పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ (Moin Khan) కుమారుడిగా ప్రేక్షకులకు పరిచయమైన క్రికెటర్ ఆజం ఖాన్ (Azam Khan). పాక్ తరఫున 2021లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఆజం.. 14 మ్యాచ్‌లు ఆడి కేవలం 88 పరుగులే చేశాడు.
ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్-2024 టోర్నమెంట్ ముగిసిన తర్వాత.. తిరిగి జాతీయ జట్టులో ఆజం ఖాన్ స్థానం సంపాదించుకోలేకపోయాడు. చెత్త ప్రదర్శన కారణంగా జట్టులో అతడికి చోటు కరువైంది. ఆడిన పద్నాలుగు మ్యాచ్‌లలో కలిపి కనీసం వంద పరుగులు కూడా చేయకపోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.
మీమ్ మెటీరియల్ అయ్యేవాడు
ఇందుకు తోడు ఆజం ఖాన్ భారీ కాయంపై కూడా విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. కనీస ఫిట్‌నెస్ లేని ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఫీల్డర్‌గానూ ఓ ఫెయిల్యూర్‌గా మిగిలిపోయాడు. పదే పదే క్యాచ్‌లు డ్రాప్ చేస్తూ మీమ్ మెటీరియల్ అయ్యేవాడు.
ఈ విషయాల గురించి ఆజం ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. 2024లో ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా తాను అవహేళనకు గురయ్యాయని.. తన జీవితంలో అతిగా బాధపడ్డ సందర్భం అదేనంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.
అభ్యంతరకర భాషలో దూషించారు
‘‘ఆరోజు మార్క్ వుడ్.. తొలుత నాకు బౌన్సర్ సంధించాడు. నేను దానిని వదిలేశాను. పాకిస్తాన్‌లో కూడా గంటకు నూటా యాభై కిలో మీటర్ల వేగంతో బంతులు సంధిస్తారు కాబట్టి.. నాకు అదేమీ కొత్తగా అనిపించలేదు.
కానీ ఆ తర్వాత కూడా మార్క్ వుడ్ మళ్లీ బౌన్సర్ వేశాడు. నేను దానినీ ఎదుర్కోలేకపోయాను. అపుడు నా జీవితం స్తంభించిపోయినట్లుగా అనిపించింది. అసలు నాకేం అవుతుందో కూడా అర్థం కాలేదు.
నా వేలికి గాయమైన తర్వాత.. నా పని అయిపోయిందని గ్రహించాను. అంతలోనే ఓవల్ స్టేడియంలోని ప్రేక్షకులు నన్ను అభ్యంతరకర భాషలో దూషించడం మొదలుపెట్టారు.
నాకసలు ఇజ్జత్ ఉందా?
అక్కడ ఒక పాకిస్తానీ రిపోర్టర్.. తాగి ఉన్న ఓ ఇంగ్లిష్ ప్రేక్షకుడిని.. ‘మీ అభిమాన పాకిస్తాన్ ఆటగాడు ఎవరు?’ అని అడిగారు. ఇందుకు బదులుగా అతడు.. ‘ఆజం ఖాన్.. అతడు బ్యాటింగ్ చేయలేడు. ఫీల్డింగ్ చేయలేడు’ అంటూ నాపై సెటైర్లు వేశారు.
అది వినగానే నా హృదయం ముక్కలైంది. నాకసలు ఇజ్జత్ (గౌరవం) ఉందా? నా గురించి జనాలు ఇలా అనుకుంటున్నారా? అని బాధలో కూరుకుపోయా. సులువైన క్యాచ్‌లను కూడా జారవిడిచా.
ఏడుపు తన్నుకొచ్చి కన్నీళ్లు కారాయి. అసలు నాకే ఇలా ఎందుకు అవుతోంది అనుకుంటూ ఏడ్చేశా’’ అని ఆజం ఖాన్ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెబుతూ ఉద్వేగానికి గురయ్యాడు. కాగా నాటి మ్యాచ్‌లో ఆజం ఖాన్ డకౌట్ కాగా.. పాకిస్తాన్ 19.5 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌట్ అయింది.
లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 15.3 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి పని పూర్తి చేసింది. పాకిస్తాన్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో డకౌట్ బ్యాటర్ ఆజం ఖాన్‌పై మరోసారి విమర్శల వర్షం కురిసింది.
చదవండి: వన్డే ఆల్‌టైమ్ జట్టు.. టీమిండియా నుంచి ముగ్గురు.. రోహిత్‌కు దక్కని చోటు


