యస్తికపై వేటు... కమలినికి చోటు | Indian womens T20 cricket team announced for Asian Games | Sakshi
Sakshi News home page

యస్తికపై వేటు... కమలినికి చోటు

Jul 1 2026 4:19 AM | Updated on Jul 1 2026 4:19 AM

Indian womens T20 cricket team announced for Asian Games

ఆసియా క్రీడలకు భారత మహిళల టి20 క్రికెట్‌ జట్టు ప్రకటన

న్యూఢిల్లీ: మహిళల టి20 ప్రపంచకప్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన యస్తిక భాటియాపై వేటు పడింది. ఆమె స్థానంలో యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కమలినికి భారత మహిళల క్రికెట్‌ జట్టులో చోటు దక్కింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 4 వరకు జపాన్‌ వేదికగా జరగనున్న ఆసియా క్రీడల కోసం బీసీసీఐ మంగళవారం 15 మందితో కూడిన మహిళల జట్టును ప్రకటించింది. 2023లో హాంగ్జౌలో జరిగిన ఏషియన్‌ గేమ్స్‌లో భారత మహిళల జట్టు పసిడి పతకం సాధించింది. దీంతో ఈసారి మన జట్టు డిఫెండింగ్‌ చాంపియన్‌గా ఈ క్రీడల్లో అడుగు పెట్టనుంది. 

ఆసియా క్రీడల్లో భాగంగా... పురుషుల, మహిళల క్రికెట్‌లో టి20 ఫార్మాట్‌లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. తాజా టి20 వరల్డ్‌కప్‌లో జట్టును గ్రూప్‌ దశ దాటించలేకపోయినప్పటికీ... 37 ఏళ్ల హర్మన్‌ప్రీత్‌ కౌర్‌నే కెప్టెన్‌గా కొనసాగించారు. స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. వరల్డ్‌కప్‌లో ఆడిన జట్టులో యస్తికపై మాత్రమే వేటు వేశారు. గాయం కారణంగా ప్రపంచకప్‌ మధ్యలో జట్టుకు దూరమైన శ్రేయాంక పాటిల్‌ను కూడా ఎంపిక చేశారు. అయితే ఈ టోర్నీకి ముందు ఆమె ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సి ఉంది. 

భారత జట్టు: హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, కమలిని, భారతి ఫుల్మాలి, శ్రీచరణి, రేణుక ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక పాటిల్, రాధ యాదవ్, నందని శర్మ.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement