మహిళలుగా మనం సాధించగల దానికి పరిమితి లేదు అని అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామా అని సదా నొక్కి చెబుతుంటారామె. అది నిజం అనేలా..మూసధోరణి పద్ధతులను చేధించి ముందుకు దూసుకుపోతున్న ఎన్నో స్ఫూర్తిదాయక కథలు మన కళ్లముందు కదలాడుతున్నాయి. అలాంటి స్ఫూర్తిదాయ కథే ఈ సింగిల్ మదర్ స్టోరీ.
ఒక ప్రయాణికురాలు, మహిళా క్యాబ్ డ్రైవర్ మధ్య సాగిన సరదా సంభాషణా వీడియో కాస్తా..శక్తిమంతమైన మహిళా శక్తికి నిర్వచనంగా, స్ఫూర్తిదాయకంగా మారింది. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఆ వీడియోని నటి ఆయుషి లాహిరి షేర్ చేసుకున్నారు. ఆయుషి ఒక క్యాబ్‌ని బుక్ చేసుకోగానే 'హైలైట్ ఆఫ్ ది డే' అనే శీర్షికతో ఒక ప్రముఖ క్యాబ్ డ్రైవర్ ప్రొఫైల్ కనిపిస్తుంది.
ఆ ప్రొఫైల్ ప్రకారం, క్యాబ్ డ్రైవర్ ఒక మహిళ అని ఆశ్చర్యపోతుందామె. ఆ తర్వాత వారి మధ్య సరదాగా సంభాషణ సాగుతుంది. ఆ మహిళ క్యాబ్ డ్రైవర్ తన పేరు శోభనా అవస్థి అని పరిచయం చేసుకుంటుంది. ఆ తర్వాత ఆయుషి ఎప్పటి నుంచి క్యాబ్ నడుపుతున్నారని ప్రశ్నించగా జూన్ నెల నుంచి అని సమాధానమిస్తుంది. అయితే తాను కేవలం క్యాబ్ డ్రైవర్‌ని మాత్రమే కాదని తాను ప్రముఖ బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్‌ని అని కూడా చెబుతుంది.
అయితే ప్రతిరోజు మేకప్ పని దొరకదని, పైగా తాను ఒంటరి తల్లినని పేర్కొంటుంది. తన కుటుంబాన్ని, పిల్లలను చూసుకునేందుకు ఇలా రెండు వృత్తులు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక తనకు డ్రైవింగ్ అంటే మహా ఇష్టమని, తాను 15 ఏళ్ల వయసులోనే తండ్రి వద్ద నేర్చుకున్నానని, చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు బీఎండబ్ల్యూ, మెర్సిడెస్, ఎస్‌యూవీలతో సహా సుమారు 80 కార్లను నడిపినట్లు పేర్కొంది. ఆ నటి ఈ హృద్యమైన వీడియోకి "నా రోజులోని ముఖ్యాంశం" అనే క్యాప్షన్‌ని జోడించి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.
నిజానికి పురుషాధిక్య రంగంలో తమకంటూ ఒక గుర్తింపును సృష్టించుకోవడానికి మహిళలు ఎంతగా కష్టపడగలరో ఈ ఘటన నిరూపిస్తుంది. అందులోనూ ఒక సింగిల్ మదర్‌గా అటు మాతృత్యం ఇటు వర్క్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ సాగిపోతున్న ఆమె నిజంగా సూపర్ విమెన్ అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
(చదవండి: 'ఓం'కి ఇంత పవర్ ఉందా? గుక్కపెట్టి ఏడుస్తున్న బిడ్డ కాస్తా..)


