హైదరాబాద్: లగ్జరీ కార్లలో తిరగడం..ఖరీదైన దుస్తులు వేసుకోవడం..ఆ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టుచేయడం.. స్నాప్ ఛాట్‌లో మహిళలతో పరిచయాలు పెంచుకోవడం.. స్నేహం చేయడం.. ఆ తరువాత వారిని మోసం చేసి బంగారు ఆభరణాలు చోరీ చేయడం.. ఇదీ వారి వ్యవహారం. ఇలా ఇద్దరు వ్యక్తులు కలిసి 20 మంది మహిళలను మోసం చేసి 40 తులాల ఆభరణాలను మాయం చేశారు. బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు వరికి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఏసీపీ శంకర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన సాగర్ చౌదరి అలియస్ సాయిసునీల్(25), శివాంగుల భరత్‌కుమార్(28) ఖరీౖదైన కార్లను అద్దెలకు తీసుకుని స్నాప్ చాట్ వేదికగా పరిచయం పెంచుకుని మహిళలతో సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. ఈ నే«పథ్యంలో పలువురు మహిళలను నమ్మిం వారి నుంచి 40 తులాల వరకు బంగారు ఆభరణాలను చోరీలకు పాల్పడ్డారు. భరత్‌కుమార్ తనకున్న పరిచయాల ద్వారా ఆభరణాలను నగల దుకాణదారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
వీరి ఆగడాలపై పలువురు మహిళలు ఫిర్యాదులు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు. ఆర్‌సీ పురం, ఎల్‌బీనగర్, పేట్ బషీరాబాద్ పరిధిలో పలు మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ప్రధాన నిందితుడు సాగర్ చౌదరి గతంలో అత్యాచారం కేసులో అరెస్టు కూడా అయ్యాడు. ఇప్పటి వరకు వీరి బారిన పడి మోసపోయిన 20 మంది బాధితులను పోలీసులు గుర్తించారు. మరికొంత మంది బాధితులు ఉండే అవకాశముందని, వీరిని రిమాండ్‌కు తరలించి ఆ దిశగా దర్యాప్తు చేపట్టినట్లు ఏసీపీ శంకర్‌రెడ్డి పేర్కొన్నారు.


