FIFA World Cup Qatar 2022: పోర్చు‘గోల్‌’ కొట్టింది..!

FIFA World Cup Qatar 2022: Ronaldo sets record as Portugal edge Ghana 3-2  - Sakshi

3–2తో ఘనాపై ఘన విజయం

దోహా: ‘ఫిఫా’ ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో పోర్చుగల్‌ ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా బోణీ కొట్టింది. గోల్‌ లేకుండా తొలి అర్ధ భాగం చప్పగా సాగగా... ద్వితియార్ధంలో పెనాల్టీ కిక్‌ మ్యాచ్‌ను ఉన్నపళంగా మార్చేసింది. చకాచకా గోల్స్‌తో నమోదవడంతో మ్యాచ్‌లో ఆసక్తి అంతకంతకూ పెరిగింది. చివరకు పోర్చుగల్‌ 3–2తో ఘనాపై గెలిచింది. ఆట 64వ నిమిషంలో స్టార్‌ స్ట్రయికర్‌ క్రిస్టియానో రొనాల్డోను మొరటుగా కిందపడేయడంతో రిఫరీ పెనాల్టీ కిక్‌ ఇచ్చాడు. దీన్ని సులువుగానే రొనాల్డో గోల్‌గా మలిచాడు. కానీ 8 నిమిషాల వ్యవధిలో ఘన ఆటగాడు అండ్రూ అవియు (73వ ని.) ఫీల్డ్‌ గోల్‌తో స్కోరును 1–1గా సమం చేశాడు. మళ్లీ ఐదు నిమిషాల్లో ఆధిక్యం మారింది.

జొవో ఫెలిక్స్‌ (78వ ని.), రాఫెల్‌ లియో (80వ ని.) ఫీల్డ్‌ గోల్స్‌ చేయడంతో పోర్చుగల్‌ 3–1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెగ్యులర్‌ టైమ్‌ ముగిసే దశలో ఘనా ఆటగాడు ఉస్మాన్‌ బుకారి (89వ ని.) హెడర్‌తో అద్భుతమైన గోల్‌ సాధించాడు. ఇంజ్యూరి టైమ్‌లో స్కోరును సమం చేసేందుకు ఘనా ఆటగాళ్లు శక్తికి మించి శ్రమించారు. ఆఖరి క్షణందాకా వారు గోల్‌పోస్ట్‌పై చేసిన దాడుల్ని పోర్చుగల్‌ డిఫెండర్లు అడ్డుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య పదే పదే ఘర్షణ వాతావరణం ఏర్పడింది. రిఫరీ ఆరు సార్లు ఎల్లో కార్డు ప్రయోగించాడు. పోర్చుగల్‌ జట్టులో ఇద్దరు, ఘనా బృందంలో నలుగురు ఎల్లో కార్డుకు గురయ్యారు.

5: ఐదు ప్రపంచకప్‌లలోనూ గోల్‌ చేసిన ఏకైక ఆటగాడు రొనాల్డో. ఈ సాకర్‌ స్టార్‌ 2006 మొదలు 2010, 2014, 2018, 2022 ప్రపంచకప్‌లలో గోల్‌ చేశాడు. ఓవరాల్‌గా 8 గోల్స్‌ సాధించాడు.

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top