మెగా క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌లో మరో జట్టు యాజమాన్యం మారనుందా? ఇప్పటికే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) టీమ్‌ను అమ్మకానికి పెట్టారు. తాజాగా మరో జట్టు కూడా ఇదే బాటలో పయనిస్తోందన్న సమాచారం బయటకు వచ్చింది. ఇంతకీ ఆ రెండో జట్టు ఏది? ఈ రెండు జట్లను దక్కించుకునేందుకు పోటీ పడుతున్న కొనుగోలుదారులు ఎవరో తెలుసుకోవాలని ఉందా?
ఒకటి కాదు, రెండు ఐపీఎల్ జట్లు ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయని ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయంకా (Harsh Goenka) ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆర్సీబీతో పాటు రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) జట్టును విక్రయించనున్నట్టు తెలిసిందని పేర్కొన్నారు. ఈ రెండు టీమ్‌లను దక్కించుకునేందుకు నలుగురైదుగురు కొనుగోలుదారులు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. పుణే, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు లేదా అమెరికా చెందిన వారు ఈ జట్లను దక్కించుకోవచ్చన్నారు. వచ్చే ఐపీఎల్ సీజన్ నాటికి ఆర్సీబీ, ఆర్‌ఆర్ జట్ల యాజమాన్యం మారే అవకాశాలు ఉన్నట్టు దీన్నిబట్టి స్పష్టమవుతోంది.
రాజస్థాన్ రాయల్స్ (RR) ఫ్రాంచైజీకి మనోజ్ బాదాలే యజమానిగా ఉన్నారు. ఆయనకు చెందిన ఎమర్జింగ్ మీడియా IPL లిమిటెడ్‌కు ఈ జట్టులో దాదాపు 65% వాటా ఉంది. రెడ్‌బర్డ్ క్యాపిటల్ పార్టనర్స్, మీడియా-వ్యాపార దిగ్గజం లాచ్లాన్ ముర్డోచ్ మైనారిటీ వాటాదారులుగా కొనసాగుతున్నారు. రెడ్‌బర్డ్ క్యాపిటల్ పార్టనర్స్ సుమారు 15% వాటాను కలిగి ఉంది. ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం దివంగత షేన్ వార్న్ కుటుంబానికి కూడా చిన్న షేర్ ఉన్నట్టు తెలుస్తోంది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైప్పటి నుంచి రాజస్థాన్ రాయల్స్ కార్యకలాపాలు, వ్యూహాత్మక నిర్ణయాలలో మనోజ్ బాదాలే కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా, 2008లో ఐపీఎల్ తొలి టైటిల్‌ను రాజస్థాన్ రాయల్స్ గెలిచిన సంగతి క్రికెట్ అభిమానులకు గుర్తుండే ఉంటుంది.
మార్చి నాటికి ఆర్సీబీ అమ్మకం పూర్తి
2025 ఐపీఎల్ టైటిల్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చే ఏడాది సీజన్‌కు ముందే అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఆర్సీబీ ఫ్రాంచైజీని విక్రయించే ప్రక్రియను నవంబర్ 5న అధికారికంగా ప్రారంభించినట్లు ప్రస్తుత యాజమాన్యం డియాజియో ధ్రువీకరించింది. అమ్మకపు ప్రక్రియ వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ముగుస్తుందని భావిస్తున్నట్టు తెలిపింది.
చదవండి: స్మృతి పెళ్లి వివాదం.. చాట్‌లను బయటపెట్టింది నేనే..
I hear, not one, but two IPL teams are now up for sale- RCB and RR. It seems clear that people want to cash in the rich valuations today. So two teams for sale and 4/5 possible buyers! Who will be the successful buyers- will it be from Pune, Ahmedabad, Mumbai, Bengaluru or USA?
— Harsh Goenka (@hvgoenka) November 27, 2025


