యువతను మత్తు పదార్థాల బారినుంచి దూరం చేయడమే లక్ష్యంగా తమిళనాడులో విజయ్ ప్రభుత్వం చర్యలు చేపడుతున్న సమయంలో.. అదే రాష్ట్రంలో ఓ గవర్నమెంట్ స్కూల్‌లో ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. క్లాస్‌రూంలో.. అదీ అమ్మాయిలు మద్యం సేవిస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన విజయ్ సర్కార్ తీవ్ర చర్యలకు ఉపక్రమించింది.
కన్యాకుమారి జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన కలకలం రేపింది. తరగతి గది సమీపంలో ఇద్దరు విద్యార్థినులు మద్యం సేవిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ పాఠశాలలో నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆ తరగతులు ముగిసిన తర్వాత కొందరు విద్యార్థులు పాఠశాలలోనే ఉండగా ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
విజయ్ ప్రభుత్వం యువతలో పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. జిల్లా స్థాయిలో నిఘా వ్యవస్థలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. తుక్కలై ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు మద్యం సేవిస్తున్న వీడియో వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.
వైరల్ వీడియోతో కదిలిన యంత్రాంగం
మద్యం సేవిస్తున్న దృశ్యాలను మరో విద్యార్థి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు తెలుస్తోంది. వీడియో వైరల్ కావడంతో కన్యాకుమారి జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించింది. విద్యార్థినులు ఎవరు? పాఠశాల ప్రాంగణంలోకి మద్యం ఎలా వచ్చింది? పర్యవేక్షణలో లోపం జరిగిందా? అనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రమీలా ఎవాంజెలిన్‌ను మరో పాఠశాలకు బదిలీ చేశారు. విద్యాశాఖ అధికారులు కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు.
రాజ్‌కుమార్ అరెస్ట్
విద్యార్థినులకు మద్యం అందించింది ఎవరు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. తొలుత తోటి విద్యార్థులపై అనుమానం వ్యక్తమైనప్పటికీ.. వారి ప్రమేయం లేదని తేలినట్లు పోలీసులు తెలిపారు. తర్వాత తక్కలై ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల రాజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు పాలు సరఫరా చేసే వ్యక్తిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఓ విద్యార్థినికి పరిచయస్తుడైన రాజ్‌కుమార్.. ఆమె కోరడంతో మద్యం కొనిచ్చినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
కౌన్సెలింగ్‌కు ఆదేశాలు
ఘటన అనంతరం విద్యార్థినుల తల్లిదండ్రులను పిలిపించిన అధికారులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. విద్యార్థినులకు కూడా మానసిక నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ అందించాలని సూచించారు. మరోవైపు.. విద్యాసంస్థల్లో మత్తు పదార్థాల నియంత్రణ, పర్యవేక్షణ మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యువతను మత్తుకు దూరంగా ఉంచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల మధ్య ఇలాంటి ఘటనలు మరింత అప్రమత్తత అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి.


