మరో 3 రోజుల్లో హాకీ ప్రపంచ కప్
బరిలో 16 జట్లు
స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
ప్రపంచ క్రీడా అభిమానుల కోసం ఫుట్‌బాల్ తర్వాత మరో వరల్డ్ కప్ సిద్ధమైంది. ఈసారి హాకీలో విశ్వ విజేతగా నిలిచే సమరానికి 16 జట్లు ‘సై’ అంటున్నాయి. మారిన ఫార్మాట్, ప్రత్యేకంగా రూపొందించిన కొత్త తరహా టర్‌్ఫలు ఈ మెగా టోర్నీని మరింత ఆసక్తికరంగా మార్చాయి. రెండు వరుస ఒలింపిక్ పతకాలతో జోరు ప్రదర్శించిన భారత పురుషుల జట్టు ఈ ప్రపంచకప్‌లో కూడా అదే జోరు కొనసాగించి రెండోసారి జగజ్జేతగా నిలుస్తుందా లేదా వేచి చూడాలి.
వావ్రే/ఆమ్‌స్టెల్‌వీన్: ప్రతిష్టాత్మక హాకీ ప్రపంచ కప్ మరో 3 రోజుల్లో ప్రారంభం కానుంది. ఆగస్టు 15న ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ ఆగస్టు 30న ముగుస్తుంది. పురుషులు, మహిళల విభాగాల్లో ఒకేసారి ఈ టోర్నమెంట్ జరగనుండటం విశేషం. బెల్జియంలోని వావ్రే నగరం, నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టెల్‌వీన్ నగరం సంయుక్త వేదికలుగా ఉన్నాయి. పురుషుల విభాగంలో జర్మనీ, మహిళల విభాగంలో నెదర్లాండ్స్ డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలోకి దిగుతున్నాయి. రెండు విభాగాల్లోనూ ఇది 16వ వరల్డ్ కప్ కానుండగా, టోర్నీలో 16 చొప్పున జట్లు బరిలోకి దిగుతున్నాయి.
భారత పురుషుల జట్టు తమ తొలి మ్యాచ్‌ను ఆగస్టు 15న వేల్స్ జట్టుతో ఆడుతుంది. ఆ తర్వాత 17న ఇంగ్లండ్‌తో, 19న పాకిస్తాన్‌తో భారత్ తలపడుతుంది. మరోవైపు భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్‌లో ఆగస్టు 16న చైనాను ‘ఢీ’కొంటుంది. ఆ తర్వాత 18న దక్షిణాఫ్రికాతో, 20న ఇంగ్లండ్‌తో టీమిండియా పోటీపడుతుంది. భారత పురుషుల జట్టుకు హర్మన్‌ప్రీత్ సింగ్... భారత మహిళల జట్టుకు సలీమా టెటె కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.
క్వార్టర్ ఫైనల్ లేకుండా...
మూడేళ్ల క్రితం భారత్‌లో జరిగిన వరల్డ్ కప్‌తో పోలిస్తే ఈసారి ఫార్మాట్‌లో స్వల్ప మార్పు జరిగింది. 16 టీమ్‌లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్ నుంచి టాప్–2 టీమ్‌లు ముందంజ వేస్తాయి. ఈ 8 టీమ్‌లను మళ్లీ రెండు గ్రూప్‌లుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఒక్కో గ్రూప్ నుంచి టాప్–2 జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. ఆపై ఫైనల్ ఉంటుంది.
గత టోర్నమెంట్‌లో గ్రూప్ దశలోని నాలుగు టాపర్ జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాయి. 2వ, 3వ స్థానాల్లో వచ్చిన మొత్తం 8 జట్లతో ‘క్రాస్ ఓవర్స్’ను నిర్వహించారు. ఆ మ్యాచ్‌ల విజేతలు క్వార్టర్స్ చేరాయి. ఇప్పుడు ఈ దశను మొత్తం తొలగించారు. అయితే ప్రతీ పోరుకు ప్రాధాన్యత ఉండేలా లీగ్ దశలో తమ గ్రూప్ నుంచి ముందంజ వేసే మరో జట్టుపై సాధించిన పాయింట్లను రెండో రౌండ్‌లోకి ‘క్యారీ ఫార్వర్డ్’ చేయనున్నారు. ఉదాహరణకు పురుషుల గ్రూప్ ‘డి’ నుంచి భారత్‌తో పాటు ఇంగ్లండ్ ముందంజ వేస్తే... ఇంగ్లండ్‌తో మ్యాచ్ ఫలితం కూడా కీలకంగా మారుతుంది.
51 ఏళ్ల క్రితం...
గత రెండు ఒలింపిక్స్‌లలో కాంస్యాలు గెలిచిన భారత పురుషుల హాకీ జట్టు ప్రపంచకప్ ప్రదర్శన మాత్రం సుదీర్ఘ కాలంగా పేలవంగానే ఉంది. యూరోపియన్ టీమ్‌లతో పోటీ పడినప్పుడు మన టీమ్ అనూహ్యంగా వెనుకబడిపోతోంది. పటిష్ట టీమ్‌లు బరిలో నిలిచిన ప్రొ లీగ్‌లో కూడా ఇదే కనిపించింది. 1971లో తొలి వరల్డ్ కప్‌లో కాంస్యం, 1973లో రెండో వరల్డ్ కప్‌లో రజతం నెగ్గిన జట్టు 1975లో మరింత మెరుగైన ప్రదర్శనతో చాంపియన్‌గా నిలిచింది.
అయితే ఆ తర్వాత ఒక్కసారిగా పడిపోయిన ప్రమాణాలు మన స్థాయిని దిగజార్చాయి. 1975 తర్వాత వరుసగా 10 ప్రపంచ కప్‌లలో మన టీమ్ గ్రూప్ దశకే పరిమితమైంది. 2018లో సొంతగడ్డపై ఆరో స్థానంతో సంతృప్తికరంగా ముగించింది. అయితే 2023లో మళ్లీ మన దేశంలోనే ఆడినా... 16 జట్ల టోర్నీలో 9వ స్థానానికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో తాజా టోర్నీలోనైనా రాణించి 51 ఏళ్ల తర్వాత మన టీమ్ పతకానందం అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఒక్కసారి సెమీస్...
మరోవైపు భారత మహిళల హాకీ జట్టు ప్రదర్శన కూడా ప్రపంచకప్‌లో సాధారణంగానే ఉంది. 1974లో ఏకైకసారి భారత జట్టు సెమీఫైనల్ చేరుకుంది. సెమీఫైనల్లో 0–1తో అర్జెంటీనా చేతిలో.. 3–4 స్థానాల కోసం నిర్వహించిన మ్యాచ్‌లో 0–2తో జర్మనీ చేతిలో ఓడిపోయి భారత్ నాలుగో స్థానంతో సంతృప్తి పడింది. ఆ తర్వాత భారత జట్టు ఏడుసార్లు (1978, 1983, 1998, 2006, 2010, 2018, 2022) ప్రపంచకప్‌లో పోటీపడినా ఒక్కసారి కూడా సెమీఫైనల్ చేరలేకపోయింది.
పాలీగ్రాస్ టర్ఫ్ పై...
వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరిగే బెల్‌ఫియాస్ హాకీ ఎరీనా (బెల్జియం), వాగ్నర్ స్టేడియంలో (ఆమ్‌స్టెల్‌వీన్)లలో పాలీగ్రాస్ టర్ఫ్ లను ఏర్పాటు చేశారు. ఈ సింథటిక్ టర్‌్ఫను తయారు చేయడంలో 80 శాతం చెరకును ఉపయోగించారు. దీని వల్ల సాధారణ టర్ఫ్‌లతో పోలిస్తే ఇది తక్కువ నీరు పీల్చుకోవడంతో పాటు ఆటలో వేగంగా దూసుకుపోయే లక్షణాన్ని కలిగి ఉంటుంది. గతంలోనూ ఇలాంటి టర్‌్ఫను వాడినా...కొత్తగా జత చేసిన కార్బన్ జీరో బేస్ దీనిని మరింత ఆధునికంగా మార్చింది.
జట్ల వివరాలు
పురుషుల విభాగం
గ్రూప్ ‘ఎ’: నెదర్లాండ్స్, అర్జెంటీనా, న్యూజిలాండ్, జపాన్.
గ్రూప్ ‘బి’: బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, మలేసియా.
గ్రూప్ ‘సి’: ఆస్ట్రేలియా, స్పెయిన్, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా.
గ్రూప్ ‘డి’: భారత్, ఇంగ్లండ్,పాకిస్తాన్, వేల్స్.
మహిళల విభాగం
గ్రూప్ ‘ఎ’: నెదర్లాండ్స్,ఆ్రస్టేలియా, చిలీ, జపాన్.
గ్రూప్ ‘బి’: అర్జెంటీనా, జర్మనీ, అమెరికా, స్కాట్లాండ్.
గ్రూప్ ‘సి’: బెల్జియం, స్పెయిన్, న్యూజిలాండ్, ఐర్లాండ్.
గ్రూప్ ‘డి’: భారత్, చైనా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా.


