తొలిసారి ‘ఫిఫా’ అండర్–17 ప్రపంచకప్ టైటిల్ సొంతం
ఫైనల్లో ఆస్ట్రియాపై 1–0 గోల్ తేడాతో గెలుపు
దోహ: పోర్చుగల్ ఫుట్‌బాల్ అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు క్రిస్టియానో రొనాల్డో. వరుసగా ఆరో ప్రపంచకప్ ఆడబోతున్న రొనాల్డోకు ప్రపంచకప్ ట్రోఫీ మాత్రం అందని ద్రాక్షగానే ఉంది. అయితే రొనాల్డో కలను పోర్చుగల్ యువ జట్టు మరో రూపంలో నెరవేర్చింది. తొలిసారి అండర్–17 ప్రపంచకప్‌లో పోర్చుగల్ జట్టు చాంపియన్‌గా అవతరించింది. సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన పోర్చుగల్ యువ జట్టు గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో 1–0 గోల్ తేడాతో ఆ్రస్టియాపై విజయం సాధించింది.
ఈ టోర్నీ నిర్వహించడం ఇది 20వ సారి కాగా... పోర్చుగల్ తొలిసారి విజేతగా నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన ‘షూటౌట్ పోరు’లో ఇటలీ 4–2 గోల్స్ తేడాతో బ్రెజిల్‌పై విజయం సాధించింది. తుదిపోరులో పోర్చుగల్ జట్టు తరఫున అన్‌సియో కాబ్రాల్ (32వ నిమషంలో) ఏకైక గోల్ సాధించాడు. ఈ టోర్నీలో కాబ్రాల్‌కు ఇది ఏడో గోల్ కావడం విశేషం.
ఆ్రస్టియాకు చెందిన జొహన్నెస్ మోసెర్ 8 గోల్స్‌తో ‘గోల్డెన్ బాల్’ అవార్డు అందుకున్నాడు. మొత్తం 48 దేశాల జట్లు పోటీపడిన ఈ టోర్నమెంట్‌లో తొలి మూడు స్థానాలు యూరప్ జట్లే దక్కించుకోవడం విశేషం. ఖతర్ వేదికగా జరిగిన ఈ టోర్నీ లీగ్ దశలో గ్రూప్ ‘బి’లో రెండో స్థానంలో నిలిచిన పోర్చుగల్ ఆ తర్వాత 2–1 గోల్స్ తేడాతో బెల్జియంపై, ప్రిక్వార్టర్స్‌లో 5–0తో మెక్సికోపై గెలిచింది.
క్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్ జట్టు 2–0 గోల్స్ తేడాతో స్విట్జర్లాండ్‌ను చిత్తు చేసింది. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో షూటౌట్‌లో 6–5 గోల్స్ తేడాతో నాలుగుసార్లు చాంపియన్ బ్రెజిల్‌పై గెలిచి ఫైనల్లో అడుగు పెట్టింది. తుదిపోరులో సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ ప్రపంచకప్ ట్రోఫీ కైవసం చేసుకుంది.


