లయోనల్ మెస్సీ ‘షో’ టికెట్ల ధరలు
డిసెంబర్ 13న హైదరాబాద్‌లో కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా సూపర్‌స్టార్ లయోనల్ మెస్సీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ప్రత్యక్షంగా ఈ స్టార్ ప్లేయర్ ఆటను చూసే అవకాశం నగర అభిమానులకు కలుగుతోంది. ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా డిసెంబర్ 13న మెస్సీ హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటాడు. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ షో నిర్వహిస్తారు.
దేశవ్యాప్తంగా నాలుగు దిక్కుల్లో నాలుగు నగరాలు కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలలో అతని పర్యటన ఉంటుంది. ఇవన్నీ పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమాలు. ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజర్ శతధ్రు దత్తా ఈ టూర్ మొత్తానికి నిర్వాహకుడు. నాలుగు వేదికల్లో అభిమానుల కోసం నిర్వహిస్తున్న ఈవెంట్లు కాకుండా ముంబైలో వ్యక్తిగతంగా మెస్సీని కలిసి ఫోటో దిగే అవకాశం కూడా నిర్వాహకులు కల్పిస్తున్నారు. అయితే దీని కోసం ఒక్కొక్కరు సుమారు రూ.9.95 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది!
స్టేడియంలో కార్యక్రమం ఇదీ...
సాయంత్రం 7 గంటలకు మొదలై దాదాపు 3 గంటల పాటు మెస్సీ ‘షో’ సాగుతుంది. ఇందులో నాలుగు అంశాలు ఉన్నాయి. ఎంపిక చేసిన సెలబ్రిటీలతో ఎగ్జిబిషన్ మ్యాచ్... ఎంపిక చేసిన చిన్నారులతో ‘మాస్టర్ క్లాస్ విత్ యంగ్ టాలెంట్స్’... ‘పెనాల్టీ షూటౌట్’లో మెస్సీ పాల్గొంటాడు. ఆ తర్వాత మ్యూజికల్ కన్‌సర్ట్ ఉంటుంది. దీనికి సంబంధించి నిర్వాహకులు టికెట్ల వివరాలను ప్రకటించారు.
ఇందులో వరుసగా రూ. 1750, రూ. 2000, రూ. 3250, రూ. 5000, రూ. 7000, రూ. 8000, రూ. 13500 విలువ గల టికెట్లు ఫ్యాన్స్ కోసం అందుబాటులో ఉన్నాయి. టికెట్లను https://www.district.in/ events/goat-india-tour-2025-lionel-messi-hyderabad-buy-tickets వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.


