సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గోల్కొండ కోటపై తొలిసారి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేశారు. అంతకుముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో అమర జవాన్ల స్థూపం వద్ద సీఎం నివాళులర్పించారు.
ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు వెళ్తున్నాం. 32 నెలల కృషి ఇప్పుడు ఫలితాల్లో కనిపిస్తోంది. రైతులకు సంక్షేమం కోసం తమ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని.. వ్యవసాయాన్ని పండుగలా మారుస్తున్నామని తెలిపారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అధికారంలోకి వచ్చాక లక్షా 70 వేల కోట్లు రైతుల సంక్షేమం కోసం కేటాయించామని తెలిపారు. 2 లక్షల పంట రుణమాఫీతో 25 లక్షల మంది రైతు కుటుంబాలకు మేలు జరిగిందని.. కేవలం 9 రోజుల్లో 9 వేల కోట్ల రైతు భరోసా నిధులు ఇచ్చామని చెప్పారు. త్వరలోనే పాలమూరు పూర్తి చేసి నీరందిస్తామని అన్నారు.
పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని.. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తున్నామని చెప్పారు. కోర్ అర్బన్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామని.. తద్వారా పట్టణ ప్రాంతాల్లోని పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా 2.25 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామన్నారు. వితంతులకు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తున్నామన్నారు.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. సన్నవడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇచ్చామని తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. కోటి మహిళలను కోటీశ్వరులను చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. మహాలక్ష్మీ స్కీంతో ఆడబిడ్డలకు అండగా ఉంటున్నామన్నారు. మహాలక్ష్మీ, గృహా లక్ష్మీ స్కీములతో ఆడబిడ్డలకు ఆసరా అయ్యామని అన్నారు.
పెట్రోల్ బంకులకు మహిళా సంఘాలను యజమానులను చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రేషన్ ద్వారా సన్నం బియ్యం పంపిణీ పథకాన్ని విప్లవాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 93 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తోన్న వారికి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు.

అలాగే, రాష్ట్రంలోని విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాన్ని పూర్తిగా అందజేస్తామని సీఎం స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం 2400కోట్ల రూపాయలు ముందుగానే బ్యాంకు ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం సన్నద్ధం అయిందని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరిని అడగవలసిన అవసరం లేకుండా డబ్బులు నేరుగా వారి ఖాతాలలోనే పడే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.


