పాక్‌తో మ్యాచ్‌.. కుండబద్దలు కొట్టిన సూర్యకుమార్‌ | Humne: Suryakumar Yadav breaks silence on Pak boycotting IND T20 WC | Sakshi
Sakshi News home page

పాక్‌తో మ్యాచ్‌.. కుండబద్దలు కొట్టిన సూర్యకుమార్‌ యాదవ్‌

Feb 5 2026 4:44 PM | Updated on Feb 5 2026 6:50 PM

Humne: Suryakumar Yadav breaks silence on Pak boycotting IND T20 WC

భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరిస్తామన్న పాకిస్తాన్‌ నిర్ణయంపై టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ స్పందించాడు. తాము అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) షెడ్యూల్‌కు అనుగుణంగా నడుచుకుంటామని.. ఫిబ్రవరి 15న కొలంబోకు వెళ్తామని కుండబద్దలు కొట్టాడు. ఈ విషయంలో తమకు పూర్తి స్పష్టత ఉందని సూర్య ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో భారత్‌ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఒప్పందం ప్రకారం ఈ టోర్నీలో పాకిస్తాన్‌ తమ మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికైన శ్రీలంకలో ఆడనుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌ నుంచి ముస్తాఫిజుర్‌ రహమాన్‌ (Mustafizur Rahman)ను తప్పించిన నేపథ్యంలో.. బంగ్లాదేశ్‌ భారత్‌లో ఆడలేమని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది.

బంగ్లా అవుట్‌.. అండగా ఉంటామంటూ పాక్‌ డ్రామా
తమ వేదికను కూడా శ్రీలంకకు మార్చాలని కోరగా.. ఐసీసీ ఇందుకు నిరాకరించి.. పట్టువీడని బంగ్లాను టోర్నీ నుంచి తొలగించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము టీమిండియాతో మ్యాచ్‌ బహిష్కరిస్తున్నామంటూ పాకిస్తాన్‌ ప్రకటించింది. అయితే, షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్‌- పాక్‌ తలపడాల్సి ఉంది.

మేము కొలంబో వెళ్తున్నాం
ఈ పరిణామాలపై గురువారం నాటి కెప్టెన్ల మీడియా సమావేశంలో టీమిండియా సారథి సూర్యకుమార్‌ యాదవ్‌ తనదైన శైలిలో స్పందించాడు. “మా మైండ్‌సెట్‌ క్లియర్‌గా ఉంది. మేమేమీ ఆ మ్యాచ్‌ ఆడమని చెప్పలేదే!.. వాళ్లే అలా చెప్పారు. ఐసీసీ షెడ్యూల్‌ ప్రకటించింది.

మా ప్రయాణానికి విమాన టికెట్లు కూడా బుక్‌ అయ్యాయి. కాబట్టి మేము కొలంబో వెళ్తున్నాం. ఆతర్వాత ఏం జరుగుతుందో అక్కడే మాకు తెలుస్తుంది’’ అని సూర్య స్పష్టం చేశాడు. ఇక పాక్‌తో మ్యాచ్‌ రద్దు కావడం ఎలాంటి ‍ప్రభావం చూపుతుందన్న ప్రశ్నకు బదులిస్తూ..  

నా చేతుల్లో ఏమీ లేదు
“వాళ్ల నిర్ణయం నా ఆధీనంలో ఉండదు కదా!.. ఫిబ్రవరి 15న మ్యాచ్‌ ఆడాలని మాకు చెప్పారు. ఇప్పటికే తటస్థ వేదిక మీద ఆసియా కప్‌ టోర్నీలో వాళ్లతో మూడు మ్యాచ్‌లు ఆడాము. కొలంబోనూ ఆడే అవకాశం వస్తే ఆడతాం. ఆడటం.. ఆడకపోవడం నా నిర్ణయం కాదు. ఇదొక సంక్లిష్ట సమయం’’ అని సూర్య పేర్కొన్నాడు. 

చదవండి: ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు జట్టును ప్రకటించిన పాక్‌ క్రికెట్‌ బోర్డు!

Advertisement
 
Advertisement
Advertisement