న్యూఢిల్లీ: జైలులో 25 ఏళ్లు గడిపినందున విడుదల చేయాలంటూ గ్యాంగ్‌స్టర్ అబూసలేం పెట్టుకున్న అర్జీపై సుప్రీంకోర్టు సూటి ప్రశ్నను సంధించింది. వాదనను రుజువు చేసుకున్న పక్షంలో, జైలు నుంచి విముక్తి కలి్పస్తామని అతడికి స్పష్టం చేసింది. 1993 ముంబై పేలుళ్ల కేసులో దోషిగా ఉన్న అబూ సలేం పోర్చుగల్‌కు పారిపోయాడు. సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం భారత ప్రభుత్వం అతడిని 2005 నవంబర్ 11వ తేదీన తిరిగి తీసుకువచ్చింది.
అప్పట్లో పోర్చుగల్ కోర్టు అతడి అప్పగింతకు కొన్ని షరతులను విధించింది. అందులో, అబూ సలేంకు మరణశిక్ష విధించరాదు, జైలు శిక్ష 25 ఏళ్లకు మించరాదనేవి కీలకంగా ఉన్నాయి. తన 25 ఏళ్ల జైలు శిక్ష పూర్తయిందని, విడుదల చేయాలంటూ అతడు వేసిన పిటిషన్‌పై సోమవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. 2005 నుంచి జైలులో ఉంటున్నప్పుడు 2026 నాటికి 25 ఏళ్లవుతాయని ఎలా లెక్కగట్టారు? అని ప్రశ్నించింది.
పోర్చుగల్‌లో జైలులో ఉన్న రెండేళ్ల కాలాన్ని, స్రత్పవర్తనకు గాను శిక్ష తగ్గింపులను కలుపుకుంటే 25 ఏళ్లు అవుతాయని సలీం అంటున్నాడని అతడి లాయర్ చెప్పారు. అయితే, టాడా కింద అరెస్టయిన సలేంకు మహారాష్ట్ర చట్టాల ప్రకారం శిక్షాకాలంలో ఎటువంటి తగ్గింపు ఉండదని ధర్మాసనం పేర్కొనగా.. నిబంధనల కాపీని చూపిస్తామని సలేం న్యాయవాది తెలిపారు. సంబంధిత జైలు నిబంధనలతో రెండు వారాల్లోగా పిటిషన్ వేయాలని ఆదేశించిన ధర్మాసనం, తదుపరి విచారణను ఫిబ్రవరి 9వ తేదీకి వాయిదా వేసింది. కాగా, ముంబైకి చెందిన బిల్డర్ ప్రదీప్ జైన్ హత్య కేసులో ప్రత్యేక టాడా కోర్టు సలేంకు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ 2015లో తీర్పు ఇవ్వడం గమనార్హం.


