి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. బ్రెజిల్‌తో జరిగిన మ్యాచ్‌ను అర్జెంటీనా 0–0తో ‘డ్రా’ చేసుకుంది. పది జట్లున్న గ్రూప్‌లో 29 పాయింట్లతో అర్జెంటీనా రెండో స్థానంలో నిలిచి మరో ఐదు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే బెర్త్‌ను ఖరారు చేసుకుంది. చదవండి: IND Vs NZ: టీ20ల్లో అరుదైన రికార్డు సాధించిన రోహిత్, రాహుల్ జోడి.. -
ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు ఇంగ్లండ్ ...
సెరావల్లె (సాన్ మరినో): రెండో ప్రపంచకప్ ఫుట్‌బాల్ టైటిల్ కోసం 55 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఇంగ్లండ్ జట్టు వచ్చే ఏడాది ఖతర్‌లో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. యూరోపియన్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా జరిగిన గ్రూప్ ‘ఐ’ పోరులో ఇంగ్లండ్ 10–0 గోల్స్ తేడాతో సాన్ మరినోపై ఘనవిజయం సాధించి ఈ మెగా ఈవెంట్‌కు 16వసారి అర్హత పొందింది. 26 పాయింట్లతో గ్రూప్ ‘ఐ’ విజేత హోదాలో ఇంగ్లండ్‌కు బెర్త్ దక్కింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ హ్యారీ కేన్ నాలుగు గోల్స్‌తో సత్తా చాటాడు. ఇంగ్లండ్ జట్టు 1966లో ఏకైకసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. చదవండి: ICC ODI Rankings: మిథాలీ రాజ్ ర్యాంక్ యథాతథం.. -
అండర్–17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ మళ్లీ వాయిదా!
పనాజీ: కరోనా మహమ్మారి మరో ప్రతిష్టాత్మక టోర్నమెంట్ నిర్వహణపై తన ప్రభావం చూపనుంది. భారత్ వేదికగా జరుగనున్న ‘ఫిఫా’ అండర్–17 మహిళల వరల్డ్ కప్ టోర్నీ మరోసారి వాయిదా పడే అవకాశాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది నవంబర్‌లో జరగాల్సిన ఈ టోర్నీ కోవిడ్–19 కారణంగా వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేశారు. అయితే ఇది మరోసారి వాయిదా పడే అవకాశముందని అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ నెలాఖరు వరకు దీనిపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. చాలా దేశాల్లో వరల్డ్‌కప్ అర్హత టోర్నీలు కూడా ఇంకా ముగియలేదని, ఈ పరిస్థితుల్లో అంతా సవ్యంగా జరగడం కష్టమని వ్యాఖ్యానించారు. ‘ఫిఫా’ వర్గాలు కూడా ఇదే ఆలోచిస్తున్నట్లుగా తాజా వ్యాఖ్యలతో తెలుస్తోంది. ఆట కన్నా దానితో ముడిపడి ఉన్న వారి ఆరోగ్య భద్రతే తమకు ప్రధానమని ‘ఫిఫా’ అధికార ప్రతినిధి అన్నారు. -
ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు స్పెయిన్, ఇంగ్లండ్, జర్మనీ
ముంబై: వచ్చే ఏడాది భారత్‌లో జరగాల్సిన ఫిఫా అండర్–17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌కు మరో మూడు జట్లు అర్హత సాధించాయి. డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్‌తో పాటు ఇంగ్లండ్, జర్మనీలను యూరప్ విభాగం నుంచి క్వాలిఫై చేస్తున్నట్లు యూరోపియన్ ఫుట్‌బాల్ సంఘాల యూనియన్ (యూఈఎఫ్ఏ) శుక్రవారం ప్రకటించింది. ‘యూరప్ నుంచి స్పెయిన్, ఇంగ్లండ్, జర్మనీలు ప్రాతినిధ్యం వహిస్తాయి’ అని యూఈఎఫ్ఏ ఒక ప్రకటనలో పేర్కొంది. వాస్తవానికి ప్రపంచ కప్ అర్హత టోర్నీ అయిన ‘యూఈఎఫ్ఏ అండర్–17 మహిళల చాంపియన్‌షిప్’ ద్వారా ప్రపంచ కప్‌లో పాల్గొనే యూరప్ జట్లను నిర్ణయిస్తారు. అయితే కరోనా మహమ్మారితో చాంపియన్‌షిప్ చివరి రౌండ్ పోటీలు రద్దయ్యాయి. అయితే మెరుగైన ర్యాంకింగ్ ఉండటంతో స్పెయిన్, ఇంగ్లండ్, జర్మనీ జట్లు ప్రపంచ కప్‌కు అర్హత సాధించాయి. ఆతిథ్య హోదాలో భారత్‌తో పాటు కొరియా రిపబ్లిక్, జపాన్, న్యూజిలాండ్‌లు ఇప్పటికే ప్రపంచ కప్‌కు అర్హత పొందాయి. కరోనా వల్ల ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగాల్సిన ఈ మెగా ఈవెంట్... వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి మార్చి 7కి వాయిదాపడింది. -
భారత్ బరిలోకి దిగేది వచ్చే ఏడాదే
న్యూఢిల్లీ : ఏడాది పొడవునా వేళ్ల మీద లెక్క పెట్టే సంఖ్యలో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే భారత ఫుట్‌బాల్ జట్టు ఈ ఏడాదిలో మిగిలిన రోజులను ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడకుండానే ముగించనుంది. కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో... ఆసియా పరిధిలో అక్టోబర్, నవంబర్లలో జరగాల్సిన 2022 ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లను... 2023 ఆసియా కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లను ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) వచ్చే ఏడాదికి వాయిదా వేసింది. భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు తమ చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను గత సంవత్సరం నవంబర్‌లో మస్కట్ వేదికగా ఒమన్ జట్టుతో ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత్ 0–1 గోల్ తేడాతో ఓడింది. ఖతర్‌లో జరిగే 2022 ప్రపంచకప్ మెగా ఈవెంట్‌కు భారత్ అర్హత సాధించే అవకాశాలకు తెరపడినా 2023 ఆసియా కప్‌కు బెర్త్ పొందే అవకాశాలు మిగిలి ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 8న ఖతర్‌తో... ఆ తర్వాత స్వదేశంలో నవంబర్‌లో అఫ్గానిస్తాన్‌తో... నవంబర్లోనే బంగ్లాదేశ్‌తో భారత్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఐదు జట్లున్న గ్రూప్ ‘ఇ’లో ప్రస్తుతం భారత్ మూడు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. టాప్–3లో నిలిస్తే భారత్‌కు 2023 ఆసియా కప్ క్వాలిఫయర్స్ మూడో రౌండ్లోకి నేరుగా బెర్త్ లభిస్తుంది. ‘చాలా దేశాల్లో కరోనా వైరస్ తీవ్రతను దృషిలో పెట్టుకొని ఈ ఏడాది జరగాల్సిన ప్రపంచకప్, ఆసియా కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లను వాయిదా వేశాం. ఈ మ్యాచ్‌లను వచ్చే ఏడాది ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తాం’ అని ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా), ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) ఒక ప్రకటనలో తెలిపాయి. -
భారత్ x అఫ్గానిస్తాన్
దుశంబే (తజికిస్తాన్): ఫుట్‌బాల్ ప్రపంచకప్–2022 క్వాలిఫయర్స్‌లో నిలకడలేని ప్రదర్శనతో నిరాశపరుస్తున్న భారత జట్టు నేడు అఫ్గానిస్తాన్‌తో తలపడేందుకు సిద్ధమైంది. రెండో రౌండ్ క్వాలిఫయింగ్‌ను పరాజయంతో మొదలుపెట్టిన భారత్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లాడినా... ఇంకా గెలుపు బోణీనే కొట్టలేకపోయింది. తొలి మ్యాచ్‌లో తమకంటే మెరుగైన ర్యాంకులో ఉన్న ఒమన్ చేతిలో 1–2తో ఓడిన భారత్ తర్వాత ఆసియా చాంపియన్ ఖతర్‌తో 0–0తో డ్రా చేసుకుంది. కోల్‌కతాలో జరిగిన గత మ్యాచ్‌లో, చివరకు దిగువ ర్యాంకులో ఉన్న బంగ్లాదేశ్‌తోనూ 1–1తో ‘డ్రా’గా ముగించడం భారత సాకర్ అభిమానుల్ని నిరాశపరిచింది. ఈ మ్యాచ్‌లో ఒకానొక దశలో సొంత ప్రేక్షకుల మధ్య ఓడిపోయే పరిస్థితి తలెత్తింది. చివరకు ఆదిల్ ఖాన్ (88వ ని.లో) చేసిన హెడర్ గోల్‌తో ‘డ్రా’తో గట్టెక్కింది. ప్రస్తుతం గ్రూప్ ‘ఇ’లో రెండు పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచిన భారత్... ఎలాగైనా అఫ్గానిస్తాన్‌ను ఓడించాలనే గట్టిపట్టుదలతో ఉంది. 106 ర్యాంకులో ఉన్న భారత్... 149వ ర్యాంకులో ఉన్న అఫ్గాన్ కంటే ఎంతో మెరుగైన స్థితిలో ఉంది. బోణీ కొట్టేందుకు ఇదే సరైన అవకాశం. సునీల్ చెత్రి ఆశించిన స్థాయిలో రాణిస్తే విజయం ఏమంత కష్టం కాదు. అదే జరిగితే ఆశావహ దృక్పథంతో మిగతా మ్యాచ్‌లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవచ్చు. -
ఆటంకాలున్నా ఆగలేదు
మెగా టోర్నీల్లో ఆసియా క్రీడలది విరామం లేని ప్రయాణం. ఒలింపిక్స్, ఫుట్‌బాల్ ప్రపంచ కప్, కామన్వెల్త్ క్రీడలకు ఎదురైనట్లు ఈ టోర్నీకి రెండో ప్రపంచ యుద్ధ అవాంతరం తలెత్తకపోవడమే దీనికి కారణం. దీంతో అప్రతిహతంగా 18వ సారి నిర్వహణకు నోచుకుంటోంది. అయితే, క్రీడలు నిలిచిపోయేంత స్థాయిలో కాకున్నా... కొన్ని వివాదాలు, మరికొన్ని బహిష్కరణలు ‘ఆట’ంక పర్చాయి. మరో తొమ్మిది రోజుల్లో ఆసియా క్రీడలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వాటి గురించి పరిశీలిస్తే... సాక్షి క్రీడా విభాగం:ప్రస్తుతం సరిగ్గా నాలుగేళ్లకోసారి ఆసియా క్రీడలు నిర్వహిస్తున్నారు కానీ... న్యూఢిల్లీ వేదికగా తొలి పోటీలు ముగిసిన మూడేళ్లకే 1954లో ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో రెండో ఏషియాడ్ జరిగింది. తర్వాత నుంచి మాత్రం ‘నాలుగేళ్ల’ సంప్రదాయం తప్పడం లేదు. తొలి మూడు ఎడిషన్లు సక్రమంగానే సాగినా... ఏదో ఒక పరిణామం తలెత్తుతూ జకార్తా (ఇండోనేసియా–1962) నుంచి వివాదాలు ప్రారంభమయ్యాయి. అయితే, కొత్త శతాబ్దంలో మాత్రం ఇవన్నీ సద్దుమణగడం గమనార్హం. ఆ దేశాలను వద్దన్న ఇండోనేసియా... మతపర కారణాలతో ఇజ్రాయెల్‌కు, రాజకీయ కోణంతో తైవాన్‌కు 1962 జకార్తా ఏషియాడ్‌లో పాల్గొనేందుకు ఇండోనేసియా అనుమతి నిరాకరించింది. ఇది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)కి ఆగ్రహం తెప్పించింది. క్రీడలకు స్పాన్సర్షిప్ ఉపసంహరించడమే కాక, ఇండోనేసియాను ఐఓసీ సభ్య దేశాల నుంచి తొలగించింది. ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య, అంతర్జాతీయ అమెచ్యూర్ అథ్లెటిక్స్ సమాఖ్య, అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్యలు జకార్తా ఏషియాడ్‌ను గుర్తించబోమని ప్రకటించాయి. జారుకున్న దక్షిణ కొరియా... షెడ్యూల్ ప్రకారం 1970 ఆసియా క్రీడలకు దక్షిణ కొరియా ఆతిథ్యం ఇవ్వాలి. కానీ, జాతీయ భద్రతా కారణాలను చూపుతూ చేతులెత్తేసింది. ఆర్థికంగా తట్టుకోలేమనే దక్షిణ కొరియా ఈ పని చేసిందని అంతా చెప్పుకొంటారు. దీంతో థాయ్‌లాండ్ వరుసగా రెండోసారి వేదికగా మారింది. జపాన్ సైతం ముందుకొచ్చినా ఇదే సమయంలో ప్రపంచ స్థాయి ఎగ్జిబిషన్ ఉండటంతో థాయ్‌లాండ్ వైపే మొగ్గుచూపారు. నిర్వహణ ఖర్చుకు దక్షిణ కొరియా నిధులు పంపించడం ఓ విశేషమైతే... తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్లలో ప్రత్యక్ష ప్రసారం కావడం ఈ ఏషియాడ్లోని మరో విశేషం. చైనా ఆగమనం... తైవాన్‌కు తిరస్కరణ... ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జరిగిన 1974 క్రీడలతో చైనా టోర్నీలో అడుగిడింది. ఉత్తర కొరియా, మంగోలియాలకు సైతం తొలిసారి ప్రాతినిధ్యం దక్కింది. అరబ్ దేశాల వ్యతిరేకత నడుమ ఇజ్రాయెల్ పోటీల్లో పాల్గొంది. ‘చైనీస్ తైపీ’ పేరిట పాల్గొనేలా తొలుత అంగీకరించినా, తర్వాత ఆ హోదాను రద్దు చేయడంతో తైవాన్ తప్పుకోవాల్సి వచ్చింది. ఆతిథ్యం తప్పించుకున్న పాక్... ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత చూపుతూ 1978 ఆసియా క్రీడల నిర్వహణ బాధ్యత నుంచి మూడేళ్ల ముందే పాకిస్తాన్ తప్పుకొంది. టోర్నీ మళ్లీ థాయ్‌లాండ్‌కు మళ్లింది. 1962లో లాగానే ఇజ్రాయెల్, తైవాన్ ప్రాతినిధ్యాన్ని నిరాకరించారు. అంతర్జాతీయ అథ్లెటిక్ సమాఖ్య సహా చాలా సంఘాలు దీనిని వ్యతిరేకించాయి. మరోవైపు ఇజ్రాయెల్‌కు 1974 ఏషియాడే చివరిదైంది. తరచూ వివాదాలు తలెత్తుతుండటంతో టోర్నీకి గుడ్‌బై కొట్టి... ఐరోపా దేశాల సమాఖ్య క్రీడల్లో పాల్గొంటోంది. సంస్కరణల పథం... సంక్షోభాల నేపథ్యంలో ఆసియా దేశాల ఒలింపిక్ కమిటీలు ఏషియాడ్ రాజ్యాంగంలో సంస్కరణలకు ఉపక్రమించాయి. ఇజ్రాయెల్ లేకుండా 1981లో ‘ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (ఓసీఏ)’ అవతరించింది. క్రీడల షెడ్యూల్‌ను మార్చకుండానే ముందుకెళ్లాలని కౌన్సిల్ నిర్ణయించింది. 1986 నుంచి ఓసీఏ పర్యవేక్షణలోనే ఏషియాడ్ సాగుతోంది. 16 ఏళ్ల అనంతరం 1990లో తైవాన్ పునరాగమనం చేసింది. కానీ చైనా ఒత్తిడితో ‘చైనీస్ తైపీ’గానే దానిని పరిగణించారు. ఇరాక్ దూరం... సోవియట్ దేశాల ప్రవేశం గల్ఫ్ యుద్ధం కారణంగా 1990లో పాల్గొనని ఇరా క్‌ను 1994 హిరోషిమా ఏషియాడ్ నుంచి బహిష్కరించారు. రాజధాని కాకుండా వేరే నగరంలో జరిగిన తొలి ఆసియా క్రీడలు ఇవే. రాజకీయ అంశాలను చూపుతూ ఉత్తర కొరియా బాయ్ కాట్ చేసింది. సోవియట్ యూనియన్ నుంచి వేరుపడిన కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశం హోదాలో పాల్గొనడం విశేషం. -
‘రష్యా అమ్మాయిలకు దూరంగా ఉండండి’
మాస్కో: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ప్రతీ జట్టు ప్రాణం పెట్టి పోరాడుతుంది. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుంది. తమ వ్యూహాలకు పదును పెడుతుంది..! తమ ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు కొన్ని సవాళ్లను కూడా స్వీకరిస్తుంది. తమ ఆటగాళ్లు ఏం చేయాలో.. ఏం చేయకూడదో ఆయా జట్టు కోచ్‌లు నిక్కచ్చిగా చెప్పడం.. అమలయ్యేలా చూడడం సాకర్ సమరంలో సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. సాకర్‌లో కోచ్‌లదే ప్రధాన భూమిక. వారు చెప్పింది చెయ్యడమే ఆటగాళ్ల పని. అలా వారు విధించే ఆంక్షలు కొన్నిసార్లు ఆసక్తిని కలిగిస్తాయి. ఈసారి నైజీరియా కోచ్ గెర్నోట్ రోర్ తమ ఆటగాళ్లకు అలాంటి షరతునే విధించాడు. వరల్డ్‌క్‌పలో పాల్గొనేందుకు రష్యా వచ్చిన ప్లేయర్లు స్థానిక అమ్మాయిలను కలవ కూడదని, వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ శృంగారంలో పాల్గొనకూడదని ఆదేశించాడు. అయితే, టోర్నీ అయ్యేంత వరకూ ఆటగాళ్లు శృంగారానికి దూరంగా ఉండాలని మాత్రం అతను చెప్పలేదు. కేవలం రష్యా అమ్మాయిల జోలికెళ్లొద్దన్నాడు. ప్లేయర్లు తమ భార్యలను, ప్రియురాళ్లను వెంట తెచ్చుకోవచ్చన్నాడు. మ్యాచ్ ప్రాక్టీస్, మ్యాచ్‌లు లేని రోజుల్లో వారితో గడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆటగాళ్లు రష్యన్లకు దూరంగా ఉండాలని చెప్పడానికి కారణం లేకపోలేదు. కొందరు అమ్మాయిలు, వ్యభిచారులు తమ అందాలతో వల విసిరి తర్వాత బ్లాక్మెయిల్ చేస్తారని భద్రతా సిబ్బంది హెచ్చరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. -
రెండు మేటి... రెండు పోటీ!
అటువైపు మాజీ చాంపియన్ స్పెయిన్... ఇటువైపు రొనాల్డో సైన్యం పోర్చుగల్... ఈ రెండు గట్టి జట్ల కారణంగా ఫిఫా ప్రపంచకప్–2018 గ్రూప్ ‘బి’ ఆసక్తికరంగా మారింది. మిగతా గ్రూప్‌లలో ప్రమాదకర ప్రత్యర్థులు తర్వాతి దశలో ఎదురయ్యే అవకాశం ఉంది. ‘బి’లో మాత్రం స్పెయిన్, పోర్చుగల్ మధ్య లీగ్ దశలోనే హోరాహోరీ సమరం తప్పదు. దీంతో మొత్తం ఎనిమిది గ్రూప్‌ల్లో ఇందులోనే పోటీ ఒకింత ఎక్కువగా కనిపిస్తున్నది. ఇరాన్, మొరాకోలు సంచలనాలు సృష్టిస్తేనే తప్ప... 1, 2 స్థానాలు యూరప్ జట్లవేనని చెప్పొచ్చు. రొనాల్డోపైనే భారం! జట్టంతా ఒక ఎత్తు. రొనాల్డో ఒక్కడే ఒక ఎత్తు. దీన్నిబట్టే ప్రపంచ కప్‌లో పోర్చుగల్ ప్రయాణం అతడిపై ఎంతగా ఆధారపడి ఉందో చెప్పొచ్చు. కెరీర్ చరమాంకానికి చేరుకున్న ఈ సూపర్ స్టార్ చిరకాల కోరిక నెరవేరేందుకు ఇదే చివరి అవకాశం. భిన్న దేశాల ఆటగాళ్లుండే లీగ్‌లలో అద్భుతంగా రాణించే రొనాల్డోకు... జాతీయ జట్టులో మాత్రం ఇంతకాలం సరిజోడైన ఆటగాళ్లు లేరు. దీంతో పోర్చుగల్ అతడే ఒక సైన్యంగా బరిలో దిగాల్సి వచ్చేది. అయితే, దృఢమైన డిఫెండర్ పెపె, బంతిని చక్కగా అందించే జావో మౌంటిన్హో, కొత్త కెరటం ఆండ్రె సిల్వలతో ఈసారి కొంత మార్పు కనిపిస్తోంది. రొనాల్డోకు దాడులకు వీరి ఆట తోడైతే తిరుగుండదు. అనుభవజ్ఞులుండటంతో కొంత ఆశలు రేపుతోంది. రొనాల్డో లేకుండా కూడా తాము టైటిల్స్ గెలవగలమని 2016 యూరోపియన్ చాంపియన్ షిప్లో పోర్చుగల్ నిరూపించింది. నాడు స్టార్ ఫార్వర్డ్ గాయంతో దూరమైనప్పటికీ ఈ జట్టు... ఫైనల్లో ఆతిథ్య ఫ్రాన్స్‌ను ఓడించడం గమనార్హం. కీలకం: రొనాల్డో, పెపె. 33 ఏళ్ల వయసులో రొనాల్డో తన అనుభవాన్నంతా రంగరించి ఆడాల్సిన అవసరముంది. కప్ అందిస్తే మాత్రం ఆల్‌టైమ్ గ్రేట్‌లలో ఒకడిగా నిలిచిపోతాడు. కోచ్: శాంటోస్. 2014లో బాధ్యతలు స్వీకరించాడు. జట్టుకు దుర్బేధ్యమైన డిఫెన్స్‌ను సృష్టించాడు. ఇది రొనాల్డో పనిని సులువు చేయనుంది. ప్రపంచ ర్యాంక్: 4 చరిత్ర: ఏడు సార్లు క్వాలిఫై అయింది. 1966లో మూడో స్థానంలో, 2006లో నాలుగో స్థానంలో నిలిచింది. 2014లో గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. ఇరాన్ రాణించేనా? ఆసియా నుంచి ఈసారి తొలి బెర్త్ దక్కించుకున్న జట్టు ఇరాన్. వరుసగా రెండోసారి క్వాలిఫై అయింది. మొదటి అర్హత రౌండ్లో 18 మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచింది. రెండో రౌండ్లో ఓ దశలో తొమ్మిది మ్యాచ్‌ల్లో ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. 2014లో ఒక్క విజయం కూడా లేకుండానే కప్ నుంచి నిష్క్రమించింది. కీలకం: సర్దార్ అజ్మన్. 22 ఏళ్ల ఈ ఫార్వర్డ్ 2015 ఆసియా కప్‌లో మెరుపులతో వెలుగులోకి వచ్చాడు. కోచ్: కార్లోస్ క్విరెజ్. పోర్చుగల్ దేశస్తుడు. 2014కు ముందునుంచి కొనసాగుతున్నాడు. తాము రష్యా వెళ్తున్నది విహార యాత్రకు కాదంటూ ప్రకటించాడు. ప్రపంచ ర్యాంక్: 36 చరిత్ర: ఐదోసారి బరిలో నిలిచింది. ఎన్నడూ గ్రూప్ దశ దాటలేదు. 1978లో 14వ స్థానంలో నిలవడమే మెరుగైన రికార్డు. ముందడుగేస్తే గొప్పే... ఆఫ్రికా ఉత్తర ప్రాంత దేశమైన మొరాకో 20 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌నకు అర్హత సాధించింది. హకీమ్ జియెచ్, యూనెస్ బెల్హాండా వంటి ప్రతిభావంతులైన యువకులతో ఆసక్తి రేపుతోంది. అయినా దిగ్గజ జట్లను దాటుకుని ముందుకెళ్లాలంటే శక్తికి మించిన ప్రదర్శన కనబర్చాల్సి ఉంటుంది. కోచ్ హెర్వ్ రెనార్డ్. జియెచ్ మధ్య తలెత్తిన విభేదాలు సద్దుమణిగినా, ఆ ప్రభావం జట్టుపై పడకుండా చూసుకోవాలి. కీలకం: నబిల్ దిరార్. గత సీజన్లో ఫ్రెంచ్ లీగ్ టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. కోచ్: హెర్వ్ రెనార్డ్. ఫ్రాన్స్ దేశస్తుడు. జట్టులో క్రమశిక్షణ, విజయ కాంక్ష పెంచాడు. మెరుపు దాడులతో పాటు, చక్కటి డిఫెండింగ్ వ్యవస్థను రూపొందించాడు. గతంలో జాంబియా, ఐవరీకోస్ట్ జట్లను తీర్చిదిద్దాడు. ప్రపంచ ర్యాంక్: 42 చరిత్ర: ఇప్పటివరకు ఆరుసార్లు క్వాలిఫై అయింది. 1986లో 11వ స్థానంలో నిలవడమే గొప్ప ప్రదర్శన. టికి టకా ఎందాకనో! టికి టకా...ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చేది స్పెయినే. తక్కువ దూరం పాస్‌లతో ఆకట్టుకునే ఈ తరహా ఆటతో 2010లో జట్టు తొలిసారి ప్రపంచ విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపర్చింది. కానీ, తర్వాత నుంచి అనూహ్యంగా వెనుకబడింది. 2014లో డిఫెండింగ్ చాంపియన్‌గా దిగి... 23వ స్థానంతో దారుణ పరాభవం పాలైంది. 2016లో యూరో కప్‌నూ నిలబెట్టుకోలేకపోయింది. అయితే, సెర్గియో రామోస్, గెరార్డ్ పికె వంటి డిఫెండర్లు, స్ట్రయికర్ అల్వారో మొరాటా, డిగో కోస్టా, గోల్ కీపర్ డేవిడ్ డె గీతో పాటు నాణ్యమైన మిడ్ ఫీల్డర్లు, ఫార్వర్డ్లున్నందున ఈసారి ముందడుగు వేసే అవకాశాలు బాగానే ఉన్నాయి. కీలకం: 34 ఏళ్ల ఆండ్రెస్ ఇనెస్టా. 2010 ప్రపంచకప్‌లో గోల్‌తో కప్ సాధించి పెట్టాడు. ఈసారి ఏమేరకు రాణిస్తాడో చూడాలి. కోచ్: జులెన్ లొప్టెగ్యు. మాజీ గోల్ కీపర్ అయిన ఇతడు జట్టులో పునరుత్తేజం నింపాడు. తన ఆధ్వర్యంలోనే స్పెయిన్... 10 క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో తొమ్మిది గెలిచి, ఒకటి డ్రా చేసుకుని అజేయంగా నిలిచింది. ఇటలీని ఏకంగా 3–0తో ఓడించింది. ప్రపంచ ర్యాంక్: 8 చరిత్ర: 14 సార్లు క్వాలిఫై అయింది. 2010 చాంపియన్. 1950లో 4వ, 2002లో 5వ స్థానంలో నిలిచింది. 2014లో 23వ స్థానంలో నిలవడం జట్టు చరిత్రలోనే అతిపెద్ద వైఫల్యం. -
సౌదీ అరేబియాతో రష్యా తొలి పోరు
మాస్కో: వచ్చే ఏడాది సొంతగడ్డపై జరిగే ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఆతిథ్య రష్యా జట్టుకు సులువైన ‘డ్రా’నే పడింది. గ్రూప్ ‘ఎ’లో చోటు పొందిన రష్యా జూన్ 14న జరిగే టోర్నీ తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియా జట్టుతో తలపడుతుంది. ఇదే గ్రూప్‌లో ఈజిప్టు, ఉరుగ్వే జట్లు కూడా ఉన్నాయి. వచ్చే సంవత్సరం జూన్ 14 నుంచి జులై 15 వరకు రష్యాలోని 12 వేదికల్లో ఈ మెగా టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నీకి సంబంధించిన ‘డ్రా’ విడుదల కార్యక్రమం శుక్రవారం మాస్కోలో అట్టహాసంగా జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్... ‘ఫిఫా’ అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో... దిగ్గజాలు పీలే (బ్రెజిల్), మారడోనా (అర్జెంటీనా) తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం 32 జట్లను ఎనిమిది గ్రూప్‌లుగా (4 జట్లు చొప్పున) విభజించారు. లీగ్ దశ మ్యాచ్‌లు పూర్తయ్యాక ఆయా గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు చేరుకుంటాయి. డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ గ్రూప్ ‘ఎఫ్’లో ఉండగా... క్రితంసారి రన్నరప్ అర్జెంటీనాకు గ్రూప్ ‘డి’లో చోటు దక్కింది. నాలుగుసార్లు చాంపియన్ ఇటలీ... మూడుసార్లు రన్నరప్ నెదర్లాండ్స్... ఒకసారి సెమీస్ చేరిన అమెరికా జట్లు వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌నకు అర్హత సాధించడంలో విఫలంకాగా... పనామా, ఐస్లాండ్ జట్లు తొలిసారి అర్హత సాధించాయి. ఏ గ్రూప్‌లో ఎవరంటే... గ్రూప్ ‘ఎ’: రష్యా, సౌదీ అరేబియా, ఈజిప్టు, ఉరుగ్వే. గ్రూప్ ‘బి’: పోర్చుగల్, స్పెయిన్, మొరాకో, ఇరాన్. గ్రూప్ ‘సి’: ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, పెరూ, డెన్మార్క్. గ్రూప్ ‘డి’: అర్జెంటీనా, ఐస్లాండ్, క్రొయేషియా, నైజీరియా. గ్రూప్ ‘ఇ’: బ్రెజిల్, స్విట్జర్లాండ్, కోస్టారికా, సెర్బియా. గ్రూప్ ‘ఎఫ్’: జర్మనీ, మెక్సికో, స్వీడన్, కొరియా. గ్రూప్ ‘జి’: బెల్జియం, పనామా, ట్యూనిషియా, ఇంగ్లండ్. గ్రూప్ ‘హెచ్’: పోలాండ్, సెనెగల్, కొలంబియా, జపాన్. -
ఐస్లాండ్ అద్భుతం
రిక్జావిక్ (ఐస్లాండ్): గతేడాది యూరో ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తమ క్వార్టర్ ఫైనల్ ప్రదర్శన గాలివాటమేమీ కాదని ఐస్లాండ్ జట్టు నిరూపించింది. కేవలం 3 లక్షల 30 వేల జనాభా ఉన్న ఈ చిన్న యూరోప్ దేశం వచ్చే ఏడాది రష్యాలో జరిగే ‘ఫిఫా’ ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు అర్హత సాధించి సంచలనం సృష్టించింది. యూరోప్ జోన్లో భాగంగా జరిగిన తమ చివరి క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ఐస్లాండ్ 2–0తో కొసావో జట్టును ఓడించి ప్రపంచకప్ బెర్త్‌ను దక్కించుకుంది. ఆరు జట్లు ఉన్న గ్రూప్–1లో ఐస్లాండ్ 10 మ్యాచ్‌లు ఆడి 7 విజయాలు, ఒక ‘డ్రా’, రెండు పరాజయాలతో మొత్తం 22 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా ప్రపంచకప్‌కు అర్హత పొందిన అతి చిన్న దేశంగా (జనాభా పరంగా) ఐస్లాండ్ గుర్తింపు పొందింది. ఇప్పటివరకు ఈ ఘనత ట్రినిడాడ్ అండ్ టొబాగో (2006–కోటి 30 లక్షల జనాభా) పేరిట ఉండేది. వచ్చే ఏడాది జూన్ 14 నుంచి జూలై 15 వరకు రష్యాలో జరిగే ప్రపంచకప్‌లో మొత్తం 32 జట్లు పాల్గొంటాయి. ఇప్పటివరకు ఆతిథ్య రష్యా జట్టుతో కలిపి 17 జట్లు అర్హత సాధించగా... నవంబర్ 14వ తేదీతో మిగతా 15 జట్లు ఖాయమవుతాయి. -
గ్రూప్ ‘ఎ’లో భారత్
అండర్–17 ఫుట్‌బాల్ ప్రపంచకప్ ‘డ్రా’ విడుదల ముంబై: భారత్ ఆతిథ్యమివ్వనున్న ప్రతిష్టాత్మక అండర్–17 ప్రపంచకప్ ఫుట్‌బాల్ ‘డ్రా’ను శుక్రవారం విడుదల చేశారు. మొత్తం ఆరు గ్రూపుల్లో 24 జట్లు తలపడనున్నాయి. అయితే గ్రూప్ ‘ఎ’లో ఉన్న భారత్‌కు కఠిన పోటీయే ఎదురుకానుంది. రెండుసార్లు చాంపియన్ (1991, 95)గా నిలిచిన ఘనాతో పాటు యూఎస్ఏ, కొలంబియా ఈ గ్రూప్‌లోనే ఉన్నాయి. ఆరు వేదికల్లో జరిగే ఈ టోర్నీ అక్టోబర్ 6 నుంచి 28 వరకు జరుగుతుంది.గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లన్నీ ఢిల్లీలోనే జరుగుతాయి. లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాక ఆరు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు, మూడో స్థానంలో నిలిచిన నాలుగు అత్యుత్తమ జట్లు ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ‘డ్రా’ విడుదల కార్యక్రమంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో పాటు ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ చెత్రి, ఫిఫా కౌన్సిల్ సభ్యుడు సునీల్ గులాటి, భారత ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్, క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ పాల్గొన్నారు. -
ఫుట్‌బాల్ క్రీడకు ప్రోత్సాహం
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో జరుగనున్న ‘ఫిఫా’ అండర్–17 ఫుట్‌బాల్ ప్రపంచకప్ ప్రచారంలో భాగంగా బుధవారం ఎల్బీ స్టేడియంలో ‘మిషన్ ఎలెవన్ మిలియన్’ పేరిట సెమినార్‌ను ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఫుట్‌బాల్ క్రీడాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చలు జరిపారు. పిల్లల్లో ఫుట్‌బాల్ క్రీడపై ఆసక్తి కలిగించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఫుట్‌బాల్ టోర్నమెంట్లు నిర్వహించాలని పాఠశాలల ప్రిన్సిపల్స్, పీఈటీలు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వారంలో ఒకరోజు పిల్లలకి ఫుట్‌బాల్ క్రీడలో మెళకువలు నేర్పించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్‌రెడ్డి, ఎండీ దినకర్‌బాబు, సీనియర్ కోచ్ ఆరిఫ్, తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం అధ్యక్షులు మొహమ్మద్ అలీ రఫాత్, కార్యదర్శి ఫల్గుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలకు 500 ఫుట్‌బాల్‌లను పంపిణీ చేశారు. -
ఇరాన్ చేతిలో భారత్ చిత్తు
ఫుట్‌బాల్ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ టెహ్రాన్: ఫుట్‌బాల్ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత జట్టుకు మరో పరాజయం ఎదురైంది. గురువారం గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసియా నంబర్‌వన్ ఇరాన్ 4-0తో ఘనవిజయం సాధించింది. రెండో రౌండ్లో భారత్ తమ చివరి మ్యాచ్‌ను 29న కొచ్చిలో తుర్కెమెనిస్తాన్‌తో ఆడుతుంది. ఇప్పటికే ప్రపంచకప్‌కు అర్హత సాధించే అవకాశాలు కోల్పోయిన భారత్ ఈ నామమాత్రమైన ఆసియా జోన్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లోనూ ఏమాత్రం పోరాడలేక పోయింది. ఇరాన్ తరఫున ఎహ్సాన్ హజీ సఫీ (33, 66వ నిమిషాల్లో) పెనాల్టీ కిక్‌ల ద్వారా రెండు గోల్స్ చేయగా సర్దార్ అజమౌన్ (61), అలిరెజా జహాన్ బక్ష్ (78) చెరో గోల్ సాధించారు. -
నేడు ఇరాన్‌తో భారత్ పోరు
ఫుట్‌బాల్ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ టెహ్రాన్: ఇప్పటికే 2018 ప్రపంచకప్‌కు అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయిన భారత ఫుట్‌బాల్ జట్టు గురువారం నామమాత్రమైన ఆసియా జోన్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో ఆసియా నంబర్‌వన్ ఇరాన్ జట్టుతో తలపడనుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 160వ స్థానంలో ఉన్న భారత జట్టు ఈ మ్యాచ్‌లో రెగ్యులర్ కెప్టెన్ సునీల్ చెత్రి లేకుండానే బరిలోకి దిగనుంది. గాయం కారణంగా సునీల్ చెత్రి ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. జెజె లాల్‌పెకులువా భారత్‌కు సారథ్యం వహిస్తాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 44వ స్థానంలో ఉన్న ఇరాన్ గ్రూప్ ‘డి’లో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో గెలిచి, మరో రెండింటిని ‘డ్రా’ చేసుకొని 14 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు భారత్ ఆరు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక దాంట్లో గెలిచి, ఐదింటిలో ఓడిపోయి మూడు పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. 1959లో చివరిసారి ఇరాన్‌పై గెలిచిన భారత్ ఆ తర్వాత ఈ జట్టుపై గెలవలేదు. -
చరిత్ర సృష్టించిన అమెరికా
మూడోసారి మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ కైవసం ఫైనల్లో 5-2తో జపాన్‌పై విజయం వాంకోవర్: మహిళల ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో అమెరికా జట్టు చరిత్ర సృష్టించింది. కెప్టెన్ కార్లీ లాయిడ్ హ్యాట్రిక్ గోల్స్‌తో అదరగొట్టడంతో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జపాన్ను 5-2తో చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో ప్రపంచకప్‌ను మూడు సార్లు సాధించిన తొలి జట్టుగా అమెరికా రికార్డులకెక్కింది. గతంలో 1991, 1999లోనూ ఈ మెగా కప్‌ను అందుకుంది. లాయిడ్‌కు గోల్డెన్ బాల్ అవార్డు లభించింది. 2011 ఫైనల్స్‌లో జపాన్‌తోనే ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో బరిలోకి దిగిన అమెరికాకు... కార్లీ లాయిడ్ అత్యద్భుత ఆటతీరు చూపెట్టి 13 నిమిషాల వ్యవధిలో హ్యాట్రిక్ గోల్స్‌తో స్పష్టమైన ఆధిక్యాన్ని అందించింది. ప్రపంచకప్ ఫైనల్లో ఓ ప్లేయర్ మూడు గోల్స్ చేయడం ఇదే తొలిసారి. -
ఇంగ్లండ్ సెల్ఫ్ గోల్
ఫైనల్లో జపాన్ మహిళల ప్రపంచకప్ ఫుట్‌బాల్ ఎడ్మాంటన్ (కెనడా): ఇంజ్యురీ సమయంలో చేసిన తప్పిదంతో ఇంగ్లండ్ జట్టు ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఆశలకు గండి పడింది. మహిళల ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం అర్ధరాత్రి డిఫెండింగ్ చాంపియన్ జపాన్‌తో జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్‌లో 1-2తో ఓడింది. ఆదివారం జరిగే ఫైనల్లో జపాన్ జట్టు అమెరికాతో తలపడుతుంది. మ్యాచ్ అదనపు సమయం రెండో నిమిషంలో ఇంగ్లండ్ డిఫెండర్ లారా బాసెట్ బంతిని గోల్‌పోస్టు పైనుంచి పంపాలని ప్రయత్నించినా అది బార్‌కు తగిలి లోపలే పడింది. దీంతో జపాన్ సంబరాల్లో మునిగిపోగా.. తొలిసారి సెమీస్‌లోకి వ చ్చిన ఇంగ్లండ్ విషాదంలో మునిగింది. అంతకుముందు 33వ నిమిషంలో జపాన్ కెప్టెన్ అయా మియామా పెనాల్టీ ద్వారా గోల్ చేయగా ఇంగ్లండ్‌కు కూడా ఫారా విలియమ్స్ (40వ ని.) పెనాల్టీ కిక్ ద్వారా గోల్ అందించింది. -
బాత్రూమ్లు బాగుండాలి...
గతంలో భారత్ చాలా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చి ఉండొచ్చు. కానీ ఫుట్‌బాల్ ప్రపంచకప్ నిర్వహించాలంటే మాత్రం చుక్కలు కనిపించేలా ఉన్నాయి. 2017లో భారత్ అండర్-17 ప్రపంచకప్ ఫుట్‌బాల్ నిర్వహించనుంది. దీనికోసం ఫిఫా అధికారులు టోర్నీ కోసం చేయాల్సిన ఏర్పాట్ల గురించి ఒక జాబితా పంపించారు. ఇందులో ఏకంగా 8532 అంశాలు ఉన్నాయి. గదుల్లో ఉండాల్సిన ఫ్రిజ్‌లు, హెయిర్ డ్రయర్స్ దగ్గరి నుంచి బాత్రూమ్లు ఎలా ఉండాలో కూడా ఆ జాబితాలో ఉంది. ఎక్కడా బండలు జారకూడదట. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉండాల్సిన ఐస్ బరువుతో పాటు బాత్రూమ్ షవర్లో నీళ్లు ఎలా రావాలో కూడా ఆ జాబితాలో ఫిఫా పేర్కొంది. ఇక వేదికల్లో చేయాల్సిన ఏర్పాట్లు, మైదానంలో ఉండాల్సిన గడ్డి లెవల్... ఇలా ఆ జాబితా అంతా చదవడానికే రెండు రోజులు పడుతుందని టోర్నమెంట్ డెరైక్టర్ జేవియర్ సెప్పి తెలిపారు. ఫుట్‌బాలా మజాకా..! -
ఉత్కంఠ భరిత పోరులో నెదర్లాండ్స్ గెలుపు
-
ఫుట్ బాల్ ప్రపంచకప్ లో సెమీస్ బెర్తులు ఖరారు
సల్వాదార్(బ్రెజిల్): ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీలో క్వార్టర్స్ పోరుకు తెరపడింది. ఇక నాలుగు ప్రధాన జట్లు సెమీ ఫైనల్లో ఆమీతూమీకి సిద్ధమయ్యాయి. క్వార్టర్స్ ఫైనల్ మ్యాచ్ ల్లో భాగంగా శనివారం రాత్రి నెదర్లాండ్స్-కోస్టారికాల మధ్య ఆసక్తికర పోరు జరిగింది. నిర్ణీత సమయంలో ఇరుజట్లు గోల్స్ చేయకపోవడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఇందులో నెదర్లాండ్స్ జట్టు 4-3 తేడాతో కోస్టారికాను ఓడించి సెమీఫైనల్ కు ప్రవేశించింది. దీంతో సెమీస్ ఫైనల్ రేసులో తలపడే జట్లు ఖరారయ్యాయి. మంగళవారం జరిగే తొలి సెమీఫైనల్లో జర్మనీ-బ్రెజిల్ లు తలపడుతుండగా, బుధవారం జరిగే రెండో సెమీ ఫైనల్లో అర్జెంటీనా-నెదర్లాండ్స్ జట్లు సమరానికి సిద్ధమయ్యాయి.గత విజేత స్పెయిన్ తొలి రౌండ్ లోని నిష్కమించగా, రన్నరప్ నెదర్లాండ్స్ మాత్రం టోర్నీలో ఆకట్టుకుంటూ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. -
ఉత్కంఠ భరిత పోరులో నెదర్లాండ్స్ గెలుపు
సాల్వెడర్(బ్రెజిల్): సాకర్ ప్రపంచకప్ సెమీ ఫైనల్లోకి నెదర్లాండ్స్ దూసుకెళ్లింది. క్వార్టర్ఫైనల్లో కోస్టారికాతో జరిగిన ఉత్కంఠ భరిత పోరులో నెదర్లాండ్స్ 4-3 గోల్స్ తేడాతో విజయం సాధించింది. సెమీఫైనల్లో అర్జెంటీనాతో నెదర్లాండ్స్ తలపడనుంది. నెదర్లాండ్స్, కోస్టారికా మధ్య జరిగిన చివరి క్వార్టర్‌ఫైనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించింది. నిర్ణీత 120 నిమిషాల సమయంలో ఇరు జట్లు గోల్ కొట్టకపోవడంతో పెనాల్టీ షూటౌట్ తో ఫలితాన్ని తేల్చారు. కీలకమైన ఈ షూటౌట్స్‌లో డచ్ గోల్‌కీపర్ టిమ్ క్రుల్ రెండు గోల్స్ అడ్డుకొని నెదర్లాండ్స్‌కు విజయం సాధించి పెట్టాడు. ఎక్స్ట్రా టైమ్ చివరి నిమిషంలో గోల్కీపర్ను మార్చడం డచ్ టీమ్‌కు కలిసొచ్చింది. సబ్‌స్టిట్యూట్ గోల్ కీపర్ గా వచ్చి అతడు జట్టుకు విజయాన్ని అందించడం విశేషం. కోస్టారికా ప్లేయర్స్ బ్రియన్ రూయిజ్, మైఖేల్ ఉమానా కొట్టిన రెండు గోల్స్‌ను క్రుల్ అడ్డుకున్నాడు. అదే సమయంలో నెదర్లాండ్స్ తరఫున వాన్పెర్సీ, రాబెన్, స్నైడెర్, కుయ్ట్ గోల్స్ సాధించారు. దీంతో పెనాల్టీ షూటౌట్స్‌లో 4-3 తేడాతో గెలిచి సెమీస్ చేరింది నెదర్లాండ్స్. నిర్ణీత సమయంతో పాటు ఎక్స్ ట్రా టైమ్‌లో ఎన్నోసార్లు గోల్స్ చేసే అవకాశమొచ్చనా సద్వినియోగం చేసుకోలేని డచ్ టీమ్.. మొత్తానికి షూటౌట్స్‌లో బతికిపోయింది. -
మంత్రి, నలుగురు ఎమ్మెల్యేలకు ప్రభుత్వం షాక్!
పనాజి: ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ పోటీలు చూడ్డానికి బ్రెజిల్ వెళ్లేందుకు టిక్కెట్ల బుకింగ్‌కు ఖర్చు చేసిన డబ్బును తిరిగి చెల్లించాలని ఒక మంత్రి సహా నలుగురు ఎమ్మెల్యేలను గోవా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆరుగురు ఎమ్మెల్యేలు బ్రెజిల్ టూర్‌కు 89 లక్షల రూపాయలు చెల్లించాలన్న ప్రతిపాదన వివాదస్పమైంది. దాంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బ్రెజిల్ టూర్‌కు బుకింగ్ చేసిన టికెట్ల డబ్బును ఈ నెలాఖరులోగా గోవా స్పోర్ట్స్ అథారిటీకి చెల్లించాలని ప్రభుత్వం ఒక మంత్రికి, నలుగురు ఎమ్మెల్యేలకు లేఖలు రాసింది. -
బొమ్మలతో ఆడుకుంటుంది
చిత్రంలోని అమ్మడి పేరు హాంగ్యీ.. చైనాలోని షాంగాయ్కు చెం దిన ఈమె చిత్రకారిణి. ఫుట్‌బాల్ ప్రపంచ కప్ సందర్భంగా హాంగ్ సాకర్ స్టార్లు రొనాల్డో, నెయ్మార్, మెస్సీల చిత్రాలను గీసింది. ఎలాగో తెలుసా? ఫుట్‌బాల్ ఆడుతూ..! నిజం.. ఈ చిత్రాలను ఆమె అలాగే గీసింది. ఫుట్‌బాల్‌ను వివిధ రంగులున్న బకెట్లలో ముంచి.. క్రమ పద్ధతిలో బాల్‌ను ఆడటం ద్వారా వీరి బొమ్మలను సృష్టించింది. వినూత్న తరహాలో చిత్రాలను గీయడంలో హాంగ్ పెట్టింది పేరు. గతంలోనూ సాక్సులతోనూ.. ఇతర వస్తువులతో రకరకాల పద్ధతుల్లో పెయింటింగ్‌లను చిత్రించింది. -
స్పెయిన్ గుండె పగిలింది
ఓ కల చెదిరిన వేళ... ఓ ఆశ ఆవిరైన క్షణం... ఫుట్‌బాల్ ప్రపంచం ఊహించని పరిణామం... ఆరేళ్లుగా అన్ని జట్లనూ ఫుట్‌బాల్ ఆడుకుంటూ ప్రపంచాన్ని శాసిస్తున్న స్పెయిన్ బుల్ ఈసారి చతికిలపడింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బ్రెజిల్ వచ్చిన జగజ్జేత ఆశలకు వారం రోజుల్లోపే తెరపడింది. కావలసినంత మంది స్టార్ ఆటగాళ్లున్నా కనీసం గ్రూప్ దశను దాటలేకపోయింది. వరుసగా రెండు దారుణ ఓటములతో స్పెయిన్ అభిమాని గుండె పగిలింది. ప్రపంచ ఫుట్‌బాల్‌లో స్పెయిన్ శకం ‘ముగిసింది’. రియో డి జనీరో : ప్రత్యర్థిని తక్కువ అంచనా వేస్తే ఫలితం ఎలా ఉంటుందో స్పెయిన్‌కు బాగా తెలిసొచ్చింది. స్టార్ ఆటగాళ్లున్నా.. పక్కా వ్యూహాలతో బరిలోకి దిగినా... సమష్టిగా ఆడటంలో విఫలమై తగిన మూల్యం చెల్లించుకుంది. ఫలితంగా బుధవారం అర్ధరాత్రి గ్రూప్-బిలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో చిలీ చేతిలో 0-2తో ఓడిపోయి తమ పోరాటాన్ని లీగ్ దశకే పరిమితం చేసుకుంది. ప్రపంచకప్ చరిత్రలో తొలిరౌండ్లోనే ఓడిన ఐదో డిఫెండింగ్ చాంపియన్ జట్టుగా స్పెయిన్ అపప్రదను మూటగట్టుకుంది. ఇంతవరకు స్పెయిన్ మాదిరిగా ఏ డిఫెండింగ్ చాంపియన్ కూడా తొలి రెండు మ్యాచ్‌ల్లోనే ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించలేదు. ఎడ్వార్డో వర్గాస్ (20వ ని.), అర్న్గ్వైజ్ (43వ ని.) చిలీ తరఫున గోల్స్ చేశారు. తాజా విజయంతో 2010 ప్రపంచకప్ గ్రూప్ మ్యాచ్‌లో స్పెయిన్ చేతిలో 1-2తో ఎదురైన పరాజయానికి చిలీ ప్రతీకారం తీర్చుకుంది. ప్రతి మ్యాచ్‌లో ఆరంభం నుంచే ఆధిపత్యాన్ని చూపే స్పెయిన్ ఈసారి మాత్రం పూర్తిగా తడబడింది. తొలి 45 నిమిషాల్లో చిలీ అటాకింగ్‌ను ఏమాత్రం అడ్డుకోలేకపోయింది. రెండో అర్ధభాగంలో కూడా చిలీ ఛేజింగ్ గేమ్‌తో అదరగొట్టింది. 15వ నిమిషంలో అలోన్సో కొట్టిన షాట్‌ను చిలీ గోల్ కీపర్ బ్రావో అద్భుతంగా అడ్డుకున్నాడు.20వ నిమిషంలో సాంచెజ్.. స్పెయిన్ డిఫెన్స్‌ను ఛేదిస్తూ బంతిని అర్న్గ్వైజ్కు అందించాడు. అక్కడి నుంచి పాస్ అందుకున్న వర్గాస్ బంతిని నేర్పుగా గోల్ పోస్ట్‌లోకి పంపాడు. దీంతో చిలీ 1-0 ఆధిక్యంలోకి వచ్చింది.27వ నిమిషంలో స్కోరును సమం చేసే అవకాశం స్పెయిన్‌కు వచ్చింది. సిల్వ ఇచ్చిన హెడర్‌ను డిగో కోస్టా డి సర్కిల్ నుంచి లెఫ్ట్ ఫుట్‌తో నెట్లోకి పంపే ప్రయత్నం చేశాడు. 43వ నిమిషంలో కొద్ది దూరం నుంచి సాంచెజ్ కొట్టిన ఫ్రీ కిక్‌ను క్యాసిలాస్ బాగానే అడ్డుకున్నా.. బంతిని వదిలిపెట్టాడు. సరిగ్గా ఇదే అవకాశం కోసం ఎదురుచూసిన అర్న్గ్వైజ్ రీబౌండ్ అయిన బంతిని క్యాసిలాస్ను బోల్తా కొట్టిస్తూ నెట్లోకి పంపాడు.రెండో అర్ధభాగంలో అల్బా, కోకీ, డిగో కోస్టా చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. 80వ నిమిషంలో చిలీ డిఫెన్స్‌ను ఛేదించిన ఇనెస్టా... సాంటి కార్లోజాతో సమయోచితంగా ముందుకు దూసుకెళ్లినా బ్రావో అడ్డుపడ్డాడు.మ్యాచ్ చివర్లో గోల్స్ కోసం స్పెయిన్ వీరోచితంగా పోరాడినా... చిలీ సమన్వయం ముందు చిన్నబోయింది. ‘టికీ-టకా’ శైలికి చెక్ ప్రపంచ ఫుట్‌బాల్‌లో మిగతా జట్లతో పోలిస్తే స్పెయిన్ ఆటతీరు భిన్నంగా ఉంటుంది. చిన్న చిన్న పాస్‌లతో ‘టికీ-టకా’ శైలితో ప్రత్యర్థులకు బంతి అందకుండా వేగంగా ముందుకు దూసుకుపోతుంది. అయితే గత ప్రపంచకప్‌లో విజయవంతమైన ఈ శైలి... చరిత్రాత్మక మరకానా స్టేడియం సాక్షిగా ఈసారి స్పెయిన్ కొంప ముంచింది. మ్యాచ్ తొలి అర్ధభాగంలో చిలీ చేసిన పవర్ఫుల్ (బ్రూటల్) అటాకింగ్ ముందు బుల్ ఆటలు సాగలేదు. జ. ఆ.మ్యా. గె. ఓ. డ్రా. పా. నెదర్లాండ్స్ 2 2 0 0 6 చిలీ 2 2 0 0 6 ఆస్ట్రేలియా 2 0 2 0 0 స్పెయిన్ 2 0 2 0 0 నోట్: జ:జట్లు; ఆ.మ్యా: ఆడిన మ్యాచ్‌లు; గె: గెలుపు; ఓ: ఓటమి; పా: పాయింట్లు. -
వచ్చే ఏడాది భారత్ వృద్ధి 6.5%
కొత్త పెట్టుబడుల జోరుతో సాకారం... సుస్థిర మోడీ సర్కారు రాకతో ఇన్వెస్టర్లలో పెరిగిన విశ్వాసం: సిటీ గ్రూప్ న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఇప్పుడు ఫుట్‌బాల్ ప్రపంచకప్ జరగనున్న బ్రెజిల్ రాజధాని రియోతో పాటు భారత్‌పైనే ఎక్కువగా గురిపెట్టారని అంతర్జాతీయ ఫైనాన్షియల్ దిగ్గజం సిటీగ్రూప్ అంటోంది. క్రమంగా భారత్‌లో పెట్టుబడులు పుంజుకోనున్నాయని.. దీంతో వృద్ధి కూడా జోరందుకుంటుందని రీసెర్చ్ నోట్లో పేర్కొంది. ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు 5.6 శాతంగా ఉండొచ్చని... వచ్చే ఆర్థిక సంవత్సరం(2014-15)లో ఇది 6.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని సిటీ గ్రూప్ అంచనావేసింది. మోడీ నేతృత్వంలో సుస్థిర సర్కారు కొలువుదీరడంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరుగుతోందని.. స్టాక్ మార్కెట్లు ఇప్పటికే ఆ జోష్‌ను అందిపుచ్చుకున్న విషయాన్ని సిటీ గ్రూప్ ప్రస్తావించింది. మోడీ ర్యాలీ తో గత శుక్రవారం సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త ఇంట్రాడే, ముగింపు ఆల్‌టైమ్ గరిష్టాలను తాకిన సంగతి తెలిసిందే. జూలైలో ప్రవేశపెట్టనున్న మోడీ ప్రభుత్వ తొలి బడ్జెట్... సర్కారు విధానపరంగా తీసుకోబోయే ప్రధాన చర్యలు, భవిష్యత్ నిర్ధేశాన్ని తెలియయనుందని రీసెర్చ్ నోట్ వెల్లడించింది. పెట్టుబడులను తిరిగి జోరందుకునేలా చేయడం, జీఎస్టీ/డీటీసీల అమలుకు సంబంధించి ప్రకటన, ఆర్థిక క్రమశిక్షణ ఇతరత్రా కీలక అంశాలకు బడ్జెట్లో ఎలాంటి ప్రాధాన్యం లభిస్తుందో తేటతెల్లమవుతుందని సీటీ గ్రూప్ పేర్కొంది. -
మ్యాచ్ సమయాల్లో మార్పులు
రియో డి జనీరో: వచ్చే ఏడాది జరగనున్న ఫుట్‌బాల్ ప్రపంచకప్ మ్యాచ్‌ల ప్రారంభ సమయాలపై ‘ఫిఫా’ మెట్టు దిగింది. అంతర్జాతీయ ఆటగాళ్ల సంఘం (ఎఫ్ఐఎఫ్ప్రో) చేసిన ఒత్తిడికి తలొగ్గి ఏడు మ్యాచ్‌ల ప్రారంభ సమయాల్లో మార్పులు చేసింది. కొన్నింటిని ముందుకు... మరికొన్నింటిని వెనక్కి జరిపింది. అధిక ఉష్ణోగ్రతకు ఆటగాళ్లు డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 14న మన్నాస్లో ఇంగ్లండ్, ఇటలీ మధ్య మ్యాచ్ రాత్రి 9 గంటలకు బదులుగా సాయంత్రం 6 గంటలకు జరగనుంది. యూరోపియన్ టెలివిజన్ ప్రసార సంస్థలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే రోజు రెసిఫీలో ఐవరీకోస్ట్, జపాన్ల మధ్య మ్యాచ్ రాత్రి 7 గంటలకు కాకుండా 10 గంటలకు నిర్వహించనున్నారు. జూన్ 18న మన్నాస్లో మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన కామోరూన్, క్రొయేషియా మ్యాచ్‌ను సాయంత్రం ఆరింటికి మార్చారు. రియో డి జనీరోలో స్పెయిన్, చిలీల మధ్య మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు కాకుండా సాయంత్రం 4 గంటలకు మొదలవుతుంది. -
బ్రెజిల్ తొలి ప్రత్యర్థి క్రొయేషియా
సాల్వెడార్: సొంతగడ్డపై వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో ఆతిథ్య బ్రెజిల్ జట్టు తమ తొలి మ్యాచ్‌ను క్రొయేషియా జట్టుతో ఆడుతుంది. వచ్చే సంవత్సరంలో జూన్ 12 నుంచి జూలై 13 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన ‘డ్రా’ వివరాలను శుక్రవారం విడుదల చేశారు. జూన్ 12న సావోపాలోలో క్రొయేషియాతో జరిగే గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌తో బ్రెజిల్ తమ టైటిల్ వేటను ప్రారంభిస్తుంది. ఆ తర్వాత 17న మెక్సికోతో; 23న కామెరూన్‌తో బ్రెజిల్ తలపడుతుంది. మొత్తం 32 జట్లను ఎనిమిది గ్రూప్‌లుగా విభజించారు. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ స్పెయిన్ తమ తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను ఢీకొంటుంది. ఈసారి విశ్వవిజేతగా నిలిచిన జట్టుకు 3 కోట్ల 50 లక్షల డాలర్ల (రూ. 214 కోట్లు) ప్రైజ్‌మనీగా లభిస్తాయి. ఆయా గ్రూప్‌ల వివరాలు: గ్రూప్ ‘ఎ’: బ్రెజిల్, క్రొయేషియా, మెక్సికో, కామెరూన్. గ్రూప్ ‘బి’: స్పెయిన్, నెదర్లాండ్స్, చిలీ, ఆస్ట్రేలియా. గ్రూప్ ‘సి’: కొలంబియా, గ్రీస్, ఐవరీకోస్ట్, జపాన్. గ్రూప్ ‘డి’: ఉరుగ్వే, కోస్టారికా, ఇంగ్లండ్, ఇటలీ. గ్రూప్ ‘ఇ’: స్విట్జర్లాండ్, ఈక్వెడార్, ఫ్రాన్స్, హోండూరస్. గ్రూప్ ‘ఎఫ్’: అర్జెంటీనా, బోస్నియా హెర్జెగోవినా, ఇరాన్, నైజీరియా. గ్రూప్ ‘జి’: జర్మనీ, పోర్చుగల్, ఘనా, అమెరికా. గ్రూప్ ‘హెచ్’: బెల్జియం, అల్జీరియా, రష్యా, దక్షిణ కొరియా -
‘బ్రజూకా’ వచ్చేసింది
సాల్వేడార్ (బ్రెజిల్): వచ్చే ఏడాది బ్రెజిల్లో జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఉపయోగించే అధికారిక బంతి ‘బ్రజూకా’ను విడుదల చేశారు. అధికారిక బంతికి పేరు సూచించాలని పోల్ నిర్వహించగా... 10 లక్షల మంది ఫుట్‌బాల్ అభిమానులు ఈ బంతికి బ్రజూకా పేరును సూచించారు. 437 గ్రాముల బరువు ఉన్న ఈ బంతి చుట్టుకొలత 69 సెంటీ మీటర్లు. రీబౌండ్ 141 సెంటీ మీటర్లు అవుతుంది. ఒకే రకమైన 6 పలకలు, బ్యూటైల్ బ్లాడర్, పాలీయూరెథాన్తో తయారైన ఫోమ్, 2 డెమైన్షనల్ ఉష్ణ బంధాలతో ఈ బంతిని రూపొందించారు. సమయాలను మార్చలేం: ‘ఫిఫా’ వచ్చే ఏడాది జరిగే ఫుట్‌బాల్ ప్రపంచకప్ మ్యాచ్‌ల ఆరంభ సమయాలను మార్చలేమని ‘ఫిఫా’ స్పష్టం చేసింది. బ్రెజిల్‌లోని కొన్ని నగరాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలుండటంతో ఆటగాళ్ల ఆరోగ్యం దెబ్బతింటుందని వస్తున్న కథనాలను ‘ఫిఫా’ సెక్రటరీ జనరల్ జెరోమ్ వాల్కీ తోసిపుచ్చారు. ‘మంచు కురుస్తున్న జ్యూరిచ్‌లో కూర్చొని ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. బ్రెజిల్ వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వైద్య నివేదికల ఆధారంగా షెడ్యూల్‌ను రూపొందించాం. పోర్టో అలెగ్రిలో 12 డిగ్రీలు, మనాస్‌లో 28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. కాబట్టి ఏ మ్యాచ్ కూడా మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలుకాదు. షెడ్యూల్ కూడా అలాగే ఉంటుంది. ఇక్కడి వాతావరణ పరిస్థితులపై మేం చాలా అప్రమత్తంగా ఉన్నాం’ అని వాల్కీ తెలిపారు. బ్రెజిల్లో శీతాకాలం ఉన్నప్పుడు ఈ టోర్నీ జరగనుంది. సాల్వేడార్, నటాల్, రాసిఫా, ఫోర్టాలెజా, మనాస్, కూయబాలో జూన్, జూలైలో కూడా 30 డిగ్రీలను మించలేదు. కాబట్టి టోర్నీకి ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఈ పోటీలకు ఆతిథ్యమివ్వనున్న స్టేడియాలను పూర్తి చేసేందుకు ఫిబ్రవరి చివరి వరకు గడువును పెంచారు.


