భారత మహిళా క్రికెట్ జట్టు స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం షెడ్యూల్ విడుదుల చేసింది. సొంతగడ్డపై భారత జట్టు శ్రీలంకతో డిసెంబరు 21 నుంచి డిసెంబరు 30 వరకు ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నట్లు తెలిపింది.
ఈ సిరీస్‌కు విశాఖపట్నం, తిరువనంతపురం ఆతిథ్యం ఇవ్వనున్నట్లు బీసీసీఐ (BCCI) తన ప్రకటనలో పేర్కొంది. నిజానికి భారత్- బంగ్లాదేశ్ మహిళా జట్ల మధ్య సిరీస్ జరగాల్సింది. ఇందుకోసం భారత జట్టు బంగ్లాదేశ్‌కు వెళ్లాల్సి ఉండగా.. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య పరిస్థితుల దృష్ట్యా సెప్టెంబరు 2026కు ఈ టూర్‌ను వాయిదా వేశారు.
టీ20 ప్రపంచకప్-2026కి సన్నాహకంగా
ఈ క్రమంలో శ్రీలంకతో భారత్ (IND vs SL T20Is) మ్యాచ్‌లు ఆడే విధంగా తాజాగా షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఐసీసీ వన్డే ప్రపంచకప్-2025లో చాంపియన్‌గా నిలిచిన తర్వాత భారత జట్టు.. శ్రీలంకతో టీ20 సిరీస్ ద్వారా తమ తదుపరి ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది.
ఇంగ్లండ్ వేదికగా జూన్ 12- జూలై 5 వరకు జరుగనున్న మహిళల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ఇరుజట్లకు ఇది మంచి సన్నాహకంగా ఉపయోగపడనుంది. ఇదిలా ఉంటే.. శ్రీలంకతో సిరీస్ ముగిసిన తర్వాత భారత మహిళా క్రికెటర్లు మహిళల ప్రీమియర్ లీగ్‌తో బిజీగా కానున్నారు.
మహిళల ప్రీమియర్ లీగ్ వేదికలు ఇవే
నవీ ముంబై, వడోదర వేదికలుగా జనవరి 9 - ఫిబ్రవరి 5 మధ్య ఈ టోర్నీ నిర్వహించనున్నట్లు బీసీసీఐ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత మహిళా జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఫిబ్రవరి 15- మార్చి 6 వరకు మల్టీ ఫార్మాట్ టోర్నీ ఆడనుంది.
భారత్ వర్సెస్ టీ20 సిరీస్ షెడ్యూల్
👉డిసెంబరు 21- ఆదివారం- తొలి టీ20- విశాఖపట్నం
👉డిసెంబరు 23- మంగళవారం- రెండో టీ20- విశాఖపట్నం
👉డిసెంబరు 26- శుక్రవారం- మూడో టీ20- తిరువనంతపురం
👉డిసెంబరు 28- ఆదివారం- నాలుగో టీ20- తిరువనంతపురం
👉డిసెంబరు 30- మంగళవారం- ఐదో టీ20- తిరువనంతపురం.


