భారత స్కీట్ షూటర్ మహేశ్వరి ప్రాక్టీస్
న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో త్రుటిలో పతకం కోల్పోయిన భారత స్కీట్ షూటర్ మహేశ్వరి చౌహాన్ ఆసియా క్రీడల్లో పతకం గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్ వేదికగా ఆసియా గేమ్స్ జరగనుండగా... వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్న మహేశ్వరి మెరుగైన ఫలితం సాధించాలని భావిస్తోంది. 2024 పారిస్ ఒలింపిక్స్ స్కీట్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో మహేశ్వరి–అనంత్‌జీత్ సింగ్ నరూకా జోడీ ఒక్క పాయింట్ తేడాతో కాంస్య పతకం కోల్పోయి నాలుగో స్థానానికి పరిమితమైంది. ఒలింపిక్స్‌లో స్కీట్ విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారత జంటగా వీరు రికార్డు సృష్టించారు. ప్రస్తుతం మహేశ్వరి ఢిల్లీలోని కర్ణీ సింగ్ షూటింగ్ రేంజ్‌లో ఆసియా క్రీడల కోసం ప్రాక్టీస్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ... ‘పారిస్ ఒలింపిక్స్ ఫలితం నుంచి ఎంతో నేర్చుకున్నా. అలాంటి పొరబాట్లు పునరావృత్తం కాకుండా మరింత మెరుగైన ప్రదర్శన కనబర్చడమే లక్ష్యంగా సాధన సాగిస్తున్నా. ఇవే నాకు తొలి ఆసియా క్రీడలు. ప్రస్తుతానికి దీన్ని ఆస్వాదిస్తున్నా. టోర్నమెంట్ ఏదైనా సన్నద్ధతలో ఎలాంటి మార్పు ఉండదు. 2024 పారిస్ క్రీడల అనుభవం అంత త్వరగా మరచిపోలేనిది. ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన కోసం ప్రయత్నిస్తా’ అని పేర్కొంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్‌ఏఐ) ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణలో ఆరుగురు స్కీట్, ఆరుగురు ట్రాప్ షూటర్లు పాల్గొంటున్నారు. ఈ నెల 18 వరకు కొనసాగనున్న ఈ శిక్షణకు సాయ్ నిధులు కేటాయిస్తోంది.
శిక్షణలో ఉన్న షూటర్లు
స్కీట్: అనంత్‌జీత్ సింగ్ నరూకా, పరినాజ్ ధాలివాల్, భవతేజ్ సింగ్ గిల్, మేరాజ్ అహ్మద్ ఖాన్, రైజా ఢిల్లాన్, మహేశ్వరి చౌహాన్.
ట్రాప్: కైనన్ షెనాయ్, నీరు ధండా, అహవర్ రిజ్వీ, మనీషా కీర్, శపథ్ భరద్వాజ్, ఆశిమా అహ్లావత్.


