T20 WC 2026: జింబాబ్వేకు షాకిచ్చిన పసికూన! | T20 WC Warm Up, Jatinder Ramanandi Shines Oman Beat Zimbabwe, Check Out Score Details Inside | Sakshi
Sakshi News home page

T20 WC 2026: జింబాబ్వేకు షాకిచ్చిన పసికూన!

Feb 5 2026 5:54 PM | Updated on Feb 5 2026 6:30 PM

T20 WC Warm Up: Jatinder Ramanandi Shines Oman beat Zimbabwe

టీ20 ప్రపంచకప్‌-2026 సన్నాహకాల్లో భాగంగా ఒమన్‌ జట్టు జోరు కనబరుస్తోంది. ఇటీవల శ్రీలంక-‘ఎ’ జట్టును చిత్తు చేసిన ఒమన్‌.. తాజాగా జింబాబ్వేకు షాకిచ్చింది. ఐసీసీ టీమ్‌ ర్యాంకింగ్స్‌లో తమకంటే మెరుగైన స్థితిలో ఉన్న జింబాబ్వేతో ఒమన్‌ గురువారం తలపడింది.

బెనెట్‌, ముసేకివా హాఫ్‌ సెంచరీలు
కొలంబోలోని సింహళీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఒమన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 187 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది. ఓపెనర్లలో బ్రియాన్‌ బెనెట్‌ (28 బంతుల్లో 56) మెరుపు అర్ధ శతకం బాదగా... బ్రెండన్‌ టేలర్‌ (20 బంతుల్లో 26) రిటైర్డ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు.

వన్‌డౌన్‌లో వచ్చిన డియాన్‌ మేయర్స్‌ 26 పరుగులు చేయగా.. ర్యాన్‌ బర్ల్‌ (1), టోనీ మున్యోంగ (0), క్లైవ్‌ మండాడే (0) పెవిలియన్‌కు క్యూ కట్టారు. లోయర్‌ ఆర్డర్‌లో తషింగ ముసేకివా (28 బంతుల్లో 54 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. 

ఇక ఒమన్‌ బౌలర్లలో సూఫియాన్‌ మెహమూద్‌ మూడు వికెట్లు తీయగా.. నదీం ఖాన్‌ రెండు, షా ఫైజల్‌ ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. జింబాబ్వే విధించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఒమన్‌ 19.2 ఓవర్లలో పూర్తి చేసింది. 

జతిందర్‌, రామనంది ధనాధన్‌
ఓపెనర్లలో ఆమిర్‌ కలీమ్‌ (23) ఫర్వాలేదనిపించగా.. జతిందర్‌ సింగ్‌ హాఫ్‌ సెంచరీ (33 బంతుల్లో 55) చేసి రిటైర్డ్‌ అవుట్‌ అయ్యాడు. మిగిలిన వాళ్లలో హమాద్‌ మీర్జా (35), జితేన్‌ రామనంది (18 బంతుల్లో 34 నాటౌట్‌) ధనాధన్‌ దంచికొట్టారు. 

ఈ క్రమంలో ఆరు వికెట్లు నష్టపోయి ఒమన్‌ 188 పరుగులు సాధించింది. ఫలితంగా జింబాబ్వేపై నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. కాగా ఐసీసీ టీ20 టీమ్‌ ర్యాంకింగ్స్‌లో జింబాబ్వే పన్నెండో స్థానంలో ఉండగా.. ఒమన్‌ది ఇరవయ్యవ ర్యాంకు.  

కాగా ఫిబ్రవరి 7 నుంచి భారత్‌- శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్‌ మొదలుకానుంది. ఇరవై జట్లు పాల్గొంటున్న ఈ ఐసీసీ ఈవెంట్లో ఐర్లాండ్‌, జింబాబ్వే, శ్రీలంక, ఆస్ట్రేలియాలతో కలిసి ఒమన్‌ గ్రూప్‌-బిలో ఉంది.

చదవండి: పాక్‌తో మ్యాచ్‌.. కుండబద్దలు కొట్టిన సూర్యకుమార్‌ యాదవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement