టీ20 ప్రపంచకప్-2021లో ఆడింది మూడు మ్యాచ్‌లు.. పదకొండు ఓవర్ల బౌలింగ్‌లో 75 పరుగులు సమర్పించుకున్నాడు.. అయితే, కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఏకంగా 33 పరుగులు ఇచ్చుకున్న సదరు భారత బౌలర్.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 23, అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో 19 పరుగులు ఇచ్చాడు.
మిస్టరీ స్పిన్నర్‌తో ఫలితాలు రాబట్టవచ్చని జట్టులోకి తీసుకుంటే అతడి వల్ల జట్టుకు పెద్దగా ప్రయోజనమేమీ చేకూరలేదు. అలా తొలి ప్రపంచకప్ టోర్నీయే అతడికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. కీలక మ్యాచ్‌లలో వికెట్లు తీయకపోవడంతో కొందరు అభిమానులు సైతం అతడిని ఓ భారంగా, విలన్‌గా అభివర్ణించారు కూడా!
ఇక అతడి పని అయిపోయినట్లేనని అంతా భావించారు. అనుకున్నట్లుగానే జాతీయ జట్టులో చోటు కరువైంది. కానీ అతడు ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. పట్టుదలగా శ్రమించాడు. ఐపీఎల్‌లో సత్తా చాటి తనను తాను మరోసారి నిరూపించుకున్నాడు. అతడు ప్రాతినిథ్యం వహించిన జట్టుకు మెంటార్‌గా ఉన్న వ్యక్తి టీమిండియా హెడ్‌కోచ్‌గా రావడంతో అతడి పునరాగమనానికి బాటలు పడ్డాయి.
ముఖ్యంగా టీ20 జట్టులో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈసారి 2.0 వర్షన్ చూపించాడు అతడు!.. ఈ ఏడాది టీమిండియా 20 టీ20లలో ఏకంగా 36 వికెట్లు కూల్చాడు. తద్వారా టెస్టు హోదా ఉన్న దేశాలపై ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వికెట్లు కూల్చిన రెండో బౌలర్‌గా నిలిచాడు.
రీఎంట్రీలో సూపర్ హిట్
అవును.. ఈ ఉపోద్ఘాతమంగా వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) గురించే!.. గత కొంతకాలంగా భారత టీ20 జట్టులో ఈ మిస్టరీ స్పిన్నర్‌దే కీలక పాత్ర. పరిస్థితులకు అనుగుణంగా ఆడుతూ... మ్యాచ్‌ను తమవైపు తిప్పగల సత్తా ఉందని నమ్మిన మేనేజ్‌మెంట్‌కు అందుకు తగ్గ ఫలితాలు చూపించాడు. మొత్తంగా రీఎంట్రీలో అతడు ఏకంగా 49 వికెట్లు కూల్చడం అతడి నిలకడైన ప్రదర్శనకు నిదర్శనం.
తాజాగా సౌతాఫ్రికాతో ముగిసిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ వరుణ్ చక్రవర్తి అదరగొట్టాడు. తన వైవిధ్యభరితమైన బౌలింగ్‌తో గూగ్లీ, క్యారమ్ బాల్, స్లేడర్.. ఇలా వివిధ రీతుల్లో బంతులు సంధిస్తూ బ్యాటర్లను తిప్పలు పెడుతూ వికెట్లు పడగొట్టాడు. అతడి లైన్ అండ్ లెంగ్త్ కూడా ఓ పట్టాన బ్యాటర్‌కు అర్థం కాదు.
అద్భుతమైన ఆట తీరుతో ప్రత్యర్థిని ఒత్తిడికి గురిచేసి.. భారీ భాగస్వామ్యాలను విడదీయడంలోనూ వరుణ్ దిట్ట. వికెట్లు తీయడం మీద మాత్రమే అతడి దృష్టి మొత్తం కేంద్రీకృతమై ఉంటుంది. 2025లో అతడి ఎకానమీ 6.7గా ఉంది.
తాజాగా అహ్మదాబాద్‌లో ఐదో టీ20లోనూ వరుణ్ చక్రవర్తి నాలుగు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లలో కలిపి పది వికెట్లు పడగొట్టి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.
ఒకప్పుడు విలన్.. ఇపుడు హీరో
ఇక ఈసారి టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్- శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఉపఖండ పిచ్‌లపై జరిగే ఈ మెగా టోర్నీలో టీమిండియాకు వరుణ్ చక్రవర్తి ‘ఎక్స్’ ఫ్యాక్టర్ కాబోతున్నాడు.
ఆటలో నైపుణ్యమే కాదు.. ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న వరుణ్.. డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా మరోసారి విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించడం పక్కా. గత ఏడాది కాలంగా అతడి గణాంకాలు, నిలకడైన ఆటే ఇందుకు నిదర్శనం.
అట్లు ఇటీవల ఆసియా కప్-2025 టీ20లో భారత్ చాంపియన్‌గా నిలవడంలో వరుణ్‌దే ముఖ్య పాత్ర. పవర్ ప్లే, మిడిల్ ఓవర్లలో ప్రభావం చూపిన ఈ రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్నర్ మొత్తంగా తొమ్మిది వికెట్లు కూల్చి.. టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఆ తర్వాత కూడా వరుసమ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుని.. ఐసీసీ నంబర్ వన్ టీ20 బౌలర్‌గా ఈ ఏడాదిని ముగించాడు.
కాగా 2021 టీ20 ప్రపంచకప్ టోర్నీలో కనీసం సెమీస్ చేరకుండానే నిష్క్రమించిన టీమిండియా 2022లో సెమీ ఫైనల్ చేరినా ఆఖరి వరకు పోరాడలేకపోయింది. 2024లో అత్యుత్తమ ప్రదర్శనతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి టైటిల్ గెలుచుకుంది.
చదవండి: రోహిత్ శర్మ యూటర్న్!


